ప్రపంచ రేడియో దినోత్సవం: ప్రపంచాన్ని రేడియో ఐదు విధాలుగా ఎలా మార్చేసిందంటే...

ఫొటో సోర్స్, Enis Aksoy/ Getty Images
నేడు ప్రపంచ రేడియో దినోత్సవం. రేడియో మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో, మనల్ని ఎలా రూపుదిద్దుతుందో తెలుసుకుంటూ.. వేడుక జరుపుకునే రోజు ఇది.
ఈ రేడియో.. మనకు ఇష్టమైన పాటలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు వినిపించటమే కాదు.. వార్తలు కూడా చెప్తుంది, విభిన్న అభిప్రాయాలను, స్వరాలను పంచుతుంది. ప్రపంచమంతటా మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంటుంది.
ప్రపంచంలో అత్యంత విస్తారమైన శ్రోతలకు వార్తలు, సమాచారం చేరేందుకు రేడియో ఒక మార్గం. ఇంటర్నెట్, టెలివిజన్ కన్నా ముందు దీనిని కనుగొన్నారు. సమాచార మార్పిడి కోసం, సమాచారాన్ని వేగంగా అందించటం కోసం ఉపయోగించిన అసలు మార్గం రేడియో.
ఈ క్రమంలో రేడియో ప్రపంచాన్ని ఐదు రకాలుగా ఎలా మార్చివేసిందో ఇక్కడ చూద్దాం.

ఫొటో సోర్స్, FPG/Getty Images
1. సరికొత్త సమాచార రూపం...
నమ్మటానికి కష్టంగా ఉంటుంది కానీ.. ఒకప్పుడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి అనేక వారాల వరకూ పట్టేది. రేడియోను కనుగొనటంతో ఆ పరిస్థితి శాశ్వతంగా మారిపోయింది.
20వ శతాబ్దం మొదటి భాగంలో.. వైర్‌లెస్ రేడియోతో ప్రయోగాలు మొదలయ్యాయి. అనతికాలంలోనే ప్రపంచం నలుమూలల వార్తలూ తక్షణమే లక్షలాది మంది ఇళ్లకు నేరుగా చేరటం ఆరంభమైంది.
మొట్టమొదటి రేడియో వార్తా కార్యక్రమం 1920 ఆగస్టు 31న అమెరికాలోని డెట్రాయిట్‌లో 8ఎంకే స్టేషన్ నుంచి ప్రసారమైంది. కొద్ది రోజుల్లోనే రేడియో అనేది ప్రతి ఇంటిలో నిత్యావసర వస్తువుగా మారిపోయింది.
కారు ప్రయాణంలో మనకు తోడుగా పాటలు వినిపించటానికి ముందు.. విమానాల పైలెట్లు, నౌకల కెప్టెన్లు, ట్రక్ డ్రైవర్లు, పోలీసులు, అత్యవసర సేవలు, ఇంకా ఎన్నో రంగాల్లో సమాచార సంబంధాలకు, దారిచూపటానికి ప్రధాన మార్గంగా మారిపోయింది రేడియో. ఈ రంగాలను రేడియో రూపాంతరీకరించింది. ప్రపంచ సమాచార సంబంధాలను విప్లవాత్మకంగా మలచింది.

ఫొటో సోర్స్, Getty Images
2. యుద్ధ కాలంలో ప్రసారాలు
రెండో ప్రపంచ యుద్ధంలో.. యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి సైన్యానికి చాలా ముఖ్యమైన సాధనంగా రేడియో ఉపయోగపడింది.
ప్రపంచమంతటా జనం తమ ఇళ్లలో రేడియో వద్ద కూర్చుని వార్తల కోసం వేచి ఉండేవారు.
ఫ్రాన్స్, బెల్జియం, డెన్మార్క్ దేశాల్లో 1940ల్లో సాగిన రహస్య ప్రతిఘటనా ఉద్యమాల్లో అంతర్గత సమాచార ప్రసారంలోనూ రేడియో చాలా కీలక పాత్ర పోషించింది. ఆ దేశాలను ఆక్రమించిన నాజీలకు వ్యతిరేకంగా ఆయా సంస్థలు పోరాడేవి.
అలాగే రాజకీయ నాయకులు ప్రజలతో నేరుగా మాట్లాడటానికి కూడా రేడియో ఒక మార్గంగా మారింది. జర్మనీకి, బ్రిటన్‌కు మధ్య యుద్ధం మొదలైందని 1939 సెప్టెంబర్ మూడో తేదీన ప్రధానమంత్రి నెవిల్ చాంబర్లిన్ చేసిన ప్రకటన రేడియోలో చేసిన అత్యంత ప్రఖ్యాత ప్రకటనగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
3. ‘ఐ హావ్ ఎ డ్రీమ్...’
ఇరవయ్యో శాతాబ్దంలో కొన్ని కీలక ఘట్టాలను రేడియో నమోదు చేసింది. వాటిలో ఒకటి.. అమెరికాలో పౌర హక్కుల కోసం సాగిన పోరాటం.
‘ఐ హావ్ ఎ డ్రీమ్’ అంటూ మార్టిన్ లూథర్ కింగ్ చేసిన రేడియో ప్రసంగం అత్యంత ప్రఖ్యాత రేడియో ప్రసంగాల్లో ఒకటి. అమెరికాలో విప్లవాత్మక సమానత్వం గురించి వర్ణించిన ఆ ప్రసంగం కోట్లాది మంది అమెరికన్లలో స్ఫూర్తి రగిల్చింది.
1963 ఆగస్టు 28న పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్.. వేలాది మంది జనంతో అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీకి పాదయాత్రగా చేరుకున్నారు.
ఆ కాలంలో నల్లజాతి ప్రజలను రెండో తరగతి పౌరులుగా చూసేవారు. ఆ పరిస్థితి మారాలని లూథర్ కింగ్ కోరుకున్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లజాతీయులు ఉపయోగించే స్కూళ్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, చివరికి పబ్లిక్ టాయిలెట్లను సైతం నల్లజాతివారు ఉపయోగించటానికి అనుమతి ఉండేది కాదు.
లూథర్ కింగ్ ప్రసంగం అమెరికా పౌర హక్కుల ఉద్యమానికి నిర్ణయాత్మక ఘట్టంగా మారింది. సమానత్వం కోసం తమ సంఘర్షణను ప్రపంచానికి చాటడానికి ఆ రేడియో ప్రసారం సాయపడింది.

ఫొటో సోర్స్, Keystone-France/Gamma-Keystone via Getty Images
4. గ్రహాంతరవాసుల దండయాత్ర
రేడియోలో ఎప్పుడైనా.. నిజ జీవితంలాగా లేదనిపించిన ఏదైనా నాటకం విన్నారా? భూమిపై అంగారకవాసుల దండయాత్ర కథను నాటకీయంగా చెప్పిన ‘ద వార్ ఆఫ్ ద వరల్డ్స్’ నాటకాన్ని 1938 అక్టోబర్ 30న రేడియోలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ నాటకాన్ని లక్షలాది మంది ఆలకించారని.. అది నిజంగానే జరుగుతోందని నమ్మారని చెప్తారు.
ఆ నాటకానికి ఓర్సన్ వెల్స్ దర్శకత్వం వహించారు. దానిని వార్తా బులెటిన్ల సిరీస్ రూపంలో ప్రసారం చేశారు.
ఆ కార్యక్రమం పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. ఎంతోమంది ప్రజలు తీవ్రభయాందోళనలతో తమ ఇళ్లు వదిలి పారిపోయారని వార్తలు వచ్చాయి. ‘దేశాన్ని భయపెట్టిన రేడియో బూటకం’ అంటూ చాలా పత్రికలు కథనాలు ప్రచురించాయి. అయితే.. ఈ సామూహిక భయమంతా అభూతకల్పనేనని ఆ తర్వాత నిరూపితమైంది.
మీరు నమ్మినా నమ్మకపోయినా రేడియో జిమ్మిక్కుల్లో ఇదొక పెద్ద ఘట్టమనేది నిజం.

ఫొటో సోర్స్, Dave J Hogan / Getty Images
5. సంగీత పరిశ్రమ
ఇప్పుడు యూట్యూబ్‌లో సంగీతం, సంగీత వీడియోలకు ప్రజాదరణ విపరీతంగా పెరగటంతో.. రేడియో పని అయిపోయిందని మీరు భావించవచ్చు. అయితే.. ఇంకా కోట్లాది మంది జనం రేడియోను ఇప్పటికీ విశ్వసనీయమైన సంగీత ప్రసార సాధనంగానే ఉపయోగిస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో పాడ్‌కాస్ట్ వంటి వాటిని కూడా రేడియో ప్రారంభించింది. బీబీసీ రేడియో 1, కాపిటల్ ఎఫ్ఎం వంటివి ప్రపంచ సంగీత సంబరాల్లోకి అడుగుపెట్టాయి. టేలర్ స్విఫ్ట్, లిటిల్ మిక్స్, లియాం పేన్ వంటి ప్రఖ్యాత స్టార్ల ప్రదర్శనలతో తమ సొంత ఈవెంట్లను కూడా నిర్వహిస్తున్నాయి.
సంగీత రంగం ఇప్పుడు మనకు తెలిసిన విధంగా రూపొందటంలో రేడియో ప్రధాన పాత్ర పోషించింది. 1950లలో హిట్ పాటలు వినటానికి రేడియో ఒక్కటే ఏకైక సాధనం. ఒక కళాకారుడిగా విజయం సాధించాలంటే రేడియోలో తమ పాటలు ప్రసారం కావటం చాలా కీలకం కూడా.
కొత్త సంగీతాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లటంలో, ఆల్బమ్ విక్రయాలను పెంపొందించటంలో, సంగీత కచేరీ వేదికలు నిండిపోవటంలో రేడియో స్టేషన్లు పోషించిన పాత్రను కళాకారులు, సంగీత పరిశ్రమలు ఎంతగానో ప్రశంసించేవి.
ఇప్పుడు కూడా.. టాప్-40 వినటానికి, కొత్త కళాకారులను కనుగొనటానికి, తాజా పాటల మీద మన అభిప్రాయాలను పంచుకోవటానికి మనం రేడియోను ఆశ్రయిస్తూనే ఉంటాం.
రేడియో అనేది అతి పురాతన మాస్ మీడియా రూపం కావచ్చు.. కానీ అది ఎప్పటికీ, ఎక్కడికీ అదృశ్యమైపోదు.

ఇవి కూడా చదవండి:
- దేశంలో మహిళకు సేఫెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా?
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









