నటి సన్నీ లియోనీకి మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, youtube/Saregama Music
సన్నీ లియోనీ నటించిన ఒక పాటపై అభ్యంతరాలు రావడంతో మధ్యప్రదేశ్ హోమంత్రి.. నటికి వార్నింగ్ ఇచ్చారని సాక్షి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.
సన్నీ లియోన్ నటించిన "మధుబన్ మే రాధికా నాచే" ఆల్బమ్‌పై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడూ మధ్యప్రదేశ్ హోం మంత్రి సన్నీకి వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల సన్నీ నటించిన "మధుబన్ మే రాధికా నాచే" వీడియో ఆల్బమ్ విడుదలైన దగ్గర నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా సన్నీ నటించిన ఆ మ్యూజిక్ ఆల్బమ్‌ని తీసేయడానికి 72 గంటలు సమయం ఇస్తున్నానంటూ సన్నీని, గాయకుడు సాకిబ్ తోషిని హెచ్చరించారు.
ఈ క్రమంలో హోం మంత్రి నరోత్తమ్ మాట్లాడుతూ... "ఆ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం. సాకిబ్ తోషి తన మతానికి సంబంధించిన పాటలను ఈ విధంగా స్వరపరుచుకోవచ్చు కదా. ఇలాంటి పాటలు మమ్మల్ని బాధపెడతాయి. మూడు రోజుల్లో ఆ వీడియో తీయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు.
అంతేకాదు డిజైనర్ సబ్యసాచిపై చర్యలు తీసుకుంటామన్నారని సాక్షి పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒంటరి జీవితం, చనిపోయి రెండు రోజులైనా తెలీలేదు
తెలంగాణ నల్గొండ జిల్లాలో ఓ అంగన్‌వాడీ టీచర్ చనిపోయి రెండ్రోజులైనా ఎవరూ గుర్తించని దయనీయ ఘటన చోటుచేసుకుందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.
ఈ విషాదం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాశంవారిగూడెం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.
ఈ గ్రామానికి చెందిన పాశం రాజేశ్వరి(60).. భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా రెండేళ్ల క్రితం కొడుకు చనిపోయాడు.
దీంతో పిల్లలతో కలిసి కోడలు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆడపిల్లలు పెళ్లిళ్లయి అత్తారిళ్లలో ఉంటున్నారు.
రాజేశ్వరి ఒక్కరే గ్రామంలో ఉంటూ అంగన్‌వాడీ టీచరుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం స్థానికులతో మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత కనిపించలేదు.
క్రిస్మస్ సెలవులు రావడం, ఆమె ఇల్లు కాలనీలో చివరన ఉండడంతో ఎవరూ అటువైపు తొంగిచూడలేదు.
50 గడపలు మాత్రమే ఉండే ఆ ఊళ్లో చాలామంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామం దాదాపుగా నిర్మానుష్యంగానే ఉండడంతో ఆమె గురించి ఆరా తీసేవారే లేకపోయారు.
ఏ క్షణాన ఉప్పెనలా గుండెపోటు వచ్చిందో కానీ వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇంటి గుమ్మం మీదనే కుప్పకూలి చనిపోయిందని పత్రిక రాసింది.
ఆదివారం ఉదయం అటు వెళ్లిన ఓ అబ్బాయి రాజేశ్వరి ఇంటి గడప మీద పడిపోయి ఉండడాన్ని గమనించి స్థానికులకు చెప్పాడు.
వారు వచ్చి చూసేసరికి నిర్జీవంగా పడి ఉన్న ఆమె చుట్టూ చీమలు పట్టి ఉన్నాయి. రెండు రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.
ఆమె చనిపోయిన తీరును చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె గ్రామానికి చేసిన సేవలు గుర్తుచేసుకుని ఇలా దిక్కులేకుండా మృతిచెందడం బాధాకరమని వాపోయారని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లికి కెన్యా వెళ్లి ఒంగోలుకు ఒమిక్రాన్ తీసుకొచ్చారు
కెన్యా వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఒంగోలు యవతి తరఫున ఆ దేశానికి వెళ్లిన బంధువుల్లో ఒకరికి ఒమిక్రాన్ సోకినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు క్లౌపేటకు చెందిన ఓ వ్యక్తికి శనివారం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకింది.
క్లౌపేటకు చెందిన యువతి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అక్కడ కెన్యా దేశానికి చెందిన వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఈ ఇద్దరూ ఈ నెల 2న కెన్యాలో పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహానికి ఒంగోలు నుంచి వధువు కుటుంబ సభ్యులు నలుగురు వెళ్లి వచ్చారు.
వారిలో వధువు బంధువు (48)కి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనతోపాటు, మరికొందరు అనుమానితులను అధికారులు ఒంగోలు రిమ్స్‌లోని ప్రత్యేక వార్డుకు తరలించారు.
వైద్యారోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. ముందు జాగ్రత్తగా క్లౌపేట ప్రాంతాన్ని మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారని పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
సీఆర్పీఎఫ్ ఎస్సైని కాల్చి చంపిన జవాన్
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో కాల్పులు జరిగాయని వెలుగు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
మండల కేంద్రంలోని 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో ఆదివారం ఉదయం జరిగింది. బెటాలియన్‌లోని స్టీఫెన్, ఎస్ఐ ర్యాంకు అధికారి ఉమేష్ చంద్ర అనే జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి.
CRPF ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టిఫెన్ కు మధ్య గొడవ జరగడంతో కాల్పులు జరుపుకున్నారు. కాల్పుల్లో ఎస్సై ఉమేష్ చంద్ర స్పాట్ లోనే చనిపోయారు.
కానిస్టేబుల్ స్టిఫెన్ కు తీవ్రగాయాలు కావడంతో ఏటూరునాగారం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మెస్ దగ్గర గొడవ పడి ఒకరి పై ఒకరు కాల్పులు జరుపుకున్నారు.
ఎస్సై ఉమేష్ చంద్ర సొంతూరు బీహర్ గా చెప్తున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ది కన్యాకుమారి అని అధికారులు చెప్పారని పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- జేమ్స్ వెబ్: అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయిన అతి పెద్ద టెలిస్కోప్
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










