ప్రశాంత్ భూషణ్: ప్రజల కోసం పోరాడుతున్న న్యాయవాదా? ప్రభుత్వాలంటే గిట్టని అరాచకవాదా?

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ భూషణ్
    • రచయిత, ఫైసల్ మహమ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దాదాపు 40-41 ఏళ్ల కిందటి మాట. అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో 23 ఏళ్ల ఓ యువకుడు ఓ సైన్స్ ఫిక్షన్ నవల రాసే ప్రయత్నాల్లో ఉన్నారు. భూమి కాకుండా ఈ విశ్వంలోని మరో కల్పిత ప్రపంచం ఇతివృత్తంగా ఆ కథ సాగుతుంది.

కానీ, ఆ నవల అచ్చు కాలేదు.

కానీ, ఆ తర్వాత కాలంలో ఆ యువకుడు రాసిన పుస్తకాలు చాలా అచ్చయ్యాయి. కానీ, ఆయన రచయితగా కన్నా, న్యాయవాదిగా ప్రపంచానికి ఎక్కువగా తెలిశారు. ఆయనే ప్రశాంత భూషణ్.

ప్రశాంత్ భూషణ్‌ను ‘నెం.1 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) న్యాయవాది’గా ఇంగ్లీష్ వార్తా పత్రిక ‘ఇండియా టుడే’ వర్ణించింది.

ప్రశాంత్ భూషణ్ ‘సంచలనంగా మారేందుకు’ ఈ పనులన్నీ చేస్తుంటారని, ఆయన ఓ ‘అరాచకవాది’ అని అనేవాళ్లు కూడా ఉన్నారు.

తాజాగా ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థను అవమానించారని భారత సుప్రీం కోర్టు తేల్చింది.

అయితే, ప్రముఖ న్యాయవాదులు కోర్టును అవమానించినట్లుగా ఆరోపణలు రావడం ఇదేమీ తొలిసారి కాదు.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Twitter

‘సైన్స్ అంటే ఇష్టం’

ప్రశాంత్ భూషణ్ వయసు 63 ఏళ్లు. ఆయనకు భార్య, సంతానం కూడా ఉన్నారు. ప్రశాంత్ భూషణ్ రాజకీయ నాయకుడు, ఆర్ట్ కలెక్టర్ (కళాకృతులను సేకరిస్తుంటారు) కూడా.

ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతి భూషణ్ కూడా మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ప్రశాంత భూషణ్‌కు ఈ వృత్తిలోకి రావాలని అంతగా ఉండేది కాదు. కెరీర్ ఆరంభంలోనైతే అస్సలు లేదు.

ప్రశాంత్ భూషణ్ మొదట ఇంజినీరింగ్ చదువుకోవడానికి ఐఐటీ-మద్రాస్ వెళ్లారు. కానీ, తొలి సెమిస్టర్ తర్వాత కోర్సు మానేసి, ఇంటికి తిరిగివచ్చారు. చెల్లెలు అంటే తనకు చాలా ప్రేమని, ఆమెకు దూరంగా ఉండలేకే అప్పుడు కోర్సు మానేశానని ప్రశాంత్ భూషణ్ చెబుతుంటారు.

ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ‘ఫిలాసఫీ ఆఫ్ సైన్స్’ కోర్సు చేశారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య చదువుకున్నారు.

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారంలో ఇందిరా గాంధీ దోషిగా తేలిన కేసును ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతి భూషణే వాదించారు. ఆ కేసులో తీర్పు వెలువడ్డాకే ఇందిరా గాంధీ దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించారు.

ఎమర్జెన్సీ తొలగించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో 1977-79 వరకూ శాంతి భూషణ్ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.

ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాజ్ నారాయణ్ ఆ కేసును అలహాబాద్ హైకోర్టులో వేశారు.

రెండేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణకు ప్రశాంత్ భూషణ్ కూడా హాజరయ్యారు.

ఈ మొత్తం వ్యవహారం గురించి ప్రశాంత్ భూషణ్ ‘ద కేస్ దట్ షుక్ ఇండియా’ అనే పుస్తకం రాశారు.

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి... ‘బోఫోర్స్, ద సెల్లింగ్ ఆఫ్ ఏ నేషన్’ అనే పుస్తకం రచించారు.

ప్రశాంత్ భూషణ్‌కు సైన్స్ పుస్తకాలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ ఆయనకు వాటిపై మక్కువ అలాగే ఉందని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఆయనతో కలిసి చదువుకున్న హర్జిందర్ సింగ్ చెప్పారు.

‘‘రెండు నెలల క్రితమే కొన్ని రసాయన పరీక్షలకు సంబంధించిన ఓ పుస్తకం గురించి ప్రశాంత్ నన్ను వివరాలు అడిగారు’’ అని హర్జిందర్ అన్నారు.

ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది

వరుసగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు

కాంగ్రెస్ (ఓ)లో శాంతి భూషణ్ సభ్యుడిగా ఉండేవారు. ‘కోర్టింగ్ డెస్టినీ: ఎ మెమొయెర్’ పేరుతో ఆయన తన ఆత్మకథ రాశారు.

‘‘1976లో బొంబాయిలో జయ్ ప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన సమావేశానికి నేను వెళ్లా. రెండు రోజుల పాటు సాగిన సమావేశాల తర్వాత... ఇందిరా గాంధీని ఓడించాలంటే కాంగ్రెస్ (ఓ), జన్‌సంఘ్, సోషలిస్ట్ పార్టీ, భారతీయ లోక్‌దళ్ విలీనమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు’’ అని శాంతి భూషణ్ అందులో రాశారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థాపక సభ్యుల్లో శాంతి భూషణ్ ఒకరు. 1986 వరకూ ఆ పార్టీ కోశాధికారిగా పనిచేశారు.

లోక్‌పాల్ బిల్లు జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీలో శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్ సభ్యులుగా ఉన్నారు.

ఐఐటీ, ప్రిన్స్‌టన్‌ల తర్వాత ప్రశాంత్ భూషణ్ పెద్దగా సైన్స్ వైపు పోలేదు. కానీ, 1983లో డూన్ లోయలో సున్నపు రాయి తవ్వకం వల్ల పర్యావరణానికి జరిగే నష్టం గురించిన కేసు ఆయన వద్దకు రావడానికి సైన్సు నేపథ్యం ఓ కారణమైంది.

అప్పట్లో ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టు అమికస్ క్యూరీని నియమించిందని, కానీ ఆ వ్యక్తి పర్యావరణ సంబంధ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని ప్రముఖ పర్యావరణ వేత్త వందన శివ బీబీసీతో చెప్పారు. ఆ సమయంలో తనకు ఎవరో ప్రశాంత్ భూషణ్ పేరును సూచించారని ఆమె అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అంశాలను పేర్కొంటూ ఆ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు అప్పుడు చరిత్రాత్మకమైన తీర్పును ఇచ్చిందని వందన అన్నారు.

విత్తనాల సంస్థ మోన్‌శాంటో, 1984-సిక్కు వ్యతిరేక అల్లర్లు, భోపాల్ గ్యాస్ లీకేజీ, నర్మదా ప్రాజెక్టు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వివిధ పిల్స్‌కు సంబంధించిన కేసులు ప్రశాంత్ భూషణ్ వద్దకు వచ్చాయి.

‘నెం.1 పిల్స్ న్యాయవాది’
ఫొటో క్యాప్షన్, ‘నెం.1 పిల్స్ న్యాయవాది’

భౌతిక దాడి

శాంతి భూషణ్‌కు నలుగురు సంతానం. ఆ నలుగురిలో ప్రశాంత్ భూషణ్ వయసులో అందరి కన్నా పెద్ద.

దిల్లీకి సమీపంలోని నొయిడాలో ప్రశాంత్ భూషణ్ తన తండ్రితోపాటు ఉంటున్నారు.

మూడేళ్ల క్రితం వారి ఇంటి ముందు ఓ హంగామా నడిచింది. కొందరు వారి ఇంటిపై రంగులు చల్లారు.

ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన రోమియో స్క్వాడ్‌ల గురించి స్పందిస్తూ, హిందువులు దేవుడుగా పూజించే శ్రీకృష్ణుడి గురించి ప్రశాంత్ భూషణ్ చేసిన ఓ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఆ ఆందోళన చేశారని వార్తలు వచ్చాయి.

తన వ్యాఖ్యలను వక్రీకరించారని అప్పట్లో ప్రశాంత్ భూషణ్ వివరణ ఇచ్చారు.

లోక్‌పాలు బిల్లు కోసం ఉద్యమం చేసిన అన్నా హజారే బృందంలో ప్రశాంత భూషణ్ సభ్యుడిగా ఉండేవారు.

2011, అక్టోబర్‌లో ప్రశాంత్ భూషణ్‌పై ఆయన కార్యాలయంలోనే దాడి జరిగింది. జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ ఒకరిద్దరు ఆయనను కొట్టారు. కింద పడేసి తన్నారు.

కశ్మీర్‌లో రెఫరెండం నిర్వహించాలని ప్రశాంత్ భూషణ్ అభిప్రాయం వ్యక్తం చేసినందుకే ఆయనపై దాడి చేసినట్లు వారు చెప్పారు.

అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పటి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడిని ఖండించారు.

దాడికి పాల్పడినవారిలో ఒకరైన తేజిందర్ సింగ్ బగ్గా, అప్పుడు ‘భగత్ సింగ్ క్రాంతి సేన’ సభ్యుడిగా తనను తాను చెప్పుకున్నారు. తర్వాత కాలంలో బగ్గా బీజేపీ అధికార ప్రతినిధి కూడా అయ్యారు.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Getty Images

ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు...

ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రముఖ న్యాయవాదిపై లాయర్స్ ఛాంబర్స్‌లోనే దాడి జరిగినా, న్యాయవాదుల సంఘాల నుంచి పెద్దగా స్పందన రాలేదు.

‘‘న్యాయవ్యవస్థలో నాకు మిత్రులు చాలా తక్కువ. చాలా రంగాల్లో చాలా మంది బండారాలు నేను బయటపెట్టా. కార్పొరేట్ ప్రపంచం కూడా నాకు వ్యతిరేకంగా ఉంది’’ అని ప్రశాంత్ భూషణ్ ‘ఇండియా టుడే’తో అన్నారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ-2 పాలన నడిచినప్పుడు నీరా రాడియా టేప్ కేసు, బొగ్గు గనులు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల లాంటి కేసులను ప్రశాంత్ భూషణ్ లెవనెత్తారు. 2జీ కేసు ఫలితంగా అప్పటి టెలికాం మంత్రి రాజీనామా చేయడంతోపాటు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.

సుప్రీం కోర్టు స్పెక్ట్రమ్, బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసింది. ఈ కేసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఫలితంగా కొన్ని టెలికాం సంస్థలు భారీగా నష్టపోయాయి.

ప్రశాంత్ భూషణ్ పిటిషన్ వేసిన తర్వాత గోవాలో ఇనుప ఖనిజం మైనింగ్‌ను కోర్టు నిలుపుదల చేసింది.

ఈ కేసుల తర్వాత ‘ఇండియా అగైన్‌స్ట్ కరప్షన్’ ప్రచార కార్యక్రమం మొదలైంది. దాని ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ప్రశాంత్ భూషణ్ కూడా ఒకరు.

కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌తో విభేదాలు రావడంతో ప్రశాంత్ భూషణ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ తన రాజకీయ సహచరుడు, ప్రముఖ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌తో కలిసి ‘స్వరాజ్ ఇండియా’ అనే పార్టీ పెట్టారు.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Getty Images

‘గ్యాంగ్‌లో భాగం’

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం, కోవిడ్ లాక్‌డౌన్ వల్ల కార్మికుల ఇబ్బందులు, పీఎం కేర్స్ ఫండ్‌కు సంబంధించి పారదర్శకతలో లోపాలకు సంబంధించి మోదీ ప్రభుత్వంపై కూడా ప్రశాంత్ భూషణ్ న్యాయ పోరాటం చేశారు.

అయితే, ఈ కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగానే వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

‘‘ప్రభుత్వ వ్యతిరేకిగా ఉంటూ ఉంటూ ప్రశాంత్ భూషణ్ అరాచకవాదిగా మారిపోయారు. దేశంలోని న్యాయవ్యవస్థపై, సైన్యంపై ప్రజలకు ఎనలేని విశ్వాసం ఉంది. వాటిని అవమానించే అవకాశం ఎవరికీ లేదు’’ అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ నాయకుడు అమితాభ్ సిన్హా అన్నారు.

న్యాయవ్యవస్థను అవమానించిన కేసులో ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పు వెలువడగానే, ఆయన్ను కొందరు ‘గ్యాంగ్‌లో భాగం’ అంటూ వర్ణించడం మొదలుపెట్టారు.

‘‘ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడానికి, బాగా ఆలోచించి వ్యూహం పన్నుతారు. ప్రశాంత్ భూషణ్‌ను ఒక గాటన కట్టడం కుదరదు. అధికారంలో ఎవరి ప్రభుత్వం ఉందన్నదానితో సంబంధం లేకుండా, దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం ఆయన పోరాడుతున్నారు’’ అని యోగేంద్ర యాదవ్ అన్నారు.

ఆగస్టు 16న తాను కుటుంబంతో సహా వెళ్లి, ప్రశాంత్ భూషణ్ ఇంట్లో భోజనం చేసినట్లు ఆయన చెప్పారు.

‘‘ప్రశాంత్ భూషణ్ ఇంట్లో వాతావరణం చాలా సాధారణంగా ఉంది. వారిలో ఏ ఆందోళనా లేదు. ‘ఈ రోజు ప్రశాంత్ ఇంట్లో తింటున్నాడు. వచ్చే వారం ఎక్కడ తింటాడో?’ అని శాంతి భూషణ్ సరదాగా అన్నారు’’ అని యోగేంద్ర యాదవ్ చెప్పారు.

న్యాయవ్యవస్థను అవమానించిన కేసులో శిక్ష వెల్లడిని నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రశాంత్ భూషణ్ పిటిషన్ వేశారు.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Getty Images

వివాదం ఏంటి?

ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు వివాదాస్పద ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని జులై 22వ తేదీన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసు జారీ చేసింది.

ఆలోచించే హక్కు (ఫ్రీడమ్ ఆఫ్ థాట్) కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని ప్రశాంత్ భూషణ్ సమాధానం ఇచ్చారు.

దీనిపై విచారణ కొనసాగింది. ఆ ట్వీట్లు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని, వాటిని పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్ దోషి అని సుప్రీంకోర్టు తేల్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఒక మోటారు సైకిల్‌పై ఉన్న ఫొటోను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ తన అఫిడవిట్‌లో స్పందిస్తూ.. మూడు నెలలకు పైగా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని, ఈ నేపథ్యంలో విచారంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం వృథా అనే వ్యాఖ్యకు వివరణ ఇస్తూ.. ‘అలాంటి ఆలోచనలను బహిరంగంగా వ్యక్తీకరించడం ఇబ్బందిరకంగా అనిపించొచ్చు. కానీ అదే వాస్తవం, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించకూడదు’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)