రష్యా ప్రతిపక్ష నేత నావల్నీపై ప్రయోగించిన విషం.. నోవిచోక్: జర్మనీ - BBC Newsreel

నావల్నీ

ఫొటో సోర్స్, Reuters

రష్యా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు అలెక్సీ నావల్నీపై నిస్సందేహంగా నోవిచోక్ విష ప్రయోగం జరిగిందని జర్మనీ ప్రభుత్వం అంటోంది.

మిలటరీ ప్రయోగశాలలో జరిగిన పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైందనీ తెలిపింది.

గత నెల విమాన ప్రయాణంలో నావల్నీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో అతన్ని బెర్లిన్‌కు తరలించారు. అప్పటినుంచీ నావల్నీ కోమాలో ఉన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచనలమేరకే నావల్నీపై విషయప్రయోగం జరిగిందని ఆ దేశ ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది.

జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్.. నావల్నీపై నాడీ వ్యవస్థను దెబ్బ తీసే నోవిచోక్ విష ప్రయోగం కచ్చితంగా జరిగిందనీ, ఈ ప్రయోగంతో అతన్ని హతమార్చడానికి ప్రయత్నించారనీ, జర్మనీ ప్రభుత్వం తరపున ఈ చర్యలను తాను ఖండిస్తున్నాని తెలిపారు.

అయితే నోవిచోక్ ప్రయోగం కచ్చితంగా జరిగిందన్న విషయంపై జర్మనీ తమకు ఎలాంటి సమాచారం అందించలేదని రష్యా ప్రభుత్వం పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది.

కానీ, ఈ విషయాన్ని నాటోకు, యూరోపియన్ యూనియన్ సభ్యులకు తెలియపరిచామని, రష్యా స్పందన విన్న తరువత వారంతా ఒక నిర్ణయానికి రానున్నట్లు మెర్కెల్ తెలిపారు. ప్రపంచం సమాధానాల కోసం ఎదురుచూస్తోందని ఆమె అన్నారు.

గతంలో కూడా రష్యా ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరిపై నోవిచోక్ విష ప్రయోగం జరిగింది.

2018 లో రష్యా గూఢచారి సెర్గై స్క్రిపల్, అతని కూతురిపై కూడ ఈ విష ప్రయోగం జరిగింది. అలాగే రష్యా ఇంటెలిజెన్స్ సేవలను తీవ్రంగా విమర్శించిన ప్యోటర్ వెర్జిలోవ్‌పై కూడా అదే సంవత్సరం నోవిచోక్ విషయ ప్రయోగం జరిగింది. వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

పాకిస్తాన్

టిండర్, గ్రిండర్ డేటింగ్ యాప్‌లను నిషేధించిన పాకిస్తాన్

పాకిస్తాన్‌లో టిండర్, గ్రిండర్‌లతో మరో మూడు డేటింగ్ యాప్స్‌ను నిషేధించారు.

టిండర్, గ్రిండర్, ట్యాగ్ డ్, స్కౌట్, సే హాయ్ యాప్స్ చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ ప్రభుత్వం వీటి సేవలపై వేటు వేసింది.

ఇవి "అనైతికం" అని పేర్కొంటూ, ఈ సర్వీసులను తొలగించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్తాన్‌లో వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం.

పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పిటిఎ) ప్రతినిధి బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ...ఈ యాప్స్‌లో కంటెంట్‌ను చట్టపరమైన, నైతిక నిబంధనలకనుగుణంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలను జారీ చేసామని తెలిపారు.

అయితే ఈ యాప్స్ నిర్వహణాధికారులు ప్రభుత్వ ఆదేశాలపై ఇంతవరకూ స్పందించలేదు.

నైతికత పేరుతో ప్రాకిస్తాన్ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకుంటోందని విమర్శకులు భావిస్తున్నారు.

జూలైలో పాకిస్తాన్ ప్రభుత్వం టిక్‌టాక్ కు కూడా కంటెంట్ విషయంలో జాగ్రత్తపడమని తుది హెచ్చరిక జారీ చేసింది.

ఇదే తరహాలో గత కొన్నేళ్లల్లో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లపై కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పలుమార్లు వేటు వేసింది.

ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Reuters

పాలస్తీనా నిరసనకారుని మెడ మీద మోకాలు పెట్టి అదిమిన ఇజ్రాయెల్ సైనుకుడు

పాలస్తీనా నిరసనకారుడిని అదుపులోకి తీసుకునేందుకు అతడి మెడపై ఇజ్రాయెల్ సైనుకుడు మోకాలితో అదుముతూ బేడీలు వేయటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో జరిగిన ఒక నిరసన సందర్భంగా ప్రముఖ ఉద్యమకారుడు ఖైరీ హనూన్‌ను నేలమీదకు వంచి అతని మెడపై మోకాలు మోపి చేతులకు బేడీలు వేస్తున్న ఇజ్రాయెల్ సైనికుడి వీడియో వెలుగులోకి వచ్చింది.

ఈ చర్యను పాలస్తీనియన్లు ఖండించారు. ఈ వీడియో ఫూటేజ్ పాక్షిక సమాచారాన్ని అందిస్తోందని, అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యంపై జరిగిన దాడి, హింసను చూపించట్లేదని, అదే అరస్ట్‌కు కారణమని ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది.

నాబ్లస్ దగ్గర షుఫా గ్రామంలో ఇజ్రాయెల్ భవన నిర్మాణాలు చేపట్టడంపై స్థానిక పాలస్తీనియన్లు మంగళవారం నాడు నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

"ఈ అంశంపై కొందరు వృద్ధులు నిరసనలు వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసులు మమ్మల్ని ఏమీ చెయ్యరని అనుకున్నాం కానీ వాళ్లు దోపిడీ దొంగల్లా మీద పడ్డారు. సాయుధ సైనికులను మేం ఎలా ఎదుర్కోగలం?" అని 60 యేళ్ల హనూన్ తెలిపారు.

ఈ సంఘటనను ఇటీవలే యూఎస్‌లో చోటు చేసుకున్న జార్జ్ ఫ్లాయిడ్ సంఘటనతో పోల్చారు.

షుఫాలో హింసాత్మకమైన దాడులు, అల్లర్లు చోటు చేసుకున్నాయని, నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, ఎంతోసేపు నిగ్రహించుకున్నాక పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోక తప్పలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.

శరణార్థులతో వస్తున్న బోట్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, శరణార్థులతో వస్తున్న బోట్లు

కరోనావైరస్ సోకిన గర్భిణిని హెలికాప్టర్‌లో తరలిస్తుండగా ప్రసవం

కరోనావైరస్ సోకిన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా హెలికాప్టర్‌లో ఆమె ప్రసవించింది.

ఇటలీలోని లాంపెడూసా ద్వీపంలోని ఒక వలస శిబిరంలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా హెలికాప్టర్‌లోనే ప్రసవించింది.

ఆఫ్రికా దేశాల నుంచి ఇటలీకి వలసదారులు పోటెత్తుతున్నారు. సముద్ర మార్గంలో వస్తున్న వలసదారులకు ఆశ్రయం ఇవ్వాలని ఐరాస సూచించడంతో ఇటలీ అనుమతిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19,400 మంది ఇలా ఇటలీ చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020లో 40 వేల మందికిపైగా సముద్ర మార్గంలో యూరప్ చేరుకున్నారని ఐరాస లెక్కలు చెబుతున్నాయి.

మధ్యధరా సముద్రంలో వలసదారులతో వస్తున్న ఓడలను కొన్ని రేవులకు అనుమతించకపోవడంతో చిక్కుకుపోయినవారూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు.

వారిని అనుమతించాలని ఐరాస సూచిస్తుండడంతో కొన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి.

ఆ క్రమంలోనే ఇటలీ ఏర్పాటు చేసిన శిబిరం నుంచి కరోనా సోకిన ఈ గర్భిణిని హెలికాప్టరులో ఆమెను లాంపెడూసా నుంచి పాలెర్మోకు తీసుకెళ్లాలనుకున్నారు.

కెనోషాలో ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

జాకబ్ బ్లేక్: కెనోషాలో ట్రంప్ పర్యటన.. పోలీసులకు ఫుల్ సపోర్ట్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అక్కడ నిరసనలు, ఘర్షణలు జరుగుతున్న కెనోషాలో పర్యటించారు.

అక్కడ జరుగుతున్న విధ్వంసానికి దేశీయ తీవ్రవాదమే కారణమని ఆయన ఆరోపించారు.

హింస చెలరేగిన ప్రాంతాలు, నిరసనకారులు దహనం చేసిన ఒక ఫర్నిచర్ షాపును ఆయన చూశారు.

ఈ సందర్భంగా ట్రంప్ పోలీసు అధికారులను సమర్థించారు.. వారు ఒకట్రెండు తప్పులు చేస్తే మీడియా దాన్నే ఫోకస్ చేస్తోందని ఆయన ఆరోపించారు.

కెనోషాలో జాకబ్ బ్లేక్‌ను పోలీసులు కాల్చిన తరువాత హింస చెలరేగింది. నిత్యం నిరసనలు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థి జో బైడెన్ కంటే వెనుకంజలో ఉన్నట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.

ట్రంప్ జాతి ఆధారంగా విభజన సృష్టిస్తున్నారని బైడెన్ ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)