హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్' మీద సీన్ రీకన్‌స్ట్రక్షన్.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ దృష్టి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ యువతి దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సభ్యుల బృందం విచారణ ముమ్మరం చేసిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఇప్పటికే ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకుంది. దిశను దహనం చేసిన ప్రాంతం నుంచి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం వరకు తొలుత పరిశీలించారు. ఇంతదూరం నిందితులు ఎలా వచ్చారు? అంతా ఒకే దగ్గర ఎలా పడిపోయారు? నిందితుల శరీరంలో ఎలాంటి బుల్లెట్లు ఎందుకు లేవు? అనే అంశాలపై సభ్యులు దృష్టిసారించినట్లు సమాచారం.
నిందితులను పోలీసులు ఏ రకం తుపాకీతో కాల్చారు? పిస్టల్స్‌తోనా? పెద్ద గన్స్ వాడారా? పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు నిందితులు తొలుత ఫైర్ ఓపెన్ చేస్తే.. పోలీసులు నలుగురిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అనే విషయాలపై ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం.
అయితే మృతుల శరీరంలో బుల్లెట్లు లేకపోవడంపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌లో శరీరంలో నుంచి తూటాలు దూసుకుపోవడం సాధారణ విషయమేనని తెలిపారు. ఎముకలు, పక్కటెముకలకు తగిలినపుడు తూటాల దిశ మారుతుందని, మెత్తని శరీరభాగాలకు తగిలినప్పుడు ఇలా బయటికి వస్తుంటాయని వివరించారు.
ఎన్‌కౌంటర్‌లో నిందితులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఏ రకానికి చెందినవి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వద్ద 9 ఎంఎం పిస్టల్, ఎస్‌ఎల్‌ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులను పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులతోనే కాల్చా రు.
ఇదిలావుంటే.. దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై ఆదివారం ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఘటనా స్థలాలను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్‌కౌంటర్ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు ఆదివారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.
హంతకులు పోలీసులపై ఏవిధంగా తిరగబడ్డారు? ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు? ఏవిధంగా పోలీసులు, హంతకులపై కాల్పులు జరిగాయి? అనే వాటిపై పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. దీనిని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే, ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.

‘‘రేప్ జరగలేదుగా.. జరిగాక రండి’’ - యువతిని వెళ్లగొట్టిన ఉన్నావ్ పోలీసులు
మహిళల పట్ల ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని.. ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలికి నిందితులు నిప్పంటించిన ప్రాంతంలోనే తాజాగా మరో ఘటన చోటుచేసుకున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. తనపై ముగ్గురు లైంగికదాడికి యత్నించారని హిందూపూర్‌కు చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదును పోలీసులు తిరస్కరించారు. ‘లైంగికదాడి జరగలేదు కదా.. జరిగిన తర్వాత రండి’ అని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహిళ శనివారం తెలిపారు.
‘‘మూణ్నెల్ల కిందట ఇంట్లో నుంచి మెడిసిన్ తెచ్చేందుకు వెళ్లాను. ఆ సమయంలో ముగ్గురు గ్రామస్థులు నన్ను అడ్డుకున్నారు. నాపై లైంగికదాడికి యత్నించారు. ఈ సమయంలో 1090, 100 నంబర్లకు ఫోన్ చేశాను. కానీ వారు ఉన్నావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. నేను నిందితులను గుర్తుపట్టగలను. మూణ్నెల్ల నుంచి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు’’ అని చెప్పారు.
తమపై ఫిర్యాదు చేస్తే చంపేస్తామని నిందితులు రోజూ ఇంటికొచ్చి బెదిరిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
లైంగిక దాడి బాధితురాలిపై యాసిడ్‌దాడి: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ (30)పై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బుధవారం రాత్రి ఆమె ఇంటికెళ్లిన నలుగురు నిందితులు కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించారు. బాధితురాలు వెనుకకు తగ్గకపోవడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమెపై పోసి పరారయ్యారు. 30 శాతం గాయాల పాలైన ఆమెను చికిత్స కోసం మీరట్ దవాఖానలో చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరుపయోగంగా నిర్భయ నిధి: కేటాయించింది రూ. 2,264 కోట్లు.. ఖర్చు రూ. 252 కోట్లు
దేశంలో మహిళల భద్రతకు ఉద్దేశించిన 'నిర్భయ నిధి' పట్ల ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని.. కనీసం కేటాయించిన నిధులను సరైన రీతిలో వినియోగించడంలో కూడా విఫలమవుతున్నాయి ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. మహిళల భద్రత కోసం దేశంలోని రాష్ట్రాలు, యూటీలకు రూ. 2,264 కోట్లు కేటాయించగా అందులో కేవలం రూ. 252 కోట్లు మాత్రమే (11 శాతం) వినియోగించాయి. అంటే.. 89 శాతం నిధులను ఖర్చు చేయలేకపోయాయి.
ఆయా రాష్ట్రాలు సమర్పించిన సమాచారం ఆధారంగా కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ దీనిపై విశ్లేషణ చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం 15శాతం కంటే తక్కువగా నిధులను ఖర్చు చేశాయి.
నిధుల వినియోగంలో ఉత్తరాఖండ్, మిజోరాం (50 శాతం) తర్వాత ఛత్తీస్‌గఢ్ (43 శాతం), నాగాలాండ్ (39 శాతం), హర్యానా (32 శాతం), గోవా(26 శాతం) ఉన్నాయి. ఇక తమకు కేటాయించిన మొత్తంలో నిర్భయ నిధిని తక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత త్రిపుర, తమిళనాడు (మూడు శాతం), మణిపూర్ (నాలుగు శాతం), దిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్ (ఐదు శాతం), తెలంగాణ, ఒడిషా, కర్నాటక (ఆరు శాతం)లు ఉన్నాయి.
ఇక ఒక్క పైసా కూడా ఖర్చు చేయని మహారాష్ట్ర జాబితాలో అట్టడుగున నిల్చింది. 2017లో నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 'క్రైం ఇన్ ఇండియా' నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా, చిన్నారులపై జరుగుతున్న నేరాల్లో మూడోస్థానంలో ఉండటం గమనించాల్సిన అంశం.

ఫొటో సోర్స్, AFP
పెళ్లిపీటలపై వరుడిని చితకబాది పోలీసులకు అప్పగించిన బంధువులు
ఒకరితో నిశ్చితార్థం చేసుకుని... మరొకరిని పెళ్లాడుతున్న వరుడిని బాధిత కుటుంబం వారు చితకబాదగా పోలీసులు వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లిన ఉదంతం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
నంద్యాల ఒకటో పట్టణ ఎస్సై అశోక్ చెప్పినట్లుగా వివరించిన ఆ కథనం ప్రకారం... చిత్తూరు జిల్లాకు చెందిన మోహన్‌కృష్ణ తిరుపతిలోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగి. నంద్యాలకు చెందిన ఓ యువతితో అతను పెళ్లి కుదుర్చుకున్నాడు. స్థానిక దేవాలయంలో ఆదివారం వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు మోహన్‌కృష్ణను గుర్రం ఎక్కిస్తున్నారు.
అంతలో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ వాసులు కొందరు అక్కడికి చేరుకున్నారు. పెళ్లికొడుకును పట్టుకుని చితకబాదారు. గతంలో తమ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని, కట్నకానుకలు తీసుకుని, జాతకాలు కలవలేదని ముఖం చాటేసి, ఇప్పుడు మరో యువతిని ఎలా పెళ్లాడతావంటూ ప్రశ్నించారు. తమ కట్నం తిరిగి ఇచ్చేయాలన్నారు.
వారి నుంచి తప్పించుకున్న మోహన్‌కృష్ణ మండపంలోకి వెళ్లి పీటలపై కూర్చున్నాడు. వధువు మెడలో తాళి కట్టబోతుండగా మళ్లీ మక్తల్ వాసులు అడ్డుకున్నారు. మరోవైపు వరుడి నిర్వాకంపై నంద్యాల వధువు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన కట్నంతో పాటు పెళ్లి ఖర్చులూ తిరిగిచ్చేయాలన్నారు.
అంతలో పోలీసులు వచ్చి పెళ్లికొడుకును స్టేషన్‌కు తీసుకెళ్లారు. వరుడిని పోలీసులు తీసుకెళ్లడంతో చేసేదేమీ లేక బంధువులు తిరుగుముఖం పట్టారు. మోహన్‌కృష్ణ, అతని అన్న వీరప్రసాద్‌లపై ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మోసం విషయంలో మక్తల్ పోలీస్‌స్టేషన్‌లోనూ మోహన్‌కృష్ణపై కేసు ఉంది. ఇద్దరు వధువుల కుటుంబాల దగ్గరా రూ. 12 లక్షలు డబ్బు, 6 తులాల బంగారం చొప్పున నిందితుడు కట్నకానుకలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నల్లజాతి బ్రిటన్ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తొలిసారిగా స్కాలర్షిప్
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా?
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








