కౌన్ బనేగా సీఎం?

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Facebook

    • రచయిత, హరికృష్ణ పులుగు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు చర్చంతా ముఖ్యమంత్రి ఎవరనేదానిపైనే జరుగుతోంది.

కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే ఈ విషయంలో ఒక స్పష్టతతో ఉందా? లేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం దీనిపై సమావేశమై ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందా?

డిసెంబర్ 9వ తేదీన, సోనియా గాంధీ పుట్టిన రోజున తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని స్వయంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ విజయాన్ని సోనియా గాంధీకి పుట్టి‌న రోజు కానుకగా ఇస్తామని ఆయన అన్నారు.

ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించిన నాయకుడిగా రేవంత్ రెడ్డికి పార్టీలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆయనే సీఎం అవుతారా?

అసమ్మతులు, వర్గ రాజకీయాలకు నిలయంగా పేరుపడ్డ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించడం పెద్ద విషయమే. ఆ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి బాగా తెలుసు.

కర్ణాటకలో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య, డీకే శివ కుమార్‌లలో ఎవరికి సీఎం పదవి ఇవ్వాలన్నదానిపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎక్సర్‌సైజే జరిగింది.

చివరకు డీకే శివకుమార్‌ను పార్టీ అధినాయకత్వం ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పించి, సిద్ధరామయ్యకు సీఎం పదవిని కట్టబెట్టింది.

అంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ అనుభవాలు ఉండనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింథియాల ఆధిపత్య పోరులో ఎటూ తేల్చలేకపోయింది కాంగ్రెస్. చివరకు కమల్‌నాథ్ వైపు మొగ్గింది. దాంతో, జ్యోతిరాదిత్య తన వర్గంతో బీజేపీలో చేరడంతో ప్రభుత్వం మైనారిటీలో పడి కూలిపోయింది.

రాజస్థాన్‌లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరును నిన్నటి ఎలక్షన్ల వరకు భరించాల్సి వచ్చింది కాంగ్రెస్‌కు. చివరకు అక్కడా అధికారాన్ని కోల్పోయింది.

పంజాబ్‌లో వర్గ రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రులను మారుస్తూ చెడ్డ పేరు తెచ్చుకుని ఎన్నికల్లో పరాజయం పాలైంది కాంగ్రెస్.

ఇలాంటి విభేదాలను ఆ పార్టీ నేతలు అంతర్గత ప్రజాస్వామ్యమని చెబుతూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలుఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణలోనూ వర్గ రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే నేతలు వేళ్ళ మీద లెక్కబెట్టడానికన్నా ఎక్కువే ఉన్నారనే వార్తలు ఎన్నికల ముందు వరకూ వినిపించాయి. అయితే, రాను రాను ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది.

ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతల్లో ఎక్కువ మంది రేవంత్ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగని, పార్టీలో ఆశావహులు లేరని అనుకోవడానికి వీల్లేదు. కాంగ్రెస్ హైకమాండ్‌తో తమకున్న యాక్సెస్‌ను రాష్ట్ర పెద్దలు చివరిదాకా ఉపయోగించుకుంటారనే పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా హైకమాండ్ నిర్ణయిస్తే వీరంతా అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటారా అన్నది ప్రశ్న.

ముఖ్యమంత్రి ఎంపిక గురించి ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మా పార్టీలో ముఖ్యమంత్రి పదవికి అర్హులైన అభ్యర్థులు అనేక మంది ఉన్నారు’’ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే కుమ్ములాటలతోనే సరిపోతుందని, పరిపాలన ఉండదని ఓ సందర్భంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

‘‘కాంగ్రెస్ పార్టీ వంద టిక్కెట్లు ప్రకటిస్తే నూటొక్క ధర్నాలు జరుగుతున్నాయి. వీళ్లు అధికారంలోకి వస్తే గాంధీభవన్ దగ్గర నిత్యం ఆందోళనలే ఉంటాయి’’ అని ఆయన అన్నారు.

మంత్రిగా పని చేసిన అనుభవం కూడా లేదు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు సీఎం పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించేవారు ఉంటారు కదా అని ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఎదురైన ప్రశ్నకు రేవంత్ రెడ్డి, ‘‘ఇందిరా గాంధీకి ఏం అనుభవముందని ప్రధాని అయ్యారు, పైలట్‌గా పని చేసుకునే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోలేదా? షష్టి పూర్తి చేసుకున్న ఎన్టీయార్ ఏ అనుభవం లేకుండానే రాజకీయాల్లోకి రాలేదా’’ అని బదులిచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కౌన్ బనేగా సీఎం

ఫొటో సోర్స్, BHATTI VIKRAMARKA MALLU/UTTAMINC

పోటీలో ప్రధానంగా ఎవరున్నారు?

రేవంత్ రెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించారని పేరు సంపాదించుకున్నారు. పార్టీలో ప్రత్యర్ధులు ఉన్నప్పటికి, కార్యకర్తల్లో అభిమానులు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు. ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి అధిష్ఠానానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు.

రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలుఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే, సీనియర్లను కాదని ‘‘కొత్తగా’’ పార్టీలోకి వచ్చిన వారికి సీఎం పదవి ఎలా ఇస్తారని కొందరు నేతలు అడ్డుపడే అవకాశం లేకపోలేదు. అలాంటి వారిని ఎలా ఒప్పిస్తారన్నది కీలకంగా మారుతుంది.

మల్లు భట్టి విక్రమార్క: సీఎల్పీ లీడర్‌గా కాంగ్రెస్ పార్టీలో మల్లు భట్టి విక్రమార్క ఇటు పార్టీలోనూ, అటు అధిష్ఠానం దగ్గరా గుర్తింపు ఉన్న నేత. గత ఏడాది పీపుల్స్ మార్చ్ పేరుతో హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేశారు.

2019లో కాంగ్రెస్ ఆయన్ను ఫ్లోర్ లీడర్‌గా నిమమించింది. దళిత నేతగా, సౌమ్యుడిగా, వివాదాలకు దూరంగా ఉండే భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిని చేయడానికి అధిష్ఠానానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. దళితులకు సీఎం పదవి ఇచ్చిన ఘనతను సొంతం చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ ఆయన వైపు మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి: పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన అనుభవంతోపాటు అధినాయకత్వానికి సన్నిహితుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేసులో నిలబడే అవకాశం ఉంది.

పార్టీలో రేవంత్ ఉనికిని తరచూ ప్రశ్నిస్తూ, వ్యతిరేకిస్తూ వచ్చిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఈ పరిస్థితుల్లో ఆయన కూడా రేవంత్‌కు పోటీకి వచ్చే అవకాశం ఉంది. ఆయనతోపాటు ఆయన భార్య కూడా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ముఖ్యమంత్రి పదవికి తాము కూడా అర్హులమేనంటూ గతంలో కూడా కొందరు కాంగ్రెస్ నేతలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, వీహెచ్ హనుమంతరావు, దామోదర రాజనరసింహ, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్‌లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవికి ఆశావహులుగా వార్తల్లోకెక్కారు.

కర్ణాటకతో తెలంగాణను పోల్చలేమని, రెండు చోట్లా పరిస్థితులు వేర్వేరని సీనియర్ జర్నలిస్ట్ జింకా నాగరాజు చెప్పారు.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారనేది కాదనలేమని, అయితే అక్కడ క్లీన్ ఇమేజ్, సీఎంగా అనుభవం ఉన్న సిద్ధరామయ్య ఉన్నారని, తెలంగాణలో అలాంటి నాయకుడు ఎవరూ లేరు కాబట్టి రేవంత్‌కు అడ్డంకులు ఉండకపోచవ్చని ఆయన బీబీసీతో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, DK SHIVAKUMAR/FACEBOOK

ఫొటో క్యాప్షన్, డీకే శివకుమార్

రంగంలోకి డీకే శివకుమార్

పీసీసీ అధ్యక్షుడిగా మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఎక్కడా తన ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం గురించి ప్రస్తావించ లేదు. అలాగే తాను రేసులో లేనని కూడా ప్రకటించ లేదు.

పార్టీలో సీనియర్లు అందరూ సహకరించడం వల్లే కాంగ్రెస్ విజయం సాధ్యమైందంటూ ఫలితాలు వెలువడుతుండగా, గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన తొలి మీడియా సమావేశంలో ప్రకటించారు. సీనియర్ నేతలను పేరుపేరునా ప్రస్తావించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పోటీలో ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న నేతలు కూడా సీఎం అభ్యర్ధిని నిర్ణయించే బాధ్యత అధిష్ఠానానిదేనని ప్రకటించారు.

ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా రావడంతో రెండు రోజుల ముందు నుంచే కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్ హైకమాండ్.

గట్టి వ్యూహకర్తగా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను హైదరాబాద్ పంపి పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా సూచించింది. హైదరాబాద్ చేరుకున్న శివకుమార్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ తదుపరి కార్యాచరణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభినందనలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)