అంగారకుడిపైకి చేరుకుంటున్న మూడు అంతరిక్ష నౌకలు... అక్కడ అవి ఏం చేయబోతున్నాయి?

అంగారక గ్రహం

ఫొటో సోర్స్, EPA/Nasa/JPL-Caltech

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

అంగారక గ్రహానికి సంబంధించిన అంతరిక్ష పరిశోధనల్లో రాబోయే కొన్ని రోజులు కీలకం కానున్నాయి.

ఈ ఒక్క నెలలోనే అంగారకుడి గుట్టు విప్పేందుకు పంపిన మూడు అంతరిక్ష నౌకలు ఆ గ్రహానికి చేరువవుతున్నాయి.

అంగారక గ్రహ నేల పరిస్థితులు, అక్కడుండే వాతావరణం, మైక్రో బ్యాక్టీరియల్ జీవం ఆనవాళ్ల గురించి తెలుసుకునేందుకు ఈ ప్రయోగాలు చేపట్టారు.

మొదటగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పంపించిన హోప్ ఆర్బిటార్ మంగళవారం ఆ గ్రహానికి చేరుకుంది.

మరో రెండు రోజుల్లో చైనా ప్రయోగించిన టియాన్వెన్-1 వెళ్లనుంది.

ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిస్తున్న పర్సీవరెన్స్ రోవర్ ఫిబ్రవరి 18న అంగారకుడిపై దిగనుంది.

అంగారక గ్రహం, భూమి ఒకదానికొకటి చేరువగా వచ్చే సమయం కావడంతో ఈ అవకాశాన్ని ఈ ప్రయోగాలు అందిపుచ్చుకుంటున్నాయి. 26 నెలలకు ఒకసారి ఇలాంటి సమయం వస్తూ ఉంటుంది.

అంగారక గ్రహానికి అంతరిక్ష నౌక పంపడం చాలా సవాళ్లతో కూడుకున్న పని.

ఆ గ్రహంపై దిగే నౌకలైతే, 'అతిభయానక ఏడు నిమిషాలు' కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంగారక వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత నౌక నేలపై దిగేందుకు పట్టే ఏడు నిమిషాలను ఇలా వర్ణిస్తుంటారు.

ఇప్పటివరకూ అంగారక గ్రహాన్ని చేరుకునేందుకు చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో దాదాపు సగం విఫలమయ్యాయి.

మరి శాస్త్రవేత్తలు ఈ సారి సవాళ్లను ఎలా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు?

అంగారక గ్రహం

యూఏఈ హోప్ మిషన్

అంగారక గ్రహాన్ని చేరుకునేందుకు యూఏఈ చేపట్టిన తొలి ప్రాజెక్టు హోప్. ఇది ఆర్బిటార్. అంటే అంగారకుడిపై దిగదు. దాని చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరుగుతూ పని చేస్తుంది.

గత ఏడాది జులైలో జపాన్‌ నుంచి హోప్ ప్రయాణం మొదలుపెట్టింది.

అంగారక వాతావరణాన్ని తొలిసారిగా అధ్యయనం చేయనున్న ఆర్బిటార్ ఇదే. ఇదివరకు ప్రయోగాలేవీ ఈ పని చేయలేదు.

అంగారక గ్రహం తనపై ఉన్న చాలా వరకు గాలిని, నీటిని ఎలా కోల్పోయిందన్నది తెలుసుకోవడంలో హోప్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కనీసం ఒక అంగారక సంవత్సరం కాలం, అంటే 687 రోజుల పాటు ఆ గ్రహం చుట్టూ హోప్ నిర్ణీత కక్ష్యలో తిరుగుతూ అధ్యయనం చేయనుంది.

హోప్ సేకరించే సమాచారం సెప్టెంబర్ నుంచి భూమికి అందుతుందని అంచనా వేస్తున్నారు.

కానీ, అంతకన్నాముందు అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించేందుకు ఓ సంక్లిష్టమైన ప్రయాణ దశను హోప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ వరకూ ఈ దశ కొనసాగొచ్చు.

''హోప్ మిషన్‌ను వైజ్ఞానిక ప్రయోగంగానే కాదు... స్ఫూర్తిదాయకమైన అంశంగానూ చూడొచ్చు. యూఏఈలో, అరబ్ ప్రాంతంలో ఉండే యువతను సైన్స్‌వైపు ఆకర్షించేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుంది'' అని బీబీసీ సైన్స్ ప్రతినిధి జనాథన్ అమోస్ అన్నారు.

ఇప్పటివరకూ భారత్, చైనా, ఒకప్పటి సోవియట్ యూనియన్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ మాత్రమే విజయవంతంగా అంగారక గ్రహాన్ని చేరుకోగలిగాయి.

హోప్ అంగారక గ్రహాన్ని చేరుతున్న ఈ సందర్భంలోనే యూఏఈ ఏర్పడి కూడా 50 ఏళ్లు పూర్తవుతున్నాయి.

అంగారక గ్రహం

ఫొటో సోర్స్, Getty Images

చైనా టియాన్వెన్-1 మిషన్

టియాన్వెన్ అంటే 'స్వర్గానికి ప్రశ్నలు' అని అర్థం. అయితే, ఈ నౌక అంగారకుడికి చేరువవుతున్నా, దానిపై దిగడానికి మరో మూడు నెలలు సమయం తీసుకోనుంది.

అంగారకుడిపై దిగడానికి ముందు ఆ గ్రహం వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ఈ సమయాన్ని ఉపయోగించుకోనున్నారు.

అంగారక గ్రహంపై దిగే సమయంలో నౌక వేగాన్ని గంటకు 20 వేల కి.మీ.ల నుంచి చాలా తక్కువ స్థాయికి తగ్గించాల్సి ఉంటుంది. ఇది పెద్ద సవాలే.

ఈ ప్రయోగం ద్వారా 240 కేజీల బరువుండే రోవర్‌ను అంగారక గ్రహంపై దించాలని చైనా భావిస్తోంది. మే నెలలో అంగారకుడిపై ఉన్న యుటోపియా ఇంపాక్ట్ బేసిన్‌లోని చదునైన ప్రాంతంలో దీన్ని దించబోతున్నారు.

ఈ రోవర్‌కు నాలుగు సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. వాటి నుంచి వచ్చే శక్తితో అది పని చేస్తుంది. ఈ రోవర్ ద్వారా అంగారకుడి మట్టి లక్షణాలను అధ్యయనం చేయనున్నారు.

అంగారకుడిపై చిత్రాలు తీసేందుకు దీనికి కెమెరాలు కూడా బిగించారు. మట్టి, రాళ్లను విశ్లేషించేందుకు, మంచు రూపంలో ఉన్న నీటిని వెతికేందుకు ఐదు అదనపు పరికరాలు కూడా ఇందులో ఉన్నాయి.

కనీసం 90 రోజులపాటు ఈ రోబోటిక్ రోవర్ పనిచేస్తుందని చైనా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఇప్పటివరకూ ఒక్క అమెరికా మాత్రమే అంగారక గ్రహంపై రోవర్‌తో సుదీర్ఘంగా కార్యకలాపాలు సాగించగలిగింది. (సోవియట్ యూనియన్ మార్స్-3, యూరప్ బీగిల్-2 మిషన్లు ల్యాండింగ్ తర్వాత త్వరగానే విఫలమయ్యాయి)

టియాన్వెన్-1 ఇప్పటికే అంగారకుడిని దూరం నుంచి ఫొటో తీసి భూమిపైకి పంపింది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో అంగారక ఉపరితలంపై ఉన్న వాలెస్ మరినెరిస్ లోయలు, షియాపరెలి బిలం లాంటివి కనిపించాయి.

అంగారకుడికి 22 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి టియాన్వెన్ ఈ ఫొటో తీసింది.

అంగారకుడిని చేరుకునేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు రష్యా సాయంతో ఆ దేశం ప్రయోగం చేపట్టినప్పటికీ, విఫలమైంది.

అయితే, ఆ తర్వాత చంద్రుడిపైకి రెండు రోవర్లను పంపించగలగడంతో చైనాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

అంగారక గ్రహం

ఫొటో సోర్స్, PA Media

అమెరికా పర్సీవరెన్స్ మిషన్

అంగారక గ్రహంపై ప్రాచీన మైక్రోబ్యాక్టీరియల్ జీవం ఆనవాళ్ల గురించి పర్సీవరెన్స్ రోవర్ వెతకనుంది.

అంగారక శిలలను ఈ రోవర్ సేకరించనుంది. ఆ గ్రహంపై గతంలో ఎప్పుడైనా జీవం ఉందా అన్నది తెలుసుకునేందుకు ఇవి తోడ్పడే అవకాశం ఉంది.

అంగారకుడిపైకి పంపుతున్న అత్యాధునిక, అతిపెద్ద వాహనం ఇదే. ఫిబ్రవరి 18న అంగారక గ్రహ మధ్య రేఖకు సమీపంలోని జెజెరో బిలంలో పర్సీవరెన్స్ దిగుతుంది.

''జెజెరో బిలంలోని ల్యాండింగ్ ప్రదేశంలో అధ్యయనానికి అనుకూలమైన పరిస్థితులు చాలా కనిపించాయి. పురాతన నది ప్రవాహపు ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. గతం తాలూకు జీవం అవశేషాలు అక్కడ లభించవచ్చు. వీటిన్నింటి పట్ల శాస్త్రవేత్తలు ఉత్సాహంగా ఉన్నారు'' అని పర్సీవరెన్స్ ల్యాండింగ్ కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్న ఇంజినీర్ అలెన్ చెన్ అన్నారు.

''కానీ జెజెరోను చూస్తుంటే భయంగా ఉంది. అక్కడ అంతా ప్రమాదమే. ల్యాండింగ్ ప్రదేశానికి సరిగ్గా మధ్యలో 60 నుంచి 80 మీటర్ల ఎత్తైన కొండ ఉంది. పశ్చిమాన అనేక బిలాలు ఉన్నాయి. వాటిలో దిగితే రోవర్ బయటకు రాలేదు. తూర్పున పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. వాటిపై దిగినా కష్టమే అవుతుంది'' అని ఆయన చెప్పారు.

అయితే, సరైన సురక్షిత ప్రాంతంలో దిగేలా పర్సీవరెన్స్‌కు సాంకేతికత పరిజ్ఞానం జోడించారు. దాన్ని చాలా సార్లు పరీక్షించారు కూడా.

పర్సీవరెన్స్ రోవర్ దాదాపు ఓ మెట్రిక్ టన్ను బరువు ఉంటుంది. పరిమాణంలో ఓ చిన్న ఎస్‌యూవీ కారు అంత ఉంటుంది.

తనకు తానుగా ఈ వాహనం రోజుకు 200 మీటర్ల దూరం కదగలదు. దీనిలో 19 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ఉంటాయి. దీన్ని ఉపయోగించి తొలిసారిగా అంగారకుడిపై వినిపించే శబ్దాలను కూడా రికార్డు చేయాలని శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఉన్నారు.

1.8 కేజీల బరువుండే ఓ డ్రోన్‌ను కూడా ఈ ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు అంగారకుడిపైకి పంపిస్తున్నారు.

పర్సీవరెన్స్ సేకరించిన నమూనాలను భవిష్యతులో భూమిపైకి తెచ్చేందుకు కూడా శాస్త్రవేత్తలు ప్రణాళికలు వేస్తున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)