అఫ్గానిస్తాన్‌ను భారత్ నుంచి తమ వైపు తిప్పుకోవటానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నారా?

ఫొటో సోర్స్, Afghan Presidency/Handout
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య స్నేహంతో పోలిస్తే.. భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య స్నేహం కూడా అంతే దృఢమైనది.
భారత్‌ను అఫ్గాన్ ఎంతో విశ్వసిస్తుంది. అయితే, ఇది పాక్‌కు అంత నచ్చే విషయం కాదు. 2001లో అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసింది. అప్పటినుంచీ ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కోసం పాక్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతోంది.
నవంబరు 19న తొలిసారిగా పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్.. అఫ్గాన్‌లో పర్యటించారు. ఈ పర్యటనను చరిత్రాత్మక పర్యటనగా అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అభివర్ణించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపనకు తాము చేయాల్సినదంతా చేస్తామని ఈ పర్యటన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడంపై ఇద్దరు నాయకులు దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. కాబూల్‌లోని రాష్ట్రపతి భవన్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు ఘనీ సాదరంగా ఆహ్వానం పలికారు.
వీరిద్దరు కలిసి సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ‘‘అఫ్గానిస్తాన్‌లో హింస పెరుగుతున్న సమయంలో నేను పర్యటిస్తున్నాను. అఫ్గాన్‌లో శాంతి స్థాపనకు మా ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారని ఈ పర్యటన ద్వారా చెప్పాలని భావిస్తున్నా’’అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
‘‘ఏదైనా విషయంలో పాక్ సాయం చేయగలదని అనిపిస్తే.. వెంటనే అడగండి. అఫ్గాన్‌లో హింస వల్ల పాక్ కూడా ప్రభావితం అవుతోంది’’అని ఆయన వివరించారు.
అయితే, ఇమ్రాన్ ఖాన్ పర్యటనను రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, అఫ్గాన్‌లో శాంతి స్థాపనకు కృషితోపాటు మరో కోణంలోనూ రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. అదే భారత్ నుంచి అఫ్గాన్‌ను దూరం చేయడం.. నిజంగానే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తోందా?

ఫొటో సోర్స్, PIB
అఫ్గాన్, భారత్‌ల స్నేహం
2014లో అప్పటి అఫ్గాన్ ప్రధాని హమిద్ కర్జాయ్.. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల నాయకులందరూ వచ్చారు. పాకిస్తాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే హెరాత్‌లోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగింది.
‘‘హెరాత్‌లోని భారత్ కాన్సులేట్‌పై దాడి వెనుక పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల కుట్ర ఉంది’’అని ఆనాడు బహిరంగంగానే దిల్లీలో హమిద్ కర్జాయ్ వ్యాఖ్యలు చేశారు.
అయితే, అప్పుడు నవాజ్ షరీఫ్ దిల్లీలోనే ఉన్నారని హమిద్‌కు తెలుసు.
అఫ్గాన్, భారత్‌ల మధ్య స్నేహాన్ని తమ ఉనికికే ముప్పుగా పాకిస్తాన్ చూస్తోందని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇనేషియేటివ్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ ఆసియా డైరెక్టర్ అపర్ణ పాండే వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్తాన్ ఫారెన్ పాలసీ: ఎస్కేపింగ్ ఇండియా’’అనే పుస్తకంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య స్నేహం బలపడుతుందని మొదట్నుంచీ పాకిస్తాన్ భయపడుతూ వస్తోంది. ఈ స్నేహంతో తమ ఉనికికే ముప్పు పొంచివున్నట్లు పాక్ భావిస్తోంది. అయితే అఫ్గాన్ వాసులతో భారత్ బంధాలు ఎప్పుటి నుంచో పెనవేసుకొని ఉన్నాయి’’అని తన పుస్తకంలో అపర్ణ పాండే వివరించారు.
‘‘భారత్‌తో బంధాలు బలపడుతున్న నేపథ్యంలో.. అఫ్గాన్‌తో భాష, జాతి పరమైన సారూప్యతలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బంధాలను బలోపేతం చేసుకోవడానికి పాక్ ప్రయత్నించింది. అయితే ఎలాంటి విజయం సాధించలేదు. కొన్ని మతపరమైన అంశాలతోనూ విభేధాలు సృష్టించడానికి ప్రయత్నించింది. అయితే, అందులోనూ విజయం సాధించలేదు. 1971లో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించడానికి భారత్ సహకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తమ దేశాన్ని మరింతగా విభజిస్తారనే భయం పాక్‌లో పేరుకుపోయింది’’
పాకిస్తాన్‌లోని బలూచ్, పష్తోన్ల వేర్పాటువాదానికి అఫ్గాన్ మద్దతు నిచ్చింది. భారత్, అఫ్గాన్‌ల మధ్య స్నేహంతో తమ దేశం మరిన్ని ముక్కలయ్యే ముప్పుందని పాక్ భయపడుతోంది. అదే సమయంలో ఐక్యరాజ్యసమిలో పాక్ సభ్యత్వాన్ని కూడా అఫ్గాన్ వ్యతిరేకిస్తోంది.
అఫ్గాన్, పాకిస్తాన్‌ల మధ్య నుండే డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా అంగీకరించేందుకు ఎప్పటినుంచో అప్గాన్ నిరాకరిస్తోంది. ఈ రేఖను రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా చెబుతారు.

ఫొటో సోర్స్, GAUHAR AYUB KHAN
రెండు వ్యూహాలతో..
1950,60ల్లో అఫ్గానిస్తాన్‌తో కలిసి ఓ సమాఖ్య ఏర్పాటుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. తొలి పాక్ సైనిక పాలకుడు జనరల్ ఆయుబ్ ఖాన్ హయాంలో ఈ ప్రయత్నాలు జరిగాయి. పాకిస్తాన్, అఫ్గాన్, ఇరాన్, టర్కీలను కలిపి ఒక సమాఖ్య ఏర్పాటుచేసేందుకు ఆయన ప్రయత్నించారు. వ్యూహాత్మక సమస్యలకు దీని ద్వారా పరిష్కారం దొరకుతుందని ఆయన భావించారు.
ఈ సమాఖ్యలో అఫ్గాన్ చేరితే.. పాక్‌లోని వేర్పాటువాద ఉద్యమాలకు మద్దుతును ఇవ్వడం తగ్గుతుందని, అదే సమయంలో అఫ్గాన్‌లో తమ ప్రాబల్యం పెరుగుతుందని పాక్ భావించింది. అయితే, ఈ సమాఖ్యలో చేరేందుకు అఫ్గాన్ నిరాకరించింది.
అఫ్గాన్‌లో పాక్ అనుకూల, భారత్ వ్యతిరేక ప్రభుత్వం ఉండాలని పాక్ భావించిందని అపర్ణ పాండే తన పుస్తకంలో పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు అంతర్జాతీయ విధానాలకు ఆ ప్రభుత్వం సహకరిస్తుందని పాక్ భావించింది. అయితే భారత్‌కు వ్యతిరేకంగా నడుచుకునేలా అఫ్గాన్ నాయకులను ఒప్పించడంలో పాక్ విఫలమైంది.
అఫ్గాన్ నాయకులను ఒప్పించడంలో విఫలం కావడంతో రెండో వ్యూహాన్ని పాక్ తెరపైకి తెచ్చింది. అదే అఫ్గాన్‌లో హింసను రేకెత్తించే సంస్థలకు మద్దతు పలకడం. ఈ సంస్థలు ఎప్పుడో ఒకసారి అధికారంలోకి వచ్చి, భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయని పాక్ గట్టిగా నమ్ముతోంది. 1970 నుంచి ఇలాంటి విధానాలనే పాక్ అనుసరిస్తోంది.
ఈ విధానంలో భాగంగా అతివాద పష్తోన్లకు పాక్ మద్దతు పలికింది. వీరు జాతీయవాద పష్తోన్లపై పోరాడేవారు. బుర్హానుద్దీన్ రబ్బానీకి చెందిన అఫ్గాన్ జమాతే ఇస్లామీ, గుల్బుద్దీన్ హెక్మాత్యార్‌కు చెందిన హిజ్బే ఇస్లామీ సంస్థలకు పాక్ సాయం చేసింది. అఫ్గాన్‌పై సోవియట్ యూనియన్ దాడికి ముందే ఇదంతా జరిగింది. ఆ సమయంలో అఫ్గాన్‌కు సాయంగా అమెరికా కూడా రాలేదు.
సోవియట్ యూనియన్ ఇక్కడి నుంచి నిష్క్రమించడంతోపాటు 1990ల్లో అమెరికా కాలు మోపే వరకూ ఇవే విధానాలను పాక్ కొనసాగించింది. 1980ల్లో అఫ్గాన్ ముజాహిదీన్‌కు కూడా పాక్ సాయం చేసింది. 90ల నుంచి తాలిబాన్లకు కూడా మద్దతు నిచ్చింది. ఈ తాలిబాన్లకు హక్కానీ నెట్‌వర్క్‌తో కూడా సంబంధాలున్నాయి.

ఫొటో సోర్స్, AFGHAN PRESIDENCY / HANDOUT
భారత్, అఫ్గాన్ మొదట్నుంచీ
మరోవైపు భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య స్నేహం 1950ల్లో మొదలైంది. మొదట్లోనే రెండు దేశాలూ ట్రీటీ ఆఫ్ ప్రెండ్‌షిప్‌పై సంతకం చేశాయి. దీనితోపాటు రెండు దేశాల మధ్య సాంస్కృతిక, చారిత్రక సంబంధాలున్నాయి. ప్రాంతీయంగా అఫ్గాన్‌కు భారీగా సాయం అందించే మొదటి దేశం భారతే. అఫ్గాన్ మాజీ అధ్యక్షులు హమిద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా భారత్‌లోనే చదువుకున్నారు.
అఫ్గాన్‌లో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ పాలుపంచుకుంటోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. పార్లమెంటు భవన నిర్మాణంతోపాటు రోడ్లు, డ్యాంలను భారత్ ఇక్కడ నిర్మిస్తోంది. మరోవైపు అప్గాన్ సైన్యాధికారులకూ భారత్ శిక్షణ ఇస్తోంది. అఫ్గాన్ క్రికెట్ టీమ్‌కూ సాయం చేస్తోంది.
భారత్, అఫ్గాన్‌ల మధ్య స్నేహంతో ఇద్దరికీ ప్రయోజనాలున్నాయి. మధ్య ఆసియాకు అఫ్గాన్ ద్వారం లాంటిది. అక్కడి మార్కెట్లకు భారత్ వస్తువులను చేరవేసేందుకు అఫ్గాన్ రోడ్డు మార్గాలను ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే తమ దేశం గుండా భారత్ వస్తువుల రవాణాను పాక్ అనుమతించదు.
అబ్దుల్లా అబ్దుల్లాతో పోలిస్తే అష్రాఫ్ ఘనీ తమతో కాస్త సన్నిహితంగా ఉంటుంన్నారని పాక్ భావిస్తోంది. దీనికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే తాలిబాన్లకు వ్యతిరేకంగా నార్తెర్న్ అలయన్స్‌కు నేతృత్వం వహించిన అహ్మద్ షా మసూద్‌తో అబ్దుల్లాకు దగ్గర సంబంధాలున్నాయి. అఫ్గాన్‌లో పాక్ పాత్రపై చాలాసార్లు బహిరంగంగానే మసూద్ ప్రశ్నలు కురిపించారు.
అబ్దుల్లా ఒక తజిక్. ఆయన పష్తోన్ నాయకుడు కాదు. పైగా ఆయన చాలా ఏళ్లు భారత్‌లో గడిపారు. అందుకే ఆయన్ను భారత్‌కు మద్దతుదారుడిగా చూసేవారు. మరోవైపు ఘనీ పష్తోన్ నాయకుడు. భారత్‌తో ఆయనకు అంత అనుభవమేమీ లేదు.

ఫొటో సోర్స్, Anadolu Agency
ముషారఫ్ కూడా అదే చెప్పారు
అష్రాఫ్ ఘనీ.. పాకిస్తాన్‌కు దగ్గరగా ఉంటారని తమ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూడా వెల్లడించారు. 2015లో బ్రిటిష్ పత్రిక ద గార్డియన్‌తో ఆయన మాట్లాడారు. తను అధ్యక్షుడిగా ఉండే సమయంలో అఫ్గాన్‌లోని హమిద్ కర్జాయ్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించామని, ఎందుకంటే అది భారత్ అనుకూల ప్రభుత్వమని ఆయన చెప్పారు.
‘‘అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అష్రాఫ్ ఘనీతో పాక్ కలిసి పనిచేస్తోంది. హమిద్ కర్జాయ్ అధికారంలో ఉన్నన్ని రోజులూ పాక్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. అందుకే మా ప్రయోజనాలను మేం కాపాడుకోవాలి. అయితే అష్రాఫ్ ఘనీ వచ్చిన తర్వాత పరిస్థితులు మాకు అనుకూలంగా మారాయి’’అని ఆయన చెప్పారు.
2001లో అఫ్గాన్‌లోని తాలిబన్లపై అమెరికా దాడులతో పాక్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2001 నుంచి 2008 వరకు ఈ పరిస్థితులు కొనసాగాయి. అయితే 2014లో ఘనీ అధికారంలోకి రావడంతోనే, భారత్ కుదిరిన ఆయుధాల ఒప్పందాన్ని ఆయన రద్దుచేశారు. తూర్పు అఫ్గాన్‌లో పాక్ వ్యతరేకంగా పోరాడేవారిపైకి సైన్యాన్ని కూడా పంపించారు.
ఆరుగురు సైన్యాధికారులను ట్రైనింగ్ కోసం పాక్ ఆఫీసర్ అకాడమీకి పంపిస్తూ ఘనీ తీసుకున్న నిర్ణయంపై ముషారఫ్ ప్రశంసలు కురిపించారు. హమిద్ కర్జాయ్ సమయంలో అఫ్గాన్ సైనికులు ట్రైనింగ్ కోసం భారత్‌కు వచ్చారు.
హమిద్ వల్లే 2001లో తాలిబాన్లకు పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ సాయం చేసిందని ఇంటర్వ్యూలో ముషారఫ్ అంగీకరించారు. ‘‘కర్జాయ్ ప్రభుత్వంలో ఉండేవారు ఎక్కువగా భారత్‌కు మద్దతు పలికేవారు. అందుకే వారికి సవాల్ విసిరే వారి కోసం మేం ఎదురుచూశాం. తాలిబాన్లను ఆశ్రయించాం’’అని ముషారఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS/Ahmad Masood
పాక్‌పై అసంతృప్తి
పాకిస్తాన్ సాయంతో తాలిబాన్లను చర్చలకు తీసుకురావొచ్చని అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ భావిస్తున్నారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఆయన పాకిస్తాన్‌పై అంసతృప్తి వ్యక్తంచేశారు. 25 ఏప్రిల్ 2016లో ఆయన దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. తాలిబాన్లను పాక్ చర్చలకు తీసుకొస్తుందని తనకు ఎలాంటి నమ్మకమూలేదని ఆయన చెప్పారు.
ఏప్రిల్ 19న కాబూల్‌లో జరిగిన దాడి విషయంలో ఘనీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. పాక్‌కు సన్నిహితంగా ఉన్నప్పటికీ దాడులను అరికట్టడంలో ఆయన విఫలమైనట్లు చాలా వార్తలొచ్చాయి.
అయితే, ఇప్పుడు పాకిస్తాన్, తాలిబాన్, అమెరికా కలిసి చర్చలు మొదలుపెట్టాయి. కానీ అఫ్గాన్‌లో దాడులు మాత్రం ఆగడం లేదు. ఇదివరకు సౌదీ అరేబియా, ఇరాన్‌లను కూడా చర్చలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పించారు. కానీ నేడు ఎవరూ వాటిపై దృష్టి పెట్టడంలేదు. చాలాసార్లు సౌదీ, ఇరాన్‌ల మధ్య వంతెనలా పనిచేయాలని తాము చూస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ విదేశాంగ విధానాలు అంత సమర్థంగా లేవని ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్టు నజామ్ సేథి వ్యాఖ్యానించారు.
‘‘ఇరాన్‌వైపు నిలబడి ఆయన ఏం సాధించారు? అక్కడి నుంచి పాకిస్తాన్ ఏం ఆశిస్తోంది. ఆయన సౌదీ, యూఏఈ, ఐరోపా, అమెరికా నాయకులతోనూ భేటీ అవుతున్నారు. కానీ ఏం లాభం? అన్నిచోట్లా సంబంధాలు దెబ్బతింటున్నాయి. పాక్‌కు మద్దతు నిచ్చే మలేసియా ప్రధాని కూడా ఇప్పుడు అధికారంలో లేరు’’అని సేథి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- తెలంగాణలో గ్రామ సర్పంచ్‌లు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేస్తోంది?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








