మనుషుల ఎత్తు పెంచే బ్రెయిన్ సెన్సర్ ఏదో తెలిసిపోయింది...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిలిపా రాక్స్‌బీ
- హోదా, బీబీసీ హెల్త్ ప్రతినిధి
మెదడులో ఉండే ఒక సెన్సర్ ద్వారా మనుషులు అంతకు ముందు కంటే ఎత్తు పెరిగేలా, సమయానికి యుక్త వయసుకు వచ్చేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పోషకాహారం తీసుకంటూ ఆరోగ్యంగా ఉండడం వల్ల 20వ శతాబ్దంలో బ్రిటన్ ప్రజలు సగటున 3.9 అంగుళాలు(10 సెంటీమీటర్లు) ఎత్తు పెరిగితే, మిగతా దేశాల్లో ప్రజలు సగటున 7.8 అంగుళాలు(20 సెంటీమీటర్లు) వరకూ ఎత్తు పెరిగారు.
కానీ, నిజానికి ఇది ఎలా జరుగుతుందో, ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయారు. దీనిపై పరిశోధనలు జరిగితే, మన కండరాలను బలోపేతం చేయడం, క్రమంగా ఎత్తు పెరగడానికి అవసరమైన మందులు తయారు చేయడానికి ఒక దారి దొరుకుతుందని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.
పుష్టికరమైన, నియమిత ఆహారం తీసుకోవడం వల్ల మనిషి ఎత్తు పెరుగుతాడని, త్వరగా యుక్త వయసుకు వస్తాడనే విషయం మనకు తెలుసు.
ఉదాహరణకు దక్షిణ కొరియా పేద దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంతో ఇప్పుడు అక్కడి ప్రజల ఎత్తు ఇంతకు ముందుతో పోలిస్తే చాలా పెరిగింది.
మరోవైపు దక్షిణాసియా, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ వందేళ్ల క్రితంతో పోలిస్తే కొద్దిగా పొడవు మాత్రమే పెరిగారు.

ఫొటో సోర్స్, Thinkstock
'ఎక్కువ మంది పిల్లల్ని కను'
ఆహారానికి సంబంధించిన సంకేతాలు మెదడులోని 'హైపోథెలెమస్' అనే భాగం వరకూ చేరుతాయని శాస్త్రవేత్తలు ముందే కనుగొన్నారు. శరీరానికి అవసరమైన పోషకాల గురించి మెదడుకు అలాంటి సంకేతాలు అందుతాయి. శరీరం వేగంగా పెరిగేలా చేస్తాయి.
సైన్స్ అండ్ రీసెర్చ్ జర్నల్ 'నేచర్' దీనిపై ఒక కొత్త అధ్యయనం ప్రచురించింది. ఈ పరిశోధన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల నేతృత్వంలో జరిగింది. ఇందులో లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ, బ్రిస్టల్ యూనివర్సిటీ, మిషిగన్ యూనివర్సిటీ, వెండర్‌బిల్ట్ యూనివర్సిటీ టీమ్స్ కూడా పాల్గొన్నాయి.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఆ ఈ ప్రక్రియకు కారణమైన ఒక రిసెప్టర్‌ను కనుగొన్నారు. దానిని ఎంసీత్రీఆర్(MC3R) అంటారు. ఆహారం సంకేతాలు ఇవ్వడం, యుక్తవయసుకు చేర్చడంతోపాటూ శరీరం ఎత్తు పెరగడానికి కూడా ఈ రిసెప్టర్ చాలా కీలకం.
"శరీరం చాలా ఆరోగ్యంగా ఉంది, శరీరానికి ఆహారం బాగా అందుతోంది. అందుకే త్వరగా యుక్త వయసులోకి వచ్చెయ్, ఎక్కువ మంది పిల్లల్ని కనమని ఈ రిసెప్టెర్ శరీరానికి చెబుతుంది" అని ఈ పరిశోధన చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్ స్టీఫెన్ ఒరాహిలీ చెప్పారు.
"ఇది అద్భుతం, ఇదంతా ఎలా జరుగుతుంది. అనే మొత్తం వివరాలు మా దగ్గరున్నాయి" అన్నారు ఒరాహిలీ.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఇది ఎలా జరుగుతుంది
మనుషుల్లో మెదడు రిసెప్టర్స్ మామూలుగా పనిచేయకపోతే వారి ఎత్తు తక్కువగానే ఉండిపోతుందని, అలాంటివారు, మిగతావారితో పోలిస్తే ఆలస్యంగా యుక్త వయసులోకి వస్తారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
యూకే బయోబాంక్( జన్యు, ఆరోగ్య గణాంకాల డేటాబేస్)కు అనుబంధంగా ఉన్న దాదాపు ఐదు లక్షల మంది వలంటీర్ల జన్యు నిర్మాణంపై ఈ టీమ్స్ అధ్యయనం చేశాయి. తమ పరిశోధనలో కనుగొన్న ఫలితాలు వాస్తవమేనని ధ్రువీకరించింది.
ఈ పరిశోధనలో చాలా మంది పిల్లల జన్యువుల్లో మ్యూటేషన్ కనుగొన్నారు. అది వారి మెదడులో రిసెప్టర్లను దెబ్బతీసింది. అలాంటి పిల్లలందరిలో జన్యువు ప్రభావం చిన్న వయసులోనే కనిపించడం మొదలైంది. ఆ పిల్లలు అందరూ పొట్టిగా, తక్కువ బరువుతో ఉన్నారు.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ఎంసీత్రీఆర్ జన్యువు రెండు కాపీల్లో మ్యుటేషన్ ఉన్న ఒక వ్యక్తిని కూడా కనుగొన్నారు. ఇలాంటి మార్పు అత్యంత అరుదుగా ఉంటుంది. అది హానికరం కూడా. ఆయన చాలా పొట్టిగా ఉన్నారు. యవ్వనంలో వచ్చే మార్పులు కూడా ఆయనకు 20 ఏళ్లు వచ్చిన తర్వాతే ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఇలా మనుషుల్లో మాత్రమే జరగదు. దీనిని గుర్తించడానికి పరిశోధకులు ఎలుకల మీద కూడా ప్రయోగాలు చేశారు. జంతువుల ఎదుగుదలపై కూడా మెదడు రిసెప్టర్ల ప్రభావం ఉందని తేలింది.
తమ పరిశోధన ద్వారా పిల్లల్లో ఎదుగుదల మందగించడం, ఆలస్యంగా యుక్త వయసుకు రావడం లాంటి సమస్యలను గుర్తించడంతోపాటూ, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ, సన్నగా ఉండే పిల్లల్లో కండరాలు పెరుగుదలకు సాయం లభించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
"వివిధ వ్యాధులకు గురైనవారి శారీరక సామర్థ్యం మెరుగు పరచడానికి, ఎంసీత్రీఆర్‌ను యాక్టివ్‌గా చేసే మందుల ద్వారా తగినన్ని కేలరీలను పొంది కండరాలను బలోపేతం చేయవచ్చా అనేది భవిష్యత్తులో జరగబోయే పరిశోధనల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది" అని ప్రొఫెసర్ ఒరాహిలీ చెప్పారు.
శాస్త్రవేత్తలు ఇంతకు ముందే ఒక బ్రెయిన్ రిసెప్టర్‌ను గుర్తించారు. అది ఆకలిని నియంత్రిస్తుంది. దానిని ఎంసీఫోర్ఆర్(MC4R) అంటారు. ఇది తక్కువగా ఉన్నవారు సాధారణంగా చాలా లావుగా ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
జనం ఎత్తు పెరుగుతూనే ఉండవచ్చా
మనిషి పొడవు పెరగడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. తమ జన్యు సామర్థ్యాన్ని బట్టి జనం పొడవు పెరుగుతూ ఉంటారు. ఆ సామర్థ్యం ఎంత అనేదానిని నిర్ణయించడంపై వారి ఆరోగ్యం, ఆహారం లాంటి అంశాలు చాలా ప్రభావం చూపిస్తాయి.
పేద కుటుంబాల్లో పిల్లలు కూడా పోషకాహారం, తగినన్ని కేలరీలు లభిస్తే, తమ తల్లిదండ్రులు, పూర్వీకుల్లాగే, వారసత్వంగా ఉన్నంత ఎత్తు పెరగవచ్చు. పొడవుగా ఉండే వారు సాధారణంగా సుదీర్ఘ కాలం జీవిస్తారు. వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువే.
అయితే మనుషుల ఎత్తు ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. గత శతాబ్దంలో యూరప్‌లోని మిగతా దేశాల్లోలాగే బ్రిటన్ ప్రజలు సగటు ఎత్తు కూడా పెరిగింది. కానీ గత పదేళ్ల సంకేతాలు చూస్తుంటే ఇప్పుడు సగటు ఎత్తు పెరగడం లేదని తెలుస్తోంది.
గత శతాబ్దంగా ప్రపంచంలో అత్యధిక పొడవు పెరిగినవారు దక్షిణ కొరియా మహిళలు, ఇరాన్ పురుషులు మాత్రమే.
అయితే, నెదర్లాండ్స్ పురుషులు ప్రపంచంలోనే ఎక్కువ పొడవు (182.4 సెంటీమీటర్లు) ఉంటారు. మరోవైపు గ్వాటెమాలా మహిళలు ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా(140 సెంటీమీటర్లు) ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను కైవసం చేసుకున్న తరువాత నా జీవితం ఎలా అయిపోయిందంటే..
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- ‘పాతాళానికి ద్వారాలు’.. భారతదేశంలో మెట్ల బావులు
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సముద్రం మింగేస్తుందా
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











