ఆరోగ్య శ్రీ యాప్ ప్రారంభించిన సీఎం జగన్.. పథకం పరిధిలోకి మరో 234 చికిత్సలు - Press Review

ఆరోగ్యశ్రీ

ఫొటో సోర్స్, CMO Andhra Pradesh

ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింతగా విస్తరించిందని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మాట్లాడారు.

‘‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2,434 వైద్య చికిత్సలను అందుబాటులోకి తెచ్చాం. దీనివల్ల ప్రజలు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. వైద్యం ఖర్చు రూ. 1,000 దాటినవన్నీ దాదాపుగా దీని పరిధిలోకి వచ్చాయి’’.

‘‘ఏడు జిల్లాల్లో ఇప్పటికే ఉన్న 2,200 చికిత్సలకు అదనంగా మరో 234, మిగిలిన 6 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 1,313కు అదనంగా మరో 1,121 చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం’’ అని ఆయన వివరించారు.

శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ చికిత్సల విస్తరణను సీఎం జగన్‌ ప్రారంభించారు.

‘‘ఆరోగ్యశ్రీ మరో జన్మ ఇచ్చే పథకం. దీని పరిధిలోకి 1.42 కోట్ల కుటుంబాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కోవిడ్‌-19 చికిత్సను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలో అనేక సమస్యలొచ్చాయి. 108, 104 సర్వీసులు బాగా లేవు. డయాలసిస్‌ సౌకర్యం లేక రోగులు పడరాని పాట్లు పడ్డారు. అనుబంధ ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు జరగలేదు. ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయారు. అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరిస్తున్నాం. క్యాన్సర్‌, కిడ్నీ, మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులను అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నాం.’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

తెలుగు, ఆంగ్లం వెర్షన్‌లో ఉన్న ‘ఆరోగ్యశ్రీ యాప్‌’ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. లబ్ధిదారులు దీనిని డౌన్‌లోడు చేసుకుని తమ ఆరోగ్య రికార్డులు, ఆసుపత్రుల జాబితా, ఇతర వివరాలను పరిశీలించుకోవచ్చు.

ప్రేమ్ జీ

ఫొటో సోర్స్, Getty Images

రోజుకు రూ.22 కోట్ల చొప్పున అజీం ప్రేమ్‌జీ వితరణ

ఐటీ దిగ్గజం, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ మేటిగా నిలిచారని సాక్షి ఓ కథనంలో పేర్కొంది. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ఆయన రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారని తెలిపింది.

2019–20 సంవత్సరానికి గాను హురున్‌ రిపోర్ట్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ నాడార్‌ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్‌ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాల తీరు కొంత మారింది.

కరోనాపై పోరాటానికి టాటా సన్స్‌ అత్యధికంగా రూ. 1,500 కోట్లు, ప్రేమ్‌జీ రూ. 1,125 కోట్లు ప్రకటించారు. కార్పొరేట్లు అత్యధిక మొత్తం విరాళాలను పీఎం–కేర్స్‌ ఫండ్‌కే ప్రకటించడం గమనార్హం. దీనికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ. 400 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 500 కోట్లు ప్రకటించాయి.

గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. రూ. 10 కోట్లకు మించి దానమిచి్చన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు ముగ్గురు.. నందన్‌ నీలేకని (రూ. 159 కోట్లు), ఎస్‌ గోపాలకృష్ణన్‌ (రూ. 50 కోట్లు), ఎస్‌డీ శిబులాల్‌ (రూ. 32 కోట్లు) ఎడెల్‌గివ్‌ జాబితాలో ఉన్నారు.

శబరిమల

కరోనా నెగిటివ్‌ ఉంటేనే శబరిమలకు..

కరోనా నెగిటివ్‌ ఉంటేనే శబరిమలకు యాత్రకు అనుమతి లభిస్తుందని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపినట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

కోవిడ్‌-19 మార్గదర్శకాలను పాటిస్తూ ఈ నెల 15 నుంచి శబరిమల యాత్రను నిర్వహించనున్నట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ యాత్రకు నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. వారంలో ప్రతిరోజు వెయ్యి మంది, వారం చివరి రోజున రెండు వేల మందిని అనుమతించనున్నట్లు తెలిపారు.

ఇటీవల కాలంలో కరోనా వైరస్‌ సోకిన వారు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఉన్న భక్తులు యాత్రలో పాల్గొనరాదన్నారు.

శబరిమల యాత్రకు సిద్ధంకండిలా..

  • యాత్రకు వెళ్లే భక్తులు sabarimalaonline.org పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి.
  • 48 గంటల ముందు తీసుకున్న కరోనా నెగిటివ్‌ ధ్రువీకరణ పత్రం ఉంటేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
  • శబరిమల ప్రవేశ ద్వారం వద్ద కొంత రుసుము తీసుకుని యాంటీజెన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో నెగిటివ్‌ వస్తేనే లోనికి అనుమతిస్తారు.
  • పదేండ్లలోపు వారిని, అరవై ఐదేండ్లు పైబడిన వారిని, అనారోగ్య సమస్యలున్న భక్తులను అనుమతించరు.
  • శబరిమల యాత్రికులు తమతోపాటు బీపీఎల్‌ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. దారిలో ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సకు ఉపయోగకరంగా ఉంటుంది.
  • భక్తులు నెయ్యితో అభిషేకం, పంబానదిలో స్నానం చేయడంపై నిషేధం విధించారు.
  • సన్నిధానం సహా పంబా నది తీరాన, గణపతి మందిరంలో రాత్రి నిద్రకు అనుమతించరు.
  • దర్శనానికి వచ్చే యాత్రికులు ప్రయాణించే దారులపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేవలం ఎరుమెలి, వలుసిరికర్ర రెండు మార్గాల నుంచి మాత్రమే వెళ్లాలి.
నంద్యాల ఆటో డ్రైవర్ సలాం కుటుంబం

అబ్బుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలకు నిరసనగా టీడీపీ ర్యాలీలు

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చిన పరిస్థితులకు నిరసనగా మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

రాష్ట్రంలోని జిల్లాల అధ్యక్షులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బుధవారం ర్యాలీలు, గురువారం కొవ్వొత్తుల ప్రదర్శనలు... ఇళ్ల ముందు కొవ్వొత్తులు వెలిగించడం, శుక్రవారం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని నిర్ణయించారు.

నంద్యాల ఘటనపై మూడు డిమాండ్లను ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. కేసును సీబీఐకి అప్పగించాలని, విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని, కారకులైన పోలీస్‌ అధికారులను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)