పాకిస్తాన్: బస్సు పేలుడులో 9 మంది చైనా పౌరులు సహా 13 మంది మృతి, ఇది బాంబు దాడే అంటున్న చైనా

ప్రమాదానికి గురైన బస్సు

ఫొటో సోర్స్, ASIM ABBASI

ఫొటో క్యాప్షన్, పేలుడు తర్వాత ధ్వంసమైన బస్సు

పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫంఖ్తూంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఒక బస్సు పేలుడులో 13 మంది మృతి చెందారు.

మృతుల్లో 9 మంది చైనా పౌరులు ఉన్నారు. వీళ్లందరూ డాసూ డ్యాం ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.

చైనా ఈ ఘటనను బాంబు పేలుడుగా చెప్పింది. పాకిస్తాన్ మాత్రం గ్యాస్ లీకేజీ వల్లే బస్సులో పేలుడు జరిగిందని చెబుతోంది.

ఈ ఘటన ఎగువ కోహిస్తాన్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన 9 మంది చైనా పౌరులు ఇంజనీర్లని, వారితో పాటు పాకిస్తాన్ ఫ్రంటియర్ కోర్‌కు చెందిన ఇద్దరు జవాన్లు, మరో ఇద్దరు పౌరులు మృతి చెందారని డాసూ అసిస్టెంట్ కమిషనర్ ఆసిమ్ అబ్బాస్ బీబీసీకి చెప్పారు.

"ఈ బస్సు పేలుడు ఘటనలో మరో 27 మంది కూడా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది చైనా పౌరులే. గాయపడిన మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది" ఆసిమ్ అబ్బాస్ తెలిపారు.

మీడియాలో వచ్చిన కథనాలలో బాంబు పేలుడు తర్వాత బస్సు ఒక లోయలో పడిపోయిందని చెప్పారు.

బాంబు పేలుడులో 9 మంది చైనా పౌరులు చనిపోయారని పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

చైనా ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images

"మా రాయబార కార్యాలయం వెంటనే అత్యవసర చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ సైన్యం, విదేశాంగ శాఖ, హోం శాఖను సంప్రదించింది. సహాయ కార్యక్రమాలు ప్రారంభించాలని, గాయపడినవారికి తగిన వైద్య చికిత్స అందించాలని కోరింది. దేశంలో చైనా పౌరులకు, సంస్థలకు భద్రత బలోపేతం చేయాలని కూడా సూచించింది" అని ఆ ప్రకటనలో తెలిపారు.

పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చావో లీజియాన్ ఖైబర్ ఫంఖ్తుంఖ్వాలో జరిగిన ఈ బాంబు పేలుడును ఖండించారు.

"పాకిస్తాన్ ఖైబర్ ఫంఖ్తుంఖ్వాలో జరిగిన బాంబు పేలుడుతో చైనా షాక్‌కు గురైంది. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ సైనిక బలగాలు చర్యలు చేపట్టాయి" అన్నారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని, వాస్తవాలు బయటపెట్టాలని ఆయన పాకిస్తాన్‌ను కోరారు. పేలుడుకు కారణమైనవారిని అరెస్ట్ చేసి, వీలైనంత త్వరగా శిక్షించాలని సూచించారు.

పాక్ బస్సు పేలుడు

ఫొటో సోర్స్, ASIM ABBASI

బయటకు వెళ్లవద్దని సూచన

"పాకిస్తాన్‌లోని చైనా పౌరులు అప్రమత్తంగా ఉండాలని మేం హెచ్చరిస్తున్నాం. స్థానిక భద్రతా దళాలతో టచ్‌లో ఉండండి. మీ భద్రత గురించి ఎలాంటి నిర్లక్ష్యం చూపకండి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లండి" అని ఇస్లామాబాద్‌లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులకు చెప్పింది.

బుధవారం ఉదయం బస్సు కారాకరమ్ హైవే మీద వెళ్తున్నప్డు డాసు ఆనకట్ట సైట్ దగ్గర పేలుడు జరిగిందని కోహిస్తాన్ అధికారి చెప్పారు.

"ప్రాథమిక దర్యాప్తులో బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇది బాంబు పేలుడు లేదా తీవ్రవాద దాడి కాదు. దర్యాప్తు తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తాం" అని కోహిస్తాన్ డిప్యూటీ కమిషనర్ ఆరిఫ్ ఖాన్ యూసఫ్‌జయీ బీబీసీకి చెప్పారు.

ఈ ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన జారీ చేసింది.

"బుధవారం సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై లోయలో పడిపోయింది. తర్వాత గ్యాస్ లీకవడంతో పేలుడు జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని తెలిపింది.

గాయపడ్డవారిని తరలిస్తున్న పాక్ ఆర్మీ

ఫొటో సోర్స్, WAJAHAT ALI

ఫొటో క్యాప్షన్, గాయపడ్డవారిని తరలిస్తున్న పాక్ ఆర్మీ

"ఎగువ కోహిస్తాన్‌లో బస్సులో పేలుడు జరిగింది. డాసు డ్యాం వైపు వెళ్తున్న బస్సులో అప్పుడు 30 మందికి పైగా చైనా ఇంజనీర్లు ప్రయాణిస్తున్నారు" అని స్థానిక అధికారి ఒకరు తమకు చెప్పారని రాయిటర్స్‌ పేర్కొంది.

బస్సులో పేలుడు జరిగిన ప్రాంతం డాసు హెడ్‌క్వార్టర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని బరసీన్ అంటారు. పేలుడు జరిగిన ప్రాంతం డాసు ఆనకట్ట పరిధిలోకే వస్తుంది. అక్కడ ఉన్న ఒక నీటి పైప్ దగ్గర స్థానికులు నీళ్లు నింపుకుంటారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల జనాభా కూడా ఉంటున్నారు.

"బస్సు రోజూ వచ్చే సమయానికి వస్తోంది. హఠాత్తుగా పెద్ద పేలుడు జరిగింది. బస్సు గాల్లోకి ఎగిరి కింద లోయలో పడింది. జనం అరుపులు వినిపించాయి" అని ప్రమాదం జరిగినపుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి మొహమ్మద్ జుబేర్ చెప్పారు.

బస్సు గాల్లో తేలుతున్నట్లు కనిపించిందని, తర్వాత అది పెద్ద శబ్దంతో లోయలో పడిపోయిందని మరో సాక్షి చెప్పారు.

బస్సు పేలిన తర్వాత స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని లోపల గాయపడ్డవారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. తర్వాత కాసేపటికి ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రభుత్వ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు.

చైనా పాకిస్తాన్‌లో చాలా ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. వీటిలో ప్రతిష్టాత్మక చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఒకటి. చైనా ఈ ప్రాజెక్టుపై భారీ పెట్టుబడి పెట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)