మనుషుల్లా కాకుండా భిన్నంగా శ్వాస తీసుకునే జంతువుల గురించి మీకు తెలుసా?

Red deer stag

ఫొటో సోర్స్, Getty Images

శ్వాస తీసుకోవడం అనేది మనుషులతోపాటూ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకూ అత్యంత సహజమైన ప్రక్రియ.

ఊపిరి ఆగిపోతే జీవం ఆగిపోతుంది.

మనందరం ఆక్సిజన్ పీల్చుకుని బతుకుతాం. పీల్చిన గాలిని ఊపిరితిత్తులు శుభ్రం చేసి శరీరానికి అందిస్తాయి. అదే మనకు ప్రాణవాయువు.

అయితే, భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లోనూ శ్వాసక్రియ ఇలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటే.

కొన్ని జంతువుల్లో ఆశ్చర్యం కలిగే రీతిలో, వినూత్నమైన పద్ధతిలో శ్వాసక్రియ జరుగుతుంది.

అలాంటి అద్భుతమైన కొన్ని జీవుల గురించి తెలుసుకుందాం.

glass frogs

ఫొటో సోర్స్, AFP

నోటితో గాలి పీల్చే గాజు కప్పలు

గాజు కప్పల గురించి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

వాటి శరీరం పారదర్శకంగా ఉండి, లోపలి అవయవాలు కొన్ని బయటకి కనిపిస్తూ ఉంటాయి (ఇలా కనిపించడానికి కారణం ఇతర జీవులను మభ్యపెట్టడమేనని ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు).

గాజు కప్పలు మూడు రకాలుగా గాలి పీల్చుకుంటాయి.

నీళ్లల్లో ఉన్నప్పుడు చర్చం ద్వారా ఆక్సిజన్ పీల్చుకుంటాయి.

వీటికి నోటిపైన ఒక శ్వాస పొర ఉంటుంది. ఇవి నోటి ద్వారా గాలి పీల్చుకున్నప్పుడు ఆ పొర ఆక్సిజన్ గ్రహిస్తుంది.

ఇలా ఇవి నోటి ద్వారా గాలి పీల్చుకుంటాయి.

బోర్నియన్ ఫ్లాట్-హెడ్ కప్పలు అసలు ఊపిరితిత్తుల అవసరమే లేకుండా కేవలం చర్మం ద్వారానే గాలి పీల్చుకుని, శరీరానికి కావలసిన ఆక్సిజన్ సేకరిస్తాయి.

vultures

ఫొటో సోర్స్, EPA

పక్షులు తమ వెనుక భాగాలతో కూడా గాలి పీలుస్తాయి

పక్షులు గాల్లో ఎగిరేందుకు కావలసినంత శక్తిని పొందడానికి వాటి శాస్వక్రియ చాలా సమర్థవంతంగా ఉండాలి.

ముఖ్యంగా భూమికి చాలా ఎత్తులో ఎగిరే పక్షులకు శ్వాసక్రియ అత్యంత ప్రభావవంతంగా ఉండాలి.

ఉదాహరణకు రాబందులు భూమికి 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. అంత ఎత్తులో ఆక్సిజన్ కొరత ఉంటుంది.

అందుకోసం, పక్షులకు పక్క భాగాలతో సహా శరీరం నిండా గాలి సంచులు ఉంటాయి. ఈ గాలి సంచుల ద్వారా ఆక్సిజన్ ఊపిరితిత్తులకు చేరుతుంది.

అలాగే, శ్వాస వదులుతున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల నుంచి గాలి సంచులకు చేరుతుంది. అక్కడ నుంచి బయటకు విడుదల అవుతుంది.

ఇలా రెండు దశల్లో జరిగే శ్వాస ప్రక్రియ కారణంగా పక్షులకు ఎగిరేందుకు కావల్సినంత ఆక్సిజన్ లభ్యమవుతుంది.

snake

ఫొటో సోర్స్, Getty Images

పాములకు ఒకటే ఊపిరితిత్తి ఉంటుంది

మన ఊపిరితిత్తుల్లో ఎడమవైపుది కుడివైపు దానికన్నా కొంచం చిన్నగా ఉంటుందనే విషయం మీకు తెలుసా?

అలా ఎందుకంటే, ఎడమ భాగంలో గుండె కూడా ఉంటుంది కాబట్టి, దానికి సరిపడా స్థలం ఇచ్చేందుకు సహజంగా ఎడమవైపు ఊపిరితిత్తి చిన్నదిగా ఏర్పడుతుంది.

ఇదే నిర్మాణం పాములలో కూడా ఉంటుంది. కాకపోతే, పాములలో ఎడమవైపు ఊపిరితిత్తికి బదులు ఒక చిన్న సంచి ఉంటుంది. కుడివైపు మాత్రమే ఊపిరితిత్తి ఉంటుంది.

పరిణామ క్రమంలో పాములకు గొట్టంలాంటి శరీరంలో ఇమిడేందుకు పొడవైన, సన్నని అవయవాలు అవసరపడ్డాయి. ఆ క్రమంలో ఒకటే ఊపిరితిత్తి అభివృద్ధి చెందింది.

అయితే, జతలుగా ఉండే అవయవాలు కూడా పాముల్లో ఉంటాయి. ఉదాహరణకు కిడ్నీలు. ఇవి మనుషుల శరీరంలోలాగ పక్కపక్కన కాకుండా పాములలో ఒకదానిపై ఒకటి ఉంటాయి.

ఇంతకూ పాములు ఒకటే ఊపిరితిత్తితో గాలి పీల్చుకోగలిగినప్పుడు ఎడమవైపు ఆ సంచీ ఎందుకు ఉండాలి?

జలచరాలుగా ఉండే పాములకు ఎడమవైపు సంచీ నీటిలో తేలియాడేందుకు సహాయపడుతుంది.

నేల మీద ఉండే పాముల్లో ఎడమవైపు ఆ సంచీ ఎందుకుందో, దాని ఉపయోగమేమిటో ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది.

Cheetah

ఫొటో సోర్స్, Getty Images

చిరుతపులులు చాలా వేగంగా గాలి పీలుస్తాయి

చిరుతపులి వేగానికి గుర్తు. ఇది పరిగెత్తడం మొదలుపెట్టిన మూడు సెకండ్లలో గంటకు 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు.

అంత వేగాన్ని అందుకోవాలంటే దాని కండరాలకు అదే స్థాయిలో ఆక్సిజన్ అందాలి.

అందుకు తగిన శ్వాసకోశ నిర్మాణం చిరుతపులుల్లో ఉంటుంది.

చిరుతపులి వేగంగా పరిగెడుతున్నప్పుడు నిముషానికి 60 నుంచి 150 సార్లు గాలి పీల్చుకుంటుంది. ఇది, మనుషులు పరిగెడుతున్నప్పుడు తీసుకునే ఊపిరి వేగం కన్నా రెండు రెట్లు ఎక్కువ.

చిరుత ఏదైనా జంతువును వేటాడి పట్టుకోగానే అలిసిపోతుంది. ఆ పరిగెత్తే వేగం దాని శక్తినంతా హరించేస్తుంది.

మళ్లీ ఊపిరి పీల్చుకుని, కావలసిన శక్తిని కూడగట్టుకోవడానికి దానికి 30 నిముషాలు పడుతుంది. ఆ తరువాతే అది చంపిన జంతువును తింటుంది.

A sloth

ఫొటో సోర్స్, Folly Farm

శరీరం లోపలి అవయవాలకు 'టేప్' వేసే దేవాంగిపిల్లి

మనం ఎక్కువసేపు తలకిందులుగా వేలాడితే ఏమవుతుంది? ఊపిరితిత్తులపై భారం పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

గుండెకు పైనుంచి కిందకు ఎక్కువ రక్తం చేరుతుంది. తలకిందులు కాగానే కింద నుంచి పైకి రక్తం ప్రవహించడానికి మరింత శక్తి, బలం కావలసి వస్తుంది.

అలాగే, పొట్ట దగ్గర భాగాలన్నీ రొమ్ముకు, పొట్టకు మధ్యలో నొక్కి పెట్టబడతాయి.

దీనివలన మనకు శ్వాస సరిగా అందక ఇబ్బంది పడతాం.

అయితే, దేవాంగ పిల్లులు గంటల తరబడి చెట్లకు తలకిందులుగా వేలాడుతూ కాలం గడుపుతాయి.

వాటికి శ్వాస ఇబ్బందులు ఎందుకు రావు?

దానికి కారణం ఏంటంటే, అవి తలకిందులుగా వేలాడగానే, శరీరం లోపలి భాగాలు కదలకుండా వాటిని టేప్ వేసి అంటించేస్తాయి.

వింతగా ఉంది కదా.

ఈ పిల్లులు తమ శరీరంలో ఉండే ఫైబరస్ కణజాలం ఉపయోగించి అంతర్గత అవయవాలను తమ అస్థిపంజరానికి టేప్ చేసి అతికించేస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

దానివలన, లోపలి భాగాలు ఏవీ కదలవు కాబట్టి వాటికి ఊపిరి పీల్చుకోవడంలో ఏ ఇబ్బందీ ఉండదు.

శ్వాస తీసుకోని తొలి జీవిని కనుగొన్నారు

అనేక జంతువుల్లో వివిధ రకాల శ్వాసప్రక్రియలు ఉంటాయని తెలుసుకున్నాం కానీ, అసలు ఊపిరి తీసుకోని జీవి ఉంటుందనేది నమ్మశక్యం కాని నిజం.

అలాంటి ఒక సముద్ర జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇది జెల్లీ ఫిష్‌లాంటి పరాన్న జీవి.

దీని పేరు 'హెన్నేగుయా సాల్మినికోలా'.

దీన్నే 'మిల్కీ ఫిష్', 'టాపియోకా డిసీజ్' అని కూడా అంటారు.

ఇది సముద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తుంది.

ఈ మిల్కీ ఫిష్ డీఎన్ఏలో శ్వాసకోశ గ్రంథులు లేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అయితే, ఈ జీవి ఆక్సిజన్ పీల్చుకోకుండా ఎలా బతుకుతోంది అనేదానికి ఇప్పటివరకూ సమాధానం దొరకలేదు.

ఈ విషయంలో శాస్త్రవేత్తలు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)