కరోనావైరస్: 45 ఏళ్లు దాటినవారికీ వ్యాక్సినేషన్ ప్రారంభం.. ఈ వేగం సరిపోతుందా

కరోనావైరస్ వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, EPA

భారత్‌లో మూడో దశ కరోనావైరస్ వ్యాక్సినేషన్ మొదలైంది. 45ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకోవచ్చు.

భారత్‌లో ఇప్పటివరకు 6.5 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను ప్రజలకు ఇచ్చారు. ఫ్రంట్ లైన్ సిబ్బంది, 60ఏళ్లు పైబడిన వారికి తొలి దశల్లో వ్యాక్సీన్లు ఇచ్చారు.

జులైనాటికి 25 కోట్ల మందికి వ్యాక్సీన్లు ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ భారత్‌లో ప్రారంభమైంది.

కరోనావైరస్ వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Mansi Thapliyal

భారత్‌లో జనవరిలో వ్యాక్సీన్ల పంపిణీ మొదలైనప్పుడు కేసులు తక్కువగా ఉండేవి. రోజువారీ కేసులు 15,000 కంటే తక్కువగా నమోదయ్యేవి. కానీ మార్చిలో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. టెస్టులు సరిగాచేసి రోగులను క్వారంటైన్ చేయడంలో నిర్లక్ష్యం, నిబంధనలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయి.

బుధవారం ఒక్కరోజే 72,019 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 457 మంది ప్రాణాలు కోల్పోయారు. గత డిసెంబరు నుంచి ఒక రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.

కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి భారత్‌లో 11.7 మిలియన్లకుపైనే కేసులు నమోదు అయ్యాయి. 1,60,000 మరణాలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.

కోవిడ్ వ్యాక్సినేషన్

వ్యాక్సినేషన్ ఎలా సాగుతోంది?

జనవరి 16న భారత్‌లో వ్యాక్సినేషన్ మొదలైంది. తొలి దశల్లో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సీన్లు ఇచ్చారు. భారత్‌లో తొలి వ్యాక్సీన్‌ను పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చారు.

మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సీన్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

కరోనావైరస్ వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Mansi Thapliyal

ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, దేశీయ సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాలకు భారత ఔషధ ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. మరికొన్ని టీకాలు కూడా ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.

ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసులను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది. ఇటీవల ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఎగుమతులపై కూడా నిలుపుదల ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యాక్సీన్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తోంది.

''కేసులు పెరుగుతున్నాయంటే, దేశంలో వ్యాక్సినేషన్‌ను కూడా వేగవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి మరిన్ని టీకాలు అవసరం అవుతాయి''అని భారత విదేశాంగ శాఖలోని వర్గాలు బీబీసీకి తెలిపాయి.

అన్ని దేశాలకూ వ్యాక్సీన్లు అందజేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేపడుతున్న కోవాక్స్ కార్యక్రమానికి ఇప్పటివరకు భారత్ 60 మిలియన్ డోసులను అందించింది. వీటిలో ఎక్కువ శాతం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాలే ఉన్నాయి.

వ్యాక్సీనేషన్

ఎంత మందికి వ్యాక్సీన్లు ఇచ్చారు?

ఇప్పటివరకు 65 మిలియన్ డోసులకుపైనే కరోనావైరస్ వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చారు. గత 24 గంటల్లో రెండు మిలియన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మొత్తంగా 56 మిలియన్ల మంది తొలి డోసు తీసుకున్నారు. తొమ్మిది మిలియన్ల మంది రెండు డోసులనూ తీసుకున్నారు.

ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాలను దశాబ్దాల తరబడి భారత్ నడిపిస్తోంది. నవజాత శిశువులు, గర్భిణులకు మిలియన్ల సంఖ్యలో వ్యాక్సీన్లు వేస్తోంది.

వ్యాక్సీన్ల పంపిణీలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ మెరుగ్గా టీకాలు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వ్యాక్సీన్ల పంపిణీ ఊహించిన స్థాయిలో జరగడం లేదు. వ్యాక్సీన్లపై అనుమానాలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమే దీనికి ప్రధాన కారణం.

వ్యాక్సీన్లకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చాలా మంది పేదలకు తెలియడం లేదు. ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించడం తెలియని వారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పెద్ద సవాల్‌గా మారుతోంది.

వ్యాక్సీనేషన్

''పేద ప్రజలు, కార్మికులకు అర్థమయ్యేలా పెద్దగా ఎలాంటి ప్రచారాలు చేపట్టడం లేదు''అని ప్రజారోగ్య నిపుణురాలు రాధా ఖాన్ చెప్పారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 1న వ్యాక్సీన్ తీసుకున్నారు. దేశీయ వ్యాక్సీన్ కోవాగ్జిన్‌ను ఆయన తీసుకున్నారు.

తమ వంతు వచ్చినప్పుడు, అందరూ వ్యాక్సీన్లు వేసుకోవాలని ఆయన అభ్యర్థించారు.

జులై నాటికి ప్రాధాన్య వర్గాలుగా గుర్తించిన 25 కోట్ల మందికి 50 కోట్ల డోసులను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.

వ్యాక్సీన్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు యాప్‌ల ద్వారా ఇప్పటివరకు 5.6 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది వ్యాక్సీన్లు తీసుకున్నారు. దీనికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు.

కరోనావైరస్ వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, EPA

వ్యాక్సీన్ల ఖర్చు ఎవరు భరిస్తున్నారు?

వ్యాక్సీన్ తీసుకోవడం తప్పనిసరికాదు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగానే ఈ వ్యాక్సీన్లు ఇస్తున్నాయి. ప్రైవేటు క్లీనిక్‌లలో రూ.250 చెల్లించి వ్యాక్సీన్ తీసుకోవచ్చు.

ఆసుపత్రులు, ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచిత వ్యాక్సినేషన్ కోసం కేంద్రం 5 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది.

కరోనావైరస్ వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, MaNSI THAPLIYAL

ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయా?

వ్యాక్సీన్లు వేసుకున్న తర్వాత కొందరిలో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు భారత్‌లో 34ఏళ్లనాటి పటిష్ఠమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు గుర్తించి, అవగాహన కల్పించకపోతే ప్రజల్లో భయాందోళనలు పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫిబ్రవరి వరకు 8,483 మందిలో దుష్ప్రభావాలు కనిపించినట్లు భారత్ తెలిపింది. వీటిలో చాలా వరకు తీవ్రత తక్కువగా ఉండే ఆందోళన, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని వివరించింది.

తీవ్రమైన దుష్ప్రభావాలు 412 మందిలో కనిపించాయని, వీటిలో 79 మంది మరణించారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

హృద్రోగాలు, రక్తపోటు, మధుమేహం తదితర అనారోగ్యాలుండే వారి విషయంలోనే ఈ మరణాలు సంభవించాయని విచారణల్లో తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)