వ్యాక్సీన్ తీసుకున్న వారి నుంచి ఇతరులకు కరోనావైరస్ సోకుతుందా?

కరోనావైరస్ సామాజిక దూరం

ఫొటో సోర్స్, Getty Images

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

యూకే నుంచి అమెరికాకు 11 సంవత్సరాల బాలుడొకరు 2009 జూన్‌లో ఒక యూదు ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమం కోసం వెళ్లారు. అదే వారంలో ఆ బాలుడు న్యూయార్క్ లో శిక్షణా కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆ బాలుని లాలాజల గ్రంథుల్లో వింతైన వాపు కనిపించింది. ఆ బాలుడికి గాలిలో వ్యాపించిన తుంపర్ల ద్వారా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ సోకి గవద బిళ్ళలు ఏర్పడ్డాయి.

ఆ కార్యక్రమంలో సుమారు 400 మంది పిల్లలు ఒకరితో ఒకరు దగ్గరగా మెలుగుతూ గడిపారు. అది సంప్రదాయ యూదు మత విద్యకు సంబంధించిన కార్యక్రమం. అందులో ఒక చిన్న టేబుల్ కి అటూ ఇటూ కూర్చుని సహచరులతో కలిసి అధ్యయనం చేయవలసి ఉంటుంది.

ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి మరో 22 మంది పిల్లలకు, ముగ్గురు పెద్దవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది.

పిల్లలు ఇంటికి వెళ్లేసరికి ఈ వైరస్ మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించింది. మొత్తం మీద ఈ ఇన్ఫెక్షన్ ఒక సంవత్సరం పాటు కొనసాగి మొత్తంగా 3,502 మంది దీని బారిన పడ్డారు.

ఈ ఇన్ఫెక్షన్ గురించి శాస్త్రవేత్తలు విశ్లేషించినప్పుడు యూదు విద్యా విధానం నిర్వహించిన తీరులోనే ఈ వైరస్ సోకేందుకు అవకాశం ఉండుంటుందని భావించారు.

అయితే , అనుకోకుండా దీనిని సూపర్ స్ప్రెడ్ చేసిన బాలుడు అప్పటికే ఎంఎంఆర్ వ్యాక్సీన్ తీసుకుని ఉన్నారు.

ఆ బాలునికి ఉన్న రోగ నిరోధక శక్తి వలన ఆ పిల్లవాడిలో కేవలం తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. కానీ, ఆ బాలుడి నుంచి వైరస్ మాత్రం వ్యాప్తి చెందింది.

నిజానికి అన్ని వ్యాక్సీన్లు, ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా రక్షించలేవు. కాకపొతే లక్షణాలు బయటకు కనిపించకుండా నిరోధించగలవు. దీంతో, వాక్సీన్ తీసుకున్న వారు కూడా తమకు తెలియకుండా పాథోజెన్లను వ్యాప్తి చెందించే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడూ అది మహమ్మారికి కూడా దారి తీసే పరిస్థితులు ఏర్పడవచ్చు.

ఆటలమ్మ

ఫొటో సోర్స్, Alamy

ప్రభావవంతమైన రోగ నిరోధక శక్తి

వ్యాక్సీన్ వలన రెండు రకాల రోగ నిరోధక శక్తి వస్తుంది.

ఒకటి, రోగాన్ని ముదరనివ్వకుండా పాథోజెన్ ని నిరోధించే ప్రభావవంతమైన రోగ నిరోధక శక్తి. ఇది శరీరంలోకి రోగం చేరకుండా గాని, లేదా దాని ప్రతిరూపాలను పెంచడాన్ని కానీ ఆపలేదు.

మరొకటి వైరస్ లక్షణాలు కనపడకుండా చేయడం మాత్రమే కాకుండా వైరస్ ని పూర్తిగా చంపి, ఇన్ఫెక్షన్ పూర్తిగా సోకకుండా చూడగలిగే రోగ నిరోధక శక్తి.

వ్యాక్సీన్ పరిశోధన చేసే వారంతా రెండవ రకం వ్యాక్సీన్ కోసమే ఆశ పడతారు. కానీ, ఇప్పటి వరకు ఇది ఎవరూ సాధించలేదు.

మెనిన్జైటిస్‌ని ఉదాహరణగా తీసుకుంటే దీనికున్న వివిధ స్ట్రెయిన్ లకి చాలా రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

అమెరికాలో ఎంసివి 4, ఎంపిఎస్ వి 4, మెన్ బి ఉన్న మూడు వ్యాక్సిన్లు కలిపి 85 - 90 శాతం రోగం రాకుండా నిరోధించగలవు.. కానీ, కొన్ని సార్లు మాత్రం కొంత మంది ద్వారా బాక్టీరియా సోకే అవకాశమైతే ఉంది.

ఇవి ముక్కులో కానీ, గొంతు వెనక భాగంలో కానీ దాక్కుని, తుమ్ములు, దగ్గు, ముద్దు పెట్టుకోవడం, సిగరెట్లు , పాత్రలు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా వ్యాప్తి చెందించవచ్చు.

ఈ పాథోజెన్ లోపల దాగిన వ్యక్తుల్లో నాలుగు వారాల తర్వాత ఈ వ్యాక్సీన్ ఎటువంటి ప్రభావం చూపించలేదని యూకేలో యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

రోగాన్ని వ్యాప్తి చెందించగలవా లేదా అనే విషయంలో రెండు రకాల మెనిన్జైటిస్ వ్యాక్సీన్ల వలన రెండు రకాల ప్రభావాలు ఉంటాయని నాటింగ్హామ్ యూనివర్సిటీలో ఎపిడెమాయాలజి ప్రొఫెసర్ కీత్ నీల్ చెప్పారు. "కానీ, అందులో కొంత మందికి రోగ నిరోధక శక్తి ఉండటం వలన ఈ ఇన్ఫెక్షన్ బారి నుంచి తప్పించుకోగల్గుతారు" అని చెప్పారు.

ఈ వ్యాక్సీన్ తీసుకోవడం వలన రోగం లక్షణాలు తీవ్రంగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ఆసుపత్రిలో చేరకుండా ఆపడంలో ప్రభావవంతంగా పని చేసినప్పటికీ వాక్సీన్ వేసుకున్నా వేసుకోకపోయినా పెరటాసిస్, హెపటైటిస్ బి, గవద బిళ్ళలు, ఒక్కొక్కసారి ఇన్‌ఫ్లుయెంజా లాంటి ఇన్ఫెక్షన్ లు కూడా సోకే అవకాశం ఉంది.

శరీరంలో ఉండే బి, టి కణాలు, యాంటీ బాడీల వంటి అంశాల వలన ప్రభావవంతమైన రోగ నిరోధక శక్తి కలిగితే , వైరస్ ని పూర్తిగా హరించే రోగ నిరోధక శక్తి మాత్రం యాంటీబాడీలను తటస్థం చేయడం పై ఆధార పడుతుంది. దీని వలన పాథోజెన్లు ముక్కు, గొంతు, ఊపిరితిత్తులను కలిపి ఉంచే కణాలను తాకకుండా కాపాడగలవు.

కోవిడ్ 19 విషయంలో వైరస్ శరీరంలోని కణాలలోకి చేరకుండా యాంటీ బాడీలు అడ్డుకోగలవు. అయితే, ఈ వైరస్ ని పూర్తిగా హరించే రోగ నిరోధక శక్తి సాధించాలంటే మాత్రం వ్యాక్సీన్లు శరీరంలోకి చేరి వైరస్ ఎదుర్కొనేందుకు సరిపోయేంత స్థాయిలో యాంటీ బాడీలను ఉత్పత్తి చేయగలగాలి.

కరోనావైరస్ సామాజిక దూరం

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ 19 వ్యాక్సీన్ల ద్వారా ఎటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది?

"ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాక్సీన్లు కొత్తగా రూపొందించడం వలన ఇవెలా పని చేస్తాయో మనకి తెలియదు" అని నీల్ అన్నారు.

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు రోగం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తున్నాయా లేదా ప్రభావవంతంగా పని చేస్తున్నాయా లేదా అనే అంశాన్ని విశ్లేషించలేదు. చాలా మందికి ఇది రెండవ అంశం.

‘‘అవి రోగం రాకుండా కాపాడతాయో లేదోననే అంశాన్ని మాత్రమే పరిశీలించారు. దీనిని బట్టి మన లక్ష్యాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుకున్నాం అని అర్ధమవుతోంది" అని ఇంపీరియల్ కాలేజీ లండన్ లో ఇమ్యునాలజీ ప్రొఫెసర్ డానీ ఆల్ట్మన్ అన్నారు.

కోవిడ్ 19 సోకిన తర్వాత తయారయిన యాంటీబాడీలు తిరిగి ఇన్ఫెక్షన్ సోకకుండా పూర్తిగా ఆపలేవని శాస్త్రవేత్తలకు తెలుసు.

యాంటీ బాడీలు వచ్చిన తర్వాత కూడా 17 శాతం మందిలో తిరిగి ఇన్ఫెక్షన్ సోకినట్లు బ్రిటిష్ ఆరోగ్య కార్యకర్తల పై చేసిన ఒక అధ్యయనంలో గుర్తించారు.

ఇందులో 66 శాతం కేసులలో రోగ లక్షణాలు కనిపించలేదు. లక్షణాలు బయటకు కనిపించలేనంత మాత్రాన ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాప్తి చెందే ముప్పు ఉండదని మాత్రం చెప్పడానికి లేదు.

"ఇలాంటి వైరస్ విషయంలో వ్యాక్సీన్ పని తీరు గురించి కాస్త ఎక్కువగా ఆశించడం కూడా ఎక్కువేనేమో. ఇది సాధించడం కష్టం" అని ఆల్ట్మన్ అన్నారు.

కొన్ని రకాల వ్యాక్సీన్లు ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ వాటిని కొంత వరకు నిరోధించగలవని కూడా కొన్ని సూచనలు వచ్చాయి. వ్యాక్సీన్ వలన ప్రజలను రోగం బారిన పడకుండా కాపాడితే , ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం తగ్గుతుంది. కానీ, ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే అని నీల్ చెప్పారు.

కరోనావైరస్ రోగ నిరోధక శక్తి

ఫొటో సోర్స్, Alamy

వైరస్‌ను హరించే రోగ నిరోధక శక్తిని నిరూపించడం కష్టం

ఈ వ్యాక్సీన్లు ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించగలవా లేదా అనే అంశం గురించి చాలా వరకు క్లినికల్ ట్రయల్స్ పరిశీలించటం లేదు.

అయితే, వ్యాక్సీన్లు ఇచ్చిన చోట ఇన్ఫెక్షన్ వ్యాప్తి శాతం ఏమన్నా తగ్గిందా లేదా అనే అంశం గురించి మాత్రం శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

వ్యాక్సీన్ల ప్రభావం కనిపిస్తే, యూకే లాంటి దేశాలలో ఉన్న కేర్ హోమ్స్‌లో ఇన్ఫెక్షన్ సోకే రేటు తగ్గే అవకాశం ఉంది.

కానీ ఇది సమస్యాత్మకమని నీల్ అన్నారు. ఇందులో రెండు అంశాలు ఉంటాయి. "మనం లాక్ డౌన్లను చూసాం. వ్యాక్సీన్ కూడా వచ్చింది. ఈ రెంటినీ విడివిడిగా చూడటానికి లేదు" అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఉన్న వ్యాక్సీన్ల వలన ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించగలిగే సామర్ధ్యం ఉంటుందని మాత్రమైతే తెలుసు.

ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్

గత సంవత్సరం రీసస్ మకాక్ అనే పాత తరం కోతి పై వ్యాక్సీన్ పనే చేసే ప్రభావాన్ని పరీక్షించారు. వీటి శ్వాసకోశ వ్యవస్థ మనుషులను పోలి ఉండటంతో కొంచెం ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చాయి.

కోతులను కొన్ని సీరియస్ రోగాల బారిన పడకుండా కాపాడినప్పటికీ , కోవిడ్ 19 సోకకుండా మాత్రం ఆపలేకపోయారు. వ్యాక్సీన్ ఇచ్చిన కోతులు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంది.

ఈ వ్యాక్సీన్ వలన వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడం పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ ,ఇది గణనీయంగా రోగాన్ని తగ్గిస్తుందని అధ్యయనకర్తలు తేల్చారు.

మనుషుల్లో జరిగిన మూడవ దశ ట్రయల్స్ పరిశీలిస్తే మొత్తం చిత్రం కాస్త సంక్లిష్టంగా కనిపిస్తుంది. ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకునేవారికి కేవలం రెండు డోసులు వ్యాక్సీన్ ఇవ్వడం మాత్రమే కాదు. వ్యాక్సీన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు కలిగాయో కూడా గమనించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్ తీసుకున్న వారికి ఒకవేళ లక్షణాలు లేని ఇన్ఫెక్షన్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ప్రతి వారం ముక్కు, గొంతు, స్వాబ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

ఇన్ఫెక్షన్ సోకకుండా నిరోధించడంలో ఒక సాధారణ డోసు తీసుకున్న తర్వాత సగం డోసు వ్యాక్సీన్ తీసుకున్న వారిలో 59 శాతం ప్రభావవంతంగా పని చేసిందని జనవరి 2021లో ప్రచురించిన ఫలితాలు తెలిపాయి. ఈ వ్యాక్సీన్ రోగి ఊపిరితిత్తుల్లో ఉన్న వైరల్ పదార్ధాల సంఖ్య పై ఏమైనా ప్రభావం చూపిస్తుందో లేదోననే అంశం పై ఈ పరిశోధన దృష్టి సారించలేదు.

సగం డోసు తీసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ దీనిని నిర్ధరించడానికి ఇంకా పూర్తి సమాచారం కావల్సి ఉంటుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

ఈ ట్రయల్స్ లో పాల్గొన్న వారిని మరో నెల రోజులు పాటు గమనించిన తరువాత వచ్చిన ఫలితాలలో వ్యాక్సీన్ తీసుకోవడం వలన కేసుల సంఖ్య తగ్గిందని ఒక్క డోసు తర్వాత కనిపెట్టగలిగే వైరస్ 67 శాతం మాత్రమే ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనిని బట్టి వైరస్ వ్యాప్తి తగ్గుతోందని అర్ధమయిందని పత్రంలో రాశారు.

వైద్య బృందం

ఫొటో సోర్స్, Getty Images

ఫైజర్ - బయోఎన్‌టెక్

ఫైజర్ - బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ తీసుకోవడం వలన కరోనా వైరస్ సోకకుండా నిరోధిస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలేమీ ఇంకా లభించలేదు. కానీ, ఇదికొంతవరకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఆపగలదనే కొన్ని తొలి సంకేతాలు మాత్రం వస్తున్నాయి.

జంతువులపై చేసిన కొన్ని అధ్యయనాల్లో ఈ వ్యాక్సీన్ వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తుందని తెలిసిందని ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. అయితే, మనుషుల్లో కూడా ఇలాగే జరుగుతుందా లేదా అనే విషయం మాత్రం నిరూపితం కాలేదు.

ఇజ్రాయెల్ లో వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న102 మంది వైద్య సిబ్బందిలో ఇద్దరికి మాత్రమే యాంటీ బాడీలు తయారైనట్లు ఒక చిన్న సర్వే తెలిపింది. మిగిలిన 98 శాతం మందిలో కోవిడ్ సోకిన వారిలో తయారయ్యే యాంటీ బాడీల కంటే ఎక్కువ శాతం యాంటీ బాడీలు ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది.

ఇలాంటి శక్తివంతమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారి వలన ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందించటాన్ని నిరోధిస్తుందని ఈ అధ్యయన నిర్వహణకు నేతృత్వం వహించిన వ్యక్తి ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

అయితే, వీటిని నిర్వహించడానికి వారు తీసుకున్న శాంపిల్ సైజు, ఈ పరిశోధన పీర్ రివ్యూ జర్నల్ లో ప్రచురితం కాకపోవడం లాంటి అంశాల వలన వీటిని జాగ్రత్తగా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

ఇటీవల ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో పది లక్షల మంది వైద్య రికార్డులను పరిశీలించి పూర్తిగా వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత 7,15,425 మందిలో కేవలం 317 మందికి మాత్రమే కరోనావైరస్ సోకినట్లు తెలిపింది.

అయితే, ఇదేమి క్లినికల్ ట్రయల్ కాదు. ఫలితాలను పోల్చి చూడటానికి వ్యాక్సీన్ తీసుకోలేని మరో కంట్రోల్ గ్రూపు ఇక్కడ లేదు. మకాబి హెల్త్ కేర్ సర్వీసెస్ నిర్వహించిన అధ్యయనంలో ఫలితాలు ఆశాజనకంగా కనిపించాయి.

వ్యాక్సీన్ ఇచ్చిన 1,63,000 మందిలో కేవలం 31 మందికే వైరస్ సోకింది. అదే వ్యాక్సీన్ ఇవ్వలేని వారిలో 6,500 మందికి ఇన్ఫెక్షన్ సోకింది.

మోడెర్నా

ఈ వ్యాక్సీన్ వలన ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందో లేదో అనే అంశాన్ని మోడెర్నా వ్యాక్సీన్ ప్రత్యేకంగా పరిశీలించకపోయినప్పటికీ ఇందులో పాల్గొన్న వారికి మాత్రం మొదటి, రెండవ డోసులు తీసుకున్న తర్వాత కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ సోకిందో లేదోననే విషయాన్నిమాత్రం పరిశీలించారు.

అందులో 14 మందికి ఒక షాట్ తీసుకున్న తర్వాత కోవిడ్ సోకగా, ప్రభావం లేని మందు ఇచ్చిన వారిలో 38 మందికి ఇన్ఫెక్షన్ సోకింది.

దీనిని బట్టి, ఒక షాట్ తీసుకున్న తర్వాత మూడింట రెండు వంతుల మందిలో లక్షణాలు లేని ఇన్ఫెక్షన్ సోకకుండా నిరోధించగల్గుతుందని అర్ధమవుతోంది.

అయితే ఈ పరిశోధనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిశోధనలో చాలా తక్కువ మంది పై పరీక్షలు నిర్వహించింది . కానీ, ఈ అంచనాలు కచ్చితమైనవని అయితే చెప్పలేం.

ఇది ఎఫ్‌డిఎకి సమర్పించిన వివరాలలో ప్రచురితమయింది కానీ, ఇంకా పీర్ రివ్యూ జరగలేదు.

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Russell Cheyne/ Reuters

నోవావాక్స్

ఈ వ్యాక్సీన్ వాడకానికి ప్రపంచంలో ఎక్కడా అనుమతి లభించలేదు. అలాగే, మిగిలిన వ్యాక్సిన్లలా ఇది మనుష్యులలో వ్యాప్తిని నిరోధిస్తుందని విస్తృతంగా చూపించలేదు.

కానీ, నవంబరులో వచ్చిన కొన్ని తొలి ఫలితాలను చూసి శాస్త్రవేత్తలు ఉత్సాహపడ్డారు.

రీసస్ మాకక్స్ కోతుల పై జరిపిన అధ్యయనాలలో వ్యాక్సీన్ డోసును ఎక్కువగా ఇచ్చినప్పుడు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుందని సంస్థ తెలిపింది.

అయితే, ఇదే విధమైన రోగ నిరోధక శక్తిని మనుషుల్లో కూడా పెంపొందిస్తుందా లేదా అనే విషయం గురించి శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు.

అసంపూర్ణమైన హెర్డ్ ఇమ్మ్యూనిటీ

దురదృష్టవశాత్తు వ్యాక్సీన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించగలవో లేదోననే అంశం కేవలం భౌతిక దూరపు నియమాలు పాటించడం మీద మాత్రమే కాకుండా, ఇది హెర్డ్ ఇమ్మ్యూనిటీ పై కూడా ప్రభావం చూపిస్తుంది.

"ఈ వ్యాక్సీన్లు వైరస్ వ్యాప్తిని పూర్తిగా ఆపలేకపోతే హెర్డ్ ఇమ్మ్యూనిటీ నిర్దేశిత పరిధిని దాటి కేసుల సంఖ్యను 0 చేసేందుకు వ్యాక్సీన్ ఇవ్వవలసిన ప్రజల సంఖ్యను కూడా ఇది పెంచుతుంది" అని సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీలో సీనియర్ రీసెర్చ్ ఫెలో మైఖేల్ హెడ్ చెప్పారు.

అయితే, ఈ హెర్డ్ ఇమ్మ్యూనిటీ నిర్దేశిత పరిధి గురించి ఇంకా స్పష్టత లేదని ఆయన వివరించారు. సహజంగా ఇన్ఫెక్షన్ సోకి గాని, వ్యాక్సీన్ ద్వారా గాని ఇంకా జనాభా ఆ స్థాయికి చేరలేదని ఆయన అన్నారు.

ఏదైనా ఒక వ్యాధి జనాభాలోని ఒక పెద్ద భాగంలో వ్యాపిస్తే, మనుషుల రోగ నిరోధక శక్తి ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సాయం చేస్తుంది.

అంటే, జనాభా ఆ వ్యాధితో పోరాడి పూర్తిగా కోలుకోగలరు. వారు ఆ వ్యాధి నుంచి 'ఇమ్యూన్' అవుతారు. అంటే వారిలో రోగ నిరోధక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వారిలో ఆ వైరస్‌ను తట్టుకోగలిగే 'యాంటీ-బాడీస్' తయారవుతాయి.

అయితే ఆ స్థాయికి చేరడం వైరస్ పునరుత్పత్తి అయ్యే సంఖ్య, ఆర్, ప్రతి వ్యక్తి ద్వారా వైరస్ సోకిన వ్యక్తులు, లాక్ డౌన్ లాంటి క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులు లాంటి చాలా అంశాల పై ఆధారపడి ఉంటుంది.

హెర్డ్ ఇమ్మ్యూనిటీని సాధించడానికి ప్రతి చోటా ఒకేలా పని చేసే నిర్దేశిత పరిధి ఏమి లేదు.

కానీ, వ్యాక్సీన్ వలన వైరస్ వ్యాప్తి పూర్తిగా అరికడితే 60 -72 శాతం జనాభాకి వ్యాక్సీన్ వేయడం అవసరమవుతుంది. కానీ, వ్యాక్సీన్ ప్రభావం 80 శాతం ఉంటే 75 నుంచి 90 శాతం ప్రజలకు వ్యాక్సీన్ ఇవ్వవలసి ఉంటుంది.

ఇదే రకంగా వ్యాక్సీన్ డోసులను ఇవ్వాలని ప్రపంచంలో చాలా దేశాలు ఆశపడుతున్నాయి. యూకేలో సెప్టెంబరుకల్లా ప్రతి పౌరునికి వ్యాక్సీన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 6 కోట్ల 75 లక్షల జనాభాలో 5 కోట్ల 10 లక్షల మందికి వ్యాక్సీన్ ఇవ్వవలసి ఉంటుంది.

ఇది దేశంలో ఉన్న ప్రతి పౌరుడు వ్యాక్సీన్ తీసుకోవడానికి అంగీకారం తెలిపి, ఇది తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటే ఈ సంఖ్య సాధ్యం అవుతుంది.

అయితే, ఈ వైరస్ పూర్తిగా అంతమైపోతుందని శాస్త్రవేత్తలెవరూ భావించటం లేదు. ప్రస్తుతానికి దీని వ్యాప్తిని ఎంత వరకు వీలయితే అంత వరకు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాకపోతే, ఒక్కసారి అందరికీ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తే వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందో లేదో అనే విషయం పెద్దగా పట్టించుకోనవసరం లేదని అప్పటికి అందరికీ రోగ నిరోధక శక్తి వస్తుందని చెప్పారు.

అయితే, గర్భిణీలు, లేదా చిన్న పిల్లలు, వేరే వ్యాధులతో బాధపడుతున్నవారు వ్యాక్సీన్ తీసుకోలేకపోవడం కూడా కీలకంగా మారవచ్చు.

దీనికి సమాధానం దొరికే వరకు మనం గవద బిళ్ళలు సోకిన బాలుని కథ గుర్తు పెట్టుకుని మనం వ్యాక్సీన్ తీసుకోనట్లే ప్రవర్తించాలి.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)