న్యూ ఇయర్: తెలంగాణలో రాత్రి ఒంటి గంట వరకు బార్లు ఓపెన్ - ప్రెస్‌రివ్యూ

మద్యపానం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బార్లు, క్లబ్బులకు, వైన్ షాపులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని వెలుగు దినపత్రిక తెలిపింది.

‘‘డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో బార్లు, క్ల‌బ్బులు రాత్రి ఒంటిగంట వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అదేవిధంగా…అర్థరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని తెలిపింది.

అయితే… తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింద’’ని ఆ కథనంలో రాశారు..

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/ysjagan

సీజేఐకి రాసిన లేఖతో జగన్‌కు అనుచిత లబ్ధి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ద్వారా అనుచిత లబ్ధి పొందడంలో ముఖ్యమంత్రి జగన్‌ విజయవంతమయ్యారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యానించారని ఈనాడు తెలిపింది.

‘ఆ లేఖ వల్ల ఏపీ సీఎం అంతిమంగా ఊరట పొందుతారో లేదో తెలీదు గానీ.. దాని వల్లే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగిందని ప్రజలు భావించే అవకాశముంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వైదొలగాలంటూ.. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.

హైకోర్టుపైనా, న్యాయమూర్తులపైనా సామాజిక మాధ్యమాల్లో అశ్లీల, అనుచిత వ్యాఖ్యలు ప్రచారం చేయడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో.. సీఎం రాసిన లేఖను అక్టోబరు 10న సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం మీడియాకి వెల్లడించారని, కొద్దిసేపట్లోనే ఆ సమాచారం దావానలంలా వ్యాపించిందని జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడం వల్ల సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌పై కేసుల విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని, వాటిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణకూ అవరోధం ఏర్పడవచ్చని జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

జగన్ లేఖ

‘ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ వల్లా ముఖ్యమంత్రికి అనుచిత లబ్ధి చేకూరుతుంది. మూడు రాజధానులు ఆయన మానస పుత్రిక అని అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణానికి పేద రైతులు భూములిస్తే... 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక దాన్ని నిలిపివేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్‌బెంచ్‌ నెల రోజులకు పైగా తుది విచారణ జరిపింది. సీఎం లేఖ తర్వాత జస్టిస్‌ మహేశ్వరిని బదిలీ చేయడంతో విచారణ నిలిచిపోయింది. కొత్త బెంచ్‌ వేయడానికి కొంత సమయం పడుతుంది. విచారణ మొదటి నుంచీ ప్రారంభించాల్సి రావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

‘ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీల్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ అలాంటి నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు కొలీజియంలోని సభ్యుల మాదిరిగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారే’ అని రాకేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

మూడు రాజధానులకు అనుగుణంగా శాసనసభలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించనందుకు ఏకంగా శాసనమండలి రద్దుకే సిఫారసు చేసిన ఏకైక ప్రభుత్వం ఇదే కావచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయనందుకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నూ వాళ్లు విడిచి పెట్టలేదన్నారు. ఆ రెండు వ్యవస్థల్నీ దెబ్బతీయడంలో కొంత విజయం సాధించాక ఇప్పుడు హైకోర్టుపై పడ్డారని రాకేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఖైదీ నం.6093 అని కొడితే దిగ్భ్రాంతిగొలిపే వాస్తవాలు

‘ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. గూగుల్‌లో ఖైదీ నంబర్‌ 6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని ఎవరో చెప్పారు. నేను అలా చేసేసరికి దిగ్భ్రాంతి కలిగించే సమాచారం లభించింది. నేను డౌన్‌లోడ్‌ చేసిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆ తర్వాత కొంత సాధికారిక సమాచారం తెప్పించుకున్నాను. జగన్‌పై 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు, ఐపీసీ సెక్షన్‌ కింద నమోదు చేసిన మరో 18 కేసులు ఉన్నట్టు తెలిసింది (ఆ జాబితాలను పొందుపరిచారు). ఆ కేసులన్నీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒకరోజు వాటిలో కొన్ని తప్పుడు కేసులని, వాస్తవాల నమోదులో పొరపాటు జరిగిందని, చర్యలు నిలిపివేశామన్న కారణాలతో పోలీసులు వాటిని మూసేశారు. డీజీపీ సారథ్యంలోని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ కనునసన్నల్లో ఎలా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు.

వ్యాక్సీన్‌

ఫొటో సోర్స్, GETTY IMAGES

జ్వరముంటే కరోనా వ్యాక్సిన్‌ వద్దు

జ్వరమున్నప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోకూడదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసినట్లు దినపత్రిక తెలిపింది.

వ్యాక్సిన్‌ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వేసేప్పుడు వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు దాదాపు 10 కోట్ల డోసులను కూడా సిద్ధం చేశాయి. వచ్చే నెలాఖరులోగా వాటిని నిర్దేశిత ప్రజ లకు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యాక్సిన్‌ వేసేప్పుడు వైద్య సిబ్బంది టీకా తీసుకునే వారి వివరాలు సేకరించాలని సర్కార్‌ స్పష్టం చేసింది. అలాగే తీసుకునే వ్యక్తులు కూడా ముందే తమకున్న ఆరోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించింది.

జ్వరముందా? ఏవైనా అలర్జీలున్నాయా? రక్తస్రావం, రక్తం పలుచన వంటి సమస్యలున్నాయా? ఇతరత్రా మందుల వల్ల వారి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపినట్లుందా? గర్భిణీయా? ప్రెగ్నెన్సీకి ఏవైనా ప్లాన్‌ చేస్తున్నారా? ఇతర కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొని ఉన్నారా... వంటి పూర్తి వివరాలను తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

ఇటువంటి వారుంటే తాత్కాలికంగా వారికి వ్యాక్సిన్‌ నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. జ్వరమున్న వారికి తగ్గిన తర్వాత టీకా వేస్తారు. ఇతర అలర్జీలున్న వారికి అవి తగ్గిన తర్వాత వేయాలా లేదా వైద్యులు సూచిస్తారు. అంతేకాదు మొదటి డోసులో తీవ్రమైన అలర్జీ తలెత్తిన వారికి తదుపరి డోసు ఇవ్వకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

ఆరోగ్య శ్రీ ట్రస్టు భవనం

ఫొటో సోర్స్, Aarogyasri-Telangana/FACEBOOK

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యాలయం

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్ర శ్రీ అనుసంధానం

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియజేశారు.

ప్రధాని మోదీ అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి, ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జల్‌జీవన్‌ మిషన్‌ పథకాలపై సమీక్షించారు.

తెలంగాణ రాష్ట్రం మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గృహాలకు సురక్షితమైన నీటిని అందిస్తున్నదని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రధానికి తెలిపారు. రాష్ట్రంలో 98.5శాతం గృహాలకు సురక్షితమైన తాగునీరు అందుతున్న విషయాన్ని కేంద్రం గుర్తించిందని చెప్పారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)