నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ సమ్మతించింది.
ఫిబ్రవరి 25న లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయన్ను భారత్ అప్పగించాలని తీర్పు ఇవ్వగా ఏప్రిల్ 15న అక్కడి హోం మంత్రి ప్రీతి పటేల్ దానిపై సంతకం చేసినట్లు హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
తనను భారత్‌కు అప్పగించరాదంటూ నీరవ్ మోదీ పెట్టుకున్న అభ్యర్థనను లండన్‌లోని వెస్ట్‌మినిష్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న తోసిపుచ్చుతూ.. అప్పగింత విషయంలో నిర్ణయం తీసుకోవాలని అక్కడి హోం శాఖకు రిఫర్ చేశారు.
తన మానసిక పరిస్థితి సరిగా లేదని నీరవ్ మోదీ చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది.
అయితే, తాజాగా హోం శాఖ ఆమోదం తరువాత కూడా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునేందుకు నీరవ్ మోదీకి 14 రోజుల సమయం ఉంది.
భారత్‌లో ఆర్థిక మోసాలు, మనీ లాండరింగ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 11 వేల కోట్లకు పైగా మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని 2019 మార్చిలో లండన్‌లో అరెస్ట్ చేశారు.
భారత్‌లో నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, jsp
పవన్ కల్యాణ్‌కు కరోనావైరస్ పాజిటివ్
జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణైట్లు ఆయన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు చెప్పారు.
''ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది.
ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు'' అని ఆ ప్రకటనలో వెల్లడించారు.
''అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి ఆయన్ను పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Twitter/BSYediyurappa
యెడియూరప్ప: కర్ణాటక ముఖ్యమంత్రికి రెండోసారి కరోనా వైరస్ పాజిటివ్
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు కరోనా సోకింది.
స్వల్పంగా జ్వరం ఉండడంతో టెస్టు చేయించుకున్నానని.. పరీక్షలో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని యెడియూరప్ప ట్వీట్ చేశారు.
ప్రస్తుతం బాగానే ఉన్నానని.. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని ఆయన చెప్పారు.
కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని ఆయన కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాగా యెడియూరప్ప ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
78 ఏళ్ల యెడియూరప్పకు కరోనా రావడం ఇది రెండోసారి.
మరోవైపు ఇటీవల ఆయన కరోనావైరస్ వ్యాక్సీన్ కూడా వేయించుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇండియానాపోలిస్: అమెరికాలో కాల్పులు.. ఎనిమిది మంది మృతి
అమెరికాలోని ఇండియానాపోలిస్ నగరంలో జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించారని.. మరికొందరు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
ఫెడెక్స్ సంస్థకు చెందిన ప్రదేశంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, తమకు కాల్పుల శబ్దం వినిపించిందని కొందరు చెప్పారు. ఓ వ్యక్తి ఆటోమేటిక్ తుపాకీతో కాల్పులు జరపడం చూశానని ఒకరు చెప్పారు.
కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను కూడా కాల్చుకుని చనిపోయినట్లుగా చెబుతున్నారు.
గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించినట్లు పోలీసులు చెప్పారు.
ఘటనాస్థలానికి అధికారులు చేరుకున్న తరువాత తూటా గాయాలతో పడి ఉండడం చూశారని.. వారంతా అప్పటికే మరణించారని ఇండియానాపోలిస్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధి కుక్ తెలిపారు.
కాల్పులకు కారణమేంటో తెలియలేదని ఆయన చెప్పారు.
తమకు సంబంధించిన ప్రాంతంలో కాల్పులు జరిగాయని.. విచారణలో అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని ఫెడెక్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫెడెక్స్ ఉద్యోగి జెరీమియా మిల్లర్ కాల్పులు జరిపిన వ్యక్తిని చూశారని స్థానిక మీడియా తెలిపింది.
''ఓ వ్యక్తి సబ్ మెషీన్ గన్‌తో కాల్పులు జరపడం చూశాను. వెంటనే నేను దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాను'' అని మిల్లర్ చెప్పినట్లుగా స్థానిక మీడియా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








