వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు - Newsreel

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRA PRADESH CM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో వేసిన పిటీషన్లను కోర్టు తోసిపుచ్చింది.
నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు ఈ పిటీషన్లు వేశారు. గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను ఉల్లంఘించినందున వారి బెయిల్ రద్దు చేయాలని పిటీషనర్ కోరారు.
కానీ దానికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతోనే ఈ పిటీషన్‌ని కొట్టేసినట్టు కోర్టు తెలిపింది.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ఈ కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ పిటీషనర్ ఆరోపించారు.
ఈ కేసులో సీబీఐ మాత్రం పిటీషన్‌లో మెరిట్స్‌ని బట్టి నిర్ణయం తీసుకోవాలని చెబుతూ కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేసింది.
ఇక జగన్ తరుపు న్యాయవాదులు మాత్రం సీబీఐ వాదనలు ఆధారంగా తాము నిబంధనలను పాటిస్తున్నామంటూ పేర్కొన్నారు. అంతేగాకుండా పిటీషనర్ రాజకీయ లక్ష్యాల కోసం ఈ కేసుని వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు పిటీషన్‌ని కొట్టేసింది.
ఈ కేసులో జులై నెలాఖరులోనే విచారణ పూర్తయ్యింది. అయితే ఆ తర్వాత విజయసాయిరెడ్డి బెయిల్ పిటీషన్ కూడా కోర్టు ముందుకు వచ్చింది. దీంతో ఒకే కేసులో నిందితుల మీద ఒకే వ్యక్తి వేసిన పిటీషన్లు కావడంతో కలిపి తీర్పు ఇస్తామంటూ గత వాయిదాలో కోర్టు తెలిపింది. దానికి అనుగుణంగా జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలయిన పిటీషన్ల విచారణ పూర్తి చేసి ఈరోజు తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం పిటీషన్లు కొట్టేయడంతో ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ తీర్పుపై హైకోర్టుని ఆశ్రయించబోతున్నట్టు చెప్పారు.
సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో తాను వచ్చే నెల మొదటివారంలో హైకోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. సీబీఐ వైఖరి అసంబద్ధంగా ఉందని స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, BRENDAN SMIALOWSKI
ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది: జపాన్
ఉత్తర కొరియా నుంచి రెండు క్షిపణులు ప్రయోగించారని జపాన్ తీర గస్తీ దళం (కోస్ట్ గార్డ్) తెలిపింది. అవి బాలిస్టిక్ క్షిపణులు అయ్యుండొచ్చని వివరించింది.
ఒకవేళ అది బాలిస్టిక్ క్షిపణి అయితే, అణ్వాయుధాల కార్యక్రమాలపై నియంత్రణ విధిస్తూ ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఉల్లంఘించినట్లే.
తాజా క్షిపణి ప్రయోగంపై మరిన్ని వివరాలు ఇచ్చేందుకు ఇటు జపాన్, అటు దక్షిణ కొరియా నిరాకరించాయి.
జపాన్‌లోని చాలా భూభాగాలపై దాడి చేయగలిగే దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు రోజుల్లోనే తాజా క్షిపణి ప్రయోగం జరిగింది.
ఆ క్రూయిజ్ క్షిపణికి అణు వార్‌హెడ్ కూడా అమర్చొచ్చని నిపుణులు చెబుతున్నారు.
క్రూయిజ్ క్షిపణుల ప్రయోగంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి ఆంక్షలూ విధించలేదు.
అయితే, బాలిస్టిక్ క్షిపణులపై మాత్రం ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఎందుకంటే వీటి సాయంతో భారీ పేలోడ్లను తీసుకెళ్లి శక్తిమంతమైన పేలుళ్లు జరిపే అవకాశముంది. దీర్ఘ శ్రేణి లక్ష్యాలపై మెరుపు వేగంతో ఇవి దాడి చేయగలవు.

ఫొటో సోర్స్, kcna
రెండు రోజుల కిందటే..
రెండు రోజుల కిందట ఉత్తరకొరియా జపాన్‌లోని చాలా ప్రాంతాలను లక్ష్యం చేసుకునేలా అధునాతన 'లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్'ను పరీక్షించింది.
దేశంలో ఆహార కొరత, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఉత్తర కొరియా ఆయుధాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని మాత్రం ప్రదర్శిస్తోందని ఈ పరీక్షల ద్వారా తెలుస్తోంది.
''దేశ భద్రతలో ప్రజలకు మరింత విశ్వసనీయమైన హామీని ఇవ్వడానికి, శుత్రు సైన్యాల విన్యాసాలను బలంగా అడ్డుకోవడానికి మరొక సమర్థమంతమైన ఆయుధాన్ని కలిగి ఉండాలన్న వ్యూహానికి ఈ క్షిపణుల పరీక్షలు'' అద్దం పడుతున్నాయని నార్త్ కొరియా న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ఆ సందర్భంగా పేర్కొంది.
ఈ పరీక్షలను పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజంపై ఆధిపత్యం కొనసాగించడానికి ఉత్తర కొరియా చేస్తోన్న ప్రయత్నంగా అమెరికా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








