నింద మూవీ రివ్యూ: మర్డర్ మిస్టరీతో వరుణ్ సందేశ్ కమ్‌బ్యాక్ ఇవ్వగలిగాడా?

నింద

ఫొటో సోర్స్, theferventindieproductions/instagram

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

ప్రేమ కథలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన నటుడు వరుణ్ సందేశ్. యూత్‌కి నచ్చే సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చే వరుణ్ సందేశ్ తాజా సినిమా ‘నింద’తో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌‌ను ఎంచుకోవడం ప్రయోగమనే చెప్పాలి.

ఒక జడ్జి సాక్ష్యాలను అనుసరించి ఓ కేసు విషయంలో తీర్పు ఇస్తాడు.

కానీ, ఆ కేసు ఆయన్ని ఎందుకు వ్యక్తిగతంగా బాధించింది? తండ్రి మరణించాక ఆ కొడుకు ఆ కేసు విషయంలో జరిగిన అన్యాయాన్ని ఎలా మార్చే ప్రయత్నం చేశాడు? అన్నదే ఈ సినిమా కథ.

బీబీసీ న్యూస్ తెలుగు

ఓపెనింగ్ సీన్ తరువాత..

న్యాయస్థానాలలో జరగని న్యాయాన్ని వ్యక్తిగతంగా సాధించే కథ అని పరోక్షంగా ప్రేక్షకులకు చెప్తూ ఈ సినిమా మొదలవుతుంది.

ఇది ఉపయోగించుకుంటే గొప్ప ఓపెనింగే. దీన్ని ఎస్టాబ్లిష్ చేసే తర్వాతి సన్నివేశం కొంత హాలీవుడ్ ఛాయలతో ఉంది.

ఇప్పటికే తెలుగులో కూడా అనేక థ్రిల్లర్ సినిమాల్లో అనుమానితులను లేదా నిందితులను ఒకే చోటకు చేర్చి అసలు నిజాన్ని బయటపెట్టే టెక్నిక్ వచ్చి ఉంది. ఈ టెక్నిక్ వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది.

కానీ, ఆ ఆసక్తి కొనసాగించడంలో జాగ్రత్త లోపించింది. అందువల్ల ఓపెనింగ్ సీన్ అప్పటికి బాగానే ఉందని అనిపించినా, తర్వాత తేలిపోయినట్టే అనిపించింది.

నింద

ఫొటో సోర్స్, itsvarunsandesh/instagram

ఎమోషనల్ జడ్జిమెంట్స్

అసలు కొన్ని కేసుల్లో నిందితుడిని కాపాడడానికి అమాయకుల్ని ఇరికించడం సాధారణంగా జరుగుతుంది.

కానీ, ఈ కథలో నిందితుడిని కాపాడే ప్రయత్నం కోసం ఇంకొకరిని ఇరికించలేదు.

మరి ఎందుకు అలా జరిగింది? అధికారంలో ఉన్నవారు వ్యక్తిగత వైరం లేకపోయినా ఎందుకు అసలు తెలియని వ్యక్తులను కూడా బాధితులను చేస్తారన్న విషయాన్ని సెన్సిటివ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.

వ్యక్తిగత అనుభవాల వల్ల కొన్ని అంశాల మీద కోపం లేదా ద్వేషం పెంచుకోవడం జరుగుతుంది.

అలాంటి అంశమే తన పరిధిలో జరిగినప్పుడు తన ప్రతీకారాన్ని దాని మీదకు మళ్ళించినప్పుడు అమాయకులు ఎలా బలి అవుతారు అన్నది కొత్తగా చెప్పిన అంశం.

నింద

ఫొటో సోర్స్, Divo Music/youtube

హీరో పాత్ర చిత్రీకరణ:

ఇది కథే హీరో అయిన సినిమా. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేవు.

కానీ, ఈ కథలో హీరో చిత్రీకరణ బలంగా అయితే లేనట్టే అనిపిస్తుంది. దానికి కారణం కథ సరిగ్గా చెప్పడంలో ఉన్న వైఫల్యం.

అజ్ఞాత వ్యక్తి లేదా ముఖం చూపించని పాత్రను సినిమాలో ప్రవేశపెట్టేది ఆ పాత్ర ఎమోషన్స్ బయటపడకుండా ఉండటానికే.

కానీ, కథ ముందుకు కొనసాగే కొద్దీ ఆ పాత్ర ఎమోషన్స్‌కు లోనై సమన్వయంగా వ్యవహరించకపోవడం అన్నది హీరో పాత్రను బలహీనపరించింది.

హీరో పాత్రను అనుసరించే థ్రిల్ నేపథ్యం ఈ కథలో నడుస్తుంది. ఈ పాత్ర ఎమోషన్స్ కథలో ఉన్న థ్రిల్ అనుకున్న స్థాయిలో లేకుండా చేశాయి.

నింద

ఫొటో సోర్స్, Divo Music/youtube

ఆరంభం-ముగింపు మధ్య స్పష్టత తగ్గిందా?

స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా కథ ద్వారా చెప్పే విషయంలో ముఖ్యంగా సామాజిక అంశాల్లో స్పష్టత లేకపోతే అది కథ కలిగించిన ఎమోషన్ మొత్తాన్ని క్షణాల్లో మాయమయ్యేలా చేస్తుంది.

తను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న అమాయకుడికి న్యాయం చేసినా, ఆ నేరం చేసిన వ్యక్తి తెలిసినప్పుడు ప్రతిస్పందన ఊహించిన స్థాయిలో లేకపోవడం కథకు ఆత్మ లేకుండా చేసింది.

కథ మొదలు పెట్టినప్పుడు చెప్పాలనుకున్న విషయానికీ.. కథ చివర్లో చెప్పినది విరుద్ధంగా ఉండటంతో గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

నింద

ఫొటో సోర్స్, Divo Music/youtube

బాలరాజు పాత్ర కథకు బలమైందా?

సామాజిక అంశం మీద ఉండే కథల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల థ్రిల్లర్ ఎలిమెంట్ చివరకు వచ్చేసరికి ఎమోషనల్ ఎలిమెంట్‌గా మారిపోయింది.

ఇక్కడ హీరో పాత్రకు ఒక ‘పాజిటివ్ ఇమేజ్’ ఏర్పరిచే క్రమంలో సస్పెన్స్ మొత్తం పలచబడిపోయింది.

ఈ సినిమాలో ముఖ్య పాత్ర బాలరాజు. చేయని తప్పుకి శిక్షను అనుభవిస్తున్నవాడు. ఈ పాత్ర నేపథ్యం గురించి బలంగా చెప్పే అవకాశం కథలో లేదు.

ఒక క్రిమినల్‌గా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి గురించి అతన్ని క్రిమినల్ గానో లేకపోతే బాధితుడిగానో ప్రేక్షకులు కనక్ట్ అయ్యే బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల బలమైన పాత్ర బాలరాజు ఈ సినిమాలోని మిగిలిన పాత్రల్లో ఒక పాత్రగానే మిగిలిపోయాడు.

ఇది ఈ సినిమాకు అన్నిటికన్నా పెద్ద లోటు.

నింద

ఫొటో సోర్స్, theferventindieproductions/instagram

సామాజిక అంశం నేపథ్యం ప్లస్సా? మైనస్సా?

నిజానికి ఈ సినిమాను కేవలం ఒక మిస్టరీ కథగానో, లేకపోతే రివేంజ్ డ్రామాగానో తీసినా బాగానే ఉండేది. కానీ, సామాజిక అంశమై,అందులోనూ మన చుట్టూ అనేకం జరుగుతున్న విషయం మీద తీసినప్పుడు ఎమోషన్స్ కథకు బలమవ్వాలి తప్ప బలహీనమవ్వకూడదు.

బాధ,కోపం,నిస్సహాయత లాంటి భావోద్వేగాలు సాధారణంగా బాధితుల పాత్రలకు ఉంటాయి. అటువంటి బాధితుడి పక్కన నిలబడటానికి కావాల్సిన బలమైన ఎమోషన్ నాయకుడి పాత్రకు లేదు. ఆ బలం మొదట్లో లేకపోయినా కథతో పాటు బలపడొచ్చు. కానీ, కథ ముందుకు నడుస్తూ ఉంటే ఈ పాత్ర సాధారణంగా మారిపోతుంది.

ఎమోషనల్ కాలిక్యులేషన్స్ సామాజిక అంశాలు కథలుగా వచ్చే సినిమాలో ముఖ్యమైన అంశం. సామాజిక సమస్యకు ప్రేక్షకుల స్పందన ఏ సన్నివేశాల్లో ఎలా ఉంటుందో ఊహించే అంచనా ఉండి, ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఎలా మారితే ప్రేక్షకులు కథలో లీనమై పోతారో ఊహించగలగడమే ఆ కాలిక్యులేషన్.ఆ గణన తప్పడం వల్ల సామాజిక అంశంతో కూడిన ఈ థ్రిల్లర్ అంశం కూడా మైనస్ గా మారిన సినిమా ఇది.

కథ బాగున్నా,దాన్ని చెప్పడంలో గందరగోళం, అస్పష్టత ఉంటే, అసలు కథే ట్రాక్ తప్పిపోతుంది. అలా ట్రాక్ తప్పిన సినిమానే ‘నింద.’

(అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)