శ్మశానంలో చితిపై పెట్టారు, నోట్లో గంగా జలం పోశారు.. ఆ తర్వాత: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో చితికి నిప్పంటించే సమయంలో ఓ వృద్ధుడు కళ్లు తెరిచినట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
దిల్లీ సమీపంలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. అతడు మరణించినట్లు వైద్యులు తప్పుగా ధ్రువీకరించడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
సతీశ్ భరద్వాజ్(62) అనే వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతూ ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. సోమవారం వేకువజామున బాధితుడు తుదిశ్వాస విడిచాడని ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలిపాయి.
ఆయన చనిపోయారని 11 మంది వైద్యులు నిర్ధరించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లారు.
చితికి నిప్పంటించే ముందు నోట్లో గంగాజలం పోశారు. అంతే.. వృద్ధుడిలో ఒక్కసారిగా కదలిక కనిపించింది. ఆయన నెమ్మదిగా కళ్లు తెరిచారు. ఆయన మాట్లాడ్డం కూడా జరిగిందని ఈనాడు చెప్పింది.
ఈ పరిణామంతో అవాక్కైన కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. దిల్లీ పోలీసులకూ సమాచారం అందించారు.
అనంతరం వృద్ధుడిని నరేలాలోని రాజా హరిశ్చంద్ర ఆసుపత్రిలో చేర్చారు. సతీశ్ భరద్వాజ్ బీపీ, గుండె కొట్టుకోవడం సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
మెరుగైన వైద్యం కోసం లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణాలో కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలు
తెలంగాణలో కరెంటు చార్జీలు పెంచడానికి రంగం సిద్ధమైందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
తెలంగాణలో గృహ విద్యుత్తు వినియోగదారులపై (లో టెన్షన్- ఎల్టీ డొమెస్టిక్) యూనిట్‌కు 50 పైసలు పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి.
అలాగే, షాపులు, వ్యాపార సంస్థల వంటి వాణిజ్య వినియోగదారుల (ఎల్టీ కమర్షియల్)పై యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచాలని ప్రతిపాదించాయి.
ఫలితంగా, 1,54,91,171 మందిపై భారం పడనుంది. అలాగే, పరిశ్రమల (హై టెన్షన్- హెచ్‌టీ) వినియోగదారులపై యూనిట్‌కు రూపాయి చొప్పున చార్జీ పెంచాలని నిర్ణయించాయి. ఈ ప్రభావం 13,717 హెచ్‌టీ వినియోగదారులపై పడనుంది.
తాజా ప్రతిపాదనల ద్వారా.. ఎల్టీ వినియోగదారులపై ఏడాదికి రూ.2,110 కోట్లు; హెచ్‌టీ వినియోగదారులపై ఏడాదికి రూ.4,721 కోట్ల మేర చార్జీలు పెంచడానికి డిస్కమ్‌లు సిద్ధమయ్యాయని ఆంధ్రజ్యోతి రాసింది.
ఈ మేరకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ దీనిని ఆమోదిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
నిజానికి, ఈనెల 27వ తేదీలోగా టారిఫ్ ప్రతిపాదనలు దాఖలు చేయకపోతే తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈఆర్సీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
దాంతో, సరిగ్గా గడువుకు చివరి రోజైన సోమవారమే టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, facebook/Sharath Sharu
మిడిల్ క్లాస్ కోసం స్మార్ట్ టౌన్‌షిప్ లే అవుట్లు
పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ఆదాయ వర్గాలు ఇళ్లు కట్టుకోడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్(ఎంఐజీ) లేఅవుట్ల పనులు ప్రారంభమైనట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
మార్కెట్ ధర కంటే తక్కువకు ప్లాట్లను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ అధికారులు లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణాల్లో లే అవుట్లను వేసి, డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు.
వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, గుంటూరు, ఏలూరు అర్బన్ అథారిటీ పరిధిలో మరికొన్ని లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు.
ఇవి వివిధ దశల్లో ఉన్నట్టు ఎంఐజీ ప్రాజెక్టు ఎండీ పి.బసంత్ కుమార్ సోమవారం 'సాక్షి'కి తెలిపారని పత్రిక చెప్పింది.
తొలివిడతలో వీటన్నింటినీ సిద్ధం చేసి..సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. అంతకు ముందే ప్లాట్ల బుకింగ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో జనవరి 3 నుంచి టీనేజర్లకు టీకా
దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి టీనేజర్లకు కరోనా వ్యాక్సీన్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైనట్లు వెలుగు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఆధార్ ఇతర ధ్రువ పత్రాలు లేని పిల్లలు స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి పేరు నమోదు చేసుకునే వెసలుబాటు కల్పించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ప్రకటించారు.
ఈ మేరకు కోవిన్ యాప్, వెబ్ సైట్లలో మార్పులు చేసినట్లు చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
పిల్లలకు భారత్ బయోటెక్ అందుబాటులోకి తెచ్చిన కోవాగ్జిన్ లేదా జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్ డీ వ్యాక్సిన్ లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారని పత్రిక రాసింది.
హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు బూస్టర్ డోస్ ఇచ్చే అంశంపైనా కేంద్రం స్పష్టతనిచ్చింది. 9 నెలలకు ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది.
దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుందని పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- జేమ్స్ వెబ్: అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయిన అతి పెద్ద టెలిస్కోప్
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








