వంటింటి పోపుల డబ్బా చిట్కాల్లో ఉండే మహత్యం ఏంటి?

వంటింటి చిట్కాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, ఆయేషా ఇంతియాజ్
    • హోదా, బీబీసీ ట్రావెల్

వంటిట్లో, ఇంటి పెరట్లో లభించే వస్తువులతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దవాళ్లు నయం చేయడం భారత్, పాకిస్తాన్‌లో బాగా చూస్తుంటాం.

నాకు కవల పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ తల గుండ్రంగా పెరగాలనే ఉద్దేశంతో స్టీల్ గిన్నెల మూతల మీద, బియ్యం కట్టిన చిన్న మూటలు, లేదా టీ తాగే సాసర్లను తల దిండుగా పెద్దవాళ్లు పెట్టేవారు. పాకిస్తాన్‌లో ఇది చాలా విరివిగా పాటించే చిట్కా.

ఇలాంటి ఎన్నో చిట్కాలను చాలా రకాల చిన్న చిన్న సమస్యలకు మంత్రంలా వాడుతూ ఉంటారు. వినడానికి సాధారణంగా అనిపించినా, ఒక్కోసారి ఇవి చాలా బాగా పని చేస్తాయి. ఈ ప్రాంతాలలో నివసించే చాలా మంది ప్రజలు తమకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన విజ్ఞానాన్ని నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యల పరిష్కారానికి వాడుతూ ఉండేవారు.

ఈ చిట్కాలలో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు కురుపులకు వెల్లుల్లి రసం వాడటం, చీమలను తరిమేసేందుకు ఉప్పు, పసుపు చల్లడం, బల్లులు ఇంట్లోకి రాకుండా చేయడానికి కోడిగుడ్డు పెంకులు పెట్టడం, డెంగీ రాకుండా లవంగాలు గుచ్చిన నిమ్మకాయను ఉంచడం లాంటివి చేస్తూ ఉంటారు. నిమ్మ, పసుపు, అల్లాన్ని అయితే రకరకాల ఆరోగ్య సమస్యలను నయం చేసే ఔషధాలుగా వాడతారు. అలాగే, నెయ్యి తాగడం వలన పురిటి నొప్పులు వస్తాయని, ఇంగువ తింటే ఉబ్బరం తగ్గుతుందని అంటారు.

బస్సుల్లో, రైళ్లలో కూడా సాధారణ రోగాలకు మందులు అమ్మే వ్యాపారులను చూడవచ్చు.

ఇక ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు, చిట్కాలు వల్లించే పెద్దవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఏదైనా కాస్త నలతగా ఉందని చెబితే చాలు.. రకరకాల చిట్కా పరిష్కారాలు ఇచ్చేవారు, సూచించేవారు సిద్ధంగా ఉంటారు.

వంటింటి చిట్కాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

సౌందర్య చిట్కాలు అయితే మరీ ప్రాచుర్యం పొందాయి. పాకిస్తాన్ లాంటి దేశాలలో కొన్ని కుటుంబాలలో వివాహం అయితే గాని, అమ్మాయిలను బ్యూటీ పార్లర్‌కి వెళ్లనివ్వరు.

అమ్మాయిలు ఇంట్లో సహజంగా లభించే పదార్థాలనే సౌందర్య సాధనాలుగా వాడుతూ ఉంటారు. ఒక రోజు నిల్వ ఉంచిన రొట్టెను పొడి చేసి అందులో వేపాకు కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలకు మందుగా వాడతారు. చర్మం మీద రంధ్రాలను శుభ్రపరిచేందుకు కూడా వినియోగిస్తారు. ఇవి ఒక్కొక్కసారి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను ఇస్తాయి.

చిట్కాను ఉర్దూలో టోట్కా అంటారు. ఈ పదం మూలాలు సంస్కృతం నుంచి వచ్చాయి. ఈ పదం 1683లో రాసిన సుహాగన్ నామా అనే పుస్తకంలో కనిపిస్తుంది. ఏదైనా చెడు విషయానికి చిట్కాగా పని చేసే దానిని టోట్కా అంటారు. ఇది టోనా అనే పదానికి పర్యాయ పదం లాంటిది. ఈ పదాలు చేతబడికి సంబంధించినవి.

కాలక్రమేనా చేతబడి లాంటివి పోయి, ప్రాకృతిక వైద్యానికి చిట్కా అనే పదం వాడటం మొదలయింది.

సాధారణంగా ఈ చిట్కాలను అమ్మమ్మలు, నానమ్మలు సంరక్షిస్తూ, తరువాతి తరం వారికి అందిస్తూ ఉంటారు.

వంటింటి చిట్కాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

80 సంవత్సరాల రెహ్మాన్ నవాబ్ జాన్ సిద్దిఖి చిన్నప్పుడు వేసవి సెలవులను తమిళనాడులోని వెల్లూరులో అమ్మమ్మ ఇంట్లో గడిపేవారు. ఆమె ఒంటి మీద తామరకి వెల్లుల్లి రసం రాయడం, లేదా కందిరీగ కుడితే ఉల్లిపాయ రసం రాయడం లాంటివి చేస్తూ ఉండేవారు.

సిద్దిఖి అమ్మమ్మ వైద్యురాలు కాదు. వాళ్ళ ఇల్లు వెల్లూరులో పేరు పొందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి సమీపంలోనే ఉన్నప్పటికీ చుట్టు పక్కల పొలాల్లో పని చేసే చాలా మంది వాళ్ళ అమ్మమ్మ ఇచ్చే ప్రకృతి వైద్యం తీసుకోవడానికే ఇష్టపడేవారు.

నువ్వుల నూనెలో విషం నిండిన తేళ్లను నింపి ఉంచి ఆ నూనెను తేళ్ల కాటుకి ముందుగా వాడుతూ ఉండే వారు. అంతే కాకుండా వాళ్ళింట్లో కలబంద లాంటి రకరకాల ఔషధ మొక్కలు ఉండేవి. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సహజంగా రక్షిస్తుంది.

వాళ్ళ ఇంటి తోటలో ఉండే ఒక మొక్క వేరు, ఇంకొక మొక్క గుజ్జు, ఇంకొక మొక్క పూల రేకులే రకరకాల రోగాలకు చిట్కా వైద్యంగా పనిచేసేవి.

"చాలా మంది రోగులకు ఈ చిట్కా వైద్యం అసలైన వైద్యానికి ప్రత్యామ్న్యాయంగా పని చేసేది. అవి తమ సొంత భూమి మీద పుట్టి అక్కడ నివసించే ప్రజల ద్వారా అందించిన చికిత్సలు. ఇలాంటి చిన్నప్పటి చిట్కాలన్నీ నాకు గుర్తు ఉన్నాయి" అని సిద్దిఖి చెప్పారు.

1990ల నుంచి ఈ చిట్కాలను జుబైదా తారిఖ్ ప్రాచుర్యంలోకి తేవడం మొదలు పెట్టారు. ఆమె పాకిస్తాన్ జాతీయ టెలివిజన్ ఛానెల్లో ఈ చిట్కాలను పంచుకునేవారు.

ఆమె ఇచ్చిన ఒక ఆఖరి ఇంటర్వ్యూ లో చిట్కాల గురించి మాట్లాడుతూ, "ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్న చోట చిట్కాలు ఉంటాయి. మేము గోరు వెచ్చని తేనె, వాము, అల్లం కలిపి దగ్గుకి వాడేవాళ్ళం. తలనొప్పి వస్తే కణతలకు నిమ్మ రసం పట్టించే వాళ్ళం. మాకు అప్పుడు మందుల పేర్లు తెలియవు" అని అన్నారు.

"చాలా మందికి అల్లోపతి మందుల పేర్లు తెలియవు. చేతి వేలు తెగితే పసుపు రాసి గాయాన్ని మాన్చే చికిత్స గురించి సాజిద్ మహమూద్ అనే నేవీ కెప్టెన్ గుర్తు చేసుకున్నారు. అలా చేయగానే నాకు రక్తం కారడం ఆగిపోయింది. ఈ రోజుల్లో అయితే దానికి కనీసం 3 - 5 కుట్లు పడతాయి" అని ఆయన అన్నారు.

వంటింటి చిట్కాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆధునిక వైద్యానికి, ప్రత్యామ్నాయ వైద్యానికి మధ్యన ఉండే అంతరాలను తగ్గించేందుకు డాక్టర్ బిల్కిస్ షేఖ్ అనే హోమియోపతి వైద్యుడు పని చేస్తున్నారు.

"మీకు చేయి విరిగితే, మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే కనీసం 12 గంటలు పట్టేటట్లు ఉంటే, ముందు ఇంటి వైద్యం గురించి ఆలోచిస్తామా లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మన మహిళలు వంటింటి డాక్టర్లు. ఈ చిట్కా వైద్యం మన జీన్స్‌లోనే ఉంది" అని ఆమె అన్నారు.

ఆమె యు ట్యూబ్ ఛానల్‌కి పది లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ ఛానెల్లో ఆమె హార్మోనుల సమస్యల నుంచి కాఫీ, పెరుగు లాంటివి వాడి సహజంగా జుట్టు కుదుళ్లను బల పర్చుకోవడం వంటి వాటి కోసం పరిష్కారాలు చెబుతారు..

లవంగ, వెల్లుల్లి, అల్లం పొడి, ఉప్పు వాడి మూడు నిమిషాల్లో మెరిసే దంతాలను పొందటం ఎలాగో కూడా ఆమె చెబుతారు.

ఈ పదార్ధాలన్నీ మనకు పరిచితమైనవే. కానీ, కేవలం అమ్మమ్మలు, నానమ్మల నుంచి సంపాదించిన జ్ఞానంతోనే కాకుండా... రకరకాల శాస్త్రీయ పరిశోధనలు, పత్రాలు, వీటికి సంబంధించిన సమాచారం చదివి షేఖ్ శాస్త్రీయంగా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు.

ఆలా చేయడం వలన కొత్త తరం పిల్లలు ఆమె చెప్పే విషయాల పట్ల ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు. వీరు ప్రతీ సమస్యకు గూగుల్లో ప్రశ్నలు అడిగే తరం అని ఆమె అన్నారు.

"మనం మొక్కల లాంటి వాళ్ళం. మనం మన మూలాలతో సంబంధం తెంచేసుకుంటే మనం వంగిపోవడం ఖాయం" అని ఆమె అన్నారు.

తేనె, నిమ్మకాయ బద్ద

ఫొటో సోర్స్, Dmitry Alferov/Getty Images

ఇటీవల కాలంలో ఈ చిట్కాలు ఆన్‌లైన్ లో షేర్ చేస్తూ వీటికి ప్రాచుర్యం కల్పించడం ఎక్కువయింది.

ఈ చిన్న చిన్న చిట్కాలతో చికెన్ పాస్తా ఎలా చేయాలో చెప్పడం నుంచి , వయసును కప్పిపెట్టే రక రకాల కషాయాలు లాంటివి కూడా ఉంటాయి. వీటికి వ్యూస్ కొన్ని లక్షల్లో ఉంటాయి.

ఈ చిట్కాలు ప్రజల నిత్య సంభాషణల్లో, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులతో, టీవీ షోలలో ప్రతి రోజూ దర్శనమిస్తూనే ఉంటాయి.

ఇంట్లో స్వయంగా ఈ చిట్కాలను చేసుకుని పాటించలేని వాళ్ళ కోసం భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి అమ్మే సంస్థలు కూడా పెరిగాయి.

పాకిస్తాన్‌లోని ప్రాకృతిక ఔషధాలను తయారు చేసే హమ్ దర్ద్ లాబొరేటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫాతిమా మునీర్ అహ్మద్ ముత్తాత హకీమ్ హఫీజ్ అబ్దుల్ మజీద్ యునాని వైద్యునిగా పని చేసేవారు. ఆయన తొలి మత్లబ్ క్లినిక్‌ని 1906లో దిల్లీలో ప్రారంభించారు.

దేశ విభజన తరువాత ఆయన కొడుకులు హకీమ్ మొహమ్మద్ సైద్, హకీమ్ అబ్దుల్ హమీద్ కలిసి హమ్ దర్ద్ పాకిస్తాన్ ని, హమ్ దర్ద్ (ఇండియా)ని మొదలుపెట్టారు.

"మేము తయారు చేసే మందులన్నీ మా పూర్వీకులు కనిపెట్టినవే" అని అహ్మద్ చెప్పారు.

5000 సంవత్సరాల ప్రాచీన వైద్యంగా చెప్పే ఆయుర్వేదంలాగే యునాని కూడా ఒక రకమైన ప్రాచీన వైద్యం. దీని మూలాలు గ్రీకు, పర్షియాలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

అరబిక్ పదం యునాని టిబ్ అంటే గ్రీకు ఔషధం అని అర్ధం. ప్రకృతి చికిత్స ద్వారా శరీరంలో అసమతుల్యతలను సరిదిద్దవచ్చని ఈ వైద్యం చెబుతుంది.

యునాని టిబ్ ని చైనా వైద్యంతో, ఆయుర్వేదంతో కలిపి తూర్పు దేశాల వైద్యంగా చెబుతారు. దీనిని ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఎక్కువగా పాటిస్తారు.

అహ్మద్ చిన్నప్పుడు వారాంతంలో తన పొట్టను శుభ్రపరుచుకునే ప్రక్రియలో ఉండేవారు. శనివారం ఆముదం తాగడం, ఆదివారం పెరుగు తినడం లాంటివి చేయడం వలన పేగుల ఆరోగ్యవంతంగా ఉంటాయని ఆమె ఇలా చేసేవారు.

అల్లోపతి వైద్యంలో వ్యాధికి నేరుగా మందులిస్తే, యునాని తరహా వైద్యంలో వ్యాధి మూలాలు కనుక్కుని వాటికి వైద్యం చేస్తారు. మొటిమలకు నేరుగా పూసే ఆయింట్మెంట్ కాకుండా రక్తం శుభ్రపడేందుకు మందులు ఇస్తారని చెప్పారు.

అహ్మద్ తాతలు, తండ్రులు ఈ ఔషధాలను సంప్రదాయ పద్దతిలో రాతి రోట్లో నూరి తయారు చేసేవారు. అయితే, ప్రస్తుత తరం అంత శ్రమ లేకుండా చేసే విధానాలను అనుసరిస్తున్నారు.

వంటింటి చిట్కాలు

ఫొటో సోర్స్, Getty Images

హమ్ దర్ద్ వాళ్ళు ఉత్పత్తి చేసే సాఫి టానిక్ పాకిస్తాన్, భారతదేశంలో కూడా బాగా ప్రసిద్ధి చెందిన ఔషధం. ఇందులో వేప, చైనా వేళ్ళు వాడతారు. సాఫి ఔషధం సేవిస్తే, మచ్చలు, మొటిమలు లేని చర్మం లభిస్తుందని చాలా మంది భావిస్తారు.

అహ్మద్ తాత కరాచీకి దగ్గరలో ఉన్న మదీనత్ ఆల్ హిక్మాలో ఈ వైద్యంలో 5 సంవత్సరాల కోర్సులను, పీహెచ్‌డీని అందించే వైద్య సంస్థలను ప్రారంభించారు. ఇక్కడ 350 ఎకరాల స్థలంలో యునాని వైద్యులను తయారు చేసేందుకు ప్రయోగశాలలు ఉన్నాయి.

డాక్టర్ గజాల రిజ్వాని వంటింటి చిట్కాలను సమర్థిస్తారు. ఆమె మదీనాత్ అల్ హిక్మాలో డీన్‌గా పని చేస్తున్నారు.

‘‘లవంగం నూనెలో సహజంగా ఉండే యుజెనాల్ అనే పదార్ధం దంత వైద్యంలో పని చేస్తుంది. జీలకర్ర, వాములో ఉండే కొన్ని పదార్ధాలు జీర్ణ శక్తిని పెంచి ఉబ్బరాన్ని తగ్గిస్తాయి’’ అని ఆమె అన్నారు.

దక్షిణ ఆసియా వంటిళ్లలో ఉండే పోపుల డబ్బాలు మన పూర్వీకులు పరీక్షించి పెట్టిన శక్తివంతమైన సాధనాలు అని ఆమె అంటుంటారు.

ఇప్పుడిప్పుడే పశ్చిమ దేశాల్లో కూడా ఇలాంటి చిట్కాలు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న రుగ్మతలకు చవకగా లభించే ఔషధాలు.

వాటిని తీసి పారేసే ప్రయత్నం ఒక వైపు సాగుతున్నా, ఈ చిట్కాలు ఈ ప్రాంతాల వారి ఉనికికి ఒక గుర్తింపుగా నిలిచిపోతున్నాయి.

ఒక చిట్కాను పంచుకుంటున్నప్పుడు, ఆ సంస్కృతితో అనుసంధానం అవుతున్నట్లే అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)