మోదీ ప్రమాణ స్వీకారం: విపక్షాలు ఏమంటున్నాయి? సాయంత్రం ఏం జరుగనుంది?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

నరేంద్రమోదీ ఆదివారం మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రాష్ట్రపతి భవన్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 9వ తేదీ సాయంత్రం 7:15 గంటలకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి ఇతర సభ్యులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

శుక్రవారం ఎన్డీయే కూటమి సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, లోక్‌సభలో కూటమి నేతగా మోదీ ఎంపికయ్యారు. ఆ తర్వాత మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనేక దేశాల ప్రముఖులను ఆహ్వానించారు.

వాట్సాప్ చానల్

పొరుగు దేశాల ప్రభుత్వాధినేతలను ఈ కార్యక్రమానికి పిలిచారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీప్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దాహాల్ ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారు.

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొహమ్మద్ ముయిజ్జు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలకంగా చూడొచ్చు. 2014లోనూ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అప్పటి మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ నేతలకు రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ఆతిథ్యం ఇస్తారు.

భారత్‌కు చెందిన నైబర్‌హుడ్ పాలసీ, సాగర్ విజన్ కింద పొరుగు దేశాల నేతలను ఆహ్వానించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఆహ్వానం అందలేదన్న విపక్ష నేతలు

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రభుత్వం నుంచి విపక్ష నేతలకు ఎటువంటి ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అన్నారు.

‘ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇండియా కూటమి నేతలకు ఆహ్వానం రాలేదు. మా కూటమి నేతలకు ఆహ్వానం అందినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం’’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ అన్నారు.

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ కూడా తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనరని, తాను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనని విలేఖరులతో అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం విలేఖరులతో ఆమె మాట్లాడారు.

‘‘ఒక రాజ్యాంగ విరుద్ధ, చట్టవిరుద్ధ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎవరూ కోరుకోరు. ఈ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఏర్పడుతోంది. మేం బీజేపీని విచ్ఛిన్నం చేయం. కానీ, అంతర్గతంగానే బీజేపీ విచ్ఛిన్నం అవుతుంది. ఆ పార్టీ వాళ్లు సంతోషంగా లేరు.

400 సీట్లు దాటుతామని నినాదాలు ఇచ్చిన వారు కనీసం సొంతంగా మెజార్టీ సాధించలేకపోయారు. సర్కారును ఏర్పాటు చేస్తామని ఎన్డీయే చెప్పింది. అయితే అంతా బాగున్నట్లని కాదు. మేం అంతా చూస్తున్నాం. పరిస్థితులు మారుతుంటాయి.

కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక్కరోజు కూడా నిలబడలేవు. ఏదైనా జరగొచ్చు. ఈ ప్రభుత్వం 15 రోజులు ఉంటుందో? లేదో? ఎవరికి తెలుసు’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ 42 సీట్లకుగానూ 29 సీట్లు గెలుచుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో ఒక భాగం.

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత పదవి

శనివారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు.

‘‘కొత్తగా ఎంపీలు అయిన వారికి అభినందనలు తెలిపారు. పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ పేరును ప్రతిపాదించారు, ఆమోదించారు’’ అని వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐతో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు.

దీనికంటే ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.

‘‘లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అందరూ ఏకగ్రీవంగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు. ఆయన కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించారు’’ అని తివారీ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 293 సీట్లు, విపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు దక్కాయి.

కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్షనేత పదవి దక్కనుంది.

సోనియా గాంధీ ఈ ఏడాది ఆరంభంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.

స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, ANI

పలువురు కేంద్ర మంత్రుల ఓటమి

బీజేపీకి ఈ ఎన్నికల్లో షాక్ తగిలింది. మోదీ క్యాబినెట్‌లోని 19 మంది మంత్రులు ఓడిపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ పరాజయం పాలవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 1.67 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు.

ఈ జాబితాలో అర్జున్ ముండా, ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ, ఆర్కే సింగ్, అజయ్ మిశ్రా టెనీ, సాధ్వీ నిరంజన్, సంజీవ్ బాలియాన్, మహేంద్ర పాండే, రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఉన్నారు.

యోగి మంత్రిమండలిలోని ఇద్దరు మంత్రులు దినేశ్ ప్రతాప్ సింగ్, జైవీర్ సింగ్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

యూపీలో 2019 ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షాలు కలిసి 64 స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈసారి 36 మాత్రమే గెలుచుకోగలిగాయి. బీజేపీ ఖాతాలో 33 సీట్లు చేరాయి.

ఎన్డీయే మిత్రపక్షాలు

ఫొటో సోర్స్, ANI

మిత్రపక్షాలతో సమన్వయం

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 సీట్లు గెలుచుకుంది. బీజేపీ సొంతంగా 240 సీట్లు సాధించింది.

ఇప్పుడు ఎన్డీయేలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌లు ముఖ్యమైన భాగస్వాములు.

2019కి ముందు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఎన్డీయే నుంచి వైదొలిగారు.

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా చాలా కాలంగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కూడా జేడీయూ డిమాండ్ చేయవచ్చు.

మోదీ 3.0 సర్కారుకు మద్దతు ఇస్తున్నామని ఈ రెండు పార్టీలు చెబుతున్నప్పటికీ, తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకురావొచ్చు.

జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి, అగ్నివీర్ పథకంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. దీనికి చిరాగ్ పాశ్వాన్‌ కూడా మద్దతు తెలిపారు.

మంత్రిమండలిలో చోటు దక్కించుకునే విషయంలో కూడా గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

అయితే ఏడు సీట్లు గెలుచుకున్న శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం, అయిదు సీట్లు నెగ్గిన జనశక్తి రామ్‌విలాస్ పాసవాన్ వర్గం (ఎల్‌జేపీ), ఉత్తర ప్రదేశ్‌లో రెండు సీట్లు నెగ్గి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన రాష్ట్రీయ లోక్‌ దళ్ (ఆర్‌ఎల్‌డీ) కూడా బీజేపీకి ముఖ్యమైన భాగస్వాములు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)