తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన లేదన్న కేంద్ర వ్యవసాయ మంత్రి -ప్రెస్‌ రివ్యూ

పసుపు బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచన లేదని కేంద్రం తెలిపింది.

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది. రాజ్యసభలో ఈనెల 12న టీఆర్‌ఎర్‌ ఎంపీ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు.

పసుపుతోపాటు హార్టికల్చర్‌ సాగులో సహాయం చేసేందుకు ఇప్పటికే అనేక పథకాలు అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యశాఖ ఇప్పటికే నిజామాబాద్‌లో స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు.

పసుపుతోపాటు ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రచారంకోసం తెలంగాణలో వరంగల్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాల్లో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నట్లు ఈ కథనం తెలిపింది.

దేశంలో అత్యధికంగా పసుపు పండిస్తున్నది తెలంగాణేనని, దేశంలో ఉత్పత్తి అవుతున్న పసుపులో మూడింట ఒకవంతు రాష్ట్రం నుంచే వస్తున్నదని ఈ కథనం పేర్కొంది. 2019-20లో దేశవ్యాప్తంగా 1,153 టన్నుల పసుపు ఉత్పత్తి కాగా ఇందులో తెలంగాణ వాటా 386.5 టన్నులు (33.5 శాతం) ఉందని వెల్లడించింది.

సగటు ఉత్పత్తిలోనూ తెలంగాణ టాప్‌లో ఉందని, రైతులు ఒక్కో హెక్టారుకు సగటున 6,973 కిలోల పంట తీశారని, ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు ఉన్నాయని నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది.

ప్రవీణ్‌ కుమార్‌
ఫొటో క్యాప్షన్, హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిన ప్రార్ధనలో ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ పాల్గొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ- వివాదంలో ఐఏఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

సోషల్‌ వెల్వేర్‌ ఏరో(స్వేరో)నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిందూ దేవుళ్లను పూజించబోమంటూ ప్రతిజ్ఞ చేయించడం, ఆ కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్న వీడియో వైరల్‌ అయ్యిందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనం ఇచ్చింది.

'నాకు రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను. నాకు గౌరి మీద, గణపతి మీద, ఇతర హిందూ దేవతలెవరి మీదా నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను... అంటూ వివిధ దేవీదేవతల పేర్లను ప్రస్తావిస్తూ వందలాది మంది ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో ఒకటి సోమవారంనాడు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది.

స్వేరో పవిత్ర మాసం (మార్చి 15 - ఏప్రిల్‌14) సందర్భంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌, ధూళికట్ట గ్రామాల మధ్యగల బౌద్ధస్తూపం వద్ద పాలరాతి బుద్ధవిగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన కూడా చేయి చాచి నిలబడ్డారు.

కాగా ఈ కార్యక్రమానికి హాజరైన ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి కన్నం అంజయ్య ఆ ప్రతిజ్ఞను తీవ్రంగా ఖండించారు. బుద్ధుడు కూడా తొలుత హిందువేనని, హిందువులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆయన 'జైశ్రీరాం' అనడంతో అక్కడున్నవారంతా 'జై శ్రీరాం' అన్నారు. అయితే కులమతాలను నిందించేది భీమ్‌ దీక్ష కాదని, మంచి ఏ మతంలో ఉన్నా స్వీకరిస్తామని ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. బానిసత్వ భావజాలం పోవాలంటే స్వేరోయిజం కావాలని ఆయన అన్నారు.

సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోపై స్పందించిన ప్రవీణ్‌కుమార్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ధూళికట్టలో జరిగిన కార్యక్రమానికి తాను హాజరయ్యానని.. అక్కడ ఒక బౌద్ధ కుటుంబం వేదికపైకి వచ్చి బుద్ధవందనం చేశారని వివరించారు.

అలాగే 1956లో నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో అంబేడ్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు చేసిన ప్రతిజ్ఞను వారు వేదికపై పఠించారని ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.ఆ కుటుంబంతో తనకుగానీ, స్వేరో ప్రతినిధులకు గానీ ఏ సంబంధం లేదని, బుద్ధవందనం తర్వాత వారు చెప్పినదానితో తాము ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు.

ఇది ఎవరి మతపరమైన మనోభావాలనైనా గాయపరిచి ఉంటే, అందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు.

అయితే ప్రవీణ్‌ కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ఫేక్‌ వీడియోను సృష్టించి సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని స్వేరోస్‌ ఆరోపించింది. వీడియోకు వివాదాస్పద ఆడియోను జోడించినట్లు స్పష్టంగా తెలుస్తోందని తెలిపింది. ఫేక్‌ వీడియోపై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు హిందు దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుచేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆయనను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని విశ్వహిందు పరిషత్‌ డిమాండ్‌ చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

కృష్ణా ట్రిబ్యునల్‌

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

ఫొటో క్యాప్షన్, తమ ప్రాజెక్టులను సందర్శించాలనడం సరికాదని ఏపీ ప్రభుత్వం అన్నది

తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించండి-కృష్ణాబోర్డుకు ఏపీ ప్రభుత్వ లేఖ

విభజన చట్టాన్ని ఉల్లంఘించి అపెక్స్ కౌన్సిల్, కృష్ణాబోర్డు, కేంద్ర జలసంఘాల అనుమతి తీసుకోకుండా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టుల పనులను ముందుగా పరిశీలించాలని కృష్ణాబోర్డుకు సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ జారీచేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా ఉల్లంఘించి, పనులు చేస్తోందని అనేకమార్లు బోర్డుకు చేసిన ఫిర్యాదులను గుర్తు చేసింది.

కొత్తగా ఆయకట్టుకు నీరందించేందుకు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు వాటా నీటిని వాడుకుని పాత ఆయకట్టుకు సమర్థవంతంగా నీరు అందించడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని స్పష్టంచేసింది.

తెలంగాణ ప్రాజెక్టుల పనులను పరిశీలించకుండా.. రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేస్తామని, అందుకు నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని తమను కోరడం సబబుకాదని ఈ లేఖలో తెలిపినట్లు సాక్షి కథనం వెల్లడించింది.

మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి వస్తామని అందుకు నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి ఈనెల 4న కృష్ణా బోర్డు లేఖ రాసింది.

రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని ఎన్జీటీ కృష్ణాబోర్డును ఆదేశించలేదని, కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తోందా లేదా అన్నది పరిశీలించకుండా రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేయడం సమంజసం కాదని కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సాక్షి కథనం వెల్లడించింది.

నిర్మలా సీతారామన్‌

ఫొటో సోర్స్, Nirmala Sitharaman/twitter

ఫొటో క్యాప్షన్, ప్రైవేటీకరణకు లాభనష్టాలు ప్రాతిపదిక కాదని కేంద్ర ఆర్ధిక మంత్రి వెల్లడించారు.

అప్పులు ఎక్కువ, ఉత్పాదకత తక్కువ- స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం

కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కావని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది. ప్రైవేటీకరణ ద్వారా సమకూరిన వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి వివరించారు.

సోమవారం లోక్‌సభలో వైసీపీ సభ్యుడు బాలశౌరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి, విశాఖ స్టీల్‌ప్లాంటు నష్టాలకు ప్రధాన కారణం ప్రత్యక్ష పరోక్ష వ్యయాలు, అధిక రుణ భారం, తక్కువ ఉత్పాదకతలేనని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ స్టీల్‌తోపాటు దాని అనుబంధ, సంయుక్త వ్యాపార భాగస్వామ్య సంస్థలన్నింటిలో ప్రైవేటీకరణ రూపంలో 100% వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టాలని నిర్ణయించామన్నారు.

2019-20లో 84 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు వాటి మాతృ, అనుబంధ సంస్థలతో సహా నష్టాలు మూటగట్టుకున్నాయి. ఒక్కో సంస్థ నష్టాలకు ఒక్కో కారణం ఉందని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.

ఆయా సంస్థల నష్టాలు, ఖాయిలాకు కనిపించే ఉమ్మడి కారణం మాత్రం మూలధన కొరత, పాతకాలపు యంత్ర పరికరాలు, కాలం చెల్లిన సాంకేతికత, తక్కువ వినియోగ సామర్థ్యం, ఆస్తులు అప్పుల వాటా నిర్మాణం సరిగా లేకపోవడం, ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం, బలహీనమైన మార్కెటింగ్‌ వ్యూహాలు, మార్కెట్‌ పోటీని ఎదుర్కొనే సత్తా లేకపోవడం, ఆవిష్కరణలు కొరవడటం, ప్రభుత్వ ఆర్డర్లపై ఎక్కువగా ఆధారపడటమే' అని నిర్మలా సీతారామన్‌ వివరించినట్లు ఈనాడు కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)