ఎలక్టోరల్ బాండ్స్ వివరాల ఆధారంగా ఎవరిపై, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతమైన తర్వాత వాటిపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష పార్టీలు, న్యాయ నిపుణుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుకు, కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో కాంట్రాక్టులు పొందడానికి, లేదా ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారణ నిలిపివేయడం వంటి ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఉంది.
ఉదాహరణకు, ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా అనుచిత లబ్ధి చేకూర్చిందా? అందుకే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారా? అనేది నిగ్గుతేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ - సిట్) ఏర్పాటు చేయాలని గత నెలలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ లేవు.
ఇదేకాకుండా, కపిల్ సిబల్ వంటి న్యాయ నిపుణులు, రాజకీయాల్లో పారదర్శకత కోసం పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వంటి సంస్థలు కూడా దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాయి.
ఈ విషయంలో దర్యాప్తు సాధ్యమేనా? తర్వాత ఏం జరగబోతోంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఫొటో సోర్స్, AFP
ఎలక్టోరల్ బాండ్ల డేటా ఏం చెబుతోంది?
భారతీయ స్టేట్ బ్యాంక్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన డేటా చాలా విషయాలను బహిర్గతం చేసింది.
ఈ విరాళాలు అందించిన సమయం అనేక సందేహాలకు తావిస్తోందని చాలా వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి.
ఉదాహరణకు, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న 26 కంపెనీల్లో 16 కంపెనీలు విచారణ ప్రారంభమైన తర్వాత రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. విచారణ అనంతరం మరో 6 కంపెనీలు మరిన్ని బాండ్లు కొనుగోలు చేసినట్లు పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్ల కేసుకు సంబంధించిన న్యాయవాదుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం, భారతీయ జనతా పార్టీకి 33 గ్రూపు కంపెనీలు దాదాపు 1,750 కోట్ల రూపాయాలు విరాళంగా ఇచ్చాయి. ఈ కంపెనీలు రూ.3.7 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందాయి.
మరో 30 షెల్ కంపెనీలు దాదాపు రూ.143 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చాయని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.
వార్తాసంస్థ రిపోర్టర్స్ కలెక్టివ్ ప్రకారం, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చిన టాప్ 200 కంపెనీల్లో 16 కంపెనీలు మూడేళ్లుగా వరుసగా నష్టాల్లో ఉన్నప్పటికీ బాండ్లను కొనుగోలు చేశాయి.
బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, టెలికం వంటి వివిధ రంగాల్లో ప్రైవేటు చెల్లింపులకు సంబంధించి కూడా సందేహాలున్నాయి.
మొత్తం దాదాపు రూ.16,500 కోట్లు (16,492) విలువైన ఎలక్టోరల్ బాండ్ల కొనుగోళ్లు జరిగాయి. వాటిలో బీజేపీకి రూ.8,252 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ.2,000 (1952) కోట్లు, టీఎంసీకి రూ.1,705 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇందులో తప్పేంటి?
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం కాదు, ఎందుకంటే, ఇది కొనుగోలు చేయదగిన చట్టబద్ధమైన పథకం.
సీనియర్ న్యాయవాది, శిక్ష్మాస్మృతి చట్టాల (క్రిమినల్ లా) నిపుణులు సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ, "చట్టబద్ధమైన పథకం కింద చేసిన చెల్లింపులను అవినీతిగా పరిగణించలేం."
ఒక వ్యక్తి లేదా కంపెనీ ఒక పార్టీకి విరాళం ఇస్తే, దానికి ప్రతిఫలంగా ఆ పార్టీ వారి ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తే అది చట్టవిరుద్ధం.
"కాబట్టి, ఆ చెల్లింపులు ఏదో ఒక ప్రయోజనానికి సంబంధించినవని మొదట నిరూపించాలి. వారికి ఆ ప్రయోజనం కల్పించేందుకు రాజకీయ పార్టీ అధికారంలో ఉండి ఉండాలి, లేదా చెల్లింపులు చేసిన వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగివుండాలి" అని లూథ్రా చెప్పారు.
పారదర్శకత గురించి పనిచేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ మాట్లాడుతూ, ''అక్రమాలు జరిగినందుకే బాండ్లు ఇచ్చామని లేదా తీసుకున్నామని ఎవరూ చెప్పరు, కాబట్టి ఈ విషయంలో సమగ్ర విచారణ జరగాలి''అన్నారు.
కంపెనీలు బాండ్లు కొనుగోలు చేసేలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించారా? లేక కేంద్ర సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్న వ్యక్తులు, లేదా కంపెనీలు బాండ్లను కొనుగోలు చేయలేదా? ఆ తర్వాత వారిపై కేసులు నమోదు చేశారా? అనే విషయాలపై విచారణ జరగాలని ఆమె అంటున్నారు.
అలాగే, బాండ్లు కొనుగోలు చేసినందుకు బదులుగా కాంట్రాక్టులు కట్టబెట్టారా వంటి ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అంజలి భరద్వాజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విచారణ ఎలా జరగాలి?
దర్యాప్తునకు రెండు మార్గాలున్నాయి. ఒకటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి కేంద్ర ఏజెన్సీలతో ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ లేదా లంచానికి సంబంధించిన అవకతవకలు ఏమైనా జరిగాయా అనే కోణంలో దర్యాప్తు జరిపించవచ్చు. లేదంటే ప్రత్యామ్నాయంగా, ఈ కేసులను విచారించేందుకు సుప్రీం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేయవచ్చు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ మాట్లాడుతూ, ''సిట్ ఏర్పాటు చేయాలి. అయితే, ప్రభుత్వం ఈ పని సొంతంగా చేసే అవకాశం లేదు. కాబట్టి కోర్టు ద్వారానే చేయాల్సి ఉంటుంది.''
చాలా వరకూ ఇలాంటి విషయాల్లో "ఎవరో ఒకరు సుప్రీంకోర్టు తలుపులు తడతారు" అని ఆయన అన్నారు.
"ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందే. ఎందుకంటే, దీని చుట్టూ చాలా లావాదేవీలున్నాయి."
''జైన్ హవాలా కేసు దగ్గరి నుంచి ఇలాంటి ఎన్నో కేసుల్లో విచారణ జరిగింది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు కూడా ఉన్నాయి'' అని బొగ్గు కేటాయింపుల కుంభకోణంపై విచారణ జరిపిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ మదన్ లోకూర్ అభిప్రాయపడ్డారు.
జైన్ హవాలా కేసులో క్యాబినెట్ మంత్రులతో పాటు పలువురు నేతలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరిగింది.
వాటితో పాటు, 2జీ లైసెన్స్ మంజూరు వంటి అనేక కేసుల్లో సీబీఐ, ఈడీ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించింది.
దిల్లీ కోర్టులో వాదనల సందర్భంగా, దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యాపారి రూ.55 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను బీజేపీకి విరాళంగా ఇవ్వడంపై కూడా దర్యాప్తు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
ఈ కేసులో వ్యాపారవేత్త శరత్ రెడ్డి చివరికి సాక్షిగా మారి, దిల్లీ కోర్టు నుంచి బెయిల్ కూడా పొందారు.

ఫొటో సోర్స్, @Luthra_Sidharth
ఎవరు శిక్షార్హులు, వారికి విధించగలిగిన శిక్ష ఏమిటి?
లంచం ఎందుకిచ్చారు, ఎవరికిచ్చారు, ఎలా ఇచ్చారనే స్వభావాన్ని బట్టి ఎక్కువ మందికి కూడా శిక్షపడొచ్చు.
న్యాయ నిపుణుల అభిప్రాయాల ప్రకారం,విరాళాలిచ్చిన కంపెనీలు లేదా వ్యక్తులు, రాజకీయ పార్టీలకు చెందినవారు, ప్రయోజనాలు చేకూర్చే అధికారం ఉన్న ప్రభుత్వ అధికారులు, ఇంకా ఆయా లావాదేవీల్లో పాల్గొన్న, లేదా సంబంధమున్న వారిని కూడా విచారించవచ్చు.
''కంపెనీలకు చెందిన వ్యక్తులు, రాజకీయ పార్టీలకు చెందిన వారు, ప్రభుత్వంలోని కొందరు, మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈ ఏజెన్సీలకు చెందిన వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయొచ్చు'' అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
పొందిన ప్రయోజనాలకు, ఇచ్చిన విరాళాలకూ సంబంధాలంటే, ''పార్టీ కోశాధికారి, లేదా పార్టీ అధ్యక్షుడు, లేదా చెల్లింపుల వ్యవహారంలో సంబంధమున్న పార్టీ వ్యక్తులు, ప్రయోజనం చేకూర్చేలా ఆదేశాలిచ్చిన ప్రభుత్వ అధికారి'' వంటి వారిని విచారణ చేయవచ్చని సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం, కంపెనీని కూడా నిందితుల జాబితాలో చేర్చవచ్చు.
అలాంటి పరిస్థితుల్లో, ''చట్ట ఉల్లంఘన జరిగిన సమయంలో కంపెనీ వ్యాపార వ్యవహారాల బాధ్యుడైన వ్యక్తి, ఆయా కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉన్న ప్రతి వ్యక్తీ'' మనీలాండరింగ్ నేరానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఈ నిబంధన ప్రకారం రాజకీయ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేర్చవచ్చని సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.
''పార్టీని నిందితుల జాబితాలో చేరిస్తే పార్టీ అధ్యక్షుడు, లేదా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి, లేదా ఆ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తిని విచారించవచ్చు'' అని ఆయన అన్నారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ పోలీసు కేసులో, పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ మనీలాండరింగ్ నేరానికి పాల్పడిందని ఈడీ వాదించింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం, ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తికి జరిమానాతో పాటు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
అయితే, ఒక రాజకీయ పార్టీని నిందితుడిగా చేర్చవచ్చా, లేదా అనేదానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
అయినప్పటికీ, ఆ లావాదేవీలు జరిగిన సమయంలో కీలకంగా వ్యవహరించిన పార్టీ నేతలు, కార్యకర్తలు బాధ్యులు అవుతారు.
''ఒకవేళ సెక్షన్ 70 వర్తించకపోతే, డబ్బులు తీసుకోవడం, నిర్ణయాన్ని ప్రభావితం చేయడంలో ప్రమేయం ఉన్న వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది'' అని లూథ్రా చెప్పారు.
వాటితో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు కూడా వర్తిస్తాయి.
ఈ చట్టం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు లంచం ఇచ్చినవారిని, అందులో మధ్యవర్తులుగా ఉన్నవారికి కూడా శిక్ష విధించే అవకాశం ఉంది.
ఈ సెక్షన్ కింద జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
అలాగే, ''ఆ కాంట్రాక్టులను రద్దు కూడా చేయొచ్చు'' అని జస్టిస్ మదన్ లోకూర్ చెప్పారు.
1993 నుంచి 2010 మధ్య కాలంలో ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపులను 2014లో సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?
- ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు, ఒక శాతం ఓటు కూడా లేని బీజేపీతో స్నేహం కోసం ప్రధాన పార్టీలు ఎందుకు ఆరాటపడుతున్నాయి
- ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచినా లెక్క చెప్పకపోతే ఇంటికే.. ఎందుకు?
- కచ్చతీవు దీవిపై కాంగ్రెస్, డీఎంకేలను మోదీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలేంటీ వివాదం?
- బైపోలార్ డిజార్డర్: ఆత్మహత్యకు పురిగొల్పే మానసిక వ్యాధి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














