ఏప్రిల్ 1 నుంచి ఏమేం మారిపోతాయి? ఉద్యోగులు, బీమా పాలసీదారులు, ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్

ఏప్రిల్ 1 మార్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుంది. అంతేకాదు చాలా మార్పులు, నిబంధనలూ అమల్లోకి రానున్నాయి.

ఈ నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి, లేకుంటే నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు.

ఇంతకీ ఈ కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25కి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో చూద్దాం.

ఆదాయపు పన్ను

2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా అమలుకానుంది.

దీని ప్రకారం మీరు కొత్త పన్ను విధానంలోనే ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ 'పాత పన్ను విధానం'లో ట్యాక్స్ చెల్లించాలనుకుంటే, మీ కంపెనీకి సమాచారం అందించాలి.

కొత్త పన్ను విధానం పన్ను స్లాబ్‌లు:

రూ. 3 లక్షల వరకు - 0 శాతం

రూ. 3-6 లక్షలు - 5 శాతం

రూ. 6-9 లక్షలు - 10 శాతం

రూ. 9-12 లక్షలు - 15 శాతం

రూ. 12 నుంచి 15 లక్షలు - 20 శాతం

రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం - 30 శాతం

బీమా

ఫొటో సోర్స్, Getty Images

బీమా ప్లాన్ 'సరెండర్'

ఒక కస్టమర్ తన బీమా పాలసీని సరెండర్ చేస్తే, అంటే దానిని కంపెనీకి తిరిగి ఇస్తే, ఐఆర్డీఏఐ దాని విలువను నిర్ణయించే నియమాలను మార్చింది.

ఏప్రిల్ 1 నుంచి ఇవి వర్తిస్తాయి.

ఉదాహరణకు మీరు ఏదైనా పాలసీని కొనుగోలు చేశారు. కొన్నాళ్లు ప్రీమియం అంటే వాయిదాలు కూడా చెల్లించారు.

కానీ కొన్ని కారణాల వల్ల పాలసీని కొనసాగించాలనుకోకపోయినా, మెచ్యూరిటీకి ముందే క్లోజ్ చేయాలనుకున్నా.. పాలసీని కంపెనీకి సరెండ్ చేస్తారు.

ఆ సమయంలో కొత్త నిబంధనల ప్రకారం ఎవరికి ఎలాంటి రిఫండ్ వస్తుంది?

నాన్-సింగిల్ ప్రీమియం- బహుళ వాయిదాలు చెల్లించే పాలసీ

  • మీరు పాలసీని రెండో సంవత్సరంలో మూసివేస్తే, మీరు చెల్లించిన ప్రీమియంలో 30 శాతం తిరిగి పొందుతారు.
  • మూడో సంవత్సరంలో పాలసీని సరెండర్ చేసినట్లయితే, మీరు చెల్లించిన ప్రీమియంలో 35 శాతం తిరిగి మీకు లభిస్తుంది.
  • పాలసీ తీసుకున్న 4- 7వ సంవత్సరం మధ్యలో సరెండర్ చేసినట్లయితే, మీరు చెల్లించిన ప్రీమియంలో 50 శాతం రిఫండ్ పొందుతారు.
  • చివరి రెండేళ్లలో పాలసీని సరెండర్ చేసినట్లయితే, మీరు చెల్లించిన ప్రీమియంలో 90 శాతం తిరిగి పొందుతారు.

సింగిల్ ప్రీమియం - అంటే బీమా ప్లాన్‌ల కోసం ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లించడం

  • మూడో సంవత్సరంలో పాలసీని సరెండర్ చేస్తే, చెల్లించిన ప్రీమియంలో 75 శాతం తిరిగిస్తారు.
  • చివరి రెండేళ్లలోపు పాలసీని సరెండర్ చేసినట్లయితే, మీరు చెల్లించిన ప్రీమియంలో 90 శాతం తిరిగి పొందుతారు.

అంటే మొదటి మూడేళ్లలో పాలసీ మూసివేస్తే తక్కువ డబ్బు వస్తుంది.

నాలుగో సంవత్సరం తర్వాత పాలసీని మూసివేయాలని నిర్ణయించుకున్న కస్టమర్లకు కొత్త నిబంధనల అనుసారం మునుపటి కంటే ఎక్కువ డబ్బును తిరిగి పొందగలరు.

నేషనల్ పెన్షన్ స్కీం

నేషన్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) సెక్యూరిటీ రూల్స్ మార్చారు. ఇప్పుడు మనం 'టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్' చేయాలి.

అంటే ఇంతకుముందులా కేవలం పాస్‌వర్డ్‌ టైప్ చేసి లాగిన్ కాలేము. కాబట్టి మీ ఖాతాను వేరేవాళ్లు యాక్సెస్ సులభంగా చేయలేరు.

మీరు ఆధార్ నంబర్‌ను ధ్రువీకరించాలి, మీ మొబైల్‌కు పంపిన ఓటీపీని కూడా ఉపయోగించాలి, అప్పుడు మీ ఖాతా వివరాలను మీరు చూడగలరు.

ఈపీఎఫ్‌వో

ఫొటో సోర్స్, Getty Images

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)

మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మెంబర్‌గా రిజిస్టర్ అయి ఉండి, మరో కంపెనీలోకి మారితే, మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఆటోమేటిక్‌గా కొత్త సంస్థలోని ఖాతాకు బదిలీ అవుతుంది.

అంటే మీరు కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత పీఎఫ్ బదిలీని ప్రాసెస్ చేయనవసరం లేదు.

ఫాస్టాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫాస్టాగ్

ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ నిబంధనలు మారనున్నాయి.

ఫాస్టాగ్ సేవలు వినియోగించుకోవాలంటే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు కేవైసీ చేయకపోతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.

ఫాస్టాగ్‌లో కేవైసీ ప్రధానం. కేవైసీ ద్వారా వినియోగదారు గుర్తింపు (ఐడెంటిటీ) నిర్ధరితమవుతుంది.

ఆర్థికపరమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వారి కేవైసీ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇది ఫాస్ట్‌ట్యాగ్‌‌కు కూడా వర్తిస్తుంది.

కేవైసీ వివరాల్లో మార్పులుంటే, అప్డేట్ చేసుకునేందుకు సంబంధిత బ్యాంకును సంప్రదించాలి.

సమీపంలోని బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే, ఫాస్టాగ్ ఖాతా కేవైసీ వివరాలను బ్యాంకు అప్డేట్ చేస్తుంది.

అందులో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్రాసెస్ అవ్వదు. దాని నుంచి చెల్లింపులు చేయలేరు.

ఓలా మనీ వాలెట్

ఓలా మనీ వాలెట్‌ను ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ)కి మారుస్తున్నట్లు ప్రకటించింది.

కాబట్టి కస్టమర్లు ఇప్పుడు గరిష్టంగా నెలకు రూ.10,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)