విశాఖలో మిస్టరీ: చనిపోయిందని తీసుకొచ్చిన పసిబిడ్డ శ్మశానంలో ఏడ్చింది

ఫొటో సోర్స్, AFP
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశానవాటికకు నలుగురు వ్యక్తులు ఓ పసికందును చనిపోయిందని తీసుకువచ్చారు. కానీ, పూడ్చి పెట్టే ప్రయత్నాల్లో ఉండగా ఆ శిశువు ఏడుపు వినిపించింది.
ఇదేమిటని శ్మశాన వాటిక సిబ్బంది ప్రశ్నించడంతో, వారు ఆ శిశువుని తీసుకుని పరారయ్యారు.
అయితే ప్రస్తుతం ఆ పాప ఎక్కడుందనే విషయంపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.
అసలేం జరిగింది?
విశాఖలోని జ్ఞానాపురం శ్మశానవాటికకు శుక్రవారం (ఆగస్ట్ 6) కొందరు వ్యక్తులు కవర్లో చుట్టి తీసుకుని వచ్చిన శిశువుని ఖననం చేయాలని కోరారు.
ఏ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారని శ్మశాన వాటిక ఇంచార్జి ప్రసన్నకుమార్ ప్రశ్నించడంతో, రైల్వే న్యూకాలనీలోని కృష్ణ మెటర్నిటీ & నర్సింగ్ హోమ్ నుంచి తెచ్చామంటూ వారు ఓ లేఖను ఆయన చేతిలో పెట్టారు. ప్లాస్టిక్ కవర్లో ఉన్న శిశువును శ్మశాన వాటిక సిబ్బందికి అందించారు.

సిబ్బంది శిశువును పూడ్చడం కోసం ప్లాస్టిక్ కవర్ని తెరవగా.. ఒక్కసారిగా శిశువు ఏడవడం ప్రారంభించింది. దీంతో శిశువుని తీసుకొచ్చిన నలుగురిని నిలదీశారు. వెంటనే వారు శిశువుతో సహా అక్కడ నుంచి జారుకున్నారు.
ఆ వ్యక్తుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన శ్మశాన వాటిక సిబ్బంది వారు చెప్పిన ఆసుపత్రికి వెళ్లారు. శ్మశానానికి శిశువుని తీసుకొచ్చినప్పడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి శ్మశానవాటిక ఇంచార్జి ప్రసన్న కుమార్ తో బీబీసీ మాట్లాడింది.
"ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బంది...ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే ఆ శిశువు పుట్టిన రైల్వే న్యూకాలనీలోని కృష్ణ మెటర్నిటీ & నర్సింగ్ హోమ్ కు వెళ్లి విషయాన్ని చెప్పాను. అయితే, వాళ్లు నాకు ఏ విధమైన సమాధానం చెప్పలేదు. పైగా నన్ను ఆసుపత్రి వద్ద ఉండనివ్వలేదు. దాంతో నేను ఒక కంప్లైట్ రాసి కంచరపాలెం పోలీసులకు ఇచ్చాను. కానీ దానిపై పూర్తి సమాచారం తెలుసుకుని ఫిర్యాదు స్వీకరిస్తామని చెప్పి పంపించారు. ప్రస్తుతం ఆ పాప ఎక్కడుందో మాత్రం మాకు తెలియదు." అని ప్రసన్న కుమార్ తెలిపారు.

పాప ఎక్కడుంది...?
కాన్వెంట్ జంక్షన్లోని శ్మశాన వాటికకు ఏపీ31 డీఎఫ్ 0741 నంబర్ గల ఓ కారులో ఆ శిశువుని నలుగురు వ్యక్తులు తీసుకుని వచ్చారు. బతికుందని తెలియగానే పాపను తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అదే సమయంలో ఆసుపత్రి యాజమాన్యం సైతం ఈ సంఘటనపై సరైన సమాధానం ఇవ్వలేదు. వేరే డాక్టరు వచ్చి ఇక్కడ డెలీవరీ చేశారని, తమకు సంబంధం లేదని కృష్ణ మెటర్నిటీ & నర్సింగ్ హామ్ యాజమాన్యం చెప్తోంది.

మరైతే పాపని తీసుకుని వచ్చిన నలుగురు ఎవరనేది ఇటు శ్మశానవాటిక సిబ్బంది, అలాగే ఆసుపత్రి సిబ్బంది కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే పాప తల్లిదండ్రులు మాత్రం విశాఖ మాధవధారకు చెందిన వారని మాత్రమే తెలుస్తోంది.

ఆసుపత్రిలో ఏం జరిగింది?
మాధవధార ప్రాంతానికి చెందిన గర్భిణి డాక్టర్ సూచనల మేరకు ఈ నెల 2వ తేది న్యూ కాలని వద్ద నున్న కృష్ణ మెటర్నిటీ & నర్శింగ్ హొమ్ లో చేరారు. 4వ తేది వైద్యులు స్కానింగ్ నిర్వహించి ఆమెకు పుట్టబోయే బిడ్డ " డౌన్ సిండ్రోమ్ " అనే వ్యాధితో బాధపడుతుందని స్కాన్ పరీక్షల్లో గుర్తించి విషయాన్ని ఆమెకు తెలియచేశారు. వైద్యుల సూచనల మేరకు 6 నెలల గర్భిణీకి ప్రసవం నిర్వహించి బిడ్డను బయటకి తీసారు. ఇదిలా వుండగా 6 వ తేది బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు గుర్తించి మృతి చెందినట్లు కృష్ణ మెటర్నిటీ నర్సింగ్ హామ్ వైద్యులు తల్లిదండ్రులకు లేఖను ఇచ్చారు.
"నిర్మల అనే డాక్టరు మా ఆసుపత్రికి డెలివరీ కోసమని ఒక మహిళను పంపించారు. ఆ మహిళకు ఆరో తేదీన డెలివరీ అయ్యింది. అయితే బిడ్డ మరణించింది. ఆ విషయాన్నే లేఖలో రాసి ఇచ్చాం. తల్లిని కూడా మా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం మాకు ఆ తల్లితో కానీ, బిడ్డతో కానీ ఏ సంబంధం లేదు." అని కృష్ణ మెటర్నిటీ నర్సింగ్ హోం యాజమాని డాక్టర్ కమల చెప్పారు.

పోలీసుల విచారణ
చనిపోయిందని పూడ్చేందుకు శ్మశానానికి తీసుకుని వచ్చిన వారు ఎవరు? బతికుందని శ్మశానవాటిక సిబ్బంది గుర్తించిన వెంటనే పాపని ఎక్కడికి తీసుకుని వెళ్లారు? ప్రస్తుతం పాప ఎక్కడుంది? అసలు పాప తల్లిదండ్రులెవరు? అనే విషయాలను అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేకపోతున్నారు. సంఘటన జరిగిన (08.08.21) మూడో రోజుకు పోలీసులు రంగంలోకి దిగారు.
"ఐసీడీఎస్ (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ) సిబ్బంది మాకు సమాచారం ఇచ్చారు. జ్ఞానాపురం శ్మశాన వాటికకు తీసుకుని వెళ్లడం అక్కడ శిశువు బతికే ఉండటం, ఇప్పుడు పాప ఏమైందో తెలియడం లేదని చెప్పారు. దీంతో మేం ఆసుపత్రిలో విచారణ చేపట్టాం. ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటీ వరకు అందిన సమాచారం ప్రకారం పాప ఆచూకీ మాత్రం తెలియలేదు. అయితే ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అధారంగా చర్యలు చేపడతాం" అని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సాయి చెప్పారు.
ప్రస్తుతం స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ అర్బన్ -1 సీడీపీఓ రమణకుమారి, కృష్ణ మెటర్నిటీ & నర్శింగ్ హోమ్ లో విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








