#20thYearOfNaMo: ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీకి 20 ఏళ్లు.. ప్రధాని మీడియాతో మాట్లాడకపోవటానికి కారణం ఏంటి?

ఫొటో సోర్స్, The India Today Group
- రచయిత, అపూర్వ కృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
#20YearOfNaMo- ఈ హ్యాష్‌ట్యాగ్ బుధవారం ఉదయం నుంచి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
దీనికి కారణం- సరిగ్గా 20 సంవత్సరాల కిందట అంటే 2001 సంవత్సరంలో ఇదే రోజున నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మోదీ రాజ్ మొదలై నేటికి 20 సంవత్సరాలు పూర్తయింది.
2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
ఆయన సీఎం కావడానికి కొన్ని నెలల ముందు గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంపానికి దాదాపు 20వేల మంది మరణించారు.
ఈ విపత్తు సహాయ కార్యక్రమాల్లో అప్పటి సీఎం కేశూభాయ్ పటేల్, ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దాని ఫలితంగా ఆయన్ను పదవి నుంచి తొలగించి నరేంద్రమోదీని పీఠంపై కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం.
2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లో అల్లర్లు చెలరేగిన నాటికి మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఐదు నెలలైంది. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా ఒత్తిళ్లు కూడా వచ్చాయి. కానీ మోదీ కొనసాగారు.
డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 182 సీట్లలో 127 సీట్లను గెలుచుకోవడం ద్వారా బీజేపీ అత్యధిక మెజారిటీ సాధించింది. మరోసారి మోదీ ముఖ్యమంత్రి అయ్యారు.
మోదీ నాయకత్వంలో 2007, 2012 ఎన్నికలలో కూడా గుజరాత్‌లో బీజేపీ సులభంగా అధికారాన్ని నిలుపుకుంది. ఆ రాష్ట్రానికి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు ఆయనకు దక్కగా, మోదీ నాయకత్వంలో గుజరాత్ మోడల్‌కు మంచి పేరు వచ్చింది.
2013లో మోదీని బీజేపీ తన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరమే ఆయన గుజరాత్ నుంచి దిల్లీ వచ్చారు. ఆయన్ను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించుకుని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
2019లో కూడా మోదీ విజయ యాత్ర కొనసాగింది. వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA
అక్టోబర్ 7ను ప్రధాని మోదీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పండగ రోజుగా మార్చేశారు. పార్టీ నుంచి ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, కార్యకర్తలు ఆయనపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
“ 2001 అక్టోబర్ 7వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. మోదీజీ మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది. అప్పటి నుంచి ఆయన ప్రతి ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ప్రజాదరణ పెంచుకుంటూ వస్తున్నారు” అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ట్వీట్ చేశారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోంమంత్రిగా పని చేసిన అమిత్‌షా ఇప్పుడు దేశానికి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ప్రధానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
"130 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను ఎవరైనా నిజంగా అర్థం చేసుకోగలిగినవారు ఉన్నారా అంటే ఆయన నరేంద్ర మోదీనే. తన దూరదృష్టితో బలమైన, ఆధునిక, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని సృష్టిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన 20వ సంవత్సరం పూర్తి చేసుకోవడాన్ని నేను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను" అని అమిత్ షా తన ట్వీట్‌లో రాశారు.
నరేంద్ర మోదీ సాధించిన విజయాలను పేర్కొంటూ, భారతీయ జనతా పార్టీ కూడా అనేక ట్వీట్లు చేసింది.
ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీని అమెరికా మాజీ అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, బిల్ క్లింటన్, జార్జ్.డబ్ల్యూ.బుష్, బరాక్ ఒబామాలతోపాటు, బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్, మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడుఫ్రాన్సిస్ మిట్టరాండ్, జర్మనీ మాజీ ఛాన్స్‌లర్ హెల్మట్ కోల్‌తో పోల్చింది బీజేపీ.
మోదీ ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఫొటో సోర్స్, PRAKASH SINGH
హాథ్‌రస్‌పై మౌనం ఎందుకు ?
కానీ గత కొద్దిరోజులుగా భారతదేశంలో ట్రెండింగ్‌లోఉంటూ, టీవీలు, పేపర్లు, అన్ని రకాల మీడియాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం హాథ్‌రస్ సంఘటన.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణల వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కల్పించుకోవడం సరికాదని భారత్ స్పష్టం చేసింది.
ఐక్యరాజ్య సమితి మాట్లాడటం అనవసరం కావచ్చు. కానీ దీనిపై ప్రధాని ఏమీ మాట్లాడాల్సిన పని లేదా ? “ ఒక దళిత యువతి అత్యాచారానికి గురైంది. అధికారులందరూ ఆమె కుటుంబీకులను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ దేశ ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడరు’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
“హాథరస్‌లో జరిగిన ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన యూపీ నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. కానీ యూపీలో ఎన్ని హాథ్‌రస్‌లు ఉన్నాయో ఆయనకు తెలియదా? మా సోదరిని ఎందుకు గడ్డిపోచలా కాల్చేశారు’’ అని దళిత హక్కుల సంస్థ భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ ప్రశ్నించారు.
హాథరస్ విషయంలో ప్రధాని మౌనాన్ని అనేకమంది నేతలు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
అయితే ఒక్క హాథ్‌రస్ విషయంలోనే కాదు చాలా విషయాలలో ఆయన మౌనంగా ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times
ప్రధాని మాట్లాడాల్సిన అవసరం ఉందా?
ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన నోరు విప్పడం అవసరమా, అనవసరమా? హాథ్‌రస్‌వంటి విషయాలో ప్రధాన మంత్రి మాట్లాడాలనుకోవడం తార్కికం, ఆచరణీయంకాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
“ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలను పరిశీలిస్తే దేశంలో గంటగంటకు అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రధాని ప్రతి అంశంపైనా మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన పని చేయడానికి ఉండదు. అధికారులు, ఆ రాష్ట్ర సీఎం మాట్లాడుతున్నారు. దర్యాప్తు జరుగుతోది. ఇంకా ప్రధాని మాట్లాడాల్సిన పనేంటి?” అన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్.
ఇందులో మరో ఇబ్బంది కూడా ఉందంటారు ప్రదీప్ సింగ్. “ఈ సంఘటనపై ఆయన ఇవాళ మాట్లాడితే, పది రోజుల తర్వాత మరో ఘటన జరుగుతుంది. యూపీ ఘటనపై మాట్లాడారు కదా, దీనిపై కూడా మాట్లాడండి అంటారు. ప్రతి రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఎందుకు మాట్లాడరు అని అడుగుతారు. ఒక రాష్ట్రం గురించి మాట్లాడి, మరో రాష్ట్రం గురించి మాట్లడకపోతే ఇబ్బంది అవుతుంది” అన్నారు ప్రదీప్ సింగ్.
ప్రధాని ఏదో ఒకటి మాట్లాడాలని ఆశించడం సరికాదని, మాట్లాడినా మాట్లాడకపోయిన పెద్దగా తేడా ఏమీ ఉండదని మరో సీనియర్ జర్నలిస్ట్ అదితి ఫడ్నిస్ అభిప్రాయపడ్డారు.
“ఆయన ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగుందని అంటారు. బాగాలేదని అనలేరు. ఎందుకంటే వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం. దేశంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ ఆయన మౌనం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు’’ అన్నారామె.
ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలలో మౌనంగా ఉండటమే మంచిదని ఆయన భావిస్తూ ఉండవచ్చని అదితి ఫడ్నిస్ అన్నారు.
“సీఎంగా ఉన్న రోజుల్లో ముఖ్యమంత్రి రాజధర్మం పాటించాలంటూ అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని పరోక్షంగా విమర్శించారు. అప్పట్లో ఆయన బాధితుడు. ముఖ్యమంత్రులు తమ విధిని నిర్వర్తించరని ఆయన ఎందుకు అనుకుంటారు’’అని విశ్లేషించారు అదితి.
ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే అంశాలపై ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు కచ్చితంగా డిమాండ్ చేస్తాయన్నారు పాత్రికేయులు ప్రదీప్ సింగ్. ఏ ప్రధాని కూడా ప్రతిపక్షాల ఉచ్చులో పడాలని కోరుకోరు అంటారాయన.
“బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలు వచ్చినప్పుడు రాజీవ్‌గాంధీ నుంచి ప్రతిపక్షాలు సమాధానం కోరాయి. కానీ ఏం జరిగింది? ఆయన దొంగ అంటూ వీధుల్లో నినాదాలు, ఆందోళనలు చేశారు’’ అని ప్రదీప్ సింగ్ గతంలో జరిగిన విషయాలను గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, Hindustan Times
మౌని మన్మోహన్?
నరేంద్ర మోదీ మౌనంగా ఉంటున్నారని అందరూ విమర్శిస్తున్నారు. మరి ఆయనలాగా మౌనంగా ఉన్న ప్రధానులు ఎవరూ లేరా అన్నప్పుడు “మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడారు? నిర్భయ ఘటన జరిగినా ఆయన ఒక్కసారి కూడా స్పందించలేదు ’’ అని పాత్రికేయురాలు అదితి ఫడ్నీస్ అన్నారు.
రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉండాలనే వ్యూహం చాలా పాతదని, క్లిష్టమైన సందర్భాలలో నేతలు దీనిని పాటిస్తున్నారని అదితి అంటారు. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల గురించి ప్రధాని ఏమీ మాట్లాడలేదని, జీఎస్టీ మీద రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినా ఆయన మౌనంగానే ఉన్నారని అదితి గుర్తు చేశారు.
తాము అధికారంలో లేని రాష్ట్రాలలో ఎక్కడ సమస్య వచ్చినా బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అంటారామె.“ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీపై విమర్శలు గుప్పిస్తారు. కానీ వలస కూలీల సంక్షోభంపై నితీశ్ కుమార్‌ను ఏమీ అనరు. శివసేనపై కాస్త స్వరం పెంచినా, ఎప్పటికైనా మళ్లీ తమతో కలుస్తారు కదా అన్నట్లు ఎక్కువగా మాట్లాడ లేదు"అన్నారు అదితి.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ- మీడియా
మీడియాతో మాట్లాడే విషయంలో మోదీ ఇతర ప్రధాన మంత్రులకన్నా భిన్నంగా ఉన్నారని విశ్లేషించారు జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్.
“2002 అల్లర్ల నుంచి 2007 సంవత్సరం ఎన్నికల వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే తాను చెప్పేదానిపై పట్టింపు లేకుండా జర్నలిస్టులు తాము రాయాలనుకున్నది రాస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే మీడియాతో మాట్లాడటం మానేశారు” అన్నారు ప్రదీప్ సింగ్.
“ముఖ్యమంత్రి కావడానికి ముందు మోదీ చాలా కలుపుగోలుగా ఉండేవారు. మీడియాతో చక్కగా మాట్లాడి వాళ్లను ఉపయోగించుకునే వారు” అన్నారు అదితి ఫడ్నిస్. “ ఇది నిజంగానే చాలా క్లిష్లమైన వ్యవహారంగా మారింది. ఒక్క మోదీ సర్కారే కాదు, అన్ని ప్రభుత్వాలు మీడియాను ముల్లులాగానే భావిస్తున్నాయి” అన్నారామె.
“మీడియా నన్ను వ్యతిరేకించినా ఈ స్థాయికి చేరుకున్నాను. అలాంటప్పుడు నేను వాళ్లతో ఎందుకు మాట్లాడాలి, ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలి అని ప్రధాని భావిస్తూ ఉండి ఉంటారు” అని అభిప్రాయపడ్డారు ప్రదీప్ సింగ్.
ఇవి కూడా చదవండి:
- మోదీకి మీడియా అంటే భయమా? ఇంటర్వ్యూల్లో ఆయన తీరు ఎలా ఉంటుంది?
- కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- చైనా విషయంలో నెహ్రూ చేసిన తప్పునే మోదీ కూడా చేస్తున్నారా?
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- ఇందిరాగాంధీతో పోటీపడుతున్న నరేంద్ర మోదీ
- ఇప్పటికీ నరేంద్ర మోదీని చూసే బీజేపీకి ఓట్లు వేస్తున్నారు.. ఎందుకు?
- కరోనా వైరస్ సోకినవారిలో కనిపించే లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
- ‘‘ఆ విషప్రయోగంతో నరకానికి వెళ్లొచ్చినట్లు ఉంది.. పుతిన్ వల్లే ఇదంతా’’ - రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ
- కరోనావైరస్ వల్ల కంటి సమస్యలు వస్తున్నాయా?
- సరిహద్దుల్లో విధులకు వెళుతూ చైనా సైనికులు ఏడ్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








