ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: గోరఖ్‌పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ విజయం సాధిస్తారా-గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కీర్తీ దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
గోరఖ్‌పూర్ రాజకీయాల్లో గోరఖ్ నాథ్ మఠం అనుమతి లేకుండా ఆకు కూడా కదలదని అంటుంటారు. తనకు నచ్చని అభ్యర్ధిని ప్రకటించడంతో 2002లో గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారు. నిరసనగా హిందూ సభ నుండి డాక్టర్ రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టారు.
బీజేపీకి వ్యతిరేకంగా హిందూ మహాసభ అభ్యర్థికి మఠం బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారి. శివప్రతాప్ శుక్లా నాలుగుసార్లు గెలిచిన అభ్యర్ధి. కానీ బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయింది. అదే సమయంలో గోరఖ్‌పూర్ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్‌కు, మఠానికి ఉన్న సత్తా ఏమిటో బీజేపీ హైకమాండ్‌కు తెలిసొచ్చింది.
20 ఏళ్ల తర్వాత యోగి ఇప్పుడు గోరఖ్‌పూర్ సిటీ స్థానం నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు తనతో పాటు పని చేసినవారిలో చాలామంది ఇప్పుడాయనకు పోటీగా నిలబడుతున్నారు.
గోరఖ్‌పూర్‌లో బీజేపీకి బలమైన నాయకుడు, దివంగత ఉపేంద్ర దత్ శుక్లా భార్య అయిన సుభావతి శుక్లాను సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉపేంద్ర శుక్లాకు 2018 లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలో బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఆయన ఎస్పీ కూటమి అభ్యర్ధి ప్రవీణ్ నిషాద్ చేతిలో ఓడిపోయారు.
గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూడడం 28 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఓటమి కారణంగా బీజేపీలోని ఓ వర్గం శుక్లాకు మద్దతివ్వడం లేదని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, KIRTI DUBEY
యోగికి వ్యతిరేకంగా ఏకమయ్యారు
గోరఖ్‌పూర్ నగరంలోని ఉర్దూ బజార్ సమీపంలో ఉన్న దివంగత ఉపేంద్ర శుక్లా ఇంట్లో ఆయన భార్య సుభావతీ శుక్లాను కలిశాం. ఆ ప్రాంతంలో అంతా సమాజ్‌వాదీ కార్యకర్తలు ఉన్నారు. ''యోగీజీ మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే అఖిలేశ్ దగ్గరకు వెళ్లాం. నా భర్త గౌరవం కోసం ఈ ఎన్నికల్లో పోరాడుతున్నాను'' అన్నారు సుభావతి శుక్లా.
2018 ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నా బలవంతంగా టిక్కెట్లు ఇచ్చి పోటీ చేయించారని, కానీ ఆయన ఓడిపోయారని, ఇది ఎందుకు జరిగిందో అందరికీ తెలుసుని ఆమె అన్నారు. ఇన్నాళ్లు యోగి ఆదిత్యనాథ్ కోసం ఓట్లడిగిన ఆ కుటుంబం నేడు యోగికి వ్యతిరేకంగా పోరాడుతోంది.
అయితే, ఇలాంటి వారిలో ఆమె ఒక్కరే కాదు. గతంలో బీజేపీతో, యోగితో అనుబంధం ఉండి, అవమానాలు ఎదుర్కొన్నామని భావిస్తున్న వారిని కాంగ్రెస్ పార్టీ యోగి పై పోటీ పెడుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధి చేతనా పాండే అలాంటి వారిలో ఒకరు. గతంలో ఆమె ఆరెస్సెస్ అనుబంధ విద్యార్ధి సంస్థ ఏబీవీపీలో పని చేశారు.
''అమ్మాయిలు విద్యార్ధి రాజకీయాల్లోకి కూడా రాని సమయంలో నేను ఏబీవీపీ నుంచి విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోరాడాను. ఏళ్ల తరబడి బీజేపీ, ఏబీవీపీలో పని చేశాను. అయితే ఆయన (యోగి ఆదిత్యనాథ్) ఎంత శక్తిమంతుడో తెలుసా? తన సొంత పార్టీ రాజకీయాలను మాత్రమే కాకుండా ఇతర పార్టీల రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలరు. నేను బీజేపీ సిద్ధాంతంతో పగలు, రాత్రి శ్రమించాను. కానీ పార్టీ నన్ను గుర్తించలేదు. దీనికి ఎవరు కారకులో అందరికీ తెలుసు'' అన్నారామె.

ఫొటో సోర్స్, KIRTI DUBEY
గోరఖ్‌పూర్‌లోని బ్రాహ్మణ వర్సెస్ ఠాకూర్ ఫ్యాక్టర్
యోగిపై పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బ్రాహ్మణులే. గోరఖ్‌పూర్‌లో బ్రాహ్మణ వర్సెస్ ఠాకూర్ పోరాటం దశాబ్దాల నాటిది. ఇది ఇక్కడి రాజకీయాల్లో అతిపెద్ద అంశం.
మఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్ నాథ్ కాలం నుంచి ఈ పోరాటం మొదలైంది. అప్పట్లో బ్రాహ్మణుల నాయకుడు దిగ్విజయ్‌నాథ్, సూరతీ నారాయణ త్రిపాఠి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అప్పటి నుంచి ఈ పోరు మొదలైందని చెబుతారు. దీని తరువాత బ్రాహ్మణ వర్సెస్ ఠాకూర్ పోరాటంలో హరిశంకర్ తివారీ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నిలబెట్టి నాయకుడిగా ఎదిగారు. వీరేంద్ర ప్రతాప్ షాహి ఠాకూర్‌లలో అతి పెద్ద నాయకుడయ్యారు.
1998లో గ్యాంగ్‌స్టర్ శ్రీ ప్రకాష్ శుక్లా వీరేంద్ర ప్రతాప్ షాహీని హతమార్చారని, ఆ తర్వాత ఠాకూర్‌ల నాయకత్వంలోని శూన్యతను యోగి ఆదిత్యనాథ్ పూరించారని, ఇక్కడి నుంచి ఠాకూర్ల నాయకత్వం యోగి ఆదిత్యనాథ్ చేతుల్లోకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మఠం, హటా (గోరఖ్‌పూర్‌లోని హరిశంకర్ తివారీ నివాసాన్ని హటా అని పిలుస్తారు) మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఈ పోరు సుదీర్ఘంగా సాగి చివరకు 90లలో మఠంపై యోగి ఆదిత్యనాథ్ బలం పెరిగి, హటా ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది.
గోరఖ్‌పూర్ సీటు యోగి ఆదిత్యనాథ్‌కు సురక్షితమైన సీటు. ఇక్కడి నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే మొదటిసారి. అయితే, 1998 నుండి 2014 వరకు గోరఖ్‌పూర్ నుండి ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 2002లో ఒక నినాదం పుట్టుకొచ్చింది. అది నేటికీ గోరఖ్‌పూర్ వీధుల్లో వినిపిస్తోంది. గోరఖ్‌పూర్‌లో ఉండాలంటే యోగి-యోగి అని అనాల్సిందే.
''ఈ సీటు ఆయనకు అంత సులభం కావడానికి ఒక కారణం ఉంది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ లేదా బీఎస్పీ...ఏ పార్టీ అయినా..ఇక్కడ ఒక పెద్ద నేతను తయారు చేయలేదు. ఈ పార్టీలు ప్రతిసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాయి. వాళ్లెవరూ ఇక్కడ యోగిని ఎదుర్కొనే వ్యక్తిగా నిలవలేకపోయారు'' అని సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, KIRTI DUBEY
చంద్రశేఖర్ ఛాలెంజ్
గత కొన్నేళ్లుగా గోరఖ్‌పూర్ రాజకీయాల్లో యోగిని ఎదుర్కొనే సరైన వ్యక్తి అభ్యర్థి కాలేక పోయాడు. కానీ ఈ ఎన్నికల్లో యోగితో పాటు, భీమ్ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కూడా చర్చలో నిలుస్తున్నారు.
చంద్రశేఖర్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన మొదటి పోరు కూడా ముఖ్యమంత్రి పైనే. కానీ, చంద్రశేఖర్ ఈసారి పోటీలో ఉన్నారన్న విషయం గోరఖ్‌పూర్ వీధుల్లో ఎక్కడా కనిపించదు. వీధుల్లోని హోర్డింగ్‌లలో లేదా స్థానిక వార్తాపత్రికల పేజీలలో ఎక్కడా, ఏ మూలనా ఆయన మాటలు కనిపించవు, వినిపించవు.
ఈ ప్రశ్న చంద్రశేఖర్‌ని అడగ్గా "డబ్బున్న వాళ్ల మాటలనే పత్రికలు ముద్రిస్తాయి. మేం హోర్డింగులు పెట్టాలనుకున్నా పెట్టలేము. బ్యానర్లు పెట్టడానికి అనుమతులు కావాలి. మేం పోస్టర్లు కూడా వేశాం. కానీ వాటిని చించేశారు. మేం ప్రజలను కలుస్తున్నాం. ముఖ్యమంత్రితో విసిగిపోయామని, ఈసారి మార్పు కావాలని వారు చెబుతున్నారు'' అన్నారాయన.
''నేను యోగి మీద అయోధ్య, మధుర నుంచి పోటీ చేస్తానని చెప్పాను. కానీ, ఆయన తనకు సురక్షితమైన గోరఖ్ పూర్‌కు వచ్చారు. ఈ ఐదు సంవత్సరాలు మంచిగా పాలిస్తే భయం ఎందుకు'' అని చంద్రశేఖర్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES/BBC
యోగికి లిట్మస్ టెస్ట్
గోరఖ్‌పూర్ జిల్లాలో తొమ్మిది విధాన సభ స్థానాలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తొమ్మిది స్థానాల్లో ఎనిమిది స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
అయితే, గోరఖ్‌పూర్ సిటీ సీటు తప్ప మిగతా అన్ని విధాన సభ స్థానాల్లో అగ్రవర్ణాలది నిర్ణయాత్మక పాత్ర కాదని అక్కడి కుల సమీకరణాలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలలో యాదవులు, కుర్మీలు, నిషాదులు, దళితులు ప్రభావవంతంగా ఉన్నారు.
గోరఖ్‌పూర్ రాజకీయాలను అర్థం చేసుకున్న వారు యోగికి గోరఖ్‌పూర్ సిటీ సీటులోనే కాకుండా జిల్లాలోని మిగిలిన ఎనిమిది స్థానాల విషయంలో కూడా అగ్నిపరీక్షేనని భావిస్తున్నారు.
"గోరఖ్‌పూర్ సిటీ సీటును గెలవడం యోగికి కష్టమేమీ కాదు. అయితే ఈ విజయం ఎంత పెద్దది అనేది చూడాలి. గెలుపు మార్జిన్, మరీ ముఖ్యంగా ఆయన దాదాపు ఆరు సీట్లలో కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. యోగి గోరఖ్‌పూర్‌లో మిగిలిన సీట్లను గెలవకపోతే, ఆయన తన సీటును గెలిచినా ఓడిపోయిన వ్యక్తిగానే లెక్కగడతారు'' అని జర్నలిస్ట్ మనోజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
యూపీలోని ఈ వీవీఐపీ జిల్లాలో యోగి తన లిట్మస్ టెస్ట్‌లో పాస్ కాగలరా లేదా అనేది మార్చి 3న ప్రజలు నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- వోడ్కా బ్యాన్: యుక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. అమెరికా, కెనడాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యా వోడ్కా తొలగింపు
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- యుక్రెయిన్: నాటో అంటే ఏంటి, అది రష్యా దాడులపై ఎలా స్పందించింది?
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- eSanjeevani OPD: ఆన్లైన్లో అన్ని స్పెషాలిటీల డాక్టర్లు.. పైసా ఫీజు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













