కమలా హారిస్ - మైక్ పెన్స్ మధ్య హోరాహోరీ డిబేట్: సంవాదంలో గెలుపెవరిది?

ఫొటో సోర్స్, ERIC BARADAT
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు కమలా హారిస్, మైక్ పెన్స్ మధ్య సాల్ట్ లేక్ సిటీలో డిబేట్ జరిగింది.
అధ్యక్షుడు ట్రంప్ కరోనా పాజిటివ్ అయిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఈ అభ్యర్థుల మధ్య జరిగే ఈ చర్చ చాలా కీలకంగా నిలిచింది.
ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ఈ చర్చను జర్నలిస్ట్ సుజాన్ పేజ్ నిర్వహించారు.
కరోనా దృష్ట్యా అభ్యర్థుల మధ్య ఒక గ్లాస్ షీల్డ్ ఏర్పాటుచేశారు. అభ్యర్థులకు, హోస్ట్ కు మధ్య ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ చర్చకు హాజరైన ప్రేక్షకులందరికీ కోవిడ్ టెస్ట్ చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో అందరూ మాస్క్ వేసుకోవడం, ఫిజికల్ డిస్టన్స్ పాటించడం తప్పనిసరి చేశారు.
90 నిమిషాల ఈ చర్చను వివిధ భాగాలుగా విభజించారు..

ఫొటో సోర్స్, Getty Images
మొదటి అంశం- కరోనా మహమ్మారి
కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో ట్రంప్ చేయలేనిది జో బైడెన్ ఏం చేయగలరని సుజాన్ పేజ్ ప్రశ్నించారు.
“అధ్యక్షుడు ట్రంప్ వైరస్‌ను వదంతిగా చెప్పారు. ఆయన ఈ మహమ్మారి గురించి ముఖ్యమైన సమాచారం దాచిపెట్టారు. ఆయన దగ్గర ఇప్పటికీ దీన్ని ఎదుర్కోడానికి బలమైన పథకం ఏదీ లేద”ని కమలా హారిస్ సమాధానం ఇచ్చారు.
ఇటు మైక్ పెన్స్ మాత్రం ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని, అవసరమైన చర్యలన్నీ చేపట్టిందని చెప్పారు.
“అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో ఐదు కరోనా కేసులు ఉన్నప్పుడే అమెరికా-చైనా మధ్య అన్ని విమానాలను రద్దు చేశారు. ఆ నిర్ణయాన్ని జో బైడెన్ జెనోఫోబిక్(ఇతర దేశాలపై వ్యతిరేకత ప్రదర్శించడం) అన్నారని చెప్పారు.
కమలా హారిస్ ఆ వాదన నిజం కాదన్నారు. ట్రంప్ ప్రభుత్వం అన్ని ప్రణాళికలు ఫెయిల్ అయ్యాయని, అందుకే దేశంలో రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
అటు, పెన్స్ మాత్రం దేశంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుంటే కరోనా వల్ల 20 లక్షల మంది అమెరికన్ల ప్రాణాలు పోయేవని పెన్స్ చెప్పారు.
ట్రంప్ పాలనపై ప్రజలకు నమ్మకం లేదని కమలా హారిస్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్లు చెప్తే.. అది వేయించుకోవటానికి తాను ముందు వరుసలో నిలబడతానని.. అదే మాట ట్రంప్ చెప్తే తాను వ్యాక్సీన్ వేయించుకోనని ఆమె చెప్పారు.
ఇటు, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేయకూడదని పెన్స్ అన్నారు. వ్యాక్సీన్ మీద నమ్మకం లేదని చెప్పడం సరికాదన్నారు. అమెరికా రికార్డు సమయంలో కరోనా వ్యాక్సీన్‌ను ప్రజల దగ్గరకు చేరుస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, MORRY GASH
ఆరోగ్యం, పారదర్శకత, పన్నులు
ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులు మీరు బహిర్గతం చేస్తారా అని పేజ్ అభ్యర్థులు ఇద్దరినీ అడిగారు.
ఆరోగ్యం, పన్నులకు సంబంధించిన అన్ని పత్రాలనూ బహిరంగం చేయాలనే వాదనకు తాను అనుకూలమేనని కమలా హారిస్ అన్నారు.
అమెరికా చరిత్రలో తన పన్ను చెల్లింపుల సమాచారాన్ని బయటపెట్టని తొలి అధ్యక్షుడు ట్రంపేనని ఆమె ఆరోపించారు.
అటు, అధ్యక్షుడు ట్రంప్ వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఆయన ఆదాయానికి సంబంధించిన మొత్తం సమాచారం ప్రజల చూడవచ్చని పెన్స్ సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, JUSTIN SULLIVAN
అమెరికాకు చైనా ఎంత ముఖ్యం
చైనా గురించి మీ అభిప్రాయం చెప్పాలని పేజ్ అభ్యర్థులు ఇద్దరినీ అడిగారు.
సమాధానంగా చైనా కరోనా మహమ్మారికి కారణం అని, దానికి సంబంధించిన సమచారాన్ని ప్రపంచానికి తెలీకుండా దాచిపెట్టిందని పెన్స్ అన్నారు.
“ట్రంప్ చైనాను ఎదిరించి నిలబడ్డారు. చైనా ప్రయాణాలపై నిషేధం విధించారు. కానీ, జో బైడెన్ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించార”ని చెప్పారు.
అటు, కమలా హారిస్ మాత్రం చైనాతో అమెరికా సంబంధాలు పాడవడం వల్లే దేశంలో చాలా మంది చనిపోయారని అన్నారు. చైనా పట్ల ట్రంప్ విధానాల వల్లే ప్రజల ఉద్యోగాలు పోయాయని, రైతులు దివాలా తీశారని చెప్పారు.
“అధ్యక్షుడు ట్రంప్ చైనాతో ట్రేడ్ వార్‌లో ఓడిపోయారు. ట్రంప్ పదవీకాలం ముగిసేలోపు అమెరికాలో పోయినన్ని ఉద్యోగాలు అంతకు ముందు ఏ అధ్యక్షుడి పదవీకాలంలోనూ జరగలేదని అంచనా వేస్తున్నారు” అన్నారు.
దీనికి సమాధానంగా “జో బైడెన్ కమ్యూనిస్ట్ చైనా చీర్‌లీడర్‌లా పనిచేస్తున్నారని, ఉద్యోగాల కోసం ఆయన చేసిందేమీ లేదని” పెన్స్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
డిబేట్ సమయంలో ట్రంప్ ట్వీట్
డిబేట్ జరుగుతున్నప్పుడు ఆస్పత్రి నుంచి తిరిగొచ్చిన డోనల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా మైక్ పెన్స్ కు తన మద్దతిచ్చారు.
"మైక్ పెన్స్ చాలా బాగా చేస్తున్నావ్. కమలా హారిస్ వాగుడు మెషిన్ మాత్రమే" అని ట్వీట్ చేశారు.
భద్రత, ఉగ్రవాదం
అమెరికా మిత్రదేశాలను వదిలి 'ప్రపంచ నియంత'లకు అండగా నిలుస్తోందని కమలా హ్యారిస్ ఆరోపించారు. ఇంటెలిజెన్స్ విషయంలో మిత్ర దేశాలకంటే ట్రంప్ ఎక్కువగా రష్యా అద్యక్షుడు పుతిన్‌కు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
న్యూక్లియర్ డీల్ నుంచి తప్పుకుని ట్రంప్ అమెరికాను అభద్రతాభావంలో పడేశారన్నారు.
అటు పెన్స్ మాత్రం అమెరికా ఇజ్రాయెల్ విషయంలో తన మాట నిలబెట్టుకుందని, రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు మార్చిందని అన్నారు. అమెరికా నాటోలో కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ భాగస్వామ్యం అందించింది. ట్రంప్ పాలనలో అమెరికా ఐఎస్ లాంటి తీవ్రవాద గ్రూపులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంలో విజయవంతం అయ్యిందన్నారు.
ట్రంప్ పదవిని వీడడానికి నిరాకరిస్తే
ట్రంప్ ఎన్నికల్లో ఓడిన తర్వాత శాంతియుతంగా పదవిని వీడడానికి నిరాకరిస్తే, అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందని సుజాన్ పేజ్ ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా మేం ఎన్నికల్లో గెలుస్తామనే తనకు అనిపిస్తోందని పెన్స్ చెప్పారు.
ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోతే, మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారని కూడా పెన్స్ ను ప్రశ్నించారు. దానికి ఆయన "ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే, మీకొకటి చెప్పాలి.. మీ పార్టీ గత మూడున్నరేళ్లుగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని ప్రయత్నిస్తోంది" అన్నారు.
అటు, కమలా హారిస్ మాత్రం తనపై, బైడెన్‌పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు.
"గత నాలుగేళ్లలో దేశంలో వ్యాపించిన ద్వేషం, వేర్పాటువాదం జో బైడెన్‌ను బాధించింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం వెనుక ప్రధాన కారణం అదే" అన్నారు.
"ప్లీజ్ ఓటు వేయండి, ఓటు వేయడానికి ఒక ప్లాన్‌తో రండి" అని ఆమె కోరారు.
8వ తరగతి విద్యార్థి ప్రశ్న
ఈ చర్చ చివర్లో సుజాన్ పేజ్ అభ్యర్థులు ఇద్దరికీ ఒక 8వ తరగతి విద్యార్థి పంపిన ప్రశ్న అడిగారు.
ఆ విద్యార్థి "మా నేతలే కలిసి నడవకతే, పౌరులు కలిసి ఎలా నడుస్తారని" ప్రశ్నించాడు.
దీనికి పెన్స్ "అమెరికా న్యూస్ చానళ్లలో చూపిస్తున్నట్లు లేదనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. ఇక్కడ అమెరికాలో చర్చించే సమయంలో మా మధ్య అభిప్రాయబేధాలు వస్తాయి. కానీ చర్చ ముగియగానే, మేం అమెరికా పౌరుల్లాగే కలిసిపోతాం" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ సంవాదంలో గెలుపెవరిది?
ఆంథోనీ జుర్చర్, నార్త్ అమెరికా రిపోర్టర్
బుధవారం ఉపాధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, మైక్ పెన్స్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చ భిన్నంగా ఉన్నట్టు అనిపించలేదు. ఇద్దరూ కొన్ని పొరపాట్లు చేశారు, ఈ చర్చలో గుర్తుండిపోయే విషయాలు చాలా కొన్నే ఉన్నాయి.
గత వారం అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చ గట్టిగా అరుచుకోవడం, ఒకరినొకరు షటప్ అని తిట్టుకునే వరకూ వెళ్లింది. కానీ, ఈసారీ గ్లాస్ వెనుక కూర్చున్న ఉపాధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ గత చర్చలను దృష్టిలో ఉంచుకుని వినయపూర్వకంగా మాట్లాడుకున్నారు.
మొదట కరోనావైరస్ అంశంపై జరిగిన చర్చలో కమలా హారిస్ ట్రంప్ ప్రభుత్వంపై దాడికి దిగితే, పెన్స్ ఎక్కువగా రక్షణాత్మకంగా మాట్లాడడంపైనే దృష్టి పెట్టారు. ఇటీవల వైట్‌హౌస్ కరోనావైరస్‌కు హాట్‌స్పాట్ కావడం గురించి చర్చించడానికి అభ్యర్థులు ఇద్దరూ పెద్దగా సమయం వెచ్చించలేదు.
ఉపాధ్యక్ష అభ్యర్థులు ఇద్దరినీ పర్యావరణం అంశంపై జరిగిన చర్చ ఇబ్బంది పెట్టింది. తర్వాత అభ్యర్థుల మధ్య చర్చ మొత్తం జాతివివక్ష, చట్టాల అమలుపై సాగింది.
అమెరికాలోని పలు నగరాల్లో వివక్ష, పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ జరిగిన హింసాత్మక ప్రదర్శనలపై చర్చను గత వారం ట్రంప్ లాగే.. పెన్స్ కూడా త్వరగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తమ నేతలను రక్షించుకోడానికి, ప్రత్యర్థులపై విమర్శలు కురిపించడానికి హారిస్, పెన్స్ తమ వంతు కృషి చేశారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










