జీ-7 సదస్సు ఏమిటి? 2019 నుంచి ప్రతిసారీ వెళ్తున్న భారత్‌కు ఈసారి ఆహ్వానం ఎందుకు అందలేదు?

ఫొటో సోర్స్, francesca Volpi/Bloomberg via Getty Images
ఈ ఏడాది జీ-7 శిఖరాగ్ర సమావేశం జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని ఆల్బెర్టా ప్రావిన్స్‌లోని కననాస్కిస్‌లో జరగనుంది. ఈ సదస్సులో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొంటారు.
జీ-7 గ్రూపులో భారతదేశం భాగస్వామి కాదు. అయితే ఈసారి భారత్‌కు ఆహ్వానం అందకపోపవడం చర్చనీయంగా మారింది. దీనికి కారణం 2019 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతున్నారు.
"భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపం" అని కాంగ్రెస్ పేర్కొంది.
2020లో జీ-7 సదస్సును అప్పటి ఆతిధ్య దేశం అమెరికా కరోనా కారణంగా రద్దు చేసింది.
సాధారణంగా జీ-7 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఈ గ్రూప్‌లో లేని దేశాలనూ ఆహ్వానిస్తుంది.

దీనిపై కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
"ఈసారి బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, యుక్రెయిన్ అధ్యక్షులు, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రిని కూడా ఆహ్వానించారు"
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. భారత్‌కు ఆరేళ్లలో తొలిసారి జీ-7 సదస్సుకు ఆహ్వానం అందకపోవడం దౌత్యపరంగా భారీ తప్పిదమని ఆయన అందులో రాశారు.
ఏడాదిగా భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు అత్యంత దారుణంగా దిగజారాయి. ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని 2023లో అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.
భారత్ ఈ ఆరోపణలను తిరస్కరించింది.
అప్పటి నుంచి రెండు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది.
ప్రస్తుతం జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా లేకున్నా భారత్‌కు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందకపోవడం రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి పురోగతి లేదనడానికి సూచికగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ జీ-7
జీ-7 లేదా 'గ్రూప్ ఆఫ్ సెవెన్' అనేది ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ఉన్న ప్రపంచంలోని ఏడు అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కూటమి.
2000 నాటికి ప్రపంచ జీడీపిలో జీ-7 దేశాల వాటా 40 శాతంగా ఉంది. అయితే ఆ తర్వాత అది క్షీణించింది.
ప్రపంచ జీడీపీలో ప్రస్తుతం జీ-7 దేశాల వాటా 28.43 శాతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి డేటా చెబుతోంది.
2014 కి ముందు జీ-7 కూటమి జీ-8గా ఉండేది. అందులో ఎనిమిదో దేశం రష్యా. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించిన తర్వాత జీ-8 గ్రూప్ నుంచి రష్యాను బహిష్కరించారు.
ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైనప్పటికీ, ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ చైనా ఈ గ్రూపులో భాగం కాలేదు.
ఈ ఏడు దేశాల కంటే చైనాలో తలసరి ఆదాయం చాలా తక్కువ. అందువల్ల చైనాను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించరు.
అయితే భారత్, చైనా, మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు జీ20 గ్రూపులో ఉన్నాయి.
యూరోపియన్ యూనియన్ కూడా జీ-7లో భాగం కాదు కానీ ఆ సమాఖ్య అధికారులు వార్షిక జీ-7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతారు.

ఫొటో సోర్స్, Getty Images
జీ-7 ఎప్పుడు ఏర్పడింది? అది ఎలా పనిచేస్తుంది?
ఏడాది పొడవునా, జీ 7 దేశాల మంత్రులు, అధికారులు సమావేశమవుతుంటారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలపై ఒప్పందాలను రూపొందించి ఉమ్మడి ప్రకటనలు జారీ చేస్తారు.
ఈసారి జీ 7 గ్రూప్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.
సభ్య దేశాల్లో ఏదో ఒకటి, ఏడాదికొకరు చొప్పున సదస్సుకు నాయకత్వం వహిస్తారు. ఈసారి కెనడా ఆతిథ్యమిస్తోంది.
ఈసారి శిఖరాగ్ర సమావేశం అజెండాలో అంతర్జాతీయ శాంతి, భద్రతతో పాటు ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, ప్రపంచ సవాళ్లు ఉన్నాయి.
అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, బ్రిటన్, పశ్చిమ జర్మనీ 1975లో ఆరు దేశాలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశాయి.
ఆ సమయంలో ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షల వల్ల ఉత్పన్నమైన ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి ఈ బృందం ఏర్పడింది.
మరుసటి సంవత్సరం కెనడా కూడా అందులో చేరింది.
ఆ తర్వాత 1980లలో, ఈ ఏడు దేశాలు తమ పరిధిని విస్తరించుకుని రాజకీయ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది.
1998లో రష్యా అధికారికంగా ఈ గ్రూప్‌లో భాగమైంది. అప్పటి నుంచి ఇది జీ-8గా మారింది.
జీ-7కు చట్టబద్ధమైన ఉనికి లేదు. శాశ్వత కార్యాలయం కూడా లేదు.
కానీ ఇది సభ్య దేశాలకు ఉమ్మడి సమస్యలను చర్చించే వేదికను కల్పిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
జీ-7 దేశాలకు అధికారం ఉందా?
జీ-7 దేశాలు చట్టాలు చేయలేవు. ఎందుకంటే ఇది అధికారిక సమూహం కాదు. దాని నిర్ణయాలను పాటించడం తప్పనిసరి కాదు.
అయితే, ఈ బృందం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయి.
ఉదాహరణకు, 2002లో, మలేరియా, ఎయిడ్స్ వంటి వ్యాధులపై పోరాడటానికి గ్లోబల్ ఫండ్‌ను సృష్టించడంలో జీ-7 కీలకపాత్ర పోషించింది.
2021 శిఖరాగ్ర సమావేశం బ్రిటన్‌లో జరిగింది, కానీ అంతకు ముందే, బహుళజాతి కంపెనీలు మరిన్ని పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ఈ గ్రూపు ఆర్థిక మంత్రుల మధ్య ఏకాభిప్రాయం ఉంది.
ఈ జీ-7 గ్రూప్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
జీ-20, జీ- 7 మధ్య తేడా ఏంటి
పేరు లాగే, ఈ రెండు గ్రూపుల పని కూడా దాదాపు ఒకేలా ఉంటుంది.
జీ-20 సభ్య దేశాలకు అతిపెద్ద అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. అయితే జీ-7కి రాజకీయ అంశాలు కూడా ముఖ్యమైనవి.
జీ-20లో భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, బ్రిటన్, తుర్కియే, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఉన్నాయి.
ఈ బృందం 1999లో ఏర్పడింది. ప్రారంభంలో సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేవారు.
2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత, ఈ సమావేశాలు జీ-20 సభ్య దేశాల అగ్ర నాయకుల స్థాయిలో జరగడం మొదలైంది.
2022-23లో జీ-20 సదస్సు భారత్‌లో జరిగింది.
ఈసారి సదస్సుకు దక్షిణాఫ్రికా అధ్యక్షత వహిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














