భూమి మీద నివసించే సరీసృపాలలో ఇదే అత్యంత చిన్న జీవి: Newsreel

అతి చిన్న ఊసరవెల్లి

ఫొటో సోర్స్, Endagerex

ఫొటో క్యాప్షన్, అతి చిన్న ఊసరవెల్లి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఒక విత్తనం సైజులో ఉండే అతి చిన్న ఊసరవెల్లిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి మీద నివసించే సరీసృపాలలో ఇదే అత్యంత చిన్న జీవి అని వారు భావిస్తున్నారు.

మడగాస్కర్‌లో జర్మన్-మడగాస్కన్ సాహస యాత్రికుల బృందానికి ఈ జాతి చిన్న బల్లులు రెండు కనిపించాయి.

వీటిని 'బ్రూకేసియా నానా' లేదా 'నానో కమెలియన్' (నానో ఊసరవెల్లి) అంటున్నారు.

వాటిల్లోని మగజీవి శరీరం కేవలం 13.5 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంది.

మ్యూనిచ్‌లో ఉన్న బవేరియన్ స్టేట్ కలక్షన్ ఆఫ్ జువాలజీ ప్రకారం.. ఇప్పటిదాకా భూమి మీద మానవులు కనుగొన్న 11,500 రకాల సరీసృపాలలో ఇదే అత్యంత చిన్న జీవి.

తల నుంచీ తోక వరకూ దీని పొడవు కేవలం 22 మిల్లీమీటర్లు మాత్రమే.

అయితే, వీటిల్లోని ఆడజీవి మాత్రం 29 మిల్లీమీటర్ల పొడవుతో మగజీవి కన్నా కాస్త పెద్దదిగా ఉంది.

ఈ జాతికి చెందిన మిగతా జీవులు ఎక్కడ ఉన్నాయో ఇంకా వెతకాల్సి ఉందని, ఇది "గొప్ప ప్రయత్నమని" అని శాస్త్రవేత్తలు తెలిపారు.

అతి చిన్న ఊసరవెల్లి

ఫొటో సోర్స్, Endagerex

ఫొటో క్యాప్షన్, అతి చిన్న ఊసరవెల్లి

"ఈ కొత్త రకం జీవులు ఉత్తర మడగాస్కర్‌లో క్షీణిస్తున్న వర్షారణ్యాల్లో కనిపించాయి. ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది" అని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ పేర్కొంది.

"ఈ నానో ఊసరవెల్లులు దొరికిన ప్రదేశం దురదృష్టవశాత్తూ అటవీ నిర్మూలనకు గురవుతోంది. అయితే, ఈ మధ్యే అక్కడి ప్రాంతాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. కాబట్టి ఈ కొత్త జీవులు అంతరించిపోకుండా ఉండే అవకాశం ఉంది" అని హాంబర్గ్‌లోని సెంటర్ ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన శాస్త్రవేత్త ఆలివర్ హాలిట్స్‌చెక్ అన్నారు.

ఈ జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని 'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్' జాబితాలో చేర్చి వీటి ఆవాసాలను పరిరక్షించాలని పరిశోధకులు తమ నివేదికలో కోరారు.

కర్నూలు రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

కర్నూలు రోడ్డు ప్రమాదం మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఇస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సాయం చేయనున్నట్టు తెలిపింది.

ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మరణించారు. నలుగురు గాయాలతో బయటపడ్డారు.

మున్సిపల్ ఎన్నికలు

ఫొటో సోర్స్, ceoandhra

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 10న ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

గతంలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను, తిరిగి అక్కడ నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన వరకూ వచ్చిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కోవిడ్-19 లాక్‌డౌన్ వల్ల గత ఏడాది మార్చి 15న ఆగిపోయింది.

తదుపరి ఆదేశాల వరకూ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది మే 6న ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎస్ఈసీ, ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన పురపాలక ఎన్నికల ప్రక్రియను కూడా కొనసాగించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయితీల్లో అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ దశ నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ఈరోజు ( ఫిబ్రవరి 15, 2021) నోటిఫికేషన్ జారీ చేసింది.

మున్సిపల్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

  • అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణకు ప్రారంభ తేదీ-02.03.2021 (మంగళవారం)
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- 03.03.2021 (బుధవారం మధ్యాహ్నం 3 లోపు)
  • పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ తేదీ-03.03.2021 (బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత)
  • ఎన్నికల తేదీ-10.03.2021 (బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు)
  • ఎక్కడైనా రీపోలింగ్ జరపాల్సి వస్తే, పోలింగ్ తేదీ-13.03.2021 (శనివారం)
  • కౌంటింగ్ తేదీ - 14.03.2021 (ఆదివారం ఉదయం 8 నుంచి)

పురపాలక ఎన్నికల షెడ్యూల్‌తో రాష్ట్రంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

ఇది రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అమలులో ఉంటుంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)