గోదావరి మన్యంలో కాళ్లవాపు కలకలం.. నాలుగేళ్లుగా కొనసాగుతున్న మరణాలు... మళ్లీ మొదలైన సమస్య

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్న చింతూరు, వీఆర్ పురం, కూనవరం, కుక్కునూరు మండలాలు ప్రస్తుతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్నాయి.
పోలవరం ముంపు గ్రామాలు అనే పేరుతో రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో వాటిని విలీనం చేశారు. పూర్తిగా అటవీ ప్రాంతమైన ఈ మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు తగిన వసతులు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. దాంతో చిన్న చిన్న రోగాలతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
గతంలో భద్రాచలం ఐటీడీఏ, ప్రస్తుతం చింతూరు ఐటీడీఏ అధికారులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మౌలిక సమస్యల విషయంలో పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఏటా విష జ్వరాలు, మలేరియా వంటి వ్యాధులు మన్యానికి కొత్త కాదు.
వాటి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా కొంత వరకు ఫలితం దక్కినా సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు.
పైగా అంతుబట్టని కాళ్ల వాపులు వంటి వ్యాధులు దాడి చేస్తున్నాయి. వీటివల్ల గడిచిన మూడు నాలుగేళ్లుగా ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నమోదవుతునే ఉన్నాయి.

అత్యధికంగా 2017లోనే
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా కాళ్లవాపు కారణంగా రెండు మూడు రోజులకే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నమోదవుతున్నా అప్పటి వరకు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2017లో మాత్రం ఒక్కసారిగా 28 మంది మరణించడం కలకలం రేపింది.
అప్పట్లో చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో 28 మంది మృతి చెందారు. మొదట సహజ మరణాలుగా భావించినప్పటికీ, ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోవడంతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అప్పట్లో అనేక మంది అధికారులు ప్రభావిత గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వం తరపున మంత్రులు కూడా అనేక హామీలు ఇచ్చారు.
దిల్లీ నుంచి వచ్చిన వైద్య పరిశోధక బృందాలు చింతూరు పరిసరాల్లో ప్రభావిత గ్రామాలను సందర్శించాయి. తాగునీటి శాంపిళ్లను పరీక్షించాయి. మృతుల వివరాలను, వారి కుటుంబాలకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాయి.
కాళ్లవాపు సమస్యతో ప్రాణాలు కోల్పోతుండడం వెనుక అసలు కారణాలు వాళ్లు వచ్చి వెళ్లిన తర్వాత వెలుగులోకి వస్తాయని అంతా ఆశించారు. దానికి అనుగుణంగా పరిష్కార మార్గాలు చూపితే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందని భావించారు.

నిర్ధరణ చేయలేకపోయిన యంత్రాంగం
పెద్ద సంఖ్యలో కాళ్లవాపు సమస్య బాధితులు పెరగడంతో అప్పట్లో కాకినాడ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వారికి చికిత్స అందించారు. చింతూరు నుంచి బాధితులను అక్కడికి తరలించి వైద్యం అందించడంతో కొందరి ప్రాణాలు కాపాడగలిగారు.
కానీ ఆ వ్యాధికి అసలు కారణాలు ఏంటన్నది మాత్రం తెలియలేదు.
దాంతో వరుసగా ప్రతి ఏటా ఈ వ్యాధి ప్రభావం చూపిస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది కూడా అదే రీతిలో కాళ్లవాపు తాకిడి కనిపిస్తోంది.
కానీ గత రెండేళ్ల కన్నా భిన్నంగా బాధితులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో అధికార యంత్రాంగం అంతా కరోనా నివారణ చర్యల్లో ఉండగా మన్యంలో కాళ్లవాపు ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఇప్పటికే గడిచిన రెండు నెలల వ్యవధిలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చెబుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా కాళ్లవాపు సమస్య పరిష్కారానికి కొంత ప్రయత్నం చేసినా అప్పటి ప్రభుత్వం పూర్తిగా స్పందించలేదని రాజయ్య బీబీసీకి తెలిపారు.

గతంలో చింతూరు ప్రాంతాన్ని సందర్శించిన వివిధ వైద్య బృందాలు, అధికారులు కూడా కాళ్లవాపు సమస్యను గుర్తించి, పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్టు సున్నం రాజయ్య తెలిపారు.
“కాళ్లవాపు వ్యాధికి తాగునీటి సమస్య కారణమని పరిశీలకులు భావించారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదు. అసలు కారణాలు నిర్ధరణ కాలేదు. కానీ మాకు చెప్పిన వివరాలు ప్రకారం సురక్షితమైన తాగునీటిని అందించాలని అన్నారు. పౌష్టికాహార లోపం కూడా ఎక్కువగా ఉందని గుర్తించినట్టు తెలిసింది. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మేం వినతిపత్రాలు కూడా ఇచ్చాం. అప్పటి సీఎం, మంత్రులు హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలు కాలేదు” అని రాజయ్య బీబీసీతో అన్నారు.
ఈ ఏడాది మళ్లీ మరణాలు మొదలయ్యాయి. గత నెల రోజుల్లో చింతూరు మండలం మదుగూరు గ్రామంలోనే ముగ్గురు చనిపోయారు. చుట్టు పక్కల గ్రామాల్లో మరో ముగ్గురి ప్రాణాలు పోయాయి.
ముదుగూరుకి చెందిన కట్టం నాగయ్య, పాండ్రు జోగయ్య, పాండ్రు కన్నయ్యతో పాటు మామిళ్ల గూడేనికి చెందిన సరియం లక్ష్మయ్య, కొండపల్లికి చెందిన వంజం సీతయ్య, వేగితోటకు చెందిన బంధం ముత్తమ్మ చనిపోయారు. వారిలో 18 ఏళ్ల యువకుడి నుంచి 55 ఏళ్ల వృద్ధుల వరకూ ఉన్నారు. ఇప్పటికీ వేగితోట గ్రామానికి చెందిన పెంటయ్య, జోగయ్యలు తులసిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని రాజయ్య వివరించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రభావం
తూర్పు గోదావరి జిల్లా చింతూరు పరిసరాలతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో కూడా కాళ్లవాపు కారణంగా మరణాలు నమోదవుతున్నాయి.
చుక్కలొద్ది వలస గ్రామంలో గడిచిన నెల రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు కాళ్లవాపు కారణంగా మరణించినట్టు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో నలుగురు కాళ్ళవాపు బాధితులు అనారోగ్యంతో సతమతం అవుతున్నట్టు కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తెలిపారు.

పట్టి పీడిస్తున్న మూఢ నమ్మకాలు
చింతూరు, కుక్కునూరు ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. కిడ్నీ రోగులు డయాలిసిస్‌కి వెళ్లాలంటే చింతూరు నుంచి ఘాట్ రోడ్డు దాటి రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి వెళ్లాలి. అందుకోసం సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని స్థానికుడు కుంజా చిన్నా తెలిపారు.
“చింతూరుకి రావడమే కష్టం. కాలినడకన రావాలి. డోలీ మోసుకుంటూ కొండలు, గుట్టలు దాటాలంటే వాళ్లకి చాలా కష్టం. అయినా చింతూరు ఆస్పత్రిలో తగిన సదుపాయాలు లేవు. దాంతో వారు రంపచోడవరం గానీ, కాకినాడ గానీ వెళ్లాలంటే దాదాపుగా ఒక రోజు పని.
అందుకే చాలామంది ఆస్పత్రులకు వెళ్లే బదులుగా నాటువైద్యాన్ని, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. చివరకు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.
వెలుగులోకి వచ్చినవి తక్కువే. అసలు ప్రాణం పోయినా కూడా ఏ కారణమో తెలియకుండా పోయిన వాళ్లు చాలా ఎక్కువ మందే. అయినా ఈ కాళ్ల వాపు మరణాలకు కారణాలు కనుక్కోవడంలో శ్రద్ధ పెట్టకపోవడం మా ప్రాణాలకు ముప్పు తెస్తోంది” అని చిన్నా వివరించారు.

చర్యలు తీసుకుంటున్నాం- తూ.గో.జిల్లా వైద్య శాఖ
చాలాకాలంగా ఈ పరిస్థితి ఉందని, గతంలో జరిగిన పరిశోధనల్లో బెరిబెరి సమస్య ఉందని నిర్ధరించారని తూర్పు గోదావరి జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ సుశీల బీబీసీకి తెలిపారు.
"బెరిబెరి సమస్యకి రక్తహీనత, కిడ్నీ సమస్యలు, పౌష్టికాహార లోపం కూడా తోడయ్యాయి. అన్నింటికీ మించి నాటు సారా సేవించడం పెద్ద సమస్యగా మారుతోంది. చివరి దశలో ఆస్పత్రికి వచ్చినా తగిన ఫలితం ఉండటం లేదు" అని ఆమె వివరించారు.
మొత్తం 103 మంది బాధితుల్ని గుర్తించామని, ప్రస్తుతం ఈ సమస్యపై వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ఆమె అన్నారు. వారికి రక్త పరీక్షలు, కిడ్నీ పరీక్షలు చేయిస్తున్నాం. అవసరం అయిన వారందరినీ మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆమె బీబీసికి చెప్పారు.

మెడికల్ క్యాంప్ పెట్టాం.. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం - ఐటీడీఏ
కాళ్లవాపు కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సమాచారం అందగానే అప్రమత్తం అయ్యామని చింతూరు ఐటీడీఏ అధికారి ఆకుల వెంకట రమణ తెలిపారు.
“సమాచారం తెలియగానే వైద్య బృందాలను పంపించాం. వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించాం. అనుమానితులను పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నాం. అవసరమైతే మరింత మెరుగైన వైద్యం అందిస్తాం. గిరిజనుల ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
కొంత అవగాహన లోపం ఉంది. కొందరు సమీపంలోని ఒడిశా గ్రామాలకు వెళ్లి నాటు వైద్యం చేయించుకుంటున్నారు. ఆ నిర్లక్ష్యమే వాళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది.
ఇప్పుడు తాగునీటి కోసం సీలేరు నది నీటిని వాడినట్టు తెలిసింది. వాగులు, నదీ జలాలు శ్రేయస్కరం కాదు. అందుకే సురక్షితమైన నీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం” అని వెంకట రమణ వివరించారు.
ఇవి కూడా చదవండి.
- మా ఇళ్లకు వెళ్లేదెప్పుడు? వలస కార్మికుల ప్రశ్న
- కరోనావైరస్ రోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది
- ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు
- కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- "నా హౌస్మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్ధరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








