క్రిస్టీనా బలాన్: ‘ఎలాన్ మస్క్ టెస్లాను ఎదిరించిన నేను, చనిపోయే నాటికి నాపై పడ్డ మరకను తుడిచేసుకోవాలి’

ఫొటో సోర్స్, Cristina Balan
- రచయిత, జోయ్ క్లైన్‌మన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్, బీబీసీ న్యూస్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, ఆయన కంపెనీ టెస్లాతో దశాబ్దం కాలంగా కోర్టులో పోరాటం చేస్తున్న విజిల్‌బ్లోయర్ క్రిస్టీనా ఇప్పటికీ ఆ కంపెనీ తనకు బహిరంగంగా సారీ చెప్పాల్సిందేనని బీబీసీ న్యూస్‌తో అన్నారు.
క్రిస్టీనా బలాన్ అమెరికాలో టెస్లా కంపెనీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇంజనీర్. మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ కారులోని ప్రతి బ్యాటరీపై ఆమె పేరులో మొదటి అక్షరాలు సీబీ అనే ముద్ర ఉండేది.
కానీ, 2014లో కార్ల బ్రేకింగ్‌పై ప్రభావం చూపే భద్రతా సమస్యలు గుర్తించినప్పుడు, మేనేజ్‌మెంట్ తనకు దోషిగా నిలబెట్టిందని, దీంతో తాను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని క్రిస్టీనా చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న కేసులో ఆమె కంపెనీపై గెలుపొందారు...
కానీ, ఆ తర్వాత ఒక ‘సీక్రెట్ ప్రాజెక్టు’ కోసం ఆమె తమ వనరులను వాడుకున్నారని టెస్లా ఆరోపణలు చేసింది.
అమెరికా చట్టాల ప్రకారం ఈ ఆరోపణలు నేరాలు కిందకు వస్తాయి.
అయితే, ఈ ఆరోపణలను క్రిస్టీనా బలాన్ కొట్టేస్తూ వస్తున్నారు. దీనిపై న్యాయపోరాటానికి కూడా దిగారు.
కానీ, ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ కాలిఫోర్నియాలోని ఓపెన్ కోర్టులో తన కేసుపై జరగాల్సిన విచారణ కోసం ఆమె ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు.
దీనిపై స్పందించాలన్న బీబీసీ అభ్యర్థనకు టెస్లా స్పందించలేదు. తన ఆరోపణలపై కూడా కంపెనీ ఎలాంటి వివరాలనూ అందించలేదు.

ఫొటో సోర్స్, Cristina Balan
కొడుకు కోసమైన తన నిజాయితీని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని బలాన్ అన్నారు.
‘‘నేనే వాడి హీరోని, ఏరో ప్లేన్స్, కార్లు ఉన్న మమ్మీని నేను ’’ అన్నారామె.
‘‘నా తల్లి దొంగ అనే భావనతో నా కొడుకు పెరగకూడదని నేను కోరుకుంటున్నాను’’ అని బలాన్ చెప్పారు.
జూమ్ కాల్ ముగిసినప్పుడు, క్రిస్టీనా బలాన్ తన విగ్‌ను తొలగించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడే తన బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సను పూర్తి చేసుకుని వచ్చినట్లు తెలిపారు.
‘‘నాపై పడ్డ మరకను తుడిచేసుకోవాలనుకుంటున్నా. ఎలన్ మస్క్ మర్యాదగా క్షమాపణ చెబుతారని అనుకుంటున్నా. ఇదే నేను కంపెనీ బిలినీయర్ బాస్‌కు ఇచ్చే సందేశం’’ అని అన్నారు.
ప్రస్తుతం తాను స్టేజ్-3బీ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
కోర్టులో చివరి రోజు విచారణను తాను చూడలేకపోవచ్చేమోనని బలాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అక్కడ పనిచేసినప్పుడు తనకు, టెస్లాకు మధ్య జరిగిన పలు సంభాషణలను బలాన్ బీబీసీ న్యూస్‌తో పంచుకున్నారు.
తన కెరీర్ చాలా బాగా ప్రారంభమైందన్నారు. స్టాఫ్ క్యాంటీన్‌లో లంచ్ క్యూలో నిలబడి మస్క్‌తో జరిపిన సంభాషణలను ఆమె గుర్తుకు చేసుకున్నారు.
తను చాలా సంతోషంగా, విజయవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పారు. రోమానియాలో పెరిగిన తనకు కార్లంటే పిచ్చి అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
‘‘భద్రతాపరమైన అంశాలను వారు దాస్తున్నారని తెలిసినప్పుడు నేను నివ్వెరపోయాను’’ అని బలాన్ చెప్పారు.
పెడల్ కింద కార్పెట్లు చుట్టుకు పోతున్నాయని తాను ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారామె. ఇది ప్రమాదకరమైన డిజైన్ లోపం. దీనిపై కస్టమర్లు కూడా ఫిర్యాదు చేశారు.
‘‘మీరు బ్రేక్ వేయలేకపోతే ఎదుట ఉన్న వ్యక్తులకు ప్రమాదమే కదా’’ అన్నారామె.
కానీ, మేనేజర్లు తన అభ్యంతరాలను తోసిపుచ్చారని బలాన్ చెప్పారు.
టెస్లా ప్రతిష్టకు భంగం కలిగించే ఏ విషయంపైనైనా తనకు నేరుగా చెప్పొచ్చని ఎప్పుడూ ఉద్యోగులను ప్రోత్సహించే మస్క్‌కు ఆమె నేరుగా మెయిల్ చేశారు.
‘‘ఆయనకు రెండు మెయిల్స్ పంపాను.
‘‘టెస్లా నుంచి బయటికి వచ్చే ముందు ఒకటి పంపాను. ఇది మనందరికి ప్రమాదకరమని హెచ్చరించాను’’
‘‘టెస్లాకు ఏది మంచిదో అది ఆయన చేస్తారని మాత్రమే నేను ఆలోచించాను’’ అని చెప్పారు.
కానీ, అలా జరగలేదు. బలాన్ ఉద్యోగం పోగొట్టుకున్నారు.
ఆమె చెప్పిన అంశాలన్నింటిన్నీ బీబీసీ న్యూస్ టెస్లా ముందు ఉంచింది. కానీ, కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
‘‘ప్రతి టెస్లా కారులో భద్రతా అనేది అత్యంత ముఖ్యమైనది’’ అని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అన్ని భద్రతా ప్రమాణాలతో తమ వాహనాలను డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది.
టెస్లా నార్వే ప్రధాన కార్యాలయంలో వర్క్ కండిషన్స్‌పై మస్క్‌కు మెయిల్ చేసిన తర్వాత తనకు కూడా చేదు అనుభవాలు ఎదురైనట్లు మరో టెస్లా విజిల్‌బ్లోయర్ లుకాజ్ క్రప్స్కి చెప్పారు.
వీటి వల్ల మరో టెస్లా స్టాఫ్ మాట్లాడేందుకు భయపడుతుండొచ్చని బలాన్ అన్నారు.
తన కేసు కాలిఫోర్నియాలోని నైన్త్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లో విచారణకు రానుంది.
వృత్తిపరమైన నిరూపణకు తనకు ఉన్న ఏకైన అవకాశం ఇదొక్కటేనని చెప్పారు.
తన కెరీర్‌ను వదులుకోవాలనుకోవడం లేదని తెలిపారు.
‘‘ఒకవేళ నేను ఇది గెలవకపోతే, నేనెంత మంచిదాన్నైనా ఉపయోగం ఉండదని నాకు తెలుసు. టెస్లా నా గురించి ఏం చెబుతుందో దాన్నే అందరూ ఆలోచిస్తారు. నా కెరీర్ నాశనమవుతుంది. అలా జరగాలనుకోవడం లేదు’’ అని చెప్పారు.
అయితే, మస్క్ నాయకత్వ శైలి కాస్త భిన్నంగా ఉంటుందని అన్నారు.
2008 నుంచి 2013 వరకు మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలో పనిచేసిన డాలీ సింగ్, ఆయనొక అద్భుత నాయకుడు అని బీబీసీ న్యూస్‌కు చెప్పారు.
టెక్నాలజీ రంగంలో పనిచేసే వర్కర్లు విజిల్‌బ్లోయర్లుగా మారుతున్న ట్రెండ్ పెరుగుతోందని కాన్‌స్టాంటైన్ కానన్ సంస్థకు చెందిన అమెరికా లాయర్ గోర్డన్ ష్నెల్ చెప్పారు.
టెక్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, మన జీవితాల్లో ప్రతి భాగానికి అవి చేరుకుంటున్నాయని చెప్పారు.
ఏదైనా అంశంపైన ప్రజల్లోకి వెళ్లే ముందు సాధ్యమైన ప్రతి ఆప్షన్‌ను పరిశీలించాలని విజిల్‌బ్లోయర్ల తరఫున వాదించే ష్నెల్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














