ఏపీ, తెలంగాణలో కరోనావైరస్ గత వారం రోజులుగా విజృంభిస్తోంది.. కారణమేంటి

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ నమోదైన కేసులు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి.
తెలంగాణలో జూన్ 6 సాయంత్రం వరకూ మొత్తంగా 3,496 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వాటిలో గత 24 గంటల్లో నమోదైన కేసులు 206. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 152 కేసులు వచ్చాయి. మేడ్చల్‌లో 18, రంగారెడ్డిలో 10 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా మరో పదమూడు జిల్లాల్లోనూ కేసులు వచ్చాయి.
ఒక్కసారిగా అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
మరోవైపు ఆదివారం ఉదయం 9 గంటల వరకూ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 4,659 కేసులు నమోదయ్యాయి. వీటిలో గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 199.
ఇప్పటివరకూ తెలంగాణలో 123 మంది కరోనావైరస్‌తో మరణించగా, ఏపీలో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఐదో విడతలో ఇదీ పరిస్థితి...
దేశంలో లాక్‌డౌన్ ఐదో విడత జూన్ 1న అమల్లోకి వచ్చింది. ఇందులో లాక్‌డౌన్‌ను కంటెయిన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితం చేశారు. ఆంక్షలు చాలా వరకూ సడలించారు.
దీంతో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది.
జూన్ 1 ఉదయానికి ఏపీలో 3,118 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అప్పటికి మృతుల సంఖ్య 64. యాక్టివ్ కేసులు 885.
కానీ, ఈ వారం రోజుల్లో ఏపీలో ఆరు వందల కేసులు పెరిగాయి. మరో 11 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,290కి పెరిగింది.
మరోవైపు తెలంగాణలో మే 31 నాడు సాయంత్రం ఐదు గంటల వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,698. అప్పటికి రాష్ట్రంలో 82 మందిని కరోనావైరస్ బలి తీసుకుంది.
ఐదో విడత లాక్‌డౌన్‌లో తెలంగాణలో సుమారు 800 కేసులు పెరిగాయి. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఐదో విడత లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,188. ఇప్పుడు అవి 1,663కు పెరిగాయి.

ఫొటో సోర్స్, facebook/eatalarajendar
‘తెలంగాణలో పరీక్షలు చేయడం లేదు’
తెలంగాణలో తగినంత స్థాయిలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం మే 20 నాటికి తెలంగాణలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 30,076. వీటిలో 1,661 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే పాజిటివిటీ రేటు 6%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం 0.39% పాజిటివిటీ రేటుతో 2,67,609 పరీక్షలు చేసింది.
అన్నింట్లో రాష్ట్రానిది ప్రథమ స్థానం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం, కరోనావైరస్ పరీక్షల నిర్వహణలో దేశంలో అట్టడుగు స్థానంలో ఉందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు.
ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య తమిళనాడు, మహారాష్ట్రల్లో ఐదు లక్షలకు చేరువలో ఉంటే, తెలంగాణలో మాత్రం 40 వేలు ఉండటేమిటని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల విషయంలో దాపరికంతో వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి సైతం పరీక్షలు చేయడం లేదని ఆరోపించారు.
మరోవైపు పరీక్షల నిర్వహణకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీంఎంఆర్) మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం అంటోంది.
కరోనా లక్షణాలున్నవారికి, వృద్ధులు, చిన్న పిల్లలు వంటి హైరిస్క్ కేటగిరీ వారికి మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ సూచించిందని, ఆ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
రాజకీయ పార్టీలు, సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహవంతులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని, ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించవద్దని ఈటల కోరారు.
తెలంగాణలో ప్రైవేటు టెస్టింగ్ కేంద్రాలను అనుమతించడం లేదు. అనవసరపు ఆందోళన తలెత్తకుండా ఉండేందుకు ఇలా వ్యవహరిస్తున్నామని ఈటల చెప్పారు.
‘‘కరోనావైరస్ పాజిటివ్‌గా తేలితే, ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తుంది. ప్రైవేటు కేంద్రాలు, ఆసుపత్రులు ఆ పని చేయవు. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు?’’ అని ఆయన మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టెస్టుల్లో మెరుగ్గా కనిపిస్తున్న ఏపీ
పరీక్షల నిర్వహణ విషయంలో అధికారిక గణాంకాల ప్రకారం ఆంధప్రదేశ్ మెరుగ్గా కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకూ మొత్తంగా 46,66,386 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 4,54,030 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ లెక్కన దేశవ్యాప్త పరీక్షల్లో ఏపీ వాటా 9.72 శాతం.
ఏపీలో పరీక్షల నిర్వహణ వేగం కూడా జాతీయ స్థాయికి అనుగుణంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
భారత్ వ్యాప్తంగా జూన్ 6-7 మధ్య 24 గంటల వ్యవధిలో 1,42,069 పరీక్షలు జరిగాయని ఐసీఎంఆర్ పేర్కొంది. అదే వ్యవధిలో ఏపీలో 17,695 పరీక్షలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో ఇంతవరకూ మొత్తంగా పరీక్షించినవారిలో పాజిటివిటీ శాతం 0.8. అంటే, పరీక్షించిన ప్రతి వెయ్యి మందిలో ఎనిమిది మంది పాజిటివ్‌గా తేలారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యులకూ కరోనా
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 మందికిపైగా వైద్యులు, ఇతర సిబ్బంది కొవిడ్-19 బారిన పడ్డట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం ప్రచురించిన కథనంలో పేర్కొంది.
కరోనాకు చికిత్స చేసే ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది కన్నా.. నిమ్స్, పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్, ఉస్మానియా వైద్య కళాశాల వంటి నాన్ కరోనా ఆస్పత్రుల్లో పనిచేసేవారికే వైరస్ ఎక్కువగా సోకుతోందని అందులో రాసింది.
ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకున్నా, వైద్య సిబ్బందికి కరోనావైరస్ ఎలా సోకిందని హైకోర్టు ప్రభుత్వాన్ని ఇదివరకు ప్రశ్నించింది.
వైద్యులకు కరోనావైరస్ సోకిన విషయానికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా హైకోర్టు వైద్యుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
వైద్యులకు పీపీఈ కిట్లు, ఇతర రక్షణ సామగ్రి అందుబాటులో లేకపోవడం వల్లే కరోనా సోకిందన్న వాదనను ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఖండించారు.
అన్ని రాష్ట్రాల్లోనూ వైద్య సిబ్బందికి కరోనావైరస్ సోకిందని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యేనని చెప్పారు.
వైద్య సిబ్బంది రక్షణ కోసం తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. పది లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని... మాస్కులు, ఔషధాలకు రాష్ట్రంలో కొరత లేదని చెప్పారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










