అలెక్సీ నావల్నీ: ‘‘ఆ విషప్రయోగంతో నరకానికి వెళ్లొచ్చినట్లు ఉంది.. పుతిన్ వల్లే ఇదంతా’’ - రష్యా ప్రతిపక్ష నాయకుడి ఆరోపణ

నావల్నీ
ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన నావల్నీ బెర్లిన్‌లో తన భార్య యూలియా, కుమారుడు జఖర్‌తో కలిసి ఉంటున్నారు

నరాలను తీవ్రంగా ప్రభావితం చేసే విష ప్రయోగం జరిగిన తరువాత కోలుకోవడం ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ తెలిపారు.

ఆయన, బీబీసీ రష్యాతో మాట్లాడుతూ…ఇప్పుడు తన ఆరోగ్యం చాలా మెరుగయ్యిందని, త్వరలో రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు తెలిపారు.

బెర్లిన్ చారిటీ ఆస్పత్రిలో 32 రోజుల చికిత్స అనంతరం నావల్నీని కట్టుదిట్టమైన భద్రత మధ్య బెర్లిన్‌లో ఒక హోటల్‌కు తరలించారు. అక్కడ బీబీసీ, నావల్నీని కలిసి మాట్లాడింది.

"మొదట్లో వణుకు వచ్చేది. నొప్పులేమీ ఉండేవి కావు. కానీ, జీవితం ముగింపు దశకు వచ్చేసినట్లు" అనిపించేదని నావల్నీ తెలిపారు.

"అసలు నొప్పి, బాధ ఏమీ ఉండవు. అకస్మాత్తుగా ఆనారోగ్యం పాలయినట్టు కూడా ఉండదు. ఏదో గజిబిజిగా, జరగకూడనిదేదో జరిగినట్టు అనిపిస్తుంది. తరువాత ఒకటే ఆలోచన వస్తుంది..అంతే, అయిపోయింది, నేను చనిపోబోతున్నాను అనిపిస్తుంది" అని ఆయన వివరించారు.

నావల్నీ, ఆగస్ట్ 20న సైబీరియానుంచీ మాస్కోకు విమానంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే విమానం అత్యవసర ల్యాండింగ్ చెయ్యడం వలన ఆయన ప్రమాదంనుంచీ బయటపడగలిగారు.

నావల్నీని బెర్లిన్ తరలిస్తున్న వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, EPA

తరువాత, నావల్నీని హుటాహుటిన బెర్లిన్‌కు తరలించి అక్కడ ఆస్పత్రిలో చికిత్సనందించారు.

నోవిచోక్ విష ప్రయోగం జరిగినట్లు నిర్థరణ అయ్యింది

నావల్నీకి నోవిచోక్ విష ప్రయోగం జరిగిందని ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (ఓపీసీడబ్ల్యూ) నిర్థరించింది.

ఫ్రెంచ్, స్వీడిష్ ప్రయోగశాలలు కూడా నోవిచోక్ ప్రయోగం జరిగినట్లు ధృవీకరించాయని జర్మనీ తెలిపింది.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచిన నోవిచోక్ ఏజెంట్లు చాలా విషపూరితమైనవి. చాలా చిన్న మొత్తం కూడా మనిషి ప్రాణాలను హరించగలదు.

వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఆధిపత్యానికి ముప్పు వాటిల్లుతుందన్న భయంతోనే రష్యాన్ అధికారులు తనకు విష ప్రయోగం చేసారని నావల్నీ గతవారం ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆరోపించారు.

అయితే, రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరించింది. నావల్నీపై విష ప్రయోగం జరగలేదని ఆయనకు చికిత్స అందించిన రష్యన్ డాక్టర్లు తెలిపారు.

'విష ప్రయోగం' బారి నుంచి తన భర్త బయటపడతాడని అనుకోలేదని నావల్నీ భార్య యూలియా చెప్పారు
ఫొటో క్యాప్షన్, ‘విష ప్రయోగం’ బారి నుంచి తన భర్త బయటపడతాడని అనుకోలేదని నావల్నీ భార్య యూలియా చెప్పారు

"ఈ చర్య వెనుక (రష్యా అధ్యక్షుడు) పుతిన్ హస్తం ఉందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. ఇది తప్ప నాకు వేరే కారణం కనిపించట్లేదు" అని నావల్నీ జర్మన్ వార్తా పత్రిక డెర్ స్పీగల్‌కు తెలిపారు.

బీబీసీతో మాట్లాడుతూ..."నన్ను దేశంనుంచీ వెళ్లగొట్టాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. నా కారణాలు నాకున్నాయి. నాకు నా దేశం ఉంది" అని నావల్నీ తెలిపారు.

'నరకానికి వెళ్లొచ్చినట్లు'

విమానంలో విష ప్రయోగం జరిగాక దేనిపైనా సరిగ్గా దృషి పెట్టలేకపోయానని నావల్నీ బీబీసీతో అన్నారు. అయితే, ఇది మద్యం సేవించినప్పుడు కలిగే భ్రాంతిలాంటిది కాదని తెలిపారు.

"ఆస్పత్రిలో జాయిన్ చేసిన కొంతకాలం తరువాత తెలివి వస్తూ పోతూ ఉండేది. నరకానికి వెళ్లినట్లే ఉండేది అప్పుడు. అనేక భ్రమలు కలిగేవి. ప్రమాదంలో కాళ్లు కోల్పోయినట్టు, వెన్నెముక విరిగిపోయినట్టు అనిపించేది. అవన్నీ నిజమనే అనిపించేవి. ముఖ్యంగా రాత్రి పూట కలిగే భ్రమలవల్ల చాలా హింస అనుభవించానని" నావల్నీ తెలిపారు.

నిద్రలేమి ఎక్కువగా ఉండేదని, చేతుల్లోంచి వణుకు వచ్చేదని తెలిపారు. శారీరకంగా ఆరోగ్యం మెరుగవుతున్నప్పటికీ మానసికంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉందని నావల్నీ తెలిపారు. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే అధిక శ్రమతో కూడుకున్నవిగా అనిపిస్తాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)