తెలంగాణ: 50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణ మాఫీ - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ఆరు లక్షలమంది అన్నదాతలకు రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు దీనిని పూర్తి చేయాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 నుంచి మూడు లక్షలమంది రైతులకు రూ. 25 వేల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
తాజాగా రూ. 50 వేల లోపు రుణాలను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీని ద్వారా మొత్తం తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ వర్తించినట్లవుతుందని, మిగిలిన వారికి దశలవారీగా వర్తింపజేస్తామని తెలిపారు.
గిరాకీ దృష్ట్యా పత్తి సాగు పెంచాలని, రైతాంగాన్ని సమాయత్తం చేయాలని వ్యవసాయాధికారులకు మంత్రిమండలి సూచించింది.
రాష్ట్రంలో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ కోటా అమలుకు తీర్మానించింది. దీని కింద విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పొందేందుకు వార్షికాదాయ పరిమితి రూ. 8 లక్షల లోపు ఉండాలని.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని ధోబీ ఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది’’అని ఈనాడు తెలిపింది.

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..70 గేట్లు ఎత్తివేత
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తుతుందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై 70 గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కులు సముద్రంలోకి నీటిని విడుదల చేశారు.
కాలువలకు కూడా 6వేల క్యూసెక్కుల నీరును విడుదల చేశారు.
ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 52000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 45000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Facebook/KaushikReddy
నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తూ గవర్నర్‌కు సిఫారసులు పంపారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో ఉంటూనే టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నట్లు ఆయన కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో రికార్డింగులు వెలుగులోకి రావడంతో ఆయనే హుజూరాబాద్ అభ్యర్థి అన్న ప్రచారం జోరుగా సాగింది.
వరుసగా రెండు ఆడియోలు బయటపడిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించి చర్యలకు ఉపక్రమించగా ఆయనే పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా.. ? లేదా.. ? అన్న చర్చ కొనసాగుతున్న తరుణంలో ఆయనను ఎమ్మెల్సీగా పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది’’అని వెలుగు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
విద్యుత్ కొనుగోళ్లలో రోజుకు రూ.కోటి ఆదా చేస్తూ ఏపీ రికార్డు
చౌక విద్యుత్ కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ రికార్డు నమోదు చేసిందని సాక్షి తెలిపింది.
‘‘2021–22 తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో రూ. 95 కోట్ల మేర ఆదా చేసింది. అంటే రోజుకు రూ.కోటి వరకు ఇంధన కొనుగోళ్లలో ఆదా అయింది.
గత రెండేళ్లలో కూడా విద్యుత్ కొనుగోళ్లలో ఇప్పటికే రూ.2,342.45 కోట్లు మిగిల్చింది. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం తగ్గనుంది. అంతిమంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ఉపశమనం లభించనుంది.
నిర్వహణ వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకుని ప్రజలపై విద్యుత్ భారాన్ని నివారించే చర్యలపై దృష్టిపెడతున్నట్లు అధికారులు తెలిపారు’’అని సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మాన్యువల్ స్కావెంజింగ్: మురుగునీరు శుభ్రం చేస్తూ ఎవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెబుతోంది?
- స్పైవేర్లు ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితాన్ని శాసించేంతగా ఎలా విస్తరిస్తున్నాయి? -డిజిహబ్
- పెట్రోల్ మీద ఎక్కువ టాక్స్ వసూలు చేస్తోంది కేంద్రమా, రాష్ట్రమా? - BBC FactCheck
- పెగాసస్: గూఢచర్య ఆరోపణలపై చర్చలను మోదీ ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది?
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








