ఆక్సిజన్‌ కొరత: ‘దిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో లేదు.. బయట సిలిండర్‌ కూడా దొరకడం లేదు.. ఎలా ఊపిరి తీసుకునేది’?

covid patient

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ న్యూస్

దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్ కొరత బాధితుల్లో ఆవేశం, ఆక్రోశాలను నింపుతోంది. ఈ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.

కరోనా సోకిన బాధితులు ఆసుపత్రిలోనే మరణిస్తున్నారు. ఆక్సిజన్ లేకపోవడం వల్లేనన్న ఆందోళన ప్రతి చోటా కనిపిస్తోంది.

ఆసుపత్రులు ఆక్సిజన్ నిల్వల కోసం మీడియా, కోర్టుల తలుపులు తడుతున్నాయి.

తమ ఆప్తుల జీవితం సిలిండర్‌తో ముడిపడి ఉండటంతో అవసరమైతే బ్లాక్ మార్కెట్‌లో కొనడానికి కూడా వారు వెనకాడటం లేదు. డబ్బు ఎంతైనా సిలిండర్ దొరికితే చాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

దేశంలోనూ దిల్లీలోనూ దిగజారుతున్న పరిస్థితి

అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 3,46,756 కొత్త కేసులు నమోదయ్యాయి. 2,624 మంది మరణించారు.

దిల్లీలో రోజువారి మృతుల సంఖ్య 300 దాటింది.

''చాలా మరణాలు మా దాకా రావడం లేదు. చిన్న చిన్న ఆసుపత్రులలో కూడా వైరస్ బాధితులు మరణిస్తున్నారు'' అన్నారు ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ కో-కన్వీనర్ మాలినీ అయిసోలా.

''అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు'' అన్నారామె.

''సంక్షోభం కారణంగా పరిశ్రమలకు పంపాల్సిన ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అసలు ఆక్సిజన్ ఎక్కడుంది? అది ఎప్పుడు వస్తుంది'' అని ప్రశ్నించారు.

శుక్రవారం రాత్రి దిల్లీ రోహిణిలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో ఆక్సిజన్ లేక 20 మంది రోగులు మరణించారు.

మీడియా కథనాల ప్రకారం జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో మరణించిన కోవిడ్ -19 బాధితులంతా క్రిటికల్ కేర్ విభాగంలోని వారే. ఆసుపత్రికి సమీపంలో ఉన్న ద్రవ రూప ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో ప్రధాన గ్యాస్ పైప్‌లైన్‌కు ఆనుకుని ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఆశ్రయించారు. కానీ ప్రెజర్ లేకపోవడంతో చాలామంది రోగులు మరణించారు.

ఆక్సిజన్ తీసుకుంటున్న కరోనా రోగి

ఫొటో సోర్స్, Getty Images

కుటుంబీకుల ప్రాణాల కోసం బంధువుల పరుగులు

శుక్రవారం జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో మరణించిన వారిలో రిచాలీ అవస్థి వదిన సీమా అవస్థీ కూడా ఉన్నారు.

సీమా అవస్థి సెక్టార్-24లో ఉన్న ఇండియన్ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు.

సీమా సింగిల్ మదర్. ఆమె మరణంతో సమాజం ఒక సమర్ధురాలైన వ్యక్తిని కోల్పోయిందని రిచాలీ అవస్థీ బీబీసీతో అన్నారు.

''నేను నిన్న సాయంత్రం ఇక్కడకు వచ్చినప్పుడు, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. నేను ఆమెతో వాట్సాప్‌లో మాట్లాడాను. నా కాల్స్‌కు ఆమె త్వరగానే స్పందించారు'' అన్నారు రిచాలీ.

''మా ఇద్దరు సోదరులను ఆసుపత్రిలో చేర్పించాను. వారిద్దరి ఆక్సిజన్ లెవెల్స్ 50కన్నా తక్కువ ఉన్నాయి'' అని ఒక వ్యక్తి బీబీసీతో ఏడుస్తూ చెప్పారు.

''ఆక్సిజన్ అయిపోయిందని ఆసుపత్రి నుంచి కాల్ వచ్చింది. సిలిండర్ తెచ్చుకోవాలని వారు చెప్పారు. దీంతో నేను నా ఫ్రెండ్ దగ్గరి నుంచి ఒక సిలిండర్ తెచ్చుకున్నాను. నా ఫ్రెండ్ వాళ్ల నాన్న ఆరోగ్యం కూడా బాలేదు'' అని ఆయన వివరించారు.

అప్పుడే జైపూర్ గోల్డెన్‌ హాస్పిటల్‌కు ఆక్సిజన్ ట్యాంకర్ చేరుకుంది.

ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొస్తున్న రోగుల బంధువులు

55 ఏళ్ల నందిని రాయ్ ఏప్రిల్‌ 19న జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో చేరారు.

ప్రస్తుతం ఆమె సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు.

ఆక్సిజన్ తీసుకురావాలని ఆమె కుమారుడు పంకజ్ రాయ్‌ను ఆసుపత్రి సిబ్బంది కోరారు.

ఆక్సిజన్ సిలిండర్‌తోపాటు, ఏ లేదా బీ పాజిటివ్ ప్లాస్మా , రెమ్‌డెసివీర్ కోసం దిల్లీ అంతా తిరిగారు.

''ఆక్సిజన్ కావాలని డాక్టర్ చెప్పారు. అది లేకపోతే ప్రాణాలు నిలవడం కష్టం'' అన్నారు పంకజ్ రాయ్.

ఆక్సిజన్ ట్యాంకర్ చేరుకోక ముందు వీరు బీబీసీతో మాట్లాడారు.

''వెంటిలేటర్‌ మీద ఉన్నవారు చాలామంది మరణించారు. మా అమ్మ వెంటిలేటర్ మీద లేరు. కానీ ఆమె ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. సమయానికి ఆక్సిజన్ లేకపోతే రక్షించడం కష్టం అవుతుంది. ప్రభుత్వం మాత్రం రాజకీయాలు చేస్తోంది'' అని పంకజ్ రాయ్ అన్నారు.

''నా భర్త ఏప్రిల్ 15న ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ అందక ఏదైనా సమస్య ఏర్పడితే అది మా బాధ్యత కాదని ఆసుపత్రి వారు పేపర్ల మీద సంతకం చేయించుకున్నారు '' అని ఓ మహిళ బీబీసీకి తెలిపారు. ఈ ఆరోపణలపై ఆసుపత్రి సిబ్బంది స్పందించ లేదు.

బీబీసీ ప్రతినిధులు సర్ గంగారాం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ అనేకమంది నాన్ కోవిడ్ రోగులు చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు.

ఎయిమ్స్ ఆసుపత్రి ముందు రోగుల బంధువులు బయట వంటలు చేసుకుంటూ కనిపించారు. తమ కుటుంబ సభ్యులు ఆసుపత్రి లోపల ఉన్నారని, తమను లోపలికి అనుమతించడం లేదని వారు చెప్పారు.

ఆక్సిజన్ సిలిండర్

ఫొటో సోర్స్, Getty Images

చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత

షాలిమార్ బాగ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిని బీబీసీ ప్రతినిధులు శనివారం మధ్యాహ్నం సంప్రదించే సమయానికి అక్కడి రోగులకు మరో రెండుమూడు గంటల వరకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది.

అధికారులకు సమాచారం ఇచ్చామని.. ఆక్సిజన్ సరఫరా కోసం నిరీక్షిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

ఆక్సిజన్ వచ్చేవరకు కొత్తగా రోగులను చేర్చుకోవడం లేదని.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.

బాత్రా, మూల్‌చాంద్, సరోజ్ హాస్పిటల్ సహా అనేక ఇతర ఆసుపత్రులు ఆక్సిజన్ కోసం ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాయి.

ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లు ఉపయోగిస్తున్న అనేక మంది రోగులు కూడా సకాలంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్నారని ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ కో కన్వీనర్ మాలిని అసోలా చెప్పారు.

ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరక్క చాలామంది ఇళ్లలోనే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసుకుంటున్నారని, కొందరు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)