ఏపీ హైకోర్టు: 'ప్రభుత్వానికి ఇంత మంది సలహాదారులా' - ప్రెస్‌రివ్యూ

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40 మందిని నియమించుకోవడం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్షల్లో వారికి పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా?'

సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు కూడా లేవు. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడేవారు కారని, ఇప్పుడు కొందరు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు... ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడానికే మీడియా ముందుకు వచ్చారు’’అని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ఈనాడు తెలిపింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గురువారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, ఎస్‌ఈసీ నీలం సాహ్ని తరఫు వాదనల కోసం విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.

స్వేరోస్ ప్రవీణ్ కుమార్

ఫొటో సోర్స్, Twitter/Dr.RSPraveenKumar

దళిత సీఎం పేరిట మోసం: ప్రవీణ్ కుమార్

ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. గతంలో ఇక్కడి ప్రజలను మోసగించారని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వొద్దని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు.

సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం రాత్రి వివిధ సంఘాల ఆధ్వ ర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉప ఎన్నిక ఉన్నందునే హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు కేటాయించారని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలకు ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బానిస బతుకులు మారాలని, బీరు, బిర్యానీలకు ఓట్లు వేసే కాలం పోవాలనే తాను ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజా సేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదులుకున్నానని, ఎవరికీ అమ్ముడుపోకుండా.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ప్రకటించారు’’ అని ప్రవీణ్‌కుమార్‌ అన్నట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

తెలంగాణలో 60 శాతం మందిలో యాంటీబాడీలు

కరోనా యాంటీ బాడీలు ఎంతమందిలో ఉన్నాయో తెల్సుకునేందుకు... తెలంగాణలో ఇటీవల ICMR- NIN సంస్థలు కలిసి చేసిన సీరో సర్వే ఫలితాలు వచ్చాయని వెలుగు దినపత్రిక ఓ కథనంలో తెలిపింది.

‘‘సర్వే చేసిన ఏరియాల్లో సగటున 60% మందిలో యాంటీ బాడీలు గుర్తించినట్టు ప్రకటించారు.

చిన్నారుల్లో 55%, పెద్ద వారిలో 61 % మందిలో యాంటీ బాడీలను గుర్తించారు. హెల్త్ కేర్ వర్కర్ లలో 82.4 % మందిలో కరోనా యాంటీ బాడీలున్నట్టు సర్వే తేల్చింది. ఇప్పటికే మూడు సార్లు రాష్ట్రంలో సీరో సర్వే జరిగింది. జూన్‌లో నాలుగో విడత సర్వే చేశారు. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేశారు.

గతేడాది మొదటి సారి కేవలం 0.33%, రెండోసారి 12.5%, మూడోసారి 24.1 % మందిలో యాంటీ బాడీలను గుర్తించారు. ఆరు నెలల తర్వాత.. మొన్నటి జూన్‌లో.. సెకండ్ వేవ్ ముగిశాక సర్వే జరిపారు.

ఈ సర్వేలో.. 60.09శాతం మందికి యాంటీబాడీలు వచ్చినట్టు అధికారులు తెలిపారు’’అని వెలుగు పేర్కొంది.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/ysjagan

16 మంది ఐఏఎస్‌ల బదిలీ

16 మంది ఐఏఎస్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్సార్, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లా కలెక్టర్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు.

పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్లను బదిలీ చేశారు. దేవదాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా పని చేస్తోన్న పి.అర్జునరావును ఏపీ స్టేట్‌ హ్యాండ్‌ లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా నియమించారు.

దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తోన్న జి.వాణీమోహన్‌ను దేవదాయ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు’’అని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)