సంగారెడ్డి ఎస్‌బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

సంగారెడ్డిలో అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో బుధవారం రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు గుర్తించామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్, బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డతో చెప్పారు.

మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవి వర్మ ఉన్నారని ఎస్పీ తెలిపారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయని ఆయన చెప్పారు.

రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగిందని, పేలుడుకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ చెప్పారు.

ఘటనా స్థలం నుంచి నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఫైర్ ఆఫీసర్ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో చెప్పారు.

ఎస్‌బీ ఆర్గానిక్స్ లిమిటెడ్

ఫొటో సోర్స్, UGC

ఎస్‌బీ ఆర్గానిక్స్ లిమిటెడ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఎస్‌బీ ఆర్గానిక్స్ లిమిటెడ్ భవనం

రియాక్టర్ పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

పరిశ్రమలో మరో రియాక్టర్ కూడా ఉండటంతో, ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ పరిశ్రమ పరిసరాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన సమీక్ష నిర్వహించారు.

సహాయ చర్యలు వేగవంతం చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)