సినిమా రివ్యూ: నిశ్శబ్దం.. సస్పెన్స్ థ్రిల్లరూ కాదు కుటుంబ కథాచిత్రమూ కాదు

నిశ్శబ్దం

ఫొటో సోర్స్, facebook/Nishabdham

నేరస్తులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న వారు మాత్రమే నేరస్తులు కాదు కొన్ని నేరాలు నిశ్శబ్దంగా జరిగిపోతుంటాయి అనే కాన్సెప్ట్ ఆధారంగా నిర్మితమైంది 'నిశ్శబ్దం' సినిమా.

''ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో క్రైమ్‌ ఉంటుంది. కొన్ని బయటపడుతుంటాయి. కొన్ని కాలం లోతుల్లోకి జారిపోతుంటాయి. కానీ క్రైమ్‌ చేసిన ప్రతి ఒక్కరూ నేరస్తులు కాదు.." అంటూ సినిమా ప్రారంభంలోనే 'నిశ్శబ్దం' ఆత్మను చూచాయగా పరిచయం చేస్తారు దర్శకుడు హేమంత్ మధుకర్.

జనవరి నుంచి ఏప్రిల్.. ఏప్రిల్ నుంచి సెప్టెంబరుకు వాయిదాలు పడి ఎట్టకేలకు ఓటీటీ వేదికగా తెలుగు, మళయాలం, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన 'నిశ్శబ్దం' సినిమా గురించి మాట్లాడుకుందాం.

మాధవన్

ఫొటో సోర్స్, facebook/Nishabdham

అమెరికాలోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన బధిర(చెవిటి,మూగ) అమ్మాయి సాక్షి(అనుష్కశెట్టి) అదే శరణాలయంలో పెరిగిన సోనాలి(షాలిని పాండే) మంచి స్నేహితురాళ్లు.

సాక్షిపై సోనాలి మోతాదుకు మించి ఇష్టం పెంచుకుంటుంది. సాక్షి మంచి పెయింటర్. ఒక ఆర్ట్ గ్యాలరీలో ఆమె పెయింటింగ్ చూసి ఆమెను ఇష్టపడతాడు ఆంటోని(మాధవన్).

ఆ తరువాత సాక్షి చేసే ప్రతి పనితోనూ అతను ప్రేమలో పడిపోతాడు. సాక్షి కూడా అతణ్ని ప్రేమిస్తుంది. అంతలో సాక్షి స్నేహితురాలు సోనాలి కనపడకుండా పోతుంది.

అమెరికాలోని సియాటెల్‌లో వరుసగా యువతుల హత్యలు జరుగుతుంటాయి. అక్కడికి కొంత దూరంలో ఉన్న ఉడ్‌సైడ్ విల్లాలో 1972 లో ఓ జంట హత్యలు జరిగి..డెవిల్ హౌస్‌గా పేరుపడిన విల్లాలో ఉన్న ఒక ఫోటోను పెయింటింగ్ వేయాలనుకుంటుంది సాక్షి.

అందుకోసం సాక్షి, ఆంథోని ఆ విల్లాకు వెళ్తారు. సంఘటన పునరావృతం అవుతుంది. ఆంటోనీ హత్యకు గురవుతాడు. సాక్షి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడుతుంది. అసలు ఆ విల్లా మిస్టరీ ఏమిటి? ఆంటోనీని ఎవరు హత్య చేశారు? సోనాలి ఏమైపోయింది? యువతులను హత్యలు చేస్తున్నది ఎవరు? క్రైమ్ డిటెక్టివ్ మహాలక్ష్మి(అంజలి), పొలీస్ ఆఫీసర్ రిచర్డ్(మైఖేల్ మాడిసన్) చివరకు ఈ కేసును ఎలా ఛేదించారు అనేదే సినిమా సారాంశం.

అంజలి

ఫొటో సోర్స్, facebook

సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే మనకు ఒక రొటీన్ ఫార్మాట్ ఉంటుంది.అయితే ఆ ఫార్మాట్ ను బ్రేక్ చేయాలనుకున్నాడో..తడబడ్డాడో కానీ దర్శకుడు ఆ ఫార్మాట్ ను మధ్యలోనే బ్రేక్ చేశాడు.

రొటీన్ ఫార్మాట్‌ను బ్రేక్ చేయడం అవసరమే కానీ చూపించాలనుకున్న మరో ఫార్మాట్‌లో తడబాటు లేకుండా చూసుకోవడం అంతకన్నా అవసరం. ముందుగా సస్పెన్స్ థ్రిల్లర్ అని మెన్షన్ చేసి ప్రేక్షకులలో అంచనాలను పెంచి, ఎలాంటి సస్పెన్స్ లేకుండా థ్రిల్ కు గురిచేశాడు దర్శకుడు హేమంత్ మధుకర్.

ప్రథమార్థంలో స్ర్కీన్ ప్లే పకడ్బందీగా ఉన్నప్పటికీ.. ద్వితీయార్థం మొత్తం ప్రేక్షకులు ముందే ఊహించగలిగేంత బలహీనంగా సాగుతుంది. సియాటెల్, సీక్విమ్ నగరాల మధ్య జరిగే కథ, సినిమాటోగ్రఫీ, మైఖేల్ మాడిసన్ ఇంకొంత మంది అమెరికన్ నటుల వలన హాలీవుడ్ సినిమా తెలుగులో సాగుతున్న అనుభూతి కలుగుతుంది.

అయితే నిర్మాణ విలువలకు, సినిమాటోగ్రఫీకి అనుగుణంగా కథ, కథనం నిలవలేదని చెప్పాలి.

బధిరురాలిగా తనదైన శైలిలో బాగా నటించింది అనుష్క శెట్టి. నిశ్శబ్దం టైటిల్‌కి న్యాయం చేస్తూ నిశ్శబ్దంగానే లోతైన భావాలను పలికించింది.

మాధవన్ బాడీలాంగ్వేజ్, అందుకు ధీటైన నటనతో మెప్పించాడు. అంజలి లేడి క్రైమ్ డిటెక్టివ్‌గా ఫర్వాలేదనిపించింది.

షాలిని పాండే, సుబ్బరాజు తమ పాత్ర పరిధుల్లో బాగా నటించారు. మైఖేల్ మాడిసన్ వల్ల సినిమా లుక్స్ మారిపోయాయని చెప్పవచ్చు.

దర్శకుడు కొత్తగా చూపించలేకపోగా సస్పెన్స్ థ్రిల్లర్‌కి ఉండాల్సిన పాత ఎలిమెంట్స్ కూడా లోపించినట్లుగా అనిపిస్తుంది.

రచనలో మొదలైన కన్యూజన్ కథనంలోనూ కంటిన్యూ అయ్యి..సీన్స్ అన్నీ ఏ ఫ్రేమ్‌కి ఆ ఫ్రేమ్ విడివిడిగా కలిపి అతికించినట్లుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు విజువల్స్‌లో కనపడతాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

నేపథ్య సంగీతం బాగుంది.. రెండు పాటలు ఫరవాలేదనిపిస్తాయి. మొత్తానికి అటు సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను, ఇటు కుటుంబ కథాచిత్ర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది నిశ్శబ్దం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)