కోవిడ్: ‘భోజనం పెట్టినందుకు కరోనా రోగులు చేతులెత్తి నమస్కరించారు.. కన్నీరు ఆపుకోలేకపోయాం’

ఆహారం సిద్ధం చేస్తున్న అక్షయ్ టీం
ఫొటో క్యాప్షన్, ఆహారం సిద్ధం చేస్తున్న అక్షయ్ టీం
    • రచయిత, రాహుల్ గైక్వాడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడకు వచ్చి కోవిడ్ బారిన పడినవారు ఉన్నారు. వారికి భోజనం అందించడానికి ఎవరూ లేరు. మేం వారికి ఆహారం సరఫరా చేసినపుడు వారు మాకు చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పారు. సమాజానికి ఎంతో కొంత చేస్తున్నామనే సంతృప్తి కలిగింది’’ అని నాసిక్‌లో కరోనా రోగులకు, వృద్ధులకు ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్న అక్షయ్ చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది. రోజురోజుకూ దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

కొన్ని కేసుల్లో కుటుంబ సభ్యులంతా వైరస్ బారిన పడుతున్నారు. అలాంటి వారి కోసం అక్షయ్ వంటి యువకులు మహారాష్ట్రలో చాలా చోట్ల ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

పుణెలో ఆకాంక్ష సదేకర్, ముంబయిలో బాలచంద్ర జాదవ్ కూడా ఇలాంటి సాయమే చేస్తున్నారు.

ఆహారం

అక్షయ్ నాసిక్‌లో ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నారు. నాసిక్‌లో కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, చాలా మంది భోజనం ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోతున్నారు.

నాసిక్‌లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రోగులు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. వీరందరికీ భోజనం అందించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ్, ఆయన భార్య కరోనా రోగులకు ఉచితంగా భోజనం అందించాలని నిర్ణయించుకున్నారు.

వారు రోజుకు 100 మందికి భోజనం అందిస్తారు. ఈ ఖర్చంతా అక్షయ్ సొంతంగా భరిస్తారు. గత లాక్ డౌన్‌లోనూ అక్షయ్ తన సహోద్యోగులతో కలిసి కాలి నడకన గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఆహారం సరఫరా చేశారు.

"ఈ మహమ్మారి సమయంలో ఎవరికి వారే భోజనం సమకూర్చుకోవడం చాలా కష్టంగా ఉంటోంది. అలాంటి వారికి సహాయం చేయాలని మేం అనుకున్నాం. నేను నా భార్యతో ఈ విషయాన్ని చర్చించినప్పుడు ఆమె వెంటనే స్పందించారు. వెంటనే మేం ఈ సేవ చేయడం మొదలుపెట్టాం. కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడమే మా లక్ష్యం. ఎప్పుడైనా నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవచ్చు. అందుకే నేను చేయగలిగినంత వరకు సహాయం చేస్తాను" అని అక్షయ్ అన్నారు.

ఆకాంక్షఆమె స్నేహితురాలు రౌనిత సహాయంతో కరోనా రోగులకు భోజనం అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, AKANKSHA

ఫొటో క్యాప్షన్, ఆకాంక్షఆమె స్నేహితురాలు రౌనిత సహాయంతో కరోనా రోగులకు భోజనం అందిస్తున్నారు.

ఆకాంక్ష యూకేలో చదువుకుని వచ్చి అయిదేళ్లుగా ఇండియాలో ఉంటున్నారు. ఆమె కూడా అవసరమైన వారికి భోజనం సరఫరా చేస్తున్నారు.

స్నేహితురాలు రౌనిత సహాయంతో ఆమె ఏప్రిల్ 6 నుంచి భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారు 1,250 మందికి ఆహారం అందించారు.

చిన్నప్పటి నుంచే పక్కవారికి సహాయం చేయాలనే విషయాన్ని నాకు నేర్పించారు. కరోనాతో ఇంత మంది బాధపడుతుంటే మేం కొంత మందికైనా సహాయం చేయాలని అనుకున్నాం.

చాలా అవసరంలో ఉన్న వారికి మేం భోజనం అందిస్తాం. ఆసుపత్రిలోనే కాదు హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా రోగులకు కూడా ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్నాం. బస్ స్టాప్ ల దగ్గర ఉన్న వారికి, అంబులెన్స్ డ్రైవర్లకు కూడా భోజనం సరఫరా చేస్తున్నాం" అని ఆకాంక్ష చెప్పారు.

"చాలా మంది మమ్మల్ని భోజనం కావాలని అడుగుతారు. కొంత మంది డబ్బులు చెల్లించి కొనుక్కోగలిగే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి మేం దగ్గరలో ఉన్న మెస్ నంబర్లు ఇస్తాం" అని చెప్పారు.

బాలచంద్ర

ముంబయిలోని పరేల్ ప్రాంతంలో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండే వారికి బాలచంద్ర జాదవ్ ఉచితంగా భోజనం పంపిస్తారు. ఆయన కేటరింగ్ వ్యాపారం చేస్తారు.

అలాగే, పరేల్, షివ్ దీ, వడాల ప్రాంతాల్లో కూడా రోగులకు ఆయన ఉచితంగా భోజనం అందిస్తారు. గత లాక్ డౌన్ సమయంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆయన ఈ పని మొదలుపెట్టారు. "మనసుండాలే కానీ మార్గముంటుంది" అంటారాయన.

ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండేవారికి ఆహారం ఇవ్వడానికి సాధారణంగా చాలా మంది భయపడతారు. దాంతో, ఆయన ఈ పని చేయడానికి సంకల్పించారు. ఆయన తన ఆలోచన గురించి వాట్సాప్‌లో అందరికీ తెలియజేశారు.

ఆయనకు చాలా మంది నుంచి భోజనం కోసం అభ్యర్ధనలు వస్తూ ఉంటాయి. ఆయన ప్రస్తుతం రోజుకు రెండు పూటలా 35-40 మందికి భోజనం సరఫరా చేస్తున్నారు. వీటిని ఇళ్లకు తీసుకుని వెళ్లి ఇవ్వడానికి ఆయన దగ్గర పని చేసే కేటరింగ్ సిబ్బంది ఉన్నారు.

"మేం అవసరంలో ఉన్న వారికి సహాయం చేయగలుగుతున్నామనే భావన బాగుంటుంది. ప్రజలు మాకు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతారు. అలాంటి సందర్భాల్లో మేము కన్నీటిని ఆపుకోలేము. ఇంకా చాలా మంది ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగుంటుంది" అని బాల చంద్ర అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)