ఇక్కడి వలంటీర్లు రోడ్ల మీదా, చెట్ల కిందా దొరికే దేవుళ్ల బొమ్మలను ఏరుకుని వెళతారు..

ఆధ్యాత్మికత
ఫొటో క్యాప్షన్, 'ముంబై, సింగపూర్, హైదరాబాద్, గోవాల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమం తమ దగ్గర చేయమని అడుగుతున్నారు.

మీ ఇంట్లో పాత దేవుడి ఫోటో కానీ, దేవుడి ఫోటోలున్న కేలండర్ కానీ పాడైపోతే ఏం చేశారు? ఏదైనా గుడి దగ్గరో, రోడ్డు పక్కనో, లేక పెద్ద చెట్టు మొదట్లోనో వదిలేశారా?

మరి ఆ తరువాత ఆ ఫోటో ఏమైందో ఎప్పుడైనా గమనించారా?

మీరు కొన్నేళ్ల పాటు భక్తిపూర్వకంగా పూజ చేసిన దేవుని ఫోటో రోడ్డుపక్కన ఏ పరిస్థితుల్లో ఉందో, ఎవరు కాలితో తొక్కుతున్నారో, ఏ జంతువు దాన్ని పాడుచేస్తుందో ఎప్పుడైనా చూశారా?

అదీకాక ఆ గాజు, ఇనుము, మేకులు, ప్లాస్టిక్, పాలిథీన్ భూమిలో కలవకుండా ప్రకృతికి ఎంత హాని చేస్తున్నాయో చూశారా?

సరిగ్గా ఈ సమస్యకే తమదైన పరిష్కారం వెతికారు బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం సభ్యులు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జూలై నెలలో చివరి శనివారం ఉదయం.. బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోని 19వ క్రాస్ రోడ్డు దగ్గర పార్కు పక్కన ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణం.

ఆరోజు పండుగ కాకపోయినా పెద్ద సంఖ్యలో జనం కనిపిస్తున్నారు. గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం అంతా దేవుళ్లతో నిండిపోయింది.

చిత్రవిచిత్రమైన రంగుల్లో, రూపాల్లో, మెరిసిపోతూ ఉన్న వందలాది దేవుళ్ల విగ్రహాలు, ఫోటోలు, కేలండర్లు, ఫోటో ఫ్రేములు, దశాబ్దాల పాతవి.. సీల్ విప్పని కొత్తవీ అక్కడ కనిపిస్తున్నాయి.

ఎవరెవరో సంచుల్లో, చేతుల్లో ఫోటోలు తీసుకువచ్చి వాటిని అక్కడ పెట్టేసి, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోతున్నారు.

అక్కడున్న నిర్వాహకులు వాటిని శ్రద్ధగా ఒకచోట పేరుస్తున్నారు. కాసేపటి తరువాత పూజారి వచ్చి వాటన్నిటికీ ఒకసారి పూజ చేయగానే ఇక ఆ ఫోటోల ధ్వంసం కార్యక్రమం మొదలవుతుంది.

దేవుళ్ళ ఫోటోలు రీసైకిల్ హైదరాబాద్

బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఇలా దేవుళ్ల ఫోటోలను రీసైకిల్ చేస్తున్నారు. ఈ సంస్థ గత పదిహేనేళ్లుగా వేస్ట్ మేనేజ్మెంట్, సస్టెయినబుల్ ఎన్విరాన్‌మెంట్ విషయాల్లో పనిచేస్తున్నట్లు చెప్పారు వ్యవస్థాపకులు.

గతంలో ఈ సంస్థ క్లీన్లీనెస్ పేరుతో, ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగానూ కార్యక్రమాలు చేపడుతుండేది. ఆ క్రమంలోనే తాజాగా ఈ దేవుడి ఫోటోల రీసైకిలింగ్ ప్రారంభించినట్టు చెప్పారు హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డా. శాంతి.

''మేం ప్లాస్టిక్‌ నిరోధించడానికి పనిచేసే క్రమంలో తరచుగా చెట్ల దగ్గర, రోడ్ల పక్కన, పుట్టల దగ్గర, గుళ్ల దగ్గర దేవుళ్ల ఫోటోలు అనేకం చూసేవాళ్లం. వాటిని కుక్కలు మలినం చేస్తుండేవి. మనం పూజ చేసే భగవంతుడు పరిస్థితి ఇలా రోడ్డుపై ఉందా అనే బాధ కలిగి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో టీం అంతా కలసి చర్చించి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మా టీం సస్టెయినబులిటీ మీద పని చేస్తుంది. పర్యావరణ స్ఫూర్తి అందరికీ ఉంది కాబట్టి అందరూ అంగీకరించి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం'' అని బీబీసీకి చెప్పారు శాంతి.

బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ వారు ఆ దేవుళ్ళ ఫోటోలను రీసైకిల్ చేస్తున్నారు.

బెంగళూరు నగరంలో ఈ ఏడాది ఇప్పటిదాకా మూడుసార్లు ఈ కార్యక్రమం నిర్వహించారు.

''మా జట్టులో మొత్తం 50 మంది వరకూ ఉంటారు. వారిలో ప్రతి కార్యక్రమానికీ దాదాపు 15-20 మంది నిర్వాహకులు వస్తారు. ఈ కార్యక్రమం ముందు మేం సోషల్ మీడియాలో తేదీ, వేదిక ప్రకటిస్తాం. ఎక్కడపడితే అక్కడ ఫోటోలు వదలవద్దు, మీ దగ్గర ఉంచి మాకు అందజేయండి అని చెబుతాం. మొదటిసారి కార్యక్రమం చేసినప్పుడు మా వార్డులో ఇలా రోడ్డు పక్కన వదిలేసిన ఫోటోలు సేకరించాం. ఆ కార్యక్రమం ఒక పార్కులో చేశాం. తరువాత నుంచి గుడిలో చేస్తున్నాం. పార్కులో కార్యక్రమం చేస్తే కొందరు భయపడే అవకాశం ఉంది. గుడిలో చేస్తే ఎవరికీ భయం ఉండదు'' అని వివరించారు శాంతి.

ఈ సంస్థ నిర్వాహకులు, వలంటీర్లు అంతా, ముందుగా నిర్ణయించిన తేదీ రోజున వరసిద్ధి వినాయక గుడి దగ్గర చేరతారు. వచ్చిన ఫోటోలను అక్కడ ప్రదర్శనకు పెడతారు.

అందులో బాగా నచ్చిన ఫోటోలు కావాలంటే ఎవరైనా తమతో తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. బాగా పాతకాలంనాటి భిన్నమైన ఫోటోలను కొందరు తీసుకుంటూ ఉంటారు. కొత్తగా ఉన్న ఫోటోలను కూడా కొందరు తీసుకుంటారు.

ఆ ఫోటోలను అక్కడ పెట్టేప్పుడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, లోహం, రాయి, లామినేటెడ్ ఫ్రేములు, గాజు-చెక్క ఫ్రేములు, ఇనుప ఫ్రేములు, ప్లాస్టిక్.. ఇలా వేర్వేరుగా పెడతారు.

ఆ తరువాత అన్నిటికీ కలిపి ఆ గుడిలో అర్చకులతో ఉద్వాసన లేదా విసర్జన పూజ చేయిస్తారు.

బెంగళూరు దేవుళ్ళ ఫోటోలు

తరువాత వాటిని విడి భాగాలుగా విడదీయడం మొదలుపెడతారు. లామినేటెడ్ ఫోటోల నుంచి ప్లాస్టిక్, కాగితం వేరు చేస్తారు. ఇనుప ఫ్రేముల నుంచి చెక్క, గాజు వేరు చేస్తారు. మేకులు తీసేస్తారు.

ఇలా వేరు చేసిన పదార్థాలను రీసైకిలింగ్‌కి పంపుతారు. కాగితం, ప్లాస్టిక్, గాజు, ఇనుము, పీవోపీ.. ఇలా ప్రతీదీ రీసైకిలింగ్‌కి పంపిస్తారు. చెక్క, ప్లైవుడ్ మాత్రం పొడిగా (ష్రెడ్డింగ్) చేసి పార్కుల్లో మొక్కల దగ్గర వేస్తారు.

''దీని గురించి మేం డ్రైవేస్ట్ కలెక్షన్ సెంటర్లతో ఒప్పందం చేసుకున్నాం. నేరుగా ఈ ఫోటోలు వారికిస్తే వారేం వేరు చేయలేరు. అందుకని మేం పదార్థాలవారీగా విభజించి వారికి పంపిస్తాం'' అని చెప్పారు శాంతి.

దీనికి వీరు సొంతంగా ఖర్చు చేయడంతోపాటు విరాళాలు తీసుకుంటారు. ఫోటోలు అందజేసే దగ్గరే విరాళాల కౌంటర్ కూడా పెడతారు. విరాళం ఇవ్వడం తప్పనిసరి కాదు.

ఈ సామాన్లు తరలించడానికీ, ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో వీటిని విడదీయడానికి కూలీలు అవసరమైతే అందుకు కూడా ఆ డబ్బును ఉపయోగిస్తామని నిర్వాహకులు ప్పారు.

బెంగళూరు దేవుళ్ళ ఫోటోలు

చాలామంది వ్యాపారాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, గృహిణులు..ఇలా అనేకమంది తమ ఆసక్తిని బట్టి అక్కడకు వచ్చి స్వచ్ఛంద సేవ చేస్తున్నారు.

కేవలం ఒకచోట కార్యక్రమం పెట్టి అక్కడకు ఫోటోలు తెచ్చి ఇవ్వమనడమే కాదు. ఈ జట్టు సభ్యులు స్వయంగా తమ ప్రాంతాల్లో రోడ్లపై తిరిగి ఫోటోలను, బొమ్మలను సేకరిస్తారు.

''ఇవన్నీ ఎవరికి వారు అక్కర్లేదని పారేసినవి. చెత్తలో వేయడానికి మనసొప్పక రోడ్ల పక్కన వదిలేస్తారు. అంతే తేడా '' అని వివరించారు శాంతి.

రోడ్లపక్కన శుభ్రం చేసే మునిసిపాలిటీ సిబ్బందికి ఇలాంటి వాటివల్ల చేతులకు గాయాలవుతున్నాయని అన్నారామె.

దేవుళ్ళ ఫోటోలు రీసైకిల్ హైదరాబాద్

‘‘మొదటిసారి ఈ కార్యక్రమం చేసినప్పుడు మేమే ఫోటోలన్నీ సేకరించి ఒకచోట చేర్చి నిర్వహించాం. మా వీడియో వైరల్ అయిన తరువాత, చాలామంది తెచ్చివ్వడం మొదలుపెట్టారు. రీసైకిలింగ్ చేసే ముందు, దేవాలయ ప్రాంగణంలో ఉద్వాసన పూజ చేయించి అప్పుడు మిగిలిన పని చేస్తాం'' అన్నారు శాంతి.

''ముంబయి, సింగపూర్, హైదరాబాద్, గోవాల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమం తమ దగ్గర కూడా చేయమని అడుగుతున్నారు. అన్నిచోట్లకూ మేం వెళ్లలేము. కానీ ఎవరైనా ఇలాంటి కార్యక్రమం తమ నగరంలో చేయాలనుకుంటే వారికి తగిన అవగాహన కల్పించి, శిక్షణ ఇవ్వగలం. అందుకోసం వెబినార్లు కూడా నిర్వహిస్తాం'' అన్నారు శాంతి.

దేవుడి పటాలు

పాత వాటిని రీసైకిల్ చేయడంతో పాటు కొత్త వాటిని కొనడం తగ్గించాలని శాంతి అంటున్నారు. అలాగే బహుమానంగా వచ్చేవాటిని అందరూ పూజించరని చెబుతున్నారు.

''పుణ్య క్షేత్రాలకు వెళ్లిన వారు అక్కడ ఎక్కువ ఫోటోలు కొనేస్తారు. వారి కోసమే కాక చుట్టుపక్కల వారికి పంచడానికీ కొనేస్తున్నారు. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు. అవన్నీ ఇలా రోడ్డు పక్కకు చేరుతున్నాయి'' అన్నారామె.

''మాకు వచ్చే ఫోటోల్లో కొత్తవి కూడా ఉంటాయి. చాలా మంది గిఫ్టు కవర్లు కూడా ఓపెన్ చేయకుండా ఇచ్చేస్తారు'' అన్నారామె.

బెంగళూరు దేవుళ్ళ ఫోటోలు రిసైకిల్

''మా దగ్గరకు తెచ్చేవారిలో పుట్టింటి నుంచి తెచ్చామని కొందరు, అత్తింటి నుంచి తెచ్చామని కొందరు, గిఫ్టుగా వచ్చిందని మరికొందరు చెబుతుంటారు. తమవి కాకపోయినా, ఇతరుల నుంచి వీటిని సేకరించి తెచ్చి మాకు అప్పజెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఆఖరికి మా టీం సభ్యులు చెన్నై పనిమీద వెళ్తే, అక్కడ వారు ఈ విషయం విని, ఒక పెద్ద సంచి నిండా ఫోటోలు అప్పజెప్పారు. వాటిని మా వాళ్లు సొంతంగా తమతో పాటు రైల్లో తెచ్చి ఇక్కడ పెట్టారు'' అంటూ తమ అనుభవాలు పంచుకున్నారు శాంతి.

''ఇలాంటి ఫోటోలు ఏం చేయాలన్నా కాస్త బాధ ఉండేది. కానీ ఈ కార్యక్రమం చాలా బావుంది. అందుకే ఇక్కడకు మాలాంటివాళ్లు చాలామంది వస్తున్నారు'' అని బీబీసీతో చెప్పారు గాయత్రి అనే మహిళ.

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం సంస్థతోపాటు నగర పాలక సంస్థ, వరసిద్ధి వినాయక దేవస్థానం వీరికి సహకరిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)