దివ్య దేశ్‌ముఖ్ - కోనేరు హంపి: చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరిన భారతీయ క్రీడాకారిణులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భాగ్యశ్రీ రౌత్
- హోదా, బీబీసీ కోసం
భారతీయ చెస్ మహిళా క్రీడాకారిణులు దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరారు.
నాగ్‌పూర్‌కు చెందిన చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ జూలై 23న ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు.
జార్జియాలోని బటుమిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో, సెమీ-ఫైనల్ మ్యాచ్ రెండో రౌండ్లో చైనాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ జోంగీ టాన్‌ను ఓడించి దివ్య ఫైనల్‌లోకి ప్రవేశించారు.
ఈ టోర్నమెంట్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారత సీనియర్ క్రీడాకారిణి కోనేరు హంపి చైనా క్రీడాకారిణి లీ టింగ్జీపై గెలిచి ఫైనల్‌కు చేరారు.
లీ టింగ్జీపై టైబ్రేక్ విజయంతో ప్రపంచ కప్ ఫైనల్‌లోకి ప్రవేశించారు.
ఫైనల్ మ్యాచ్‌లో భారతీయ క్రీడాకారిణులు దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి తలపడనున్నారు.
ఫైనల్ మ్యాచ్ జూలై 26 నుండి 28 వరకు జరుగుతుంది.
సెమీ-ఫైనల్ తొలి గేమ్ డ్రాగా ముగిసిన తర్వాత, దివ్య ఒత్తిడికి లొంగకుండా తెల్లటి పావులతో ఆడుతూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. తాజా గెలుపు దివ్యను ఆమె మొదటి జీఎం నార్మ్‌ను అందుకోవడానికి సాయపడింది. అలాగే 2026లో జరగనున్న మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు దివ్య.


ఫొటో సోర్స్, Instagram/Divya Deshmukh
'నేను ఇంకా బాగా ఆడివుండొచ్చు'
"నేను ఇంకా బాగా ఆడివుండొచ్చు" అని సెమీఫైనల్ మ్యాచ్ గెలిచిన తరువాత దివ్య అన్నారు.
"ఒక దశలో నేను గెలుస్తున్నా అనిపించింది. కానీ తర్వాత ఆట కొంచెం సంక్లిష్టంగా మారింది. మధ్యలో కొన్ని తప్పులు చేశాను. ఈ మ్యాచ్ సులభంగా గెలవాల్సింది. కానీ ప్రత్యర్థి గట్టిపోటీ ఇచ్చింది. గేమ్ డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ అదృష్టం నా వైపే ఉంది" అని దివ్య దేశ్‌ముఖ్ తెలిపారు.
"నాకు ఇప్పుడు నిజంగా నిద్ర చాలా అవసరం," అని దివ్య నవ్వుతూ చెప్పారు.
"గత కొన్ని రోజులుగా నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. ఇప్పుడు నాకు కావలసింది నిద్ర, ఆహారం మాత్రమే." అని ఆమె అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో దివ్య దేశ్‌ముఖ్ చైనాకు చెందిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఝూ జినర్‌ను ఓడించారు. అంతేకాకుండా, క్వార్టర్ ఫైనల్‌లో భారత దిగ్గజ క్రీడాకారిణి హరికా ద్రోణవల్లిని కూడా ఓడించారు.

ఫొటో సోర్స్, Getty Images
దివ్య దేశ్‌ముఖ్ ఎవరు?
నాగ్‌పూర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్ 2005 డిసెంబర్ 9న జన్మించారు.
ఆమె తండ్రి జితేంద్ర, తల్లి నమ్రత ఇద్దరూ వైద్యులే.
భవన్స్ సివిల్ లైన్స్ స్కూల్‌లో చదువుకున్న దివ్య.. చిన్నప్పటి నుంచి చెస్ ఆడటంలో నిష్ణాతురాలు.
ఇంటర్నేషనల్ మాస్టర్ ప్రమాణం సాధించిన దివ్య ఆగస్టు (2023) నెలలో ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. ఆ సమయంలో ఆమె రేటింగ్ 2472.
దివ్య 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్, 2021లో ఉమెన్స్ గ్రాండ్‌మాస్టర్, 2018లో ఉమెన్స్ ఇంటర్నేషనల్ మాస్టర్, 2013లో ఫిడే (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) నుంచి ఉమెన్స్ మాస్టర్ టైటిల్‌ను అందుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్ : కోనేరు హంపి
హంపి చిన్న వయసులోనే.. అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. 2002లో ఆమె ఈ రికార్డ్ సాధించారు.
అండర్ 10, 12, 14 వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లనూ ఆమె గెలుచుకోవడంతో ఆమె ఉమన్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు.
అత్యంత పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన క్రీడాకారిణిగా ఆమె పేరిట ఉన్న రికార్డును అనంతరం 2008లో చైనా క్రీడాకారిణి హో ఇఫాన్ చెరిపేశారు.
హంపి 2003లో అర్జున అవార్డు.. 2007లో పద్మశ్రీ పురస్కారం పొందారు.
2016లో మెటర్నిటీ బ్రేక్ తీసుకున్న హంపి 2019లో 'ఫిడె ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్' గెలిచారు. మళ్లీ ఈ ఏడాది(2024)లోనూ ఆ చాంపియన్‌షిప్ గెలుచుకున్నారు.
2019లో ఆమె వరల్డ్ చాంపియన్ అయినప్పుడు తన కుమార్తెకు రెండేళ్లు.
అనంతరం 2020లో ఆమె చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం సాధించారు.

ఫొటో సోర్స్, Instagram/Divya Deshmukh
'ఆట కంటే దుస్తులపై శ్రద్ధ'
నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ గురించి కొన్ని నెలల క్రితం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ రాశారు. అందులో ప్రేక్షకుల నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
ప్రేక్షకులు తమ ఆటను సీరియస్‌గా తీసుకోరని, మహిళా క్రీడాకారుల పట్ల ప్రేక్షకులు ఎలా ప్రవర్తిస్తారో ఆమె చెప్పారు.
"పురుషులు ఆడుతున్నప్పుడు ప్రేక్షకుల దృష్టి వారి ఆటపైనే ఉంటుంది. కానీ మహిళలు ఆడుతున్నప్పుడు, చాలా మంది ప్రేక్షకులు – నేను ఎలా కనిపిస్తున్నానో? ఏ బట్టలు వేసుకున్నానో? జుట్టు దువ్వుకున్నానా? నేను ఎలా ప్రవర్తిస్తున్నానో? అనే విషయాలపైనే మాట్లాడుతుంటారు"అని తన పోస్ట్‌లో రాశారు.
"నేను చెస్ ఆడే విధానంపై ఎవరూ దృష్టి పెట్టరు. ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కూడా నా ఆట గురించి తెలియకుండానే ప్రజలు నా శరీరం, నా దుస్తులు, నా జుట్టు వైపు చూడడం నేను గమనించా" అని ఆమె చెప్పారు.
"నేను ఆట ఎలా ఆడానో, నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు." అని ఆ పోస్ట్‌లో రాశారు.
ఈ పోస్ట్ చర్చనీయాంశమైన తర్వాత, ఆమె దానిని ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు.

ఫొటో సోర్స్, Getty Images
దివ్య విజయాలు
ప్రధాన టోర్నమెంట్లలో దివ్య ప్రతిసారి అద్భుతంగా ఆడారు. మూడు చెస్ ఒలింపియాడ్‌లలో బంగారు పతకాలను గెలుచుకున్నారు.
అంతేకాకుండా ఆసియా ఛాంపియన్‌షిప్, ప్రపంచ యూత్, ప్రపంచ జూనియర్ పోటీలలో కూడా అనేక టైటిళ్లను గెలుచుకున్నారామె.
2023లో అల్మట్టిలో జరిగిన ఆసియా మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌ను దివ్య గెలుచుకున్నారు.
టాటా స్టీల్ ఇండియా, షార్జా ఛాలెంజర్స్ వంటి రాపిడ్ టోర్నమెంట్లలో దివ్య దేశ్‌ముఖ్ విజయవంతమైన ప్రదర్శనలు ఆమె వివిధ టైమ్ ఫార్మాట్లలో సమానంగా ప్రతిభావంతురాలు అని నిరూపించాయి.
2024లో బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారతదేశం బంగారు పతకం గెలవడంలో దివ్య కీలకపాత్ర పోషించారు. వరల్డ్ టీమ్ రాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్‌లో బ్లిట్జ్ విభాగంలో ఆమె ప్రదర్శన రేటింగ్ 2600 కంటే ఎక్కువగానే ఉంది.
2012లో, దివ్య తన తొలి జాతీయ టైటిల్ అయిన అండర్-7 ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత 2014లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన అండర్-10 వరల్డ్ యూత్ టైటిల్‌ను, 2017లో బ్రెజిల్‌లో జరిగిన అండర్-12 వరల్డ్ యూత్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
2021లో ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ అయ్యారు దివ్య. ఆమె విదర్భ నుంచి మొదటి మహిళా గ్రాండ్‌మాస్టర్, భారతదేశంలో 22వ మహిళా గ్రాండ్‌మాస్టర్ అయ్యారు.
దివ్య దేశ్‌ముఖ్ 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా గుర్తింపుపొందారు. ఆ తర్వాత 2024లో ప్రపంచ జూనియర్ గర్ల్స్ అండర్-20 చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. అద్భుతమైన ఆటతో 11కి 10 పాయింట్లు సాధించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














