IND vs AUS: ఆస్ట్రేలియాకు షాకిస్తున్న భారత యువ క్రికెటర్లు

మొహమ్మద్ సిరాజ్

ఫొటో సోర్స్, Getty Images

బ్రిస్బేన్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఊహంచని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌లో స్కోరును 369కి ఆస్ట్రేలియా తీసుకెళ్లింది. లబూసేన్ (108), పెన్ (50) మెరుగైన ప్రతిభ కనబరిచారు.

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 336 స్కోరు నమోదు చేసింది. శార్దూల్ ఠాకుర్ (67), వాషింగ్టన్ సుందర్ (62), హేజిల్‌వుడ్ (5-57) మంచి ప్రదర్శన కనబరిచారు.

దీంతో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేనాటికి ఆస్ట్రేలియా ఆధిక్యం 54కు పరిమితమైంది.

టెస్టు మ్యాచ్ మూడో రోజు భారత్ మెరుగైన ప్రదర్శన కనబరచడంతో ఆస్ట్రేలియా ఆశలకు గండి కొట్టినట్లు అయ్యింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 కొట్టింది. మరోవైపు భారత్ 186 రన్లకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ వెనుకపడినట్లు కనిపించింది. కానీ శార్దూల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ ద్వయం అద్భుత ప్రదర్శనతో 123 రన్లు తీసింది.

ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత భారత జట్టు ఇంత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఎవరూ ఊహించలేదు. శార్దూల్ 67, సుందర్ 62 రన్లతో భారత్ స్కోరు 336కు వెళ్లింది.

మూడో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేనాటికి ఆస్ట్రేలియా 54 రన్ల ఆధిక్యంతో ఉంది. కొత్తగా ఎలాంటి వికెట్లనూ కోల్పోలేదు. డేవిడ్ వార్నర్, మార్కస్ హ్యారిస్ క్రీజులో ఉన్నారు. వీరు 21 పరుగులు తీశారు.

Presentational grey line

నాలుగో రోజు: ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

ఆ జట్టులో స్టీవ్ స్మిత్ అత్యధికంగా 55 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు కూల్చాడు.

328 పరుగులు చేస్తే భారత్ నాలుగో టెస్టుతో పాటు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కూడా గెలుచుకుంటుంది.

ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నారు.

వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా నాలుగు పరుగులు చేసింది.

Presentational grey line

ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడుతున్న ఈ నాలుగు టెస్టు మ్యాచ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అగ్ర క్రీడాకారులు గాయాలపాలు కావడంతో భారత్‌ ప్రదర్శన అంతంత మాత్రంగా సాగింది. అగ్ర క్రీడాకారుల స్థానంలో అడుగుపెట్టిన యువ క్రీడాకారులు తమదైన శైలిలో మంచి ప్రదర్శన కనబరిచారు.

భారత క్రీడాకారుల ప్రదర్శన చూస్తుంటే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీపై భారత్ ఆశలు చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విజయం సాధించాలంటే బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌ను భారత్ డ్రా చేయించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఈ మ్యాచ్‌ను గెలవాల్సి ఉంటుంది. మ్యాచ్ చివరి రెండు రోజుల్లో వర్షం పడొచ్చని, మ్యాచ్‌కు ఆటంకాలు ఎదురుకావొచ్చని అంచనాలు ఉన్నాయి.

వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకుర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకుర్

ఇబ్బందికర పరిస్థితులు దాటుకుంటూ..

ఈ సిరీస్ చాలా ఉత్కంఠ వాతావరణంలో జరుగుతోంది. రెండు టీమ్‌లు ఇబ్బందికర పరిస్థితులు దాటుకుంటూ ముందుకువచ్చాయి. ఆదివారం భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రహానెతోపాటు మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్‌లు మెరుగైన ప్రదర్శన ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో ఆస్ట్రేలియాకు విజయం దాదాపు ఖాయమైనట్లే అనిపించింది.

భారత్ జట్టులో అనుభవంలేని, కొత్త క్రీడాకారుల పేర్లు చాలా కనిపించాయి. 21ఏళ్ల సుందర్‌కు ఇదే అరంగేట్ర టెస్టు. మరోవైపు భారత్ తరఫున రెండో టెస్టులో బరిలోకి దిగినప్పటికీ, బ్యాటింగ్‌కు రావడం శార్దూల్‌కు ఇదే తొలిసారి.

సుందర్‌కు ఆఫ్‌స్పిన్ బౌలర్‌గా పేరుంది. భారత అగ్ర క్రీడాకారులు వరుసగా గాయాలపాలు కావడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది.

శార్దూల్ ఠాకుర్

ఫొటో సోర్స్, Getty Images

చాలా మందికి గాయాలు

భారత జట్టులో ప్రస్తుతం గాయాల పాలైన క్రీడాకారుల జాబితా చాలా పెద్దదే ఉంది. కొందరు వేరే కారణాలతో మ్యాచ్‌ నుంచి నిష్క్రమించారు.

ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లి తండ్రి అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన విరామం తీసుకున్నారు. మిగతా అగ్ర క్రీడాకారులు గాయాలపాలయ్యారు.

కేఎల్ రాహుల్ మణికట్టుకు గాయమైంది. మరోవైపు హనుమ విహారీ కాలికి గాయమైంది.

రవిచంద్రన్ అశ్విన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. రవీంద్ర జడేజా బొటన వేలికి గాయమైంది. భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీలు కూడా గాయాలతో బాధపడుతున్నారు.

తాజాగా నాలుగో టెస్టు మ్యాచ్‌లో నవ్‌దీప్ సైని కూడా గాయపడ్డారు. బూమ్రా కడుపు నొప్పితో బాధపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో శార్దూల్, సుందర్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. కీలకమైన సమయంలో జట్టుకు అండగా నిలిచారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

ఠాకుర్ రెండు సిక్స్‌లు కొట్టారు. సుందర్ కూడా ఒక సిక్స్ బాదారు.

తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్‌లో జరిగింది. దీనిలో భారత్ ఓడిపోయింది.

రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పుంజుకుని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు కెప్టెన్‌గా రహానె వ్యవహరించారు.

మరోవైపు మూడో మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఆధిక్యం కనబరిచింది. అయితే, భారత్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)