సినోవాక్: చైనా వ్యాక్సీన్ సామర్థ్యం 50.4 శాతం - బ్రెజిల్ పరిశోధనల్లో వెల్లడి

సినోవాక్

ఫొటో సోర్స్, Getty Images

చైనా సంస్థ సినోవాక్ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ 50.4% శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని బ్రెజిల్‌లో తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

ఇదివరకటి అంచనాల కంటే తక్కువ సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్ పనిచేస్తున్నట్లు తాజా పరీక్షలు చెబుతున్నాయి. అనుమతికి అవసరమైన 50 శాతం సామర్థ్యం కంటే కేవలం 0.4 శాతం ఎక్కువ సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్ పనిచేస్తున్నట్లు వివరిస్తున్నాయి.

ప్రజలకు భారీ స్థాయిలో వ్యాక్సీన్లు ఇచ్చేందుకు బ్రెజిల్ ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు వ్యాక్సీన్లలో చైనా వ్యాక్సీన్ ఒకటి.

కోవిడ్-19తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి.

సినోవాక్ బీజింగ్ నుంచి పనిచేస్తున్న బయోఫార్మా సంస్థ. తమ వ్యాక్సీన్‌కు కరోనావ్యాక్‌గా సంస్థ నామకరణం చేసింది. అచేతన స్థితిలో ఉండే వైరస్ భాగాలతో రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించేలా చేయడం ద్వారా ఈ వ్యాక్సీన్ పనిచేస్తుంది.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ వ్యాక్సీన్ కోసం ఇండోనేసియా, టర్కీ, సింగపూర్ సహా కొన్ని దేశాలు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాయి.

మధ్యస్థం నుంచి తీవ్రమైన కరోనావైరస్ కేసుల్లో ఈ వ్యాక్సీన్ 78 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు గత వారం బ్రెజిల్‌కు చెందిన బుటాంటన్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. సినోవాక్ వ్యాక్సీన్‌కు బ్రెజిల్‌లో ఈ సంస్థే పరీక్షలు నిర్వహిస్తోంది.

అయితే, ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉండే కేసుల సమాచారాన్ని గతవారం ఫలితాల్లో జోడించలేదని, ఆ సమాచారం కలపడంతో సామర్థ్యం తగ్గినట్లు తేలిందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ తెలిపింది. అంటే చికిత్స అవసరంలేని ఇన్ఫెక్షన్ల సమాచారాన్ని ఇదివరకటి ఫలితాల్లో జోడించలేదు.

అయితే, స్వల్ప స్థాయిలో చికిత్స అవసరమయ్యే కేసులను అడ్డుకోవడం విషయానికి వస్తే ఇది 78 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని, తీవ్రత ఒక మోస్తరు నుంచి సీరియస్ వరకు ఉండే కేసులను అడ్డుకోవడంలో 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని పరిశోధకులు తెలిపారు.

మరోవైపు సినోవాక్ ఫలితాలు ఒక్కో దేశంలో ఒక్కోలా వస్తున్నాయి.

గత నెలలలో ఈ వ్యాక్సీన్ 91.25 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని టర్కీ పరిశోధకులు వెల్లడించారు. మరోవైపు భారీ స్థాయిలో టీకాల పంపిణీకి సిద్ధమవుతున్న ఇండోనేసియాలో ఈ వ్యాక్సీన్ 65.3 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని ఫలితాల్లో తేలింది. ఇవి రెండు చివరి దశ ట్రయల్స్ మధ్యలో సేకరించిన ఫలితాల అంచనాలే.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Sopa images

పశ్చిమ దేశాలు అభివృద్ధి చేసిన టీకాలతో పోల్చినప్పుడు చైనా వ్యాక్సీన్ ట్రయల్స్, అభివృద్ధి చర్యల్లో పారదర్శకత లేదని విమర్శలు, ఆందోళనలు మొదట్నుంచీ వినిపిస్తున్నాయి.

సినోవాక్‌తోపాటు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా కూడా బ్రెజిల్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే అనుమతులు మాత్రం ఇంకా రాలేదు.

బ్రెజిల్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఫలితాలు బయటపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసుల విషయంలో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ 81 లక్షల కేసులు నమోదయ్యాయి.

బ్రిజెల్‌లో అత్యంత దారుణంగా చెలరేగిన మహమ్మారుల్లో తాజా కరోనావైరస్ ఒకటని బీబీసీ వరల్డ్ సర్వీస్ అమెరికా ఎడిటర్ కెండేస్ పీట్ చెప్పారు. అయితే, ఇక్కడ వ్యాక్సీన్‌లు ఇచ్చే ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా ప్రకటించలేదు.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: ఒక మరణం నుంచి 19 లక్షల మరణాల వరకు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)