ఇజ్రాయెల్-పాలస్తీనా: పాక్ సైనిక నియంత జియా ఉల్ హక్.. పాలస్తీనావాసులను ఊచకోత కోశారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అబిద్ హుస్సేన్
- హోదా, బీబీసీ ఉర్దూ
దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌తో పాలస్తీనా పోరాడుతోంది. అయితే 51ఏళ్ల క్రితం స్వాతంత్ర్యం కోసం ముస్లిం దేశమైన జోర్డాన్‌తోనూ పాలస్తీనా పోరాడింది. ఈ ఘర్షణల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను పాలస్తీనా చవిచూసింది.
జోర్డాన్-పాలస్తీనా ఘర్షణల్లో ఓ సైన్యాధికారి గురించి మనలో చాలా మందికి పెద్దగా తెలియదు.
ఆయన ఈ ఘర్షణల్లో క్రియాశీల పాత్ర పోషించారు.
1970 సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబరు 27 మధ్య జరిగిన ఈ ఘర్షణలను ‘‘బ్లాక్ సెప్టెంబర్’’గా పిలుస్తుంటారు.
ఈ యుద్ధంలో జోర్డాన్ పాలకుడు షా హుస్సేన్‌కు సూచనలు, సలహాలు ఇస్తూ.. జోర్డాన్ విజయంలో పాకిస్తాన్ సైనిక నియంత జియా ఉల్ హక్ క్రియాశీల పాత్ర పోషించినట్లు చాలా మంది పరిశీలకులు, రచయితలు తమ పుస్తకాల్లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
జోర్డాన్‌లో జియా ఉల్ హక్ ఏం చేసేవారు?
1967లో ఇజ్రాయెల్‌తో ఆరు రోజుల యుద్ధంలో ఓటమి అనంతరం జోర్డాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఈజిప్టు, సిరియాలతోపాటు జోర్డాన్ కూడా ఈ యుద్ధంలో భారీగా నష్టపోయింది.
జెరూసలెం, గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై పట్టు సడలిపోయింది.
మరోవైపు, ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలపై పాలస్తీనా ప్రజలు దాడులు మొదలుపెట్టారు. వీరికి సిరియా, ఇరాక్‌ల నుంచి సాయం కూడా అందేది.
ఇలాంటి పరిస్థితుల్లో తమ కార్యచరణ రూపకల్పనలో సాయం చేయాలని తన స్నేహితుడు, పాకిస్తానీ బ్రిగేడియర్ జనరల్ జియా ఉల్ హక్‌ను జోర్డాన్ ప్రధాని షా హుస్సేన్ కోరారు.
అప్పట్లో ఒమన్‌లోని ఎంబసీలో హక్ పనిచేసే వారు.
‘‘అప్పుడే అమెరికా నుంచి శిక్షణ పూర్తి చేసుకొని హక్ స్వదేశానికి తిరిగివచ్చారు. ఆరు రోజులపాటు జరిగిన యుద్ధంలో ఘోర పరాజయాన్ని చవిచూసిన జోర్డాన్‌కు ఆయన్ను పంపించారు’’ అని పరిశోధకుడు తారిఖ్ అలీ తన పుస్తకం ‘‘ద డాయల్’’లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘పాక్-జోర్డాన్‌ల మధ్య సైనిక సంబంధాలను మెరుగు పరచడం, జోర్డాన్‌లో జరిగే ఘటనల సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపడం.. తదితర బాధ్యతలను హక్‌కు అప్పగించారు’’ అని తన పుస్తకం ‘‘What We Won’’లో అమెరికా సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రిడెల్ తెలిపారు.
అయితే, తనకు అప్పగించిన పనుల కంటే చాలా అదనపు పనులను కూడా హక్ చేశారు. వీటి గురించి తన పుస్తకం ‘‘కింగ్స్ కౌన్సిల్’’లో అమెరికా సీఐఏ మాజీ అధికారి జాక్ ఓ కనెల్ ప్రస్తావించారు.
లాహోర్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో జాక్ ఉన్నత విద్యను అభ్యసించారు. హక్ విధులపై ఆయన ఇలా రాసుకొచ్చారు.
‘‘1970ల్లో జోర్డాన్‌పై దాడికి సిరియా సైన్యం యుద్ధ ట్యాంకులను తీసుకొచ్చింది. దీంతో అమెరికా సాయాన్ని జోర్డాన్ కోరింది. కానీ ఎలాంటి సాయమూ అందకపోవడంతో జోర్డాన్ ప్రధాని షా హుస్సేన్ ఆందోళన చెందారు’’

ఫొటో సోర్స్, Getty Images
‘‘క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని జోర్డాన్ ప్రధాని షా హుస్సేన్ తన స్నేహితుడైన జియా ఉల్ హక్‌ను పంపారు’’
‘‘పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అని హక్ చెప్పినట్లు అమెరికా సీఐఏ మాజీ అధికారి జాక్ ఓ కనెల్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
‘‘సిరియా సైన్యంపైకి వైమానిక దళాన్ని పంపించాలని షా హుస్సేన్‌కు జియా ఉల్ హక్ సూచించారు. ఈ నిర్ణయంతో సిరియాపై జోర్డాన్ పైచేయి సాధించగలిగింది’’ అని తన పుస్తకంలోని నాలుగో చాప్టర్‌లో అమెరికా సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రిడెల్ వివరించారు.
'బ్లాక్ సెప్టెంబర్'లో జియా ఉల్ హక్ పాత్ర గురించి జోర్డాన్ ప్రధాని షా హుస్సేన్ సోదరుడు, యువరాజు హసన్ బిన్ తలాల్... బ్రూస్‌తో మాట్లాడారు.
‘‘షా హుస్సేన్‌కు జియా ఉల్ హక్ నమ్మిన బంటు, ఆప్త మిత్రుడు. యుద్ధంలో హక్ సాయానికి రాచకుటుంబం రుణపడి ఉంటుంది. దాదాపుగా సైన్యాన్ని ఆయనే నడిపించారు’’ అని తలాల్ తనకు చెప్పినట్లు బ్రూస్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘హక్ చర్యలతో పాకిస్తాన్ అధికారులు ఆగ్రహం చెందారు. జోర్డాన్ సైన్యంతో కలిసి పోరాడటం ద్వారా ఆయన దౌత్య, సైనిక పరమైన నిబంధనలను ఉల్లంఘించారు’’అని బ్రూస్ చెప్పారు.
అయితే, తనకు చేసిన సాయానికి గాను హక్‌పై హుస్సేన్ ప్రశంసలు కురిపించారు. హక్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని అప్పుడే పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బెనజీర్ భుట్టోను హుస్సేన్ హెచ్చరించారు. ఆ తర్వాత హక్‌కు పదోన్నతి లభించింది. ఆయన బ్రిగేడియర్ నుంచి మేజర్ జనరల్ అయ్యారు.
ఈ విషయంపై భుట్టో మాజీ సలహాదారు రాజా అన్వర్ తన పుస్తకం ‘‘ద టెర్రరిస్ట్’’లో ప్రస్తావించారు.
‘‘ఆ సమయంలో హక్‌ను షా వెనకేసుకుని రాకపోయుంటే... హక్ సైనిక ప్రస్థానం ముగిసిపోయుండేది’’ అని ఆయన వివరించారు.
‘‘దౌత్య, సైనిక నిబంధనలను తుంగలోకి తొక్కుతూ.. సెప్టెంబర్ ఊచకోతలో హక్ పాల్గొన్నారు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఊచకోతలో హక్ పాత్ర ఏమిటి?
అధికారికంగా ఈ యుద్ధం 1970లో సెప్టెంబరు 16 నుంచి సెప్టెంబరు 27 వరకు కొనసాగింది.
అయితే 1971 జులై వరకు చిన్ని చిన్న ఘర్షణలు సంభవిస్తూనే ఉన్నాయి.
ఈ యుద్ధంలో 3,000 నుంచి 4,000 మంది పాలస్తీనా పోరాట యోధులు, 600 మంది సిరియా సైనికులు, 537 మంది జోర్డాన్ సైనికులు మరణించినట్లు బ్రూస్ రీడెల్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
దాదాపు 20 వేల నుంచి 25 వేల వరకు గాయాల పాలైనట్లు పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫత్ వివరించారు.
పాలస్తీనావాసుల పోరాటానికి తాము మద్దతు ఇస్తామని చాలాసార్లు పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. అంతేకాదు పాక్‌లో పాలస్తీనా వాసులకు మద్దతుగా నిరసనలు కూడా చేపడుతుంటారు. వీటికి పెద్దయెత్తున ప్రజలు హాజరు అవుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ అంశానికి మరో కోణం కూడా ఉంది.
ఇదే అంశాన్ని ‘‘ద డాయల్’’ పుస్తకంలో తారిక్ అలీ ప్రస్తావించారు.
‘‘20ఏళ్లలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారికంటే జోర్డాన్ ప్రధాని షా హుస్సేన్ చేతిలో 11 రోజుల్లో మరణించిన పాలస్తీనా వాసులే ఎక్కువ’’ అని ఆయన రాసుకొచ్చారు.
ఈ అంశంపై వామపక్ష భావాలున్న భారత జర్నలిస్టు, చరిత్రకారుడు విజయ్ ప్రసాద్ 2002లో ఓ కథనం రాశారు.
‘‘జియా ఉల్ హక్ సాయంతో షా హుస్సేన్ భారీ సైన్యాన్ని పాలస్తీనావాసులపైకి పంపించారు. ఫలితంగా ఊచకోత జరిగింది’’
అయితే, 1970ల్లో జోర్డాన్‌లో పనిచేసిన పాక్ మాజీ దౌత్యవేత్త తయ్యిబ్ సిద్దిఖీ ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు.
‘‘ఆ ఆరు రోజుల యుద్ధంలో ఓటమి అనంతరం చాలా అరబ్ దేశాలు సైనిక పరమైన శిక్షణ, సాయం కోసం పాకిస్తాన్‌ను అభ్యర్థించాయి. దీంతో జోర్డాన్‌తోపాటు సిరియా, ఇరాక్‌లకూ పాక్ సాయం అందించింది’’ అని తయ్యిబ్ సిద్దిఖీ చెప్పినట్లు ద న్యూస్.. 2010 ఆగస్టులో ఒక కథనం ప్రచురించింది.
‘‘జోర్డాన్‌కు 20మంది ఉన్నతాధికారులను పంపించారు. వీరికి మేజర్ జనరల్ నవాజిష్ అలీ నేతృత్వం వహించారు. ఆయనకు డిప్యూటీగా జియా ఉల్ హక్ వెళ్లారు’’ అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘షా హుస్సేన్ అభ్యర్థనపై పాక్ వైమానిక దళానికి చెందిన ఓ రెజిమెంట్ జోర్డాన్‌కు చేరింది. అయితే, ఈ బృందం సైనికులకు శిక్షణ ఇచ్చేందుకే అక్కడికి వెళ్లింది. యుద్ధాల్లో పాల్గొనడానికి కాదు’’ అని సిద్దిఖీ వివరించారు.
‘‘సిరియా సరిహద్దుల్లోని ఇర్బిద్ నగరంలో మిలటరీ స్క్వాడ్ నాయకుడు పారిపోవడం, పాకిస్తానీ అంబాసిడర్ అందుబాటులో లేకపోవడంతో సెప్టెంబరు 2న జియా ఉల్ హక్‌కు షా హుస్సేన్ ఫోన్ చేశారు. సైన్యానికి నేతృత్వం వహించాలని కోరారు’’
‘‘వెంటనే పరిస్థితుల గురించి రక్షణ శాఖ కార్యదర్శి గియాసుద్దీన్‌కు హక్ ఫోన్ చేశారు. ఆయన వెంటనే అనుమతి ఇచ్చారు. నేను అభ్యంతరం చెప్పేందుకు ప్రయత్నించాను. అయితే, ఆయన నన్ను వారించారు’’
‘‘అనుమతి లభించిన తర్వాత సైనిక బృందానికి అధిపతిగా జియా ఉల్ హక్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, సైనిక ఆపరేషన్ మొదలుకాక ముందే.. అమెరికా, ఇజ్రాయెల్‌ల ఒత్తిడితో సిరియా తమ బలగాలను వెనక్కి తీసుకుంది’’ అని పాక్ మాజీ దౌత్యవేత్త తయ్యిబ్ సిద్దిఖీ చెప్పినట్లు ద న్యూస్ పేర్కొంది.
వేల మంది పాలస్తీనా వాసుల మరణాలకు జియా ఉల్ హక్ కారణమని సిద్దిఖీ అంగీకరించారు.
అంతేకాదు, దీనికి ప్రతిగా తాను పాకిస్తాన్‌లో అడుగుపెట్టబోనని పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫత్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు.
‘‘అయితే, వాస్తవంలో జరిగింది వేరు. ఆ తర్వాత చాలాసార్లు అరాఫత్ పాకిస్తాన్‌లో పర్యటించారు’’
ఇవి కూడా చదవండి:
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- కరోనావైరస్: గ్రామీణ ప్రాంతాలను కోవిడ్ కబళిస్తోందా.. సెకండ్ వేవ్ ఎందుకంత ప్రాణాంతకంగా మారింది
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








