వెలిగొండ మొదటి టన్నెల్‌లోకి కృష్ణా నీరు ఎలా వచ్చింది? అధికారులేం చెబుతున్నారు?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రకాశం జిల్లా వాసుల సాగు, తాగు నీటి సమస్యలను తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం రెండున్నర దశాబ్దాల క్రితమే ప్రారంభమయ్యింది.
అయితే, వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదు. చివరకు రెండు టన్నెల్స్‌లో మొదటి టన్నెల్ పూర్తికావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి.
త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టుకి కృష్ణా జలాలు చేరితే వాటి ద్వారా ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కడప జిల్లాకి చెందిన బద్వేలు ప్రాంతానికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో అనూహ్యంగా మొదటి టన్నెల్ గుండా కృష్ణా నీరు ప్రవహించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపుగా ట్రయల్ రన్‌తో సమానంగా ఇది ఉందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

కృష్ణా జలం టన్నెల్‌లోకి ఎలా వచ్చింది?
శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ను కొల్లం వాగు నుంచి టన్నెల్‌కి తరలించి, అక్కడి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా రిజర్వాయర్‌లోకి మళ్లించాలనేది అసలు లక్ష్యం.
దానికి అనుగుణంగా 18.8 కిలోమీటర్ల పొడవున్న రెండు టన్నెల్స్ నిర్మాణం ప్రారంభించారు.
సరిగ్గా 25 ఏళ్లకు వెలిగొండ ప్రాజెక్టులో కీలక భాగమయిన టన్నెల్స్‌లో ఒకటి సిద్ధమయ్యింది. రెండో టన్నెల్ పనులు ఇంకా సాగుతున్నాయి.ప్రస్తుతం పూర్తయిన మొదటి టన్నెల్ ద్వారా 10.7 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుగుణంగా నిర్మాణం చేశారు. 7 మీటర్ల వ్యాసం గల ఈ టన్నెల్ ద్వారా 45 రోజుల పాటు నీటిని తరలించవచ్చని లెక్కలేస్తున్నారు.
కొల్లం వాగు దగ్గర హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేసి దాని నుంచి నీటిని టన్నెల్‌లోకి వదులుతారు.
కానీ అనూహ్యంగా ఈనెల 24వ తేదీన హెడ్ వర్క్స్ దగ్గర లీకేజీ కారణంగా సుమారు వెయ్యి క్యూసెక్కుల వరకు కృష్ణా జలం టన్నెల్‌లోకి ప్రవేశించింది.
అక్కడి నుంచి టన్నెల్ నిండుగా ప్రవాహం సాగి, కాలువల వరకూ చేరింది. అయితే అక్కడ కాలువలను, టన్నెల్‌కి కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీరు మొత్తం నిలిచిపోయింది.
దాంతో 25వ తేదీ నాటికి వెలిగొండ టన్నెల్ ముఖద్వారం వద్ద ఉన్న లోకోలు సహా వివిధ యంత్రాలన్నీ జలమయమయ్యాయి.

ఫొటో సోర్స్, EE, veligonda
అప్రమత్తమయిన యంత్రాంగం
ప్రమాదవశాత్తు కొల్లంవాగు నుంచి వెలిగొండ టన్నెల్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీ కూడా విశాఖ నుంచి ప్రత్యేక బృందాన్ని వెలిగొండకు తరలించింది. హుటాహుటిన కృష్ణా నది ద్వారా హెడ్ వర్క్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నదిలోకి దిగిన బృందాలు 26వ తేదీ నాటికి లీకేజీని నియంత్రించాయి.
ఇక ముఖద్వారం వద్ద నిలిచిన నీటిని ప్రత్యేక పంపుల ద్వారా తరలించారు. వాటిని తరలించేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేయడంతో రెండు రోజుల తర్వాత 28 నాటికి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురాగలిగారు.
అప్పటికే కొంత యంత్ర సామాగ్రి నీటి పాలుకావడంతో కాంట్రాక్ట్ సంస్థ నష్టం చవిచూడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, EE, veligonda
తొలిసారిగా నీటి ప్రవాహంతో స్థానికుల ఆనందం
ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న వారికి వెలిగొండ నుంచి కృష్ణా జలం వచ్చిందని తెలియడం సంతోషాన్ని నింపింది.
కొందరు స్థానికులు వెలిగొండ టన్నెల్ ముఖద్వారం వద్దకు చేరుకుని పూజలు కూడా చేశారు.
వెలిగొండ టన్నెల్ లీకయ్యిందంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలతో కూడిన ప్రచారం సాగడంతో నిర్వాసితులు కొంత ఆందోళనకు గురయ్యారని స్థానికుడు ఎం జగదీష్ బీబీసీతో అన్నారు.
"వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ పూర్తిగా ఇవ్వలేదు. వైఎస్సార్ ఉన్న సమయంలో ఎకరాకి రూ. 50 వేల చొప్పున ఇచ్చారు. ప్రస్తుతం దానిని రూ. 15లక్షల వరకూ ఇస్తామని అధికార పార్టీ నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు చివరకు రూ. 11లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
కానీ బడ్జెట్ లేదనే పేరుతో అది దశల వారీగా చెల్లిస్తామని చెబుతున్నారు. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఈలోగా ఒక్కసారిగా వరద నీరు వచ్చేస్తోంది.. వెలిగొండ లీక్ అయిపోయిందంటూ రకరకాల ప్రచారాలు రావడంతో అంతా ఆందోళన చెందాము. ప్రస్తుతం అంతా సద్దుమణిగిందని చెబుతున్నారు. త్వరగా పునరావాస ప్యాకేజీ అమలు చేసేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు.

ఎప్పటికి ప్రారంభిస్తారు?
వెలిగొండ టన్నెల్స్‌లో మొదటిది సిద్ధం కావడంతో ఈ సీజన్‌లోనే నీటిని వదులుతారని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. కానీ పునరావాసం పూర్తిగా చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో జాప్యం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ దాదాపుగా ప్రస్తుతం టన్నెల్ పొడవునా నీటి ప్రవాహం సాగడంతో దాదాపుగా ట్రయల్ రన్ పూర్తయ్యిందనే అభిప్రాయం అధికారుల్లో ఉంది.
ఇక డిసెంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మాత్రమే వెలిగొండకు నీటిని అందించే అవకాశం కనిపిస్తోంది.
వాస్తవంగా ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా కనిపిస్తోంది. గురువారం ఉదయానికే సుమారుగా 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నమోదయ్యింది. రిజర్వాయర్ నీటిమట్టం 884 అడుగులకు చేరింది.
దాంతో వెలిగొండ ద్వారా నీటిని తరలించడానికి అన్ని రకాలుగానూ ఆస్కారం ఉంది. అయినప్పటికీ సాంకేతిక కారణాలు, ఆర్థిక పరిస్థితి రీత్యా వచ్చే ఏడాది మాత్రమే వెలిగొండలో కృష్ణా జలాలను చూసే అవకాశం కనిపిస్తోంది.

'వెలిగొండను గెజిట్‌లో చేర్చాలి'
ఇటీవల కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య వివాదం రాజుకుంది. దానికి పరిష్కారమార్గంగా మొత్తం కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
దానికోసం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో వెలిగొండను అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. కానీ వాస్తవానికి వెలిగొండ ప్రాజెక్టుకి 2005లోనే అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు తీసుకున్న తర్వాతే 2008లో టన్నెల్స్ నిర్మాణం కూడా మొదలయ్యింది.
అయితే అనుమతులతో కూడిన వెలిగొండ ప్రాజెక్టు విషయం గెజిట్‌లో చేర్చాలని ఇటీవల ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసులరెడ్డి కూడా కేంద్ర జలశక్తిమంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.
ఏపీ ప్రభుత్వం తరుపున కూడా ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ సి నారాయణ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టు మొదటి టన్నెల్ ప్రారంభించాలన్నా దానికి ముందుగా కేంద్రం ఈ ప్రాజెక్టుని గెజిట్‌లో చేర్చాల్సి ఉంటుంది. లేదంటే అక్టోబర్ 14 తర్వాత కేఆర్ఎంబీ పరిధిలోకి రాబోతున్న నేపథ్యంలో వెలిగొండ విషయం అస్పష్టంగా ఉండిపోయే ప్రమాదం ఉంటుంది.
చిన్న ప్రమాదమే, వెంటనే చక్కదిద్దాం
టన్నెల్లోకి వరద నీరు చేరిన విషయం చాలా చిన్నదని, నష్టం పెద్దగా ఉండదని ప్రాజెక్టు ఈఈ అలీ తెలిపారు. సహజంగా పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నారు.
"హెడ్ రెగ్యులేటర్ వద్ద లీకులు వచ్చాయని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నాం. దాంతో సమస్య త్వరగా పరిష్కారం అయ్యింది. ఇప్పుడంతా సాధారణ స్థితికి వచ్చింది. శనివారం నాటికి తిరిగి మళ్లీ లోకోలను టన్నెల్‌లోకి పంపిస్తాం. రెండో టన్నెల్ పనులు కూడా చేపడతాం. వారం పాటు పనులకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ పెద్ద నష్టం లేకుండా బయటపడ్డాం" అంటూ ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- వెలిగొండ: మొదటి టన్నెల్ పూర్తవడంతో చిగురిస్తున్న ఆశలు... ప్రకాశం జిల్లాలోని ఈ ప్రాజెక్టు ఎక్కడివరకు వచ్చింది?
- ఆంధ్రప్రదేశ్ రాజధాని: 'దక్షిణాఫ్రికా మోడల్ ఏపీకి పనికిరాదు, మనమే కొత్త మోడల్ చూసుకోవాలి'- ఈఏఎస్ శర్మ
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- గిరుల మీది గంగను ఊరికి తరలించిన గిరిజనులు!
- హవ్వా.. అంత్యక్రియల్లో అర్ధ నగ్న నృత్యాలా..!
- వైష్ణవి సన్నాయి పడితే.. వీనుల విందే
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- వివాహేతర సంబంధాల్లో ‘ఆమె’ను ఎందుకు శిక్షించరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









