కొరియా దేశాల శిఖరాగ్ర సదస్సు: ఉత్తర కొరియాలో క్షిపణి ప్రయోగ కేంద్రం మూసివేతకు అంగీకరించిన కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశానికి చెందిన ఒక ముఖ్యమైన క్షిపణి పరీక్ష కేంద్రం మూసివేతకు అంగీకరించినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే యిన్ ప్యాంగ్‌యాంగ్‌లో తెలిపారు.
''టొంగ్‌చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయడానికి కిమ్ అంగీకరించారు'' అని మూన్ తెలిపారు. ''అది కూడా అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో'' అని ఆయన వివరించారు.
టొంగ్‌చాంగ్-రి 2012 నుంచి ఉత్తర కొరియా ప్రధానమైన క్షిపణి ప్రయోగం కేంద్రం. ఉత్తర కొరియా నుంచి అమెరికా వరకు వెళ్లగల క్షిపణుల ప్రయోగం కూడా ఇక్కడి నుంచే జరిగింది.

ఫొటో సోర్స్, DigitalGlobe
అంతే కాకుండా యాంగ్ బ్యాన్ అణు కేంద్రం మూసివేతకు కూడా కిమ్ అంగీకరించినట్లు మూన్ వెల్లడించారు. అణుపరీక్షలకు అవసరమైన పదార్థాలను ఇక్కడే తయారు చేస్తారని తెలుస్తోంది.
అయితే అమెరికా కూడా దీనికి తగిన విధంగా ప్రతిస్పందించాలని కిమ్ కోరినట్లు మూన్ తెలిపారు. అయితే ఎలాగన్నది మాత్రం ఆయన వివరించలేదు.
ఉత్తర కొరియా గత జూన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కిమ్‌ను కలవడానికి మునుపే తమ పంగ్యె-రి అణు పరీక్ష కేంద్రాన్ని పేల్చేసింది.
కాగా.. కొరియా ద్వీపకల్పంలో మిలటరీపరమైన శాంతి స్థాపన కోసం ఇది ఒక పెద్ద ముందడుగు అని కిమ్ అభివర్ణించారు. రాబోయే కాలంలో తాను సియోల్‌లో పర్యటిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
శిఖరాగ్ర సదస్సు: అణు నిరాయుధీకరణ
ప్రస్తుతం ఉభయ కొరియాల మధ్య ప్యాంగ్‌యాంగ్‌లో జరుగుతున్న ఈ సదస్సు ప్రధాన లక్ష్యం అణు నిరాయుధీకరణే.
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఈ విషయంపై స్థూలంగా ఒక అంగీకారం కుదిరినా, ఆ తర్వాత చర్చలు ఆగిపోయాయి.
ఇప్పుడు ఈ సదస్సు ద్వారా దానికి కట్టుబడి ఉన్నట్లు ఉత్తర కొరియా నిరూపించుకోవాలనుకుంటోంది.
ఈ సదస్సు ద్వారా ఉభయ కొరియాలు రైల్వే లైన్లను కలుపుకోవడం, యుద్ధంలో విడిపోయిన కుటుంబాలు మరింత ఎక్కువగా కలుసుకునే అవకాశం కల్పించడం, ఆరోగ్య సేవల విషయంలో మరింత సహకరించుకోవాలనుకుంటున్నాయి.
2032లో ఉభయ కొరియాలు కలిసి సమ్మర్ ఒలంపిక్స్‌ను నిర్వహించే అవకాశాలనూ పరిశీలిస్తారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ భేటీ అమెరికా - ఉత్తర కొరియాల మధ్య చర్చలకు తోడ్పడుతుందా?
ఉత్తర కొరియా అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో దక్షిణ కొరియా ఆ దేశంతో కొత్త ఆర్ధిక సంబంధాలు ఏర్పరచుకోవడం అమెరికా ఆంక్షల సడలింపుపై ఆధారపడి ఉంటుంది.
ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌లు జూన్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే ఒప్పందం కుదిరినా దానికి స్పష్టమైన కాల పరిమితి ఏమీ నిర్దేశించుకోలేదు.
ఆ తరువాత కిమ్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అంతర్జాతీయ పరిశీలకులూ చెబుతున్నారు.
మరోవైపు అమెరికా కూడా తొలుత నిరాయుధీకరణ చేస్తే ఆ తరువాత ఆంక్షల ఎత్తివేత ఉంటుందని చెబుతోంది. ఉత్తర కొరియా మాత్రం ఈ ప్రక్రియ దశలవారీగా జరగాలని కోరుకుంటోంది.
కాగా... ఇటీవల మరోసారి భేటీ కోసం ఉత్తర కొరియా ట్రంప్‌కు ఆహ్వానం పంపించింది. డోనల్డ్ ట్రంప్ తొలి విడత పాలనాకాలంలోనే అణు నిరాయుధీకరణ పూర్తి చేయాలని కిమ్ భావిస్తున్నారని దక్షిణ కొరియా రాయబారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- మియాందాద్ సిక్సర్‌కి భారత్ ఎలా బదులిచ్చింది?
- అమృత కన్నీటి కథ : ‘‘నన్ను గదిలో బంధించే వారు... ప్రణయ్‌ని మరచిపోవాలని రోజూ కొట్టేవారు’’
- చంద్ర మండల యాత్రకు వెళ్లే పర్యటకుడు యుసాకు మేజావా
- అసోం: అనుమానిత ఓటరు జాబితాలో కార్గిల్ యుద్ధ సైనికులు.. పౌరసత్వంపై ప్రశ్నలు
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- ఉభయ కొరియాల చర్చలతో శాంతి నెలకొంటుందా?
- కిమ్ జోంగ్ ఉన్: ఈయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యారా?
- దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










