భారతీయ టీపై అంతర్జాతీయ కుట్ర: అసోంలో ప్రధాని మోదీ ఆగ్రహం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/narendramodi
భారతీయ ‘టీ’ని అపఖ్యాతిపాలు చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతున్నదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని, కుట్రదారులపై పోరులో తేయాకు కార్మికులు తప్పక విజయం సాధిస్తారని చెప్పారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. త్వరలో ఎన్నికలు జరుగనున్న అసోంలో మోదీ ఆదివారం పర్యటించారు. పక్షం రోజుల వ్యవధిలో ఆయన అసోం రావడం ఇది రెండోసారి. రాష్ట్ర హైవేల అభివృద్ధి పథకం ‘అసోం మాల’ను ప్రారంభించడంతో పాటు రెండు వైద్య కళాశాలలకు మోదీ శంకుస్థాపన చేశారు.
తేయాకు తోటల సాగులో అసోంది ప్రముఖ స్థానం. ఈ నేపథ్యంలో భారతీయ టీపై కుట్ర విషయాన్ని మోదీ ప్రస్తావించారు. దేశం వెలుపల ఈ కుట్ర జరుగుతున్నదంటూ పరోక్షంగా ఎన్జీవో ‘గ్రీన్‌పీస్' నివేదికను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లోని తేయాకు తోటల్లో ఎరువులను అధికంగా వినియోగిస్తున్నారని ఆ సంస్థ తన నివేదికలో ఆరోపించింది. ఇటువంటి దాడిని భారత తేయాకు తోటల కార్మికులు సహించరని మోదీ మండిపడ్డారు.
ప్రతి రాష్ట్రంలో మాతృభాషలో బోధించే కనీసం ఒక వైద్య కళాశాల, రెండు సాంకేతిక కళాశాలలు ఉండాలని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/KalvakuntlaChandrashekarRao
పదేళ్లు నేనే సీఎం.. మార్పు చేయాల్సి వస్తే అందరికీ చెప్పాకే నిర్ణయం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని, త్వరలో కేటీఆర్ సీఎం పీఠంపై కూర్చుంటారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ద్వంద్వంగా కొట్టిపారేశారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ఇటీవల టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా దీనిపై మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతానని హెచ్చరించారు. మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు.
ఆదివారం టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘నాకేమైంది? మంచిగనే ఉన్నా కదా! నేను నచ్చలేదా మీకు? ముఖ్యమంత్రి పదవికి నేను పనికిరానా? సీఎం పదవికి నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘‘టీఆర్‌ఎస్ పార్టీకి ఒక విధానం, నిర్మాణం ఉన్నాయి. ఒకవేళ మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటే, నేను కేంద్రానికి వెళ్లాలి, నా అవసరం అక్కడ ఉందని అనుకుంటే, మీ అందరినీ పిలుస్తా.. మాట్లాడుతా. అందరి అభిప్రాయాలతోనే ఏకగ్రీవంగా మార్పు చేస్తా. అనవసర రాద్ధాంతం, అక్కరలేని విషయాలు ఎందుకు?’’ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ వస్తే కేసీఆర్ జైలుకే: ఇన్‌చార్జి మాణికం ఠాగూర్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపడం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ చెప్పినట్లు ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి రాష్ట్రంలోని అక్రమ సంపాదన బదిలీ అవుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తాయన్న భయంతోనే దిల్లీ వెళ్లినప్పుడల్లా మోదీ, అమిత్‌షాలకు ఆయన మోకరిల్లుతున్నారని విమర్శించారు.
మాణికం ఠాగూర్ ఖమ్మంలో ఆదివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని తరచూ భాజపా నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి అవి ఎందుకు చేరడంలేదని ఠాగూర్ ప్రశ్నించారు.
దిల్లీలో దోస్తీ-గల్లీల్లో కుస్తీలా తెరాస-భాజపా వ్యవహరిస్తూ ఉండటం వల్లే సీఎం అవినీతి మోదీ ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి సరైన శిక్ష పడాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఫొటో సోర్స్, facebook/BSYBJP
సీఎం పదవి నుంచి నన్ను ఎవరూ దింపలేరు: యడియూరప్ప
తనను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరూ దింపలేరని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతు తనకు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. సీఎం మార్పుపై కర్నాటకలో సాగుతున్న ప్రచారంపై శనివారం యడియూరప్ప స్పందించారు. కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు.
ఉగాది తర్వాత ఏప్రిల్ 13వ తేదీన కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇటీవల ప్రకటన చేశాడు. ఆయనతోపాటు మరికొందరు నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండడంతో యడియూరప్ప అసెంబ్లీ వేదికగా వారికి జవాబిచ్చారు.
అమిత్ షా తన వెన్నంటి ఉన్నంత వరకూ తాను న్యాయ పోరాటాలన్నింటినీ దీటుగా ఎదుర్కొని బయటకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద కేసులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం మార్పుపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది.

ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









