హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి: వంద రూపాయల కోసం ప్రాణం తీసిన వార్డ్‌బాయ్ - ప్రెస్ రివ్యూ

నిలోఫర్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, fb/Bushra Alvi Razzack

వంద రూపాయలకు కక్కుర్తిపడిన వార్డుబాయ్ ఆక్సిజన్ పైపును వేరేవారికి మార్చడంతో మూడున్నరేళ్ల బాలుడు చనిపోయాడంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. మొదట ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ రెండు మూడు రోజులకే రెండు లక్షల బిల్లు అయ్యింది. అంతకన్నా ఖర్చులు భరించే స్థోమత లేక తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు.

బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం బాలుడికి స్కానింగ్ తీయించాల్సి ఉంది. అక్కడికి తీసుకెళ్లడానికి ఆక్సిజన్ సిలిండర్‌ను సమకూర్చాల్సి ఉంది.

ఆ లోగానే ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వార్డుబాయ్ సుభాష్ ఆ బాలుడికి పెట్టిన ఆక్సిజన్ పైపును తీసి పక్క బెడ్‌పై ఉన్న రోగికి అమర్చాడు. వారి వద్ద వంద రూపాయలు తీసుకుని ఈ పని చేశాడు.

దీంతో కొద్ది క్షణాల్లోనే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. బాధిత కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే ఆ చిన్నారి తుది శ్వాస విడిచాడు.

ఆగ్రహించిన బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ.. సిబ్బంది తీరు, వైద్యుల నిర్ర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ వార్డుబాయ్ సుభాష్‌ను సస్పెండ్ చేశారు.

ఉరి

ఫొటో సోర్స్, Getty Images

భర్తకు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఉరేసుకున్న భార్య

కాపురానికి తీసుకెళ్లడం లేదని మనస్తాపం చెందిన భార్య.. భర్తకు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఉరేసుకుందని దిశ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా మదనపల్లె టూటౌన్ పీఎస్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా బాబే నాయక్ తండాకు చెందిన చక్రే నాయక్, కమలమ్మ దంపతుల కుమార్తె రమ్యశ్రీని కర్ణాటకకు చెందిన చందునాయక్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి 11 నెలల కుమార్తె ఉంది.

అయితే, దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో భర్తపై అలిగిన రమ్యశ్రీ పుట్టింటికి వచ్చేసింది.

తనను వచ్చి కాపురానికి తీసుకెళ్లాలని భర్తను కోరింది. కానీ చందు నాయక్ మాత్రం స్పందించలేదు.

రమ్యశ్రీ శుక్రవారం కూడా భర్తకు వీడియో కాల్ చేసింది. తనను తీసుకెళ్లాలని కోరింది. అయినప్పటికీ చందునాయక్ నుంచి జవాబు రాలేదు. దీంతో వీడియో కాల్‌లోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అల్లుడి వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని రమ్యశ్రీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంకయ్య నాయుడు

ఫొటో సోర్స్, fb/Vice President of India

ఉచితాలతో ఒరిగేదేం లేదు - వెంకయ్యనాయుడు

ఉచిత పథకాలు, తాత్కాలిక జనాకర్షక పథకాల వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరగదని, దీర్ఘకాలికంగా చేయూతనందించే పథకాలకు రూపకల్పన జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

రైతులకు ఉచితవిద్యుత్‌తో పనిలేదని, నిరాటంకంగా 10గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తే చాలన్నారు. 'రైతునేస్తం' మాసపత్రిక 17వ వార్షికోత్పవం సందర్భంగా ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం వెంకయ్యనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

రైతులకు అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలిచి, చేయూతనందించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. పట్టభద్రులైన యువత వ్యవసాయ రంగం వైపు మళ్లాలన్నారు. రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తికాదని, వారి జీవితమన్న ఆయన, కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరువలేనిదన్నారు.

రసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించి పర్యావరణహిత వ్యవసాయ విధానాలపై రైతులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. సేంద్రియ పంట ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని, ప్రతి రైతు తమ కమతాల్లో కొంతభాగాన్ని ఆర్గానిక్‌ వ్యవసాయ పంటలు పండించేందుకు కేటాయించాలని సూచించారు.

వ్యవసాయరంగంలో ఆధునిక, సాంకేతికత అభివృద్ధి, వాణిజ్య, మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు సంస్థలూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

జగ్గారెడ్డి

ఫొటో సోర్స్, fb/Varala Kireeti S.k

రెండు రాష్ట్రాలు కలుపుతానంటే కేసీఆర్‌కు మద్దతిస్తా - జగ్గారెడ్డి

ఏపీ, తెలంగాణాలను కలుపుతానంటే తాను కేసీఆర్‌కు మద్దతిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారని వెలుగు దినపత్రిక ఒక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య వాదం వినిపించారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని చెప్పారు. ఉద్యమ సమయంలోనూ తాను సమైక్యవాదాన్నే వినిపించానని, అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. సమైక్యం.. తన వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదని ఆయన చెప్పారు.

ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు జగ్గారెడ్డి. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, తన వ్యక్తిగత అభిప్రాయం వేరన్నారు.

ప్రజల ఆలోచన మేరకే వెళ్తా.. ఏ ప్రాంతానికీ నేను వ్యతిరేకం కాదన్నారు. ఇది ప్రజల డిమాండ్‌ కాదు..నాయకుల అభిప్రాయం మాత్రమే అని ఆయన అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. కానీ, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. గతంలో నేను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని జగ్గారెడ్డి అన్నారు.

'ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.. పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్ని కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారు. సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలను నేను తప్పుపట్టను.. ఎవరి అభిప్రాయాలు వారివి' అని జగ్గారెడ్డి అన్నట్లు వెలుగు దినపత్రిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)