సెర్బియా: ఈ దేశంలో రోజూ ఉదయం 11.52 గం.లకు ప్రజలు 15 నిమిషాలు ఉద్యమిస్తారు...

ఫొటో సోర్స్, Reuters
సెర్బియాలో స్థానిక కాలమానం ప్రకారం ప్రతి రోజూ కచ్చితంగా 11.52 గం.లకు ప్రజలు15 నిముషాల పాటు వీధులను దిగ్బంధిస్తున్నారు. ఈ సమయంలో ట్రాఫిక్ ఆగిపోతుంది. ప్రజలంతా నిశబ్ధంగా వెళతారు.
సెర్బియాలోని రెండో అతి పెద్ద నగరం నోవి శాడ్ రైల్వేస్టేషన్ పైకప్పు నవంబర్‌లో కూలిపోయింది. ఈ సంఘటనలో బాధితులకు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది.
ఈ సంఘటనలో 15మంది చనిపోయారు. వారి జ్ఞాపకార్థంగా ప్రతిరోజూ 15 నిముషాల పాటు ట్రాఫిక్‌ను నిలిపేస్తున్నారు.
ఈ దుర్ఘటన తర్వాత సెర్బియా నిర్మాణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 12మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అంటున్నారు.

ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలంతా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే నవంబర్ మధ్యలో యూనివర్సిటీ ఆఫ్ బెల్‌గ్రేడ్ విద్యార్థులు, అధ్యాపకులు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ దిగ్బంధం దేశవ్యాప్తంగా ఉన్న 50కిపైగా యూనివర్సిటీలకు, మాధ్యమిక పాఠశాలలకు విస్తరించింది.
ఆదివారం దేశ రాజధాని బెల్‌గ్రేడ్‌లో లక్షల మంది ప్రజలు విద్యార్థులతో కలిసి వీధుల్లోకి వచ్చారు. ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మనమంతా పైకప్పు కిందనే ఉన్నాం’
ఆదివారం జరిగిన భారీ ఆందోళన ఇటీవలి సంవత్సరాల్లో సెర్బియాలోనే అతి పెద్దది.
రైల్వే స్టేషన్‌లో పైకప్పు కూలిపోయిన సంఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం ఆందోళకారులు వెలిగించిన ఫోన్ల లైట్లలో సెంట్రల్ బెల్‌గ్రేడ్ స్వేర్ మొత్తం నిండిపోయింది.
దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్ధంగా లక్షల మంది పాటిస్తున్న మౌనంతో వీధులన్నీ నిశబ్ధంగా మారాయి.
"విద్యార్థులు చాలాకాలం పాటు మౌనంగా ఉన్నారు. కట్టలు తెంచుకున్న బాధ్యతారాహిత్యంపై తిరుగుబాటుకి ఈ సంఘటనలు నిదర్శనం" నోవిశాడ్‌లో వైద్య విద్యార్థి మాక్సిమ్ లిక్ బీబీసీతో చెప్పారు.
ఆదివారం జరిగిన ప్రదర్శనలో విద్యార్థులతో పాటు రైతులు, ఆరోగ్య కార్యకర్తలు, నటులు, కళాకారులు, బెల్‌గ్రేడ్‌ప్రజలతో పాటు సెర్బియాలో ఇతర నగరాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో పాల్గొన్నారు.
నిశబ్ధాన్ని పాటించే సమయంలో ఆందోళనకారులు ఒక పెద్ద బ్యానర్‌ను ఆవిష్కరించారు. దాని మీద ‘మనమంతా పైకప్పు కిందే ఉన్నాం’ అని రాసి ఉంది.

ఫొటో సోర్స్, Reuters
నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, అవినీతి వల్లనే రైల్వే స్టేషన్ పైకప్పు కూలిపోయిందని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ పైకప్పు పనులను చైనా ప్రభుత్వ కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా రెండుసార్లు పునరుద్ధరించారు.
"నేను మార్పుకు మద్దతిచ్చేందుకు వచ్చాను. మార్పు కోసం ప్రజల ఆందోళన ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. మేమంతా ఆరోగ్యకరమైన జీవితం వైపు మళ్లేందుకు క్షేత్ర స్థాయి నుంచి ఈ మార్పు తప్పని సరి" అని బెల్‌గ్రేడ్ సమీపంలో ఉన్న పాన్సెవొకు చెందిన లిడిజా బీబీసీతో చెప్పారు.
విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో తనకు నమ్మకం ఉందని ఆమె చెప్పారు. ఆందోళనల్లో పాల్గొంటున్న యువత సంఖ్య అందరికీ ఒక హెచ్చరికలాంటిదని అన్నారు.
"నేను విద్యార్థులకు మద్దతిస్తాను. వాళ్లు తమ మాటకు కట్టుబడి ఉన్నారు. ఎప్పుడూ తమ వైఖరిని మార్చుకోలేదు" అని లిడిజా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
‘రక్తమంటిన చేతులు’ అనే చిహ్ననికి తోడు ‘అవినీతి చంపేస్తుంది’ అనే నినాదం ఆందోళనలకు తోడుగా మారింది.
‘నీ చేతులకు రక్తమంటిది’, ‘ఈ దేశం పిల్లలది’ ‘ఆందోళనలకు అందరూ రండి’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు.
15 నిముషాల మౌనం తర్వాత, ఆందోళనకారులంతో పెద్దగా అరుస్తూ పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అయితే, ఆందోళనకారుల డిమాండ్లను నెరవేర్చినట్లు అధికారులు చెబుతున్నారు. వారు కోరుతున్నట్లుగానే దర్యాప్తు చేపట్టామని, నోవి శాడ్ రైల్వే స్టేషన్‌లో పైకప్పు పునర్నిర్మాణానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేశామని చెబుతున్నారు.
అయితే అధికారులు చూపించిన పేపర్లు సంపూర్ణంగా లేవని విద్యార్థులు అంటున్నారు.
సెర్బియా ప్రధానమంత్రితో పాటు నోవి శాడ్ మేయర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు రహదారుల దిగ్బంధం, ఆందోళనల్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, REUTERS/Zorana Jevtic
డిమాండ్లను నెరవేర్చారా?
బెల్‌గ్రేడ్‌లోని అన్ని యూనివర్సిటీలతో పాటు దేశంలోని రెండు అతి పెద్ద నగరాలు నిస్, నోవిశాడ్‌లలో యూనివర్సిటీలు దిగ్బంధంలో ఉన్నాయి.
కొంతమంది స్కూలు టీచర్లు సైతం సిలబస్‌ను తగ్గించి తాము కూడా ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించారు. బాధితులకు గౌరవ సూచకంగా హైస్కూలు విద్యార్థులు స్కూళ్లను బహిష్కరిస్తున్నారు.
ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో పెరుగుతున్న అనిశ్చితి దృష్ట్యా శీతాకాలపు సెలవుల్ని ముందుగానే ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఆందోళనకారుల డిమాండ్లన్నింటిని నెరవేర్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విద్యార్థులు దీన్ని తిరస్కరిస్తున్నారు. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదని వారు వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
మిగతా విషయాలతో పాటు నోవిశాడ్ రైల్వే స్టేషన్‌లో కూలిపోయిన పైకప్పు సంఘటనలు సంబంధించిన అన్ని పత్రాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇప్పటికే 195 పత్రాలను ప్రచురించారు. అయితే మొత్తం 800 పత్రాలు ఉన్నాయని, ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలలో ఆర్థిక అంశాల వివరాలు లేవని విద్యార్థులు అంటున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ బెల్‌గ్రేడ్‌లో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు ఒకరు ఇటీవల ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టిన పత్రాలను విశ్లేషించారు. అందులో కీలకమైన సమాచారం లేదని ఆయన చెప్పారు.
ఆదివారం రాత్రి ఆందోళనల తర్వాత సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. అందులో "బెల్‌గ్రేడ్‌లో ప్రతిపక్ష మనస్తత్వం ఉన్న ప్రజలు భారీ సంఖ్యలో పోగయ్యారు. వారి డిమాండ్లు వినేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. వాళ్లు ఎలా ఆలోచిస్తారు? వాళ్లు దేన్ని నమ్ముతున్నారు అనేది సెర్బియాకు ఎప్పుడూ ముఖ్యం" అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














